‘ఆంధ్రా కశ్మీర్’ లంబసింగిలో జీరో డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడానికి కారణం ఇదే

లంబసింగి
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఈ శీతాకాలంలో ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఆ జిల్లాలోని అరకులో 3.8 డిగ్రీలు సెల్సియస్, చింతపల్లిలో 4 డిగ్రీలు సెల్సియస్, డుంబ్రిగూడలో 6 డిగ్రీలు, జి. మాడుగులలో 8.3 డిగ్రీలు నమోదయ్యాయి. కానీ చింతపల్లి సమీపంలోని లంబసింగిలో మాత్రం ఎప్పటిలాగే '0' (జీరో) డిగ్రీల సెల్సియస్ నమోదైంది.

చింతపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం రోజూ మన్యంలోని ఉష్ణోగ్రతలను రికార్డ్ చేస్తుంది.

చింతపల్లి, పాడేరు, అరకు, డుంబ్రిగూడ ఇలా అనేక ప్రాంతాల్లో చలికాలంలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు ఏళ్ల తరబడి నమోదవుతూనే ఉన్నాయి.

లంబసింగిలో మాత్రం ఏటా సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ ఏడాది కూడా నమోదైంది.

కేవలం లంబసింగిలోనే ఎందుకు జీరో డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి? దీనికి ఉన్న ప్రత్యేక కారణమేంటి? ఇతర ప్రాంతాలకు లంబసింగికి తేడా ఏమిటి? దీనిపై వాతావరణ నిపుణులు ఏం చెప్తున్నారు?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
చెరువులవేనంలో మంచు మేఘాలు
ఫొటో క్యాప్షన్, చెరువులవేనంలో మంచు మేఘాలు

అదే లంబసింగి ప్రత్యేకత

లంబసింగిలో సూర్యుడు ఉదయం 10 గంటల వరకు కనిపించడు. అంతలా మంచు కప్పేసి ఉంటుంది. దీనికి కారణం ఏజెన్సీలోని కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఇతర ప్రాంతాలతో పోల్చినప్పుడు లంబసింగి భౌగోళికంగా ప్రత్యేకత కలిగి ఉంటుందని ఆంధ్రా యూనివర్సిటీ వాతావరణ విభాగం ప్రొఫెసర్ రామకృష్ణ బీబీసీతో చెప్పారు.

అదే లంబసింగిలో జీరో డిగ్రీల సెల్సియస్ ఏర్పడటానికి ప్రధాన కారణమన్నారు.

"లంబసింగి అనేది కొండల మధ్య ఉన్న ఒక గిరిజన ప్రాంతం. అది కూడా సముద్ర మట్టానికి 3,600 అడుగుల ఎత్తున ఉంది. ఆ గ్రామానికి రెండు వైపులా కొండలు ఉండి మధ్యలో ఒక దారిలా ఉంటుంది. దాంతో కొండపై నుంచి సాగే శీతల గాలులకు ఎలాంటి ఆటంకం ఉండదు. దీంతో అక్కడ మేఘాలు ఏర్పాడే అవకాశం ఉండదు. రెండు కొండల మధ్య ఒక దారిలాగా ఏర్పాటు చేసుకుని వచ్చే శీతల గాలులు అక్కడ ఏర్పడుతున్న మేఘాలను పక్కకు నెట్టేస్తాయి. దాంతో అక్కడ అతి శీతల వాతావరణం ఏర్పడుతుంది"

"అదే లంబసింగిలో 0 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలకు కారణం" అని ప్రొఫెసర్ రామకృష్ణ బీబీసీతో చెప్పారు.

ఆంధ్రా యూనివర్సిటీ వాతావరణ విభాగం ప్రొఫెసర్ రామకృష్ణ
ఫొటో క్యాప్షన్, ఆంధ్రా యూనివర్సిటీ వాతావరణ విభాగం ప్రొఫెసర్ రామకృష్ణ

నాలుగు నెలలూ చలి మంటలే

ఆంధ్రా కశ్మీర్‌గా పేరుపొందిన లంబసింగిలో అక్టోబర్ మధ్య నుంచి జనవరి చివరి వరకు శీతల వాతావరణ పరిస్థితులు ఉంటాయి.

డిసెంబర్ నుంచి జనవరి చివరి వారం వరకు ప్రతి రోజూ 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలే నమోదవుతాయి.

5 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే రోజులు ఎక్కువగా ఉంటాయి.

ఈ కాలంలోనే సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయని ప్రొఫెసర్ రామకృష్ణ తెలిపారు.

ఉదయం పదిగంటలైనా సూర్యుడు కనిపించని ఈ ప్రాంతానికి రెండుమూడు కిలోమీటర్ల దూరంలో మాత్రం సాధారణ వాతావరణమే ఉంటుంది.

ఈ ప్రాంతాన్ని అంతా లంబసింగి అని పిలుస్తున్నా.. గ్రామంలో మాత్రం లమ్మసింగి అనే బోర్డులు కనిపిస్తాయి.

ఈ ప్రాంతాన్ని స్థానికులు కొర్రబయలు అని కూడా పిలుస్తారు. కొర్ర అంటే కర్ర, బయలు అంటే బయట అని అర్థం. ఎవరైనా పొరపాటున ఇంటి బయట పడుకున్నారంటే తెల్లారేసరికి కొయ్యలా బిగుసుకుపోతారనే అర్థంలో అలా పిలుస్తారు. అంతటి చలి ఇక్కడ ఉంటుంది.

లంబసింగికి పర్యటకుల తాకిడి
ఫొటో క్యాప్షన్, లంబసింగికి పర్యటకుల తాకిడి

మంచు కొండల మధ్య ప్రయాణం

లంబసింగికి వచ్చే పర్యటకులు ఒక్కసారిగా మంచు కొండల మధ్య ఉన్న అనుభూతికి లోనవుతారు. ఇలాంటి అతి శీతల వాతావరణ పరిస్థితి ఉదయం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది.

ఎక్కడ చూసినా చలి మంటలే కనిపిస్తాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అలాగే సాయంత్రం 4 గంటల నుంచి మళ్లీ ఉదయం వరకూ ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా చలిమంటలు వేసుకున్న వారే కనిపిస్తారు.

"మాకు ఇదేమీ కొత్త కాదు. మేం చిన్నతనం నుంచి చూస్తున్నదే. కాకపోతే ఈ మధ్యకాలంలోనే ఎక్కడెక్కడ నుంచో చాలా మంది మా గ్రామానికి వస్తున్నారు. అయితే పర్యటకుల సందడితో ఏడాదిలో మూడు నెలల పాటు మా గ్రామంలో పండుగలా ఉంటుంది" అని లంబసింగి గ్రామస్థుడు కిల్లో బాబు బీబీసీతో చెప్పారు.

ఇదేమీ కొత్త కాదు: వాతావరణ నిపుణులు

లంబసింగిలో జీరో డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఏర్పడటం కొత్తేమీ కాదు, కాకపోతే ఇప్పుడు ప్రచారం ఎక్కువైపోయింది. దాదాపు 15 ఏళ్ల నుంచి లంబసింగి వార్తల్లో ఉంటోంది. అంతక ముందు కూడా ఇక్కడ జీరో డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, ఇక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులే అందుకు కారణమని ప్రొఫెసర్ రామకృష్ణ చెప్పారు.

క్రమంగా వాతావరణంపై ప్రజల్లో అవగాహన పెరగడం, టూరిజం పెరగడంతో జీరో డిగ్రీస్ అంటూ లంబసింగికి, పాల సముద్రమంటూ వంజంగి వంటి ప్రాంతాలకు బాగా ప్రచారం లభిస్తోంది.

లంబసింగి

కొత్తగా ‘పాల సముద్రాలు’

లంబసింగిలోని జీరో డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలే కాదు... ఇటీవల ఎక్కువ మంది టూరిస్టులు క్యూ కడుతున్న ‘పాల సముద్రాలు’ కొత్తేమీ కాదని వాతావరణ నిపుణులు చెప్తున్నారు.

అల్లూరి జిల్లాలోని టూరిస్టు స్పాట్లంటే బొర్రా గుహలు, వలిసె పువ్వులు, జలపాతాలు ఇలా ఉండేవి.

కానీ ఇటీవల కాలంలో మన్యంలోని పాల సముద్రాల్ని తలపించే మంచును చూసేందుకు పర్యటకులు తరలి వస్తున్నారు.

ఒడిశా, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి అనేక మంది టూరిస్టులు ఈ పొగమంచును చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

మన్యంలోని గిరి శిఖరాలపై పాలసముద్రంలా కనిపించే పొగమంచును చూసేందుకు వందల సంఖ్యలో టూరిస్టులు వస్తున్నారు. ఈ అందాల్ని చూసేందుకు కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్ చేస్తున్నారు.

కొండలపైన దట్టమైన తెల్లని మేఘాల్లా కనిపించే పొగమంచు పాలసముద్రంలా కనిపిస్తుంది.

పాడేరులోని వంజంగి, లంబసింగి సమీపంలోని చెరువులవేనం వంటి ప్రదేశాల్లో ఇలాంటి అనుభూతి కలుగుతుంది.

మన్యం

'నీటి బిందువుల బంధమే పాల సముద్రం'

పాలసముద్రాల్ని తలపించే విధంగా ఏర్పడుతున్న ఈ పొగమంచును పాలసముద్రం, మేఘాల పల్లకి అని రకరకాలుగా పిలుస్తుంటారు.

ఈ తరహా పొగమంచు సెప్టెంబరు నుంచి ఫిబ్రవరి వరకు కనిపిస్తుందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు.

ఇలా పొగమంచు అంతా ఒకే చోట చేరి పాలసముద్రాల్లా కనిపించడం కూడా కొత్తకాదని, కాకపోతే టూరిస్టు స్పాట్లు ఉన్న ప్రదేశాల్లో ఈ పొగమంచు కనపడటంతో చూసేవారు ఆకర్షితులవుతున్నారని అంటున్నారు.

"సముద్రం నుంచి భూమి మీదకు వీచే తేమతో కూడిన గాలులు సాధారణంగా వేడిగా ఉంటాయి. ఈ గాలులు ఎప్పుడైతే చల్లటి ప్రాంతాలకు చేరుకుంటాయో... అంటే మన్యంలోని కొండ ప్రాంతాలను చేరుకోగానే తేమ అంతా కూడా అతి సూక్ష్మ నీటి బిందువుల్లా మారిపోతుంది. అప్పుడు వాటిలోని నీటి అణువులు ఒకదానినొకటి పట్టుకుని ఉండటం వలన కదలకుండా ఒకే చోట ఉంటూ మేఘాల వరుసలా కనిపిస్తాయి" అని విశాఖ వాతావరణ కేంద్రం ఇంచార్జ్ డైరెక్టర్ కె. శ్రీనివాస్ బీబీసీతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)