40 ఏళ్ల తర్వాత భోపాల్ గ్యాస్ దుర్ఘటన విషవ్యర్థాల తరలింపు, ఎక్కడ కాల్చుతారంటే

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, విష్ణుకాంత్ తివారి
- హోదా, బీబీసీ ప్రతినిధి, భోపాల్
నలభై ఏళ్ల తర్వాత, 1984 నాటి భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు సంబంధించిన విషపూరితమైన వ్యర్థాలను బుధవారం రాత్రి నగరం బయటకు తరలించారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఉన్న యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీలో ఈ ఘోర విపత్తు సంభవించింది. ప్రపంచంలో అత్యంత ఘోర పారిశ్రామిక విపత్తులలో ఇదొకటి.
అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్‌కు చెందిన పెస్టిసైడ్ ఫ్యాక్టరీ నుంచి 1984 డిసెంబర్ 3 ఉదయం విషవాయువు లీకైంది. ఆ గ్యాస్ నగరం అంతటా వ్యాపించింది. దాని ప్రభావంతో ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లోని ప్రజల్లో చాలామంది ఎక్కడి వారక్కడే కూలిపోయారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ గ్యాస్ లీక్‌తో 5 వేల మంది చనిపోయారు. కానీ, సామాజిక కార్యకర్తలు, స్థానిక ప్రజలు చెప్పిన ప్రకారం 10 వేల మంది వరకు చనిపోయి ఉంటారని అంచనాలున్నాయి.
బుధవారం రాత్రి ఈ దుర్ఘటనకు చెందిన విషపూరితమైన వ్యర్థాలను 12 ట్రక్కులలోకి లోడ్ చేసి భోపాల్‌కు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న పీథమ్‌పుర్‌కు తరలించారు.
కట్టుదిట్టమైన పోలీసు భద్రతతో, 40 వాహనాల కాన్వాయ్ బుధవారం రాత్రి 9.30కు దుర్ఘటన స్థలం నుంచి బయలుదేరి, అధికారులు అప్పటికే సిద్ధం చేసిన గ్రీన్ కారిడార్ ద్వారా గురువారం ఉదయం 6 గంటలకు పీథమ్‌పుర్ చేరుకుంది.

ఈ విషపూరిత వ్యర్థాలను డంప్ చేసే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని, వ్యర్థాలను ఉంచిన ప్రాంతం నుంచి వచ్చే దుమ్మును కూడా పీథమ్‌పుర్ వైపు మళ్లించామని అధికారులు చెప్పారు.
ఈ వ్యర్థాల సేకరణకు పీపీఈ కిట్లు ధరించిన 50 మందికి పైగా కార్మికులను డిప్లాయ్ చేశామని, ప్రతి 30 నిమిషాలకు ఒకసారి కార్మికులను మార్చామని అధికారులు తెలిపారు.
2015లో ఈ వ్యర్థాలను నాశనం చేసేందుకు ట్రయల్ రన్ చేపట్టారు. గంటలో 90 కేజీల వ్యర్థాలను కాల్చారు. దీని ప్రకారం చూసుకుంటే, 337 టన్నుల వ్యర్థాలను కాల్చేందుకు 5 నెలలకు పైగా సమయం పడుతుంది.
''దేశంలో పారిశ్రామిక వ్యర్థాలను తరలించేందుకు, రవాణా చేసేందుకు అమలులో ఉన్న అత్యంత సురక్షితమైన నిబంధనల ప్రకారం యూనియన్ కార్బైడ్ వ్యర్థాలను బుధవారం రాత్రి పీథమ్‌పుర్‌కు తరలించారు. వచ్చే కొన్ని నెలల్లో ఈ వ్యర్థాలను కాల్చి, పూర్తిగా నాశనం చేయనున్నాం'' అని మధ్యప్రదేశ్ గ్యాస్ రిలీఫ్, రిహాబిలిటేషన్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ స్వతంత్ర కుమార్ సింగ్ చెప్పారు.
ఈ విషపూరిత వ్యర్థాల తొలగింపుపై మాట్లాడిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్.. ఈ వ్యర్థాలను కాల్చివేతలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్నో సంస్థలు పాల్గొంటున్నాయని చెప్పారు.
''గత 40 ఏళ్లుగా, భోపాల్ ప్రజలు ఈ వ్యర్థాలతోనే కలిసి నివసిస్తున్నారు. ఈ విషపూరిత వ్యర్థాలను డిస్పోజ్ చేయడంతో పర్యావరణంపై ఎలాంటి ప్రభావం పడదు. ప్రశాంతమైన వాతావరణంలో ఈ ప్రక్రియంతా సాగుతుంది. ఈ అంశాన్ని రాజకీయం చేయకుండా చూసేందుకు మేం ప్రయత్నించాం'' అని వివరించారు.

సుదీర్ఘకాలంగా సాగిన న్యాయపోరాటం
ఈ వ్యర్థాలను తొలగించాలని 2004 ఆగస్టులో భోపాల్‌కు చెందిన అలోక్ ప్రతాప్ సింగ్ తొలుత హైకోర్టులో పిటిషన్ వేశారు.
అనంతరం 2005లో హైకోర్ట్ ఆదేశాల మేరకు ఒక టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటైంది. ఈ ప్రక్రియను సక్రమంగా అమలు చేసేందుకు కమిటీ పలు సూచనలు చేసింది.
ఆ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 345 మెట్రిక్ టన్నుల విష వ్యర్థాలను ఫ్యాక్టరీ నుంచి సేకరించి పోగు చేశాయి.
2006: 346 మెట్రిక్ టన్నుల విష వ్యర్థాలను గుజరాత్‌లోని అంకలేశ్వర్‌కు తరలించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది.
అయితే, కొంతకాలం తర్వాత గుజరాత్ ప్రభుత్వం దీనిపై తన అభ్యంతరాలను తెలియజేసింది.
2010 నుంచి 2015 మధ్య కాలంలో: పీథమ్‌పుర్‌లోని ఒక ఫ్యాక్టరీ వద్ద ఈ వ్యర్థాలను కాల్చివేసేందుకు పలు పరీక్షలు నిర్వహించారు. చివరి పరీక్షలో పర్యావరణ ప్రమాణాలను చేరుకున్నారు.
ఈ సందర్భంగా ట్రయల్ రన్‌లో భాగంగా పీథమ్‌పుర్‌లో వ్యర్థాలలో కొంత కాల్చారు.
2021: మిగిలిన 337 టన్నుల విష వ్యర్థాలను కాల్చివేసే ప్రక్రియ కోసం రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది.
2024 జులై: ఈ వ్యర్థాలను ప్రమాద స్థలం నుంచి తరలించి, కాల్చివేసే అధికారం పీథమ్‌పుర్ ఇండస్ట్రియల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు దక్కింది.
పీథమ్‌పుర్‌లో ఈ వ్యర్థాలను ధ్వంసం చేస్తున్నట్టు 2022లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి అంచనా ఖర్చు కింద రూ.126 కోట్ల బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం అందించింది.
2024 డిసెంబర్ 4: రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించిన మధ్యప్రదేశ్ హైకోర్టు, నాలుగు వారాల్లోగా వ్యర్థాలను తరలించాలని ఆదేశించింది.
ఆ తర్వాత, డిసెంబర్ 29న వ్యర్థాలను పీథమ్‌పుర్‌కు తరలించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. నాలుగు రోజుల పాటు ఈ విషపూరితమైన వ్యర్థాలను సేకరించి, బ్యాగులలో 337 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను నింపి పీథమ్‌పుర్‌కు తరలించింది.
ఈ సమయంలో ప్రభుత్వం పూర్తి గోప్యతతో వ్యవహరించింది. మంగళవారం రాత్రి నుంచే వ్యర్థాల సంచులను కంటైనర్లలోకి లోడ్ చేయడం ప్రారంభించింది. బుధవారం మధ్యాహ్నానికల్లా మొత్తం వ్యర్థాలను నింపి, పోలీసుల భారీ భద్రతతో రాత్రికిరాత్రే పీథమ్‌పుర్‌కు తరలించింది.
మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు, శుక్రవారం (జనవరి 3న) ప్రభుత్వం తన రిపోర్టును సమర్పించాల్సి ఉంది. ఈ కారణంతో, బుధవారం రాత్రే వ్యర్థాలను తరలించింది ప్రభుత్వం.

ఫొటో సోర్స్, ANI
పీథమ్‌పుర్ ఎందుకు తరలించారు
అయితే, పీథమ్‌పుర్‌కు చేరుకున్న తర్వాత ఈ వ్యర్థాల పరిస్థితి ఏంటి అన్నదే ప్రస్తుత ప్రశ్న?
''మధ్యప్రదేశ్‌లోని పారిశ్రామిక యూనిట్లలో ఉత్పత్తి అయిన రసాయనాలు, ఇతర వ్యర్థాలను ధ్వంసం చేసేందుకు ధార్ జిల్లాలోని పీథమ్‌పుర్‌లో మాత్రమే ఒక ప్లాంట్ ఉంది. ఇక్కడ విషపూరితమైన వ్యర్థాలను రక్షిత విధానంలో కాల్చుతుంటారు'' అని మధ్యప్రదేశ్ గ్యాస్ రిలీఫ్, రిహాబిలిటేషన్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన డైరెక్టర్ స్వతంత్ర కుమార్ సింగ్ చెప్పారు.
''సెంట్రల్ పొల్యుషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) మార్గదర్శకాల ప్రకారం ఈ ప్లాంట్ నిర్వహిస్తారు. నిర్దేశిత ప్రమాణాలు, భద్రతా చర్యలను చేపట్టి సీపీసీబీ పర్యవేక్షణలో 2015లో 10 టన్నుల వ్యర్థాలను కాల్చివేసే ప్రక్రియ ట్రయల్ రన్ నిర్వహించాం'' అని తెలిపారు.
పీథమ్‌పుర్‌లాగా దేశంలో 42 ప్లాంట్లు ఉన్నాయని, అక్కడ రసాయన వ్యర్థాలను కాల్చివేస్తారని స్వతంత్ర కుమార్ సింగ్ చెప్పారు.
భోపాల్ నుంచి పీథమ్‌పుర్‌కు తరలించిన వ్యర్థాలను తొలుత అత్యధిక ఉష్ణోగ్రతల్లో దహనం చేస్తారు. వ్యర్థాలను కాల్చేటప్పుడు వచ్చే పొగలో ఉండే హానికరమైన కారకాలు వాతావరణంలో కలవకుండా చూస్తారు.
వ్యర్థాలను కాల్చివేసిన తర్వాత, ఆ అవశేషాలను పరీక్షిస్తారు. హానికర రసాయనాలు పూర్తిగా నాశనమయ్యేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగిస్తారు. ఆ తర్వాత, ఏమైనా మిగిలి ఉంటే, వాటిని భూమిలో పాతిపెడతారు.
భూమిలో పాతిపెట్టే సమయంలో కూడా, ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తారు. ఆ బూడిద నీటి వనరులు, ఇతర ప్రదేశాల్లోకి చేరకుండా కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

ఫొటో సోర్స్, ANI
''మధ్యప్రదేశ్‌లో సుమారు 150 రసాయన ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటి వ్యర్థాలను పీథమ్‌పుర్‌లో ఉన్న ప్లాంట్‌లో కాలుస్తారు. యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ వ్యర్థాలను కాల్చేందుకు ఇదే సరైన ప్రదేశం'' అని మధ్యప్రదేశ్ పర్యావరణవేత్త, మాజీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ సుభాష్ సీ పాండే చెప్పారు.
''దీని వల్ల సమస్యలు వస్తాయని చాలా మీడియా కథనాలు వస్తున్నప్పటికీ, యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ వ్యర్థాల కంటే ఎక్కువ ప్రాణాంతకమైన, ప్రమాదకరమైన రసాయన వ్యర్థాలను పీథమ్‌పుర్‌లో నాశనం చేస్తున్నారని అనుకుంటున్నాను'' అని అన్నారు.
''సుప్రీంకోర్టు, సీపీసీబీ పర్యవేక్షణలో ఈ పని జరుగుతున్నప్పుడు, నిర్లక్ష్యానికి తక్కువ అవకాశం ఉంటుంది'' అని చెప్పారు.
పీథమ్‌పుర్‌కు వ్యర్థాలను తీసుకెళ్లే విషయంలో స్థానికుల్లో అయోమయం నెలకొంది.
దీని గురించి ప్రజలకు తొలుత ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయాలి, ఆ తరువాతే ప్రక్రియను పూర్తి చేయాలని ఒక స్థానిక వ్యక్తి అన్నారు.
''భోపాల్ గ్యాస్ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. కానీ, అలాంటివి జరగకుండా ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు.ఇక్కడ డిస్పోజ్ చేయడం వల్ల సమస్య వస్తే, మేమెక్కడి వెళ్లాలి?'' అని ప్రశ్నించారు.
ఈ విషపూరితమైన వ్యర్థాలను డంప్ చేసే విషయంపై దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పీథమ్‌పుర్ బచావో సమితి నిరసనలు చేపట్టింది. పలు ఇతర కార్మిక సంస్థలు కూడా బంద్‌కు పిలుపునిచ్చాయి.

వ్యతిరేకిస్తున్న బీజేపీ నేత
పీథమ్‌పుర్‌కు ఆనుకుని ఉన్న ఇందోర్ మేయర్, బీజేపీ నేత పుష్యమిత్ర భార్గవ కూడా పీథమ్‌పుర్‌లో చెత్తను కాల్చవద్దని చెప్పారు.
''గత కొన్ని రోజులుగా, వ్యర్థాల కాల్చివేయడంపై ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి. పీథమ్‌పుర్ ప్రజలు కూడా నిరసనలు చేస్తున్నారు. పీథమ్‌పుర్‌లో ఈ వ్యర్థాలను కాల్చే నిర్ణయంపై పునరాలోచించాలని నేను భావిస్తున్నా'' అని అన్నారు.
''ఇది పీథమ్‌పుర్‌కు, ఇందోర్‌కు, రాష్ట్రానికి కూడా మంచిది. ఎందుకంటే, తొలుత గుజరాత్‌లో ఈ వ్యర్థాలను కాల్చాలనుకున్నారు. కానీ, దాన్ని రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత జర్మనీ పంపాలనుకున్నారు. అది కూడా రద్దు చేసుకున్నారు. ప్రస్తుత నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరుతున్నా'' అని చెప్పారు.
అయితే, వ్యర్థాలను కాల్చివేసిన తర్వాత పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందనే దాన్ని ప్రభుత్వం ఖండిస్తోంది. భద్రతకు పూర్తి హామీ ఇస్తోంది. కానీ, పీథమ్‌పుర్, సమీప ప్రాంతాల ప్రజలు మాత్రం ఇంకా దీనిపై అనుమానాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














