Electric Vehicles: వీటిని కొనాలనుకునే ముందు ఈ 5 విషయాలూ గుర్తుంచుకోండి..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పారా పద్దయ్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనడమే బెటర్ అనే సంకేతాలిస్తుంటే.. వరుసగా జరుగుతున్న ప్రమాదాలు పునరాలోచనలో పడేస్తున్నాయి.
పారిస్ ఒప్పందం అమలులో బాగంగా కర్బన ఉద్గారాల కట్టడి కోసం ప్రభుత్వం ఈ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ప్రముఖ వాహన తయారీ సంస్థలతో పాటు కొన్ని కొత్త కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోకి అడుగు పెట్టాయి.
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలేంటి? వీటితో ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడం ఎలా?
పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, మండిపోతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి ఎలక్ట్రిక్ వాహనాలు. కర్బన ఉద్గారాల విడుదలలో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది.
ఐక్యూ ఎయిర్ 2019లో విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్య కారక నగరాల్లో 14 భారత్‌కు చెందినవే.
ఈ పరిస్థితిలో కొంతైనా మార్పు తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధన వనరులతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
1. విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్
ఇండియాలో 2014 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటార్ సైకిళ్ల వాడకం స్థిరంగా పెరుగుతూ వస్తోంది. 2019లో 1,52వేల ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులు అమ్ముడయ్యాయి. 2014తో పోల్చుకుంటే ఇది 20.6 శాతం ఎక్కువ. 2020-25 మధ్య ఇది 63.9 శాతం పెరుగుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.
ఇండియాలో ఈ-వెహికల్స్ ట్రెండ్ ప్రారంభించింది హీరో ఎలక్ట్రిక్ సంస్థ. ఫ్లాష్, ఆప్టిమా, నిక్స్ పేరుతో ఈ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తోంది. హీరో తర్వాత ఎథెర్ ఎనర్జీ, ఒకినావా స్కూటర్స్, బీగాస్, ఏంపియిర్, ఓలా, ప్యూర్ మరి కొన్ని సంస్థలు కూడా స్కూటర్లు, బైకుల్ని తయారు చేస్తున్నాయి.
2. సానుకూలతలు, ప్రతికూలతలు
ప్రభుత్వాలు, పాలకులు ఎంత చెప్పినా.. ప్రజలు తమ సౌలభ్యం, సౌకర్యమే చూసుకుంటారనేది వాస్తవం. పెట్రోల్ ధరల భారాన్ని తగ్గించుకునేందుకు ఎలక్ట్రానిక్ వాహనాలు మేలని చాలా మంది భావిస్తున్నారు.
మెట్రో నగరాలు, పెద్ద పట్టణాల్లో ఇప్పటికే ఎలక్ట్రానిక్ స్కూటర్లు, బైకుల షోరూమ్‌లు వెలిశాయి. ఈ వాహనాలు రోడ్ల మీద తిరుగుతున్నాయి. ఇతర వాహనాల్లాగే ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు కూడా కష్టాలు, నష్టాలు ఉన్నాయి.
ఈ వాహనాల వల్ల పెట్రోల్ ఖర్చు, రిపేర్లు, విడి భాగాల కొనుగోలు ఖర్చు చాలా వరకూ తగ్గుతోంది. కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. నిర్వహణ ఖర్చు తక్కువ. పర్యావరణ హితమైనవి. సౌండ్ పొల్యూషన్ ఉండదు.
ప్రతికూలతల విషయానికి వస్తే ధరలు ఎక్కువగా ఉండటం, అక్కడక్కడ బ్యాటరీలు పేలిపోతుండటం, బ్యాటరీని మార్చాలంటే వేలల్లో ఖర్చు చేయాల్సి రావడం, ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం లేకపోవడం లాంటి కొన్ని సమస్యలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
పెట్రోల్ బంకుల మాదిరిగా విస్తృతంగా చార్జింగ్ పాయింట్లు లేకపోవడం, వేగంగా వెళ్లే అవకాశం లేకపోవడం వంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, GOGORO
3. కొనేటప్పుడు చూడాల్సిన అంశాలు
మార్కెట్‌లో ప్రస్తుతం చాలా సంస్థల వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్ కొనేటప్పుడు దాని సైజ్, సస్పెన్షన్ బ్రేక్స్, సర్వీసింగ్, ఒకసారి చార్జింగ్ పెట్టాక ఎంతదూరం ప్రయాణిస్తుంది, ఎలా పని చేస్తుంది లాంటి విషయాలన్నీ తెలుసుకోవడం మంచిది.
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న వాటిలో చాలా వరకూ సింగిల్ చార్జింగ్‌తో 50 నుంచి వంద కిలోమీటర్లు మాత్రమే వెళుతున్నాయి. కొన్ని వాహనాల్లో అదనపు బ్యాటరీతో మరి కొంత దూరం వెళ్లే ఏర్పాట్లు ఉన్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాల్లో కొన్ని సంస్థలు డాష్ బోర్డులోనే బ్యాటరీ చార్జింగ్ ఎంత ఉంది, వాహనం ఎంత దూరం వెళుతుందనే అంశాలతో పాటు మ్యాపులు, యూఎస్‌బీ పోర్టు, స్పీడ్ మోడ్, సీటు కింద స్టోరేజ్ బిన్స్ లాంటి సౌకర్యాలు అందిస్తున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎంపిక చేసుకోవడంలో అన్నింటి కంటే కీలకం బ్రాండ్. వాహనాన్ని తయారు చేసిన సంస్థ చరిత్ర, విశ్వసనీయత కూడా ముఖ్యం
4. ప్రమాదాలు..
ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో ఆందోళన కలిగిస్తున్న అంశం ప్రమాదాలు. బ్యాటరీలు పేలిపోవడం, వాహనాలు కాలిపోవడం లాంటి ఘటనల్ని చూస్తున్నాం.
అయితే ఇందులో ఎక్కువగా వినియోగదారుల అవగాహన లేమి వల్లే జరుగుతున్నట్లు హైదారాబాద్‌కు చెందిన వాహనరంగ నిపుణుడు రామిరెడ్డి బీబీసీతో చెప్పారు.
వాహనాల్ని ఎండలో పార్కింగ్ చెయ్యడం, బ్యాటరీని ఎక్కువ సేపు చార్జింగ్ పెట్టడం, చార్జింగ్ పెట్టగానే వాహనాన్ని నడపడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు ఆయన వివరించారు.
వాహనాన్ని పార్కింగ్ చేశాక, కొంత సేపటి తర్వాత చార్జింగ్ పెట్టడం, చార్జింగ్ పూర్తయిన అరగంట తర్వాతే వాహనాన్ని నడపడం వంటి వాటితో ఇలాంటి ప్రమాదాలను నివారించొచ్చని ఆయన అన్నారు.
నిర్ధారిత ప్రమాణాలున్న ఎలక్ట్రిక్ స్కూటర్ మూడేళ్ల వరకూ ఢోకా లేకుండా నడుస్తుందని కైనటిక్ సంస్థ తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. అయితే ఇది వాహనం నడిపే వ్యక్తుల వ్యవహార శైలి మీద కూడా ఆధారపడి ఉంటుందని చెబుతోంది.
5. ప్రభుత్వాల ప్రోత్సాహం
పారిస్ ఒప్పందంపై సంతకం చేసిన భారత ప్రభుత్వం 2030 నాటికి కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా నిర్ణయాలు అమలు చేస్తోంది. ఇందులో బాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తోంది.
ఈవీలను ప్రమోట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ – FAME పేరుతో కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు పన్ను రాయితీలు ఇస్తోంది. పెట్రోల్ వాహనాల మీద జీఎస్టీ 28 శాతం ఉంటే ఎలక్ట్రిక్ వాహనాల మీద జీఎస్టీ 12 శాతంగా ఉంది.
ఈ నెల 17న దిల్లీలోని ICARలో జరిగిన కిసాన్ సమ్మేళన్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ.. భారత దేశం ఏటా 9.6 లక్షల కోట్ల రూపాయల విలువైన ముడి చమురు దిగుమతి చేసుకుంటోందని.. దీని వల్ల దేశ ప్రజల మీద చాలా భారం పడుతోందని అన్నారు.
ఈ పరిస్థితిని మార్చడంలో ఎలక్ట్రిక్ వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పడంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు ఉండకపోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- స్త్రీల వైద్యుడుగా పనిచేసే పురుషుడి జీవితం ఎలా ఉంటుంది?
- 5 గంటల కంటే తక్కువ నిద్రతో ఆరోగ్యం దెబ్బతింటుంది - తాజా అధ్యయనం.. మంచి నిద్రకు 6 మార్గాలు
- బీటీఎస్: ఆడుతూ, పాడుతూ ఏడాదికి రూ. 800 కోట్లు సంపాదించే ఈ యువకులు రెండేళ్లు ఆర్మీలో చేరుతున్నారు, ఎందుకు?
- బ్రిటన్ ప్రధాన మంత్రిపై ఎంపీల తిరుగుబాటు ఎందుకు? లిజ్ ట్రస్ పీఎంగా ఇంకెంత కాలం మనుగడ సాగించగలరు?
- హైదరాబాద్ సెక్స్ స్కాండల్: ఆనాటి బ్రిటీష్ సామ్రాజ్యంలో సంచలనం సృష్టించిన సెక్స్ కుంభకోణం కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

















