చైనా: సోలార్ ప్యానల్స్ తయారీ కోసం వీగర్ ముస్లింలతో నిర్బంధ చాకిరీ - Newsreel

సౌర ఫలకాల తయారీలో పాలీసిలికాన్ కీలకమైన మెటీరియల్.
ఫొటో క్యాప్షన్, సౌర ఫలకాల తయారీలో పాలీసిలికాన్ కీలకమైన మెటీరియల్.

సౌర ఫలకాల(సోలార్ ప్యానల్స్) తయారీలో కీలకమైన ఒక మెటీరియల్‌ను వీగర్ ముస్లింలతో చైనా బలవంతంగా పనిచేయించి ఉత్పత్తి చేస్తోందని బ్రిటన్‌లోని ఒక విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధనలో వెల్లడైంది. జింజియాంగ్ రాష్ట్రంలో వీరు నిర్బంధ కార్మికులుగా పనిచేస్తున్నారని తేలింది.

సౌర ఫలకాల తయారీలో పాలీసిలికాన్ కీలకమైన మెటీరియల్.

ప్రపంచ దేశాలకు సరఫరా అయ్యే పాలీసిలికాన్‌లో ఇంచుమించు 45 శాతం జింజియాంగ్ రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతోందని బ్రిటన్‌లోని షెఫీల్డ్ హాలమ్ యూనివర్శిటీ నివేదిక తెలిపింది. వీగర్ ముస్లింలపై పెద్దయెత్తున బలప్రయోగంతో ఈ మెటీరియల్ సేకరణ జరుగుతోందని చెప్పింది.

వీగర్ ముస్లింలతో నిర్బంధంగా పనిచేయించి ఈ మెటీరియల్‌ను సరఫరా చేస్తున్నందున చైనా నుంచి దీనిని తీసుకోవద్దని సౌర ఫలకాల తయారీలో అగ్రగామి సంస్థలను నివేదిక కోరింది. దీనిని ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకోవాలని సూచించింది.

వాతావరణ మార్పులను నియంత్రించే ప్రయత్నాల్లో భాగంగా అనేక దేశాలు సౌర ఇంధన వనరులను పెంచుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో సౌర ఫలకాలకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది.

వీగర్ ముస్లింల పట్ల అనుసరిస్తున్న వైఖరికి చైనా ప్రపంచవ్యాప్తంగా విమర్శలను ఎదుర్కొంటోంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వీగర్ ముస్లింల పట్ల అనుసరిస్తున్న వైఖరికి చైనా ప్రపంచవ్యాప్తంగా విమర్శలను ఎదుర్కొంటోంది.

అంతా మా చట్టానికి లోబడే: చైనా

క్వార్ట్జ్ నుంచి పాలీసిలికాన్ సేకరిస్తారు. చైనా వీగర్ ముస్లింలపై పెద్దయెత్తున బలప్రయోగంతో ఉత్పత్తి చేసిన మెటీరియల్స్‌ను ప్రపంచంలోని నాలుగు అతిపెద్ద తయారీ సంస్థలు ఉపయోగిస్తున్నాయని ఈ విశ్వవిద్యాలయం నివేదిక చెప్పింది.

చైనా మాత్రం అంతా తమ చట్టానికి లోబడే జరుగుతోందని చెబుతోంది. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వ మద్దతుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా కార్మికులు ఇష్టపూర్వకంగానే ఈ పని చేస్తున్నారని అంటోంది.

ఎన్నడూ లేనంత నిర్బంధం, మాట వినకపోతే తిరిగి రీఎడ్యుకేషన్ క్యాంపులకు లేదా కారాగారాలకు తరలిస్తారనే భయం మధ్య జింజియాంగ్‌లో వీగర్ కార్మికులు పనిచేస్తున్నారనే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని షెఫీల్డ్ హాలమ్ విశ్వవిద్యాలయం నివేదిక తెలిపింది. ఈ ఆధారాల్లో చాలా వరకు ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థల నుంచి సేకరించిన సమాచారమే ఉందని వివరించింది.

జింజియాంగ్ రాష్ట్రం చైనా వాయువ్య ప్రాంతంలో ఉంది.
ఫొటో క్యాప్షన్, జింజియాంగ్ రాష్ట్రం చైనా వాయువ్య ప్రాంతంలో ఉంది.

చైనాపై పెరుగుతున్న విమర్శలు

జింజియాంగ్ రాష్ట్రం చైనా వాయువ్య ప్రాంతంలో ఉంది. ఇక్కడ అత్యధికులు వీగర్ ముస్లింలే. వీరి పట్ల అనుసరిస్తున్న వైఖరికి చైనా ప్రపంచవ్యాప్తంగా విమర్శలను ఎదుర్కొంటోంది.

గత కొన్నేళ్లలో పది లక్షల మందికి పైగా వీగర్ ముస్లింలను‘రీఎడ్యుకేషన్ క్యాంపులు’గా పిలిచే నిర్బంధ కేంద్రాల్లో ఉంచిందని మానవ హక్కుల గ్రూపులు భావిస్తున్నాయి.

వీగర్లను నిర్బంధ కార్మికులుగా చైనా ఉపయోగిస్తోందని, వీగర్ మహిళలకు బలవంతంగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయిస్తోందని చెప్పే ఆధారాలు ఉన్నాయి.

వీగర్లను అణచివేసే చర్యలతో చైనా జాతి హననానికి పాల్పడుతోందని అమెరికా, ఇతర దేశాలు ఆరోపిస్తున్నాయి.

చైనా మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ వస్తోంది. జింజియాంగ్‌లో వేర్పాటువాదంపై, ఇస్లామిస్ట్ మిలిటన్సీపై తాము పోరాడుతున్నామని వాదిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)