ఎల్ఎన్‌జీ అంటే ఏమిటి? యూరప్ ప్రజలకు అది ఎందుకంత కీలకంగా మారింది?

ఎల్‌ఎన్‌జీ నౌక

ఫొటో సోర్స్, Getty Images

యూరప్‌కు సహజ వాయువు సరఫరాలను రష్యా చాలా వరకూ తగ్గించివేసింది.

దీంతో యూరప్ దేశాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం అన్వేషించాల్సిన పరిస్థితిల్లో పడ్డాయి.

చాలా దేశాలు లోటును భర్తీ చేసుకోవటానికి లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ (ఎల్ఎన్‌జీ) మీద ఆధారపడుతున్నాయి.

ఇప్పుడు ఆ గ్యాస్ సరఫరా చేసే నౌకలు రేవుల దగ్గర బారులు తీరుతున్నాయి.

ఎల్ఎన్‌జీ అంటే ఏమిటి?

మీథేన్ లేదా ఈథేన్ కలిపిన మీథేన్‌ను శుభ్రపరచి దాదాపుగా ‘మైనస్ 160’ డిగ్రీల సెల్లియస్ వరకూ చల్లబరుస్తారు.

దీనివల్ల ఆ గ్యాస్ ద్రవరూపంలోకి మారుతుంది. దీనినే ఎల్‌ఎన్ఎజీ అంటారు.

ద్రవరూపంలోకి మార్చడం వల్ల వాయు రూపంలో అవసరమైన దానికన్నా 600 రెట్లు తక్కువ స్థలం సరిపోతుంది.

అలా ద్రవరూపంలోని గ్యాస్‌ను ముడి చమురు తరహాలో నౌకల్లో నింపి రవాణా చేస్తారు.

గమ్యానికి చేరుకున్న తర్వాత ఆ ద్రవాన్ని తిరిగి గ్యాస్‌ రూపంలోకి మార్చి.. వేడి కోసం, వంట కోసం, విద్యుత్ అవసరాలకు మిగతా సహజ వాయువు లాగానే ఉపయోగిస్తారు.

‘‘ఎల్‌ఎన్‌జీ కన్నా ముందు గ్యాస్‌ను పైప్‌లైన్ల ద్వారా మాత్రమే సరఫరా చేయగలిగేవారు.

దానివల్ల ఆ గ్యాస్‌ను ఎక్కడ అమ్మవచ్చు అనే దానికి పరిమితి ఉండేది’’ అని విశ్లేషణ సంస్థ క్రిస్టల్ ఎనర్జీకి చెందిన కరోల్ నఖిల్ చెప్పారు.

‘‘ఎల్‌ఎన్‌జీని సముద్రాల మీదుగా నౌకల ద్వారా రవాణా చేయవచ్చు. కాబట్టి అది చాలా సుదూర గమ్యాలకు చేరగలదు’’ అని తెలిపారు.

ఎల్‌ఎన్‌జీ ప్లాంట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యూరప్‌లో ఎల్‌ఎన్‌జీని తిరిగి గ్యాస్‌గా మార్చే స్టోరేజీ ప్లాంట్లకు కొరత ఉంది

ఎల్ఎన్‌జీని సరఫరా చేసే దేశాలు ఏవి?

ప్రపంచంలో ఎల్ఎన్‌జీని అత్యధికంగా ఎగుమతి చేసే దేశాలు ఆస్ట్రేలియా, ఖతర్, అమెరికా.

యూరప్‌కు అమెరికా తన ఎల్ఎన్‌జీ ఎగుమతులను రెట్టింపు కన్నా పెంచింది.

2021లో 2.2 కోట్ల టన్నులు ఎగుమతి చేసిన అమెరికా.. 2022 సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లోనే 4.6 కోట్ల టన్నుల ఎల్‌ఎన్‌జీని పంపించింది.

యూరప్ ఖండానికి అతి పెద్ద సరఫరా దారుగా నిలిచింది.

ఇక ఆస్ట్రేలియా దాదాపుగా తన ఎల్‌ఎన్‌జీ మొత్తాన్నీ ఆసియాలోని కస్టమర్లకు ఎగుమతి చేస్తుంటుంది.

ఖతర్ కూడా.. పాటు కొంత ఎల్‌ఎన్‌జీని ఆసియాకు ఎగుమతి చేస్తుంటుంది. బ్రిటన్, బెల్జియం, ఇటలీ వంటి దేశాలకూ సరఫరా చేస్తుంది.

2022 సంవత్సరం జనవరి నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఖతర్ 1.3 టన్నుల ఎల్‌ఎన్‌జీని యూరప్‌కు ఎగుమతి చేసింది.

అయితే ఆ దేశం దాదాపుగా తన ఉత్పత్తి మొత్తాన్నీ దీర్ఘకాలిక కాంట్రాక్టులతో అమ్ముతుంది. కాబట్టి కతార్ నుంచి తక్కువ నోటీసు కాలంలో అదనపు సరఫరాలు పొందటం కష్టమవుతోంది.

అల్జీరియా వంటి దేశాలు కూడా యూరప్‌కు ఎల్ఎన్‌జీని ఎగుమతి చేస్తాయి.

యూరప్‌కు పైప్‌లైన్ల ద్వారా గ్యాస్ సరఫరాలను తగ్గించివేసిన రష్యా కూడా ఆ ఖండానికి ఎల్ఎన్‌జీని ఎగుమతి చేస్తోంది.

ఎల్‌ఎన్‌జీ నౌక

ఫొటో సోర్స్, Getty Images

యూరప్‌లో విద్యుత్ కోతలు లేకుండా ఎల్ఎన్‌జీ ఎలా సాయపడుతోంది?

రష్యా 2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్ మీద దండయాత్ర మొదలుపెట్టినపుడు దానిని యూరప్ దేశాలు విస్తృతంగా ఖండించాయి.

దీనికి ప్రతిస్పందనగా యూరప్‌కు తన సహజ వాయువు ఎగుమతులను రష్యా 80 శాతం వరకూ కత్తిరించింది.

ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు నాలుగు రెట్లు పెరిగాయి. ఇంట్లో వినియోగ బిల్లులు పెరిగిపోయాయి.

విద్యుత్ కోతలు విధించాల్సి వస్తుందనే ఆందోళనతో యూరోపియన్ యూనియన్ మరింత ఎల్‌ఎన్‌జీ దిగుమతుల కోసం అమెరికాతో ఒప్పందం చేసుకుంది.

ఇప్పుడు యూరోపియన్ దేశాలన్నిటిలో ఉపయోగించే ఇంధనంలో ఎల్‌ఎన్‌జీ వాటా 40 శాతానికి పెరిగిందని యూరోపియన్ కమిషన్ గణాంకాలు చెప్తున్నాయి.

బ్రిటన్ దిగుమతి చేసుకునే గ్యాస్‌లో సగం ఎల్‌ఎన్‌జీనే ఉంది. అందులో అత్యధికంగా అమెరికా నుంచే వస్తోంది.

ఎల్ఎన్‌జీ అదనపు సరఫరాల వల్ల గ్యాస్ ధరలు మరింతగా పెరిగిపోకుండా ఆగాయి.

అయితే.. పైపుల ద్వారా సరఫరా అయ్యే నాచురల్ గ్యాస్ కన్నా.. ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తి, రవాణా వల్ల పది రెట్లు ఎక్కువ కర్బనం విడుదల అవుతుందని విమర్శకులు ఎత్తిచూపుతున్నారు.

ఎల్‌ఎన్‌జీ పైప్‌లైన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జర్మనీ కొత్త ఎల్ఎన్‌జీ టెర్మినళ్లను అనుసంధానించటానికి పైప్‌లైన్లు నిర్మిస్తోంది

యూరప్ మరింత ఎల్‌ఎన్‌జీని ఎందుకు తీసుకోలేకపోతోంది?

‘‘యూరప్ క్లిష్ట పరిస్థితిని గట్టెక్కటానికి అమెరికా ఎల్ఎన్‌జీ సాయపడింది. కానీ ఇంకా ఎక్కువ ఎల్‌ఎన్‌జీ తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే యూరప్ తను తీసుకోగల ఎల్‌ఎన్‌జీ పరిమితులకు చేరుకుంది’’ అని ఎనర్జీ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన కేట్ డోరియన్ పేర్కొన్నారు.

ఎల్‌ఎన్‌జీని దిగుమతి చేసుకోదలచుకున్న దేశాల్లో.. దిగుమతి చేసుకున్న ఎల్ఎన్‌జీ నిల్వకు ఏర్పాట్లు, దాన్ని మళ్లీ గ్యాస్ రూపంలోకి మార్చుకోవటానికి ప్లాంట్లు అవసరం.

ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీ, స్పెయిన్ దేశాలు ఈ ప్లాంట్లను నిర్మించాయి. అయితే.. యూరప్‌లో అత్యధికంగా గ్యాస్ దిగుమతి చేసుకునే జర్మనీ సహా ఇతర దేశాలు ఈ ప్లాంట్లను నిర్మించుకోలేదు.

యూరప్‌లో ఎల్ఎన్‌జీ టెర్మినళ్ల కొరత దిగుమతులకు అవరోధంగా మారింది. అక్టోబర్ చివరి నాటికి యూరప్ సముద్ర జలాల్లో 51 ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్లు ఉన్నాయని.. వాటిలో చాలా నౌకలు రేవుల్లో ప్రవేశించటానికి వేచి ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి.

జర్మనీ, నెదర్లాండ్స్ వంటి దేశాలు ఎల్‌ఎన్‌జీని నిల్వ చేయటానికి, గ్యాస్‌ రూపంలోకి మార్చుకోవటానికి తేలియాడే టెర్మినళ్లను అద్దెకు తీసుకోవటం ద్వారా ఈ సమస్యను పరిష్కరించటానికి ప్రయత్నించాయి.

అయితే, ఈ ఫ్లోటింగ్ టెర్మినళ్లతో కూడా వస్తున్నే ఎల్ఎన్‌జీ మొత్తాన్నీ ఆ దేశాలు దింపుకోలేకపోతున్నాయి.

‘‘ఆ ఫ్లోటింగ్ టెర్మినళ్లు చిన్న స్థాయివి. భారీ మొత్తంలోని ఎల్‌ఎన్‌జీని అవి వేగంగా ప్రాసెస్ చేయలేవు. అందువల్ల నిరీక్షిస్తున్న నౌకల వరుస పెరిగిపోతోంది’’ అని నఖిల్ పేర్కొన్నారు. యూరప్ తనకు వస్తున్న ఎల్‌ఎన్‌జీ మొత్తాన్నీ స్వీకరించలేకపోవటానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ‘‘ఆయా దేశాల్లో నిల్వ సదుపాయాలన్నీ ఇప్పటికే నిండిపోయాయి. అందువల్ల కూడా మరింత ఎల్‌ఎన్‌జీని తీసుకోలేకపోతున్నాయి’’ అని డూరియన్ చెప్పారు. ‘‘యూరప్‌ దేశాలన్నీ.. వాతావరణం చల్లబడుతుండటంతో వేడి కోసం ఉపయోగించటానికి గ్యాస్‌ను నిల్వ చేస్తున్నాయి. కానీ ఈ శీతాకాలంలో వాతావరణం కాస్త వెచ్చగానే ఉంది’’ అని ఆమె వివరించారు.

యూరప్ దేశాలు మరో 17 ఎల్ఎన్‌జీ టెర్మినళ్లను నిర్మించటానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. వీటివల్ల ఎల్‌ఎన్‌జీ సామర్థ్యం 40 శాతం పైగా పెరుగుతుంది.

అయితే వీటిలో చాలా టెర్మినళ్లు 2026 లో పనిచేయటం ప్రారంభిస్తాయి.

ఇవి కూడా చదవండి: