దొనకొండ: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బౌద్ధస్తూపం పరిస్థితి ఇప్పుడెలా ఉంది?

- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
చుట్టూ పిచ్చి మొక్కలు.. సరైన రోడ్డు కాదు.. అసలు రోడ్డే లేదు.. లైట్లు అసలే లేవు.. కనీసం బోర్డు లేదు..
ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి బౌద్ధారామంగా చరిత్రకారులు పేర్కొనే చందవరం బౌద్ధక్షేత్రం వద్ద ప్రస్తుత పరిస్థితి ఇదీ..


శాతవాహనుల పాలన కాలం నాటి నిర్మాణం
ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ నది పక్కనే ఉన్న ఈ బౌద్ధ క్షేత్రం క్రీస్తుశకం రెండో శతాబ్దపు శాతవాహనుల పాలనాకాలం నాటి నిర్మాణంగా చరిత్రకారులు చెబుతున్నారు.
ఉత్తర భారతదేశంలోని సాంచీస్తూపం తర్వాత దక్షిణ భారత దేశంలో అంతటి విశిష్టత ఈ స్తూపానికి ఉందని పురావస్తు శాఖ అధికారులు అంటున్నారు.
బౌద్ధమతంలోని ప్రబలమైన హీనయానానికి ఈ క్షేత్రం సూచిక అని పురావస్తు శాఖ పేర్కొంటోంది.
అప్పట్లో కాశీ నుంచి కంచికి ప్రయాణించే బౌద్ధ భిక్షువులు ఈ క్షేత్రాన్ని ఆరాధనా కేంద్రంగా , విశ్రాంతి స్థలంగా ఉపయోగించే వారని చెబుతున్నారు.

ఈ స్తూపం ఎప్పుడు బయటపడింది?
1965లో చందవరం గ్రామస్తులు ఊరికి సమీపంలోని సింగరకొండపై ఇళ్ల నిర్మాణం కోసం మట్టి తవ్వకాలు చేస్తుండగా ఈ బౌద్ధ స్తూపం బయటపడింది.
1972లో పురావస్తు శాఖ 92 ఎకరాల విస్తీర్ణంలోని ఈ బౌద్ధ క్షేత్రాన్ని స్వాధీనం చేసుకుంది. 300 అడుగుల ఎత్తు కొండపైన ఈ స్తూపం ఉంటుంది. 40 మీటర్ల వెడల్పు, 30 అడుగుల ఎత్తులో ఉంటుంది.
ఈ నిర్మాణం మొత్తం మట్టితోనూ, పెద్దపెద్ద ఇటుకలతోనే ఉంటుంది. ఇక్కడి నిర్మాణంలోని ఇటుకలు 18x9x5 అంగుళాల పరిమాణంలో ఉంటాయి.

ఈ బౌద్ధ స్తూపం విశిష్టత ఏంటంటే...?
ఈ బౌద్ధ స్తూపం ప్రత్యేకత ఏమిటంటే ఇది మట్టితో కట్టిన ఏకైక స్తూపం, డబుల్ స్ట్రక్చర్. బౌద్ధ స్తూపానికి ఉత్తర భాగంలో 19 ధ్యానగదులు ఉన్నాయి. 16 పిల్లర్లు ఉన్నాయి.
ఈ స్తూపం 120 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తు చుట్టూ శిలాఫలకాలు ఉన్నాయి. ఆ ఫలకాల్లో బోధివృక్షం, సింహాసనం వంటి ఛాయలున్నాయి. ఉత్తర భాగంలో బుద్ధుని ధ్యానిస్తున్న శిలాఫలకం ఉంది. అందుకే దీన్ని హీనాయాన శాస్త్ర నిర్మాణంగా పిలుస్తారు.
బౌద్ధ భిక్షువులు వారణాసి నుంచి కంచికి వెళ్లేందుకు, ధాన్యకటకమైన అమరావతి నుంచి పుష్పగిరి – కంచి – రామేశ్వరం మీదుగా శ్రీలంక వెళ్ళేందుకు లక్షల సంఖ్యలో కదిలేవారు.
వీరందరికీ ఈ చందవరం బౌద్ధ ప్రదేశం ప్రధాన విశ్రాంతి కేంద్రంగా ఉపయోగపడేది.
స్తూపం చుట్టూ.. బౌద్ధ భిక్షువులు విశ్రాంతి తీసుకున్న గదులు, ధ్యాన మందిరాలు, భిక్షువులు కొండపై వినియోగించిన నీరు కిందికి వెళ్ళేందుకు నిర్మించిన కాలువ, కొండపై వారు వినియోగించిన రోలు లాంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ పాలరాతితో తయారైనవే.
ఇక్కడి స్తూపాలన్నీ బ్రాహ్మీ లిపిలో ఉన్న స్తూపాలేనని ఇక్కడ గైడ్‌గా పని చేస్తున్న యోహాన్, ప్రకాశం జిల్లాకు చెందిన చరిత్ర పరిశోధకుడు, రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు జ్యోతి చంద్రమౌళి బీబీసీకి తెలిపారు.
ఇంతటి విశిష్టత, వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ బౌద్ధారామాన్ని సంరక్షించుకోవాలని యోహాన్, చంద్రమౌళి కోరారు.

మ్యూజియం, క్యాంటీన్ పరిస్థితి ఏమిటంటే..
ఈ క్షేత్రానికి సంబంధించిన మ్యూజియంలో 2001, 2002 సంవత్సరాల్లో వరుసగా దొంగతనాలు జరిగి విలువైన బౌద్ధ కళాఖండాలు చోరీకి గురి కావడంతో మిగిలిన వాటిని దగ్గరలోని చందవరం గ్రామంలో భద్రపరిచారు. అప్పట్నుంచి ఈ మ్యూజియం నిరుపయోగంగానే ఉండిపోయింది.
2011లో అంటే దాదాపు 14 ఏళ్ల క్రితం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన క్యాంటీన్ ఇప్పటి వరకు ప్రారంభానికి కూడా నోచుకోలేదు.

ఈ స్తూపం కళాఖండాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే...
చందవరం పంచాయతీ కార్యాలయానికి చెందిన ఓ గదిలో కళాఖండాలను ఉంచారు. ఇందులో స్తూపం శిలాఫలకాలు, బోధి చెట్టు శిలాఫలకాలు, జాతక కథల చిత్రాలతో కూడిన ఫలకాలు, బుద్ధునికి ఇరువైపుల నిలిచి ఆరాధిస్తున్న దంపతుల శిల్పాలు ఉన్నాయి.
అయితే అక్కడ కూడా వాటికి సరైన భద్రత, రక్షణలేవు. కాగా, గతంలో చోరీకి గురైన శిల్పాలు, కళాఖండాలు ఆస్ట్రేలియాకి తరలిపోవడంతో అవి తిరిగి భారత్‌కు తెప్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని పురావస్తు శాఖ ఏడీ గంగాధర్ తెలిపారు.

‘పగలే భయంకరంగా ఉంది...’
‘ఈ బౌద్ధ స్తూపం గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చాం. నిజం ఇది గొప్ప స్తూపం. నిర్మాణం అద్భుతంగా ఉంది. కానీ ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు. కొండపైకి వెళ్లేందుకు సరైన దారి లేదు. చుట్టూ పిచ్చి మొక్కలు. పగలే భయంకరంగా ఉంది’’ అని మార్కాపురానికి చెందిన యాయేలు, గుంటూరుకి చెందిన దివ్య, అనిల్‌కుమార్ బీబీసీతో అన్నారు.
‘‘చాలాదూరం నుంచి స్కూలు పిల్లలు, కాలేజీల పిల్లలు వస్తుంటారు. ఇక విదేశీయులు, బౌద్ధాన్ని అనుసరించే వాళ్లు ఎక్కువమందే వస్తారు. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పక్కన గుండ్లకమ్మ నది ఉంది. కానీ బాగా అభివృద్ధి చేయాలి. ముందుగా సరైన రోడ్డు, విద్యుత్ సౌకర్యం కల్పించాలి.’’ అని గైడ్‌గా పని చేస్తున్న యోహాన్ అన్నారు.

మ్యూజియం నిర్మిస్తాం: పురావస్తు శాఖ ఏడీ
''బౌద్ధ భిక్షువులు వర్షాకాలం నాలుగు నెలలూ బయట పర్యటించకుండా చాతుర్మాస వ్రత దీక్ష చేసేందుకు ఈ క్షేత్రాన్ని వినియోగించుకునే వారు. ఉత్తర భారతదేశంలోని సాంచి తర్వాత దేశంలోనే రెండో స్తూపం ఇది. ఈ బౌద్ధస్తూపం అభివృద్ధి, మ్యూజియం నిర్మాణం కోసం మా ప్రధాన కార్యాలయానికి ప్రతిపాదనలు పంపించాం. ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి అనుమతి రావాలి. మ్యూజియం నిర్మాణానికి స్థలం ఇచ్చేందుకు రెవిన్యూ శాఖ సిద్ధంగా ఉంది. వచ్చే నెలలో ఆ పనులు ముందుకు తీసుకు వెళ్తాం. గతంలో ఇక్కడ వరుస దొంగతనాలు జరగడంతో ఒంగోలులో మ్యూజియం నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది. అయితే చందవరం గ్రామస్తులు వ్యతిరేకించడంతో స్తూపం వద్దనే మ్యూజియం నిర్మిస్తాం.'' అని ప్రకాశం జిల్లా పురావస్తు శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గంగాధర్ బీబీసీకి తెలిపారు.

‘డీపీఆర్ రాగానే అభివృద్దిపై దృష్టి..’
‘‘నిజంగా అది అరుదైన స్తూపమే. దాన్ని అభివృద్ధి చేయాలనే పర్యాటకశాఖ భావిస్తోంది. ఆ మేరకు గతంలో అక్కడ నిర్మించి వదిలేసిన క్యాంటీన్‌ను ఇప్పుడు పబ్లిక్ ప్రైవేటు పార్టనర్‌షిప్(పీపీపీ) విధానంలో ఎవరైనా ముందుకు వచ్చి తీసుకుంటే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. అలాగే అక్కడి క్షేత్ర అభివృద్ధిపై పురావస్తు శాఖ డీపీఆర్ తయారు చేస్తోంది. ఆ నివేదిక వచ్చిన తర్వాత ముందుగా విద్యుదీకరణ చేపట్టి.. పర్యాటకులకు, సందర్శకులకు కనీస సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తాం.’’ అని జిల్లా పర్యాటక శాఖ అధికారి కొప్పుల బెన్‌హర్ బీబీసీతో అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














