'అర్థరాత్రి వస్తారు, నచ్చిన ఆడవాళ్ళను ఎత్తుకెళ్ళిపోతారు... అడిగేవారే లేరు'

జియావుదున్
ఫొటో క్యాప్షన్, జియావుదున్
    • రచయిత, మాథ్యూ హిల్, డేవిడ్ క్యాంపనాలే, జోయెల్ గుంటర్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో వీగర్ ముస్లింల కోసం నిర్వహిస్తున్న 'రీ ఎడ్యుకేషన్ ' శిబిరాల్లో ఒక పథకం ప్రకారం మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని.. వారిని లైంగిక వేధింపులకు గురి చేస్తూ, హింసిస్తున్నారని బీబీసీ పరిశోధనలో వెల్లడైంది.

అక్కడ జరుగుతున్న లైంగిక దాడులు, హింస మనసులను కలచివేస్తున్నాయి.

తుర్సునే జియావుదున్ చైనా నిర్బంధ శిబిరాల్లో తొమ్మిది నెలలు గడిపారు.

"అక్కడి పురుషులు ఎప్పుడూ మాస్క్‌తోనే కనిపించేవారు. అప్పటికి కరోనా లేనే లేదు, అయినా మాస్కులు ధరించేవారు. వాళ్లు పోలీస్ యూనిఫాంలు కాకుండా మామూలు సూట్లు వేసుకునేవారు.

అర్ధరాత్రి దాటాక వాళ్లు సెల్‌లోకి వచ్చేవారు. వాళ్లకు నచ్చిన మహిళలను ఎత్తుకెళిపోయేవారు. అదే కారిడార్‌లో నిఘా కెమేరాలు లేని బ్లాక్ రూంకు తీసుకెళ్లేవారు" అని జియావుదున్ వివరించారు.

పలుమార్లు తనను కూడా ఎత్తుకెళ్లారని జియావుదున్ చెప్పారు.

"నా జీవితంలో మర్చిపోలేని విషాదం అది. దాని గురించి మాట్లాడడానికి కూడా నాకు మనసు రావట్లేదు" అని ఆమె అన్నారు.

కొన్ని వ్యక్తిగత అధ్యయనాల అంచనాల ప్రకారం, పది లక్షలకన్నా ఎక్కువమంది మహిళలు, పురుషులను ఈ శిబిరాల్లో నిర్బంధించారు.

అయితే, ఈ శిబిరాలను వీగర్ ముస్లింలు, ఇతర మైనారిటీ వర్గాల 'పునర్విద్య' (రీ ఎడ్యుకేషన్) కోసం ఏర్పాటు చేశామని చైనా చెబుతోంది.

చైనా ప్రభుత్వం, వీగర్ ముస్లింల మతపరమైన స్వేచ్ఛను, ఇతర హక్కులు, స్వాతంత్ర్యాన్ని క్రమక్రమంగా తొలగించేందుకు ప్రయత్నిస్తోందని, వారిపై సామూహిక నిఘా, నిర్బంధం, బలవంత బోధన, స్టెరిలైజేషన్‌కు పాల్పడుతున్నారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

‘‘2014లో జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో వీగర్ వేర్పాటువాదులు ఉగ్రవాద దాడులకు పాల్పడ్డారు.

అనంతరం ఆ ప్రాంతాన్ని సందర్శించిన షీ జిన్‌పింగ్ ఈ శిబిరాలను ప్రారంభించారు.

న్యూయార్క్ టైమ్స్ బయటపెట్టిన పత్రాల ప్రకారం.. ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే జిన్‌పింగ్ అధికారులకు ఆదేశాలు ఇస్తూ "ఏ రకమైన దయ, జాలి చూపవద్దని" సూచించారు.

అప్పటినుంచీ చైనా అధికారుల చర్యలు మారణహోమాన్ని తలపిస్తున్నాయ’’ని గత నెలలో అమెరికా ప్రభుత్వం ఆరోపించింది.

అయితే, ఇవన్నీ "అబద్ధాలని, అసంబద్ధ ఆరోపణలని" చైనా ప్రభుత్వం కొట్టిపారేసింది.

జియావుదున్

ప్రస్తుతం ఈ నిర్బంధ శిబిరాల్లో ఉన్నవారి నుంచి వివరాలు బయటకి రాబట్టడం కష్టమే. కానీ అంతకుముందు నిర్బంధంలో ఉన్నవారు, ఒక భద్రతా అధికారి బీబీసీకి అందించిన వివరాల ప్రకారం.. ఈ శిబిరాల్లో క్రమబద్ధంగా, పథకం ప్రకారం అత్యాచారాలు, లైంగిక దాండులు, హింస జరుగుతున్నాయని తెలిసింది.

తాము స్వయంగా ఆ హింసను అనుభవించామని కొందరు బీబీసీకి చెప్పారు.

జిన్జియాంగ్‌లోని నిర్బంధ శిబిరాల నుంచి విడుదలైన తరువాత తుర్సునే జియావుదున్ చైనా నుంచి పారిపోయి మొదట కజక్‌స్తాన్ చేరుకున్నారు. తరువాత అమెరికా వెళ్లారు.

నిర్బంధ శిబిరాల్లో ప్రతి రోజూ మహిళలను వేరే గదికి తీసుకెళ్లేవారని, ఒకరు లేదా కొంతమంది మాస్క్ వేసుకున్న పురుషులు వారిపై అత్యాచారం చేసేవారని జియావుదున్ తెలిపారు. తనను బాగా హింసించారని, మూడు సార్లు గ్యాంగ్‌రేప్ చేశారని చెప్పారు.

దీనికి ముందు కూడా జియావుదున్ కజక్‌స్తాన్‌లో ఉన్నప్పుడు మీడియతో మాట్లాడారు. అయితే, అక్కడ ఉన్నంతకాలం "తనను తిరిగి చైనా పంపేస్తారేమోనని భయంగా ఉండేదని" ఆమె చెప్పారు.

"చైనా నిర్బంధ శిబిరాల్లో తాను చూసిన, ఎదుర్కొన్న లైంగిక వేధింపులు, హింస గురించి బయటపెడితే తనను మళ్లీ జిన్‌జియాంగ్ పంపేస్తారని, అలా జరిగితే ఈసారి తనపై జరిగే దాడులు మరింత దారుణంగా ఉంటాయని బాగా భయపడ్డానని, అందుకు సిగ్గుపడుతున్నానని" జియావుదున్ అన్నారు.

జియావుదున్ చెప్పిన వివరాలన్నిటినీ పూర్తిగా ధ్రువీకరించడం అసాధ్యం, ఎందుకంటే చైనాలో జర్నలిస్టులు, రిపోర్టర్ల మీద తీవ్ర ఆంక్షలు ఉంటాయి. అయితే, ఆమె బీబీసీకి చూపించిన ప్రయాణ పత్రాలు, ఇమిగ్రేషన్ రికార్డులు కాలానుగుణంగా ఉన్నాయి.

జిన్యువాన్ కౌంటీ (వీగర్ భాషలో క్యూనెస్ కౌంటీ)లోని శిబిరం గురించి ఆమె చెప్పిన వివరాలు, బీబీసీ విశ్లేషించిన ఉపగ్రహ చిత్రాలతో సరిపోలుతున్నాయి.

శిబిరాల్లో రోజువారి జీవితం, హింసించే పద్ధతుల గురించి ఆమె చెప్పిన విషయాలన్నీ కూడా గతంలో శిబిరాల్లో ఉన్నవారు అందించిన వివరాలతో సరిపోతున్నాయి.

క్యూనెస్ కౌంటీ న్యాయ వ్యవస్థకు చెందిన.. 2017, 2018 సంవత్సరాల రికార్డులను జిన్జియాంగ్‌లోని చైనా విధానాల నిపుణులు ఆండ్రియన్ జెంజ్ బీబీసీకి అందించారు.

"కీలక వర్గాలకు విద్య ద్వారా పరివర్తన" అంటూ వీగర్లకోసం చైనా ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన బలవంతపు భోదన ప్రణాళిక, దాని ఖర్చు వివరాలన్నీ ఈ పత్రాల్లో ఉన్నాయి.

ఒక పత్రంలో విద్యాబోధన అంటే "మెదడు, హృదయాలను శుభ్రం చేయడం, ధర్మాన్ని బలోపేతం చేయడం, చెడును తొలగించడం" అని పేర్కొన్నారు.

చైనా శిబిరాల్లో 18 నెలలపాటూ నిర్బంధంలో ఉన్న ఒక కజక్ మహిళ గుల్జిరా ఓల్ఖాన్‌తో కూడా బీబీసీ మాట్లాడింది.

వీగర్ మహిళల దుస్తులు తొలగించి, ఆ గదిలో వారిని కదలకుండా కట్టేసి వెళ్లిపోమని అక్కడి పురుషులు తనను ఆదేశించేవారని ఆమె చెప్పారు. వారు వెళిపోయిన తరువాత ఆ గదులను ఆమె శుభ్రం చేసేవారు.

"ఆ మహిళలకు నడుంపైన ఉన్న దుస్తులను తొలగించి, వారు కదలకుండా చేతులు కట్టేయడమే నా పని."

"వాళ్లని అలా కట్టేసి నేను ఆ గదిలోంచి వెళిపోయేదాన్ని. తరువాత ఒక వ్యక్తి ఆ గదిలోకి వెళ్లేవారు. బయటనుంచి వచ్చిన చైనా మనిషో లేదా పోలీసో.. లోపలికి వెళ్లి, కాసేపటి తరువాత బయటకు వచ్చేవారు. నేను ఆ గది పక్కనే కూర్చుని ఉండేదాన్ని. వాళ్లు వెళ్లిపోయాక లోపల ఉన్న మహిళను స్నానానికి తీసుకెళ్లేదాన్ని. వాళ్లకు నచ్చిన అమ్మాయిని తీసుకురావడానికి నాకు డబ్బులు ఇచ్చేవారు" అని ఓల్ఖాన్‌ చెప్పారు.

వాళ్లను అడ్డుకోడానికి గానీ, జరుగుతున్న దారుణాన్ని ఆపడానికిగానీ తాను అశక్తురాలినని ఆమె అన్నారు.

అర్థరాత్రి సెల్‌నుంచీ తీసుకెళ్లిన మహిళల్లో కొందరు వెనక్కు తిరిగి వచ్చేవారు కాదని, ఒకవేళ తిరిగి వచ్చినా.. ఆ పక్క గదిలో వాళ్లకు ఏం జరిగిందో ఎవరికీ చెప్పకూడదని బెదిరించి మరీ పంపేవారని జియావుదున్ తెలిపారు.

"ఏం జరిగిందో ఎవరికీ చెప్పకూడదు. నిశ్శబ్దంగా పడుకోవడం తప్పించి చేయగలిగింది ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరి ఆత్మను నాశనం చేసే విధంగా అక్కడి విధానాలను రూపొందించారు" అని ఆమె అన్నారు.

గుల్జిరా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 18 నెలలు నిర్బంధంలో ఉన్న గుల్జిరా

వాయువ్య చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో నివసించే వీగర్లు అందరూ దాదాపు ముస్లిం-టర్కీ మైనారిటీ వర్గాలకు చెందినవారు.

వీరి జనాభా సుమారు 11 మిలియన్లు ఉంటుంది. ఈ ప్రాంతం కజక్‌స్తాన్ సరిహద్దులో ఉంది. కొంతమంది కజక్ ప్రజలు కూడా ఇక్కడ నివసిస్తూ ఉంటారు.

42 ఏళ్ల జియావుదున్ వీగర్ మహిళ. ఆమె భర్త ఒక కజక్. వీరు 2016 చివర్లో కజక్‌స్తాన్‌నుంచీ జిన్జియాంగ్ వెళ్లారు.

అక్కడికి వెళ్లిన వెంటనే వారిని విచారించి, వారి పాస్‌పోర్ట్‌లను జప్తు చేసారని జియావుదున్ తెలిపారు.

కొన్ని నెలల తరువాత పోలీసులు వారిని ఒక సమావేశానికి హాజరు కమ్మని పిలిచారు. ఆ సమావేశంలో ఇతర వీగర్లు, కజక్‌లు కూడా ఉన్నారని, అక్కడ పోలీసులు తమని నిర్బంధించి, శిబిరాలకు తీసుకువెళ్లారని ఆమె తెలిపారు.

మొదటిసారి నిర్బంధ శిబిరాల్లో తనకు అంత కష్టం కలగలేదని, భోజనం బాగానే ఉండేదని, తన దగ్గర ఒక ఫోన్ కూడా ఉండేదని జియావుదున్ తెలిపారు.

ఒక నెల తరువాత ఆమెకు కడుపులో అల్సర్లు రావడంతో ఆమెను విడుదల చేశారు. తన భర్త పాస్‌పోర్ట్‌ను తిరిగి ఇచ్చేయడంతో ఉద్యోగ రీత్యా ఆయన తిరిగి కజక్‌స్తాన్ వెళిపోయారు.

కానీ జియావుదున్ పాస్‌పోర్ట్ తిరిగి ఇవ్వకుండా ఆమె జిన్‌జియాంగ్ విడిచి వెళ్లలేని పరిస్థితులు కల్పించారు. ఇదంతా కూడా చైనా కావాలనే చేసిందని రిపోర్టులు చెబుతున్నాయి.

2018 మార్చి 9న తనను ఒక స్థానిక పోలీస్ స్టేషన్‌కు రమ్మని పిలిచారని, తనకు "మరింత విద్య అవసరమని" అక్కడ చెప్పారని జియావుదున్ తెలిపారు.

ఆమెను తిరిగి క్యూనెస్ కౌంటీలోని నిర్బంధ శిబిరానికి పంపించారు. శిబిరాలను బాగా అభివృద్ధి పరిచారని, కొత్తగా నిర్బంధించినవారిని తీసుకు వస్తూ బస్సులు లైను కట్టాయని ఆమె చెప్పారు.

అక్కడకు వెళ్లిన మహిళల ఆభరణాలను జప్తు చేస్తారు. జియావుదున్ చెవులను రక్తం వచ్చేలా లాగి మరీ కమ్మలు తీసుకున్నారు. ఆమెతోపాటూ వచ్చిన మహిళలందరినీ ఒక గదిలో ఉంచారు. వారిలో ఉన్న ఒక పెద్దావిడతో జియావుదున్‌కు స్నేహం కుదిరింది.

ముస్లిం మహిళలు తలపై ధరించిన స్కార్ఫ్‌లను లాగి పడేశారని, పొడవు దుస్తులు వేసుకున్నందుకు తనపై ఆగ్రహించారని ఆమె తెలిపారు.

వీగర్లను మతపరమైన వ్యక్తీకరణలకు అరెస్ట్ చెయ్యొచ్చని ఆ ఏడాదే చైనాలో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అందులో ఈ పొడవు దుస్తులు వేసుకోవడం కూడా ఒకటి.

"ఆ పెద్దావిడ ఒంటి మీద దుస్తులన్నీ తొలగించారు. అండర్‌వేర్ మాత్రం వదిలేశారు. ఆమె చాలా అవమానపడ్డారు.. ఏడ్చారు. ఆవిడకు జరిగిన అవమానం చూసి నేను ఎంత ఏడ్చానో చెప్పలేను" అని జియావుదున్ తెలిపారు.

కాళ్లకు ఉన్న చెప్పులు, ఎలాస్టిక్, బటన్లు ఉన్నదుస్తులను తీసి ఇచ్చేయాలని వారికి చెప్పారు. తరువాత వాళ్లను వరుసగా ఉన్న బిల్డీంగుల దగ్గరకు తీసుకెళ్లారు. లోపల గదుల్లో నిర్బంధించారు.

మొదటి నెలా, రెండు నేలల్లో పెద్దగా ఏమీ జరగలేదు. వాళ్లకు కొన్ని ప్రోపగాండా ప్రోగ్రాంలు చూపించారు. బలవంతంగా జుట్టు కత్తిరించారు.

క్రమంగా జియావుదున్ భర్త గురించి పోలీసులు ఆమెను ప్రశ్నలడగడం మొదలెట్టారు. ఆమెను నేల మీద పడేసి విచారించేవారు. ఆమె ప్రతిఘటిస్తే కడుపులో తన్నేవారు.

"పోలీసులు బూట్లు చాలా గట్టిగా, బరువుగా ఉంటాయి. మొదట వేరే దేనితోనో కొడుతున్నారు అనుకున్నాను. తరువాత అర్థమైంది.. బూట్లతో నా కడుపులో బలంగా తంతున్నారని. నేను దాదాపు స్పృహ కోల్పోయాను. శరీరంలో ఏవో వేడి తరంగాలు ప్రవహిస్తున్నట్లు అనిపించింది" అని జియావుదున్ తెలిపారు.

ఆమెకు రక్తస్రావం అవుతున్నట్లుగా తోటి మహిళలు గుర్తించారు. శిబిరంలోని డాక్టర్ ఆమెను పరీక్షించి లోపల బ్లడ్ క్లాట్ అయి ఉండొచ్చని చెప్పారు. అది విని, "మహిళలకు బ్లీడంగ్ అవ్వడం సాధారణమైన విషయం" అక్కడి భద్రతా అధికారులు జవాబిచ్చారని జియావుదున్ తెలిపారు.

శిబిరాల్లోని ఒక్కొక్క గదిలో 14 మంది మహిళలను ఉంచేవారని, వారందికీ బంక్ బెడ్స్, వాష్ బేసిన్, టాయిలెట్ ఉండేదని ఆమె చెప్పారు. మొదట్లో అర్థరాత్రుళ్లు తోటి మహిళలను గదిలోంచి బయటకి తీసుకెళుతుంటే, ఎందుకు తీసుకెళుతున్నారో అర్థమయ్యేది కాదని, బహుశా వేరే చోటికి వాళ్లను మారుస్తున్నారని అనుకునేదాన్నని ఆమె తెలిపారు.

రీ ఎడ్యుకేషన్ క్యాంప్ ఉన్న ప్రాంతం

ఫొటో సోర్స్, Maxar

ఫొటో క్యాప్షన్, రీ ఎడ్యుకేషన్ క్యాంప్ ఉన్న ప్రాంతం

"2018 మే నెలలో.. నాకు తేదీ సరిగ్గా గుర్తు లేదు.. ఆ గదుల్లోపల ఏ రోజు ఏదో తెలీదు.. ఒక అర్థరాత్రి నన్ను, నాతోటి మహిళను గదిలోంచి బయటకు తీసుకెళ్లి మాస్క్ వేసుకుని ఉన్న ఒక చైనీస్ వ్యక్తికి అప్పగించారు. రెండో ఆమెకు 20 ఏళ్లు ఉంటాయి. ఆమెను మరో గదిలోకి తీసుకెళ్లారు. లోపలికి వెళ్లిన దగ్గరనుంచీ ఆమె బిగ్గరగా అరవడం మొదలుపెట్టారు. ఆమెను లోపల హింసిస్తున్నారని అనుకున్నాను. రేప్ చేస్తారని అస్సలు ఊహించలేదు" అని జియావుదున్ అన్నారు.

వాళ్లను గదిలోంచి బయటికి తీసుకొచ్చిన మహిళ.. జియావుదున్‌కు ఈమధ్యనే రక్తస్రావం అయ్యిందని అక్కడికి వచ్చిన మగవాళ్లకి చెప్పారు.

"ఆమె నా పరిస్థితిని వాళ్లకు వివరించి చెప్పిన తరువాత వాళ్లు ఆమెను తిట్టడం మొదలెట్టారు. నన్ను ఆ పక్కనున్న చీకటి గదిలోకి తీసుకెళ్లమని ఆమెకు చెప్పారు. ఆమె నన్ను ఆ గదిలోకి తీసుకెళ్లారు. వాళ్ల చేతిలో ఒక ఎలక్ట్రిక్ రాడ్ ఉంది. అదేంటో నాకు మొదట అర్థం కాలేదు. దాన్ని నా జననాంగంలో దూర్చారు. ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి నన్ను హింసించారు.

నన్ను తీసుకొచ్చిన మహిళ నా పరిస్థితిని వాళ్లకు మళ్లీ గుర్తు చేశారు. అప్పుడు వాళ్లు ఆ హింస ఆపి, నన్ను నా గదిలోకి పంపించారు. ఓ గంట తరువాత వేరే గదిలోకి తీసుకెళ్లిన అమ్మాయిని కూడా తిరిగి తీసుకొచ్చారు.

ఆ రాత్రి తరువాత ఆ అమ్మయి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఆమె ఎవ్వరితోనూ మాట్లేడేవారు కాదు. ఏదో ట్రాన్స్‌లో ఉన్నట్టు ఎటో చూస్తూ కూర్చునేవారు. మతి భ్రమించినవాళ్లు, మానసిక సమతౌల్యాన్ని కోల్పోయినవారు ఆ శిబిరాల్లో చాలామందే ఉండేవారు" అని జియావుదున్ చెప్పారు.

ఈ శిబిరాల్లో మరో ముఖ్యమైన భాగం తరగతి గదులు. అక్కడ నిర్బంధంలో ఉన్నవారికి విద్యాబోధన చేస్తారు.

విద్యా బోధన అంటే వీగర్, ఇతర మైనారిటీ వర్గాలు తమ సంస్కృతి, భాష, మతం, ధర్మాన్ని విడిచిపెట్టి చైనా సంస్కృతి నేర్చుకునేలా బలవంతపు బోధన అని యాక్టివిస్టులు అంటున్నారు.

చైనీస్ భాష నేర్పించేందుకు జిన్జియాంగ్‌నుంచీ నిర్బంధ శిబిరాలకు బలవంతంగా తీసుకొచ్చిన టీచర్లలో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన క్వెల్బినర్ సెదిక్ కూడ ఒకరు. కానీ సెదిక్ అక్కడినుంచీ తప్పించుకుని పారిపోయారు. అనంతరం, ఆమెకు అక్కడ ఎదురైన అనుభవాల గురించి బహిరంగంగా మాట్లాడారు.

మహిళా శిబిరాల్లో కఠిన నియంత్రణ ఉండేదని సెదిక్ బీబీసీకీ తెలిపారు. అత్యాచారాలు జరుగుతున్నాయనే కథానాలు వినిపించేవని, రేప్ జరిగిన సూచనలు కనిపించేవని ఆమె చెప్పారు.

"ఒకరోజు అక్కడ నాకు తెలిసిన ఒక మహిళా పోలీస్ దగ్గరకి వెళ్లి.. ఇక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయని వార్తలు వింటున్నాను. నిజమేనా? అని మెల్లిగా అడిగాను.

మనం లంచ్ టైంలో బయటికెళ్లి దీని గురించి మాట్లాడుకుందామని ఆమె చెప్పారు.

ఆమె చెప్పిన విధంగా బయటికెళ్లి, కెమేరాలు లేని చోట తనను కలిశాను.

ఇక్కడ అత్యాచారాలు సర్వ సాధారణం అయిపోయాయని, సాముహిక అత్యాచారాలకు పాల్పడడమే కాక ఎలక్ట్రిక్ షాక్‌లు ఇస్తూ దారుణంగా హింసిస్తున్నారని ఆమె చెప్పారు.

ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. వేరే దేశంలో చదువుకుంటున్న నా కూతుర్ని తలుచుకుని రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నాను" అని సెదిక్ వివరించారు.

వీగర్ మానవ హక్కుల ప్రోజెక్ట్‌కు సంబంధించిన మరో ఇంటర్వ్యూలో సెదిక్ మాట్లాడుతూ.. మహిళల జననాంగాల్లోకి ఎలక్ట్రిక్ రాడ్‌లు దూర్చి కరంట్ షాక్ ఇస్తున్నారని విన్నానని చెప్పారు.

"నాలుగు రకాల కరంట్ షాక్‌లు ఉండేవి.. కుర్చీ, గ్లౌజ్, హెల్మెట్, జననాంగాల్లోకి కడ్డీ దూర్చడం. వాళ్ల కేకలతో భవనం దద్దరిల్లిపోయేది. లంచ్ టైంలో, ఒక్కోసారి క్లాస్ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ల అరుపులు వినిపించేవి" అని సెదిక్ తెలిపారు.

శిబిరాలు

ఫొటో సోర్స్, Bitter winter

ఈ శిబిరాల్లో పాఠాలు చెప్పడానికి బలవంతంగా తీసుకొచ్చిన మరొక టీచర్ సేరగుల్ సాత్బే కూడా "అక్కడ రేప్ చెయ్యడం సాధారణమని, భద్రతా అధికారులు తమకు నచ్చిన అమ్మాయిలను ఎత్తుకెళ్లిపోయేవారని" బీబీసీకి తెలిపారు.

తన కళ్ల ముందే ఒక సామూహిక అత్యాచారం జరిగిందని సాత్బే చెప్పారు.

"ఆరోజు అక్కడ ఒక వందమంది ఉంటుండగా, ఒక 20 లేదా 21 ఏళ్లు ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి.. అందరి ముందూ తన తప్పును ఒప్పుకోమని బలవంతపెట్టారు.

ఆ అమ్మాయి తప్పు ఒప్పుకున్నాక, పోలీస్ అధికారులు ఒకరి తరువాత ఒకరుగా వచ్చి తనను అక్కడే అందరి ముందూ రేప్ చేశారు.

రేప్ చేస్తుండగా ఎవరైనా ప్రతిఘటించినా, కళ్లు మూసుకున్నా, పిడికిలి బిగించినా వారిని శిక్షించడానికి తీసుకెళ్లారు.

సేరగుల్ సాత్బే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సేరగుల్ సాత్బే

ఆ అమ్మాయి సహాయం కోసం ఎంతో అర్థించింది. నా కళ్ల ముందే ఇంత దారుణం జరిగింది. అది చూసి నేను చచ్చిపోయాను" అని సాత్బే తెలిపారు.

క్యూనెస్ శిబిరంలో జియావుదున్‌కు వారాలు, నెలలు గడిచిపోయాయి. అందరికీ జుట్టు కత్తిరించారు.

తరగతి గదుల్లో పాఠాలు బోధించేవారు. వైద్య పరీక్షలు ఏవో జరిపేవారు. మాత్రలు వేసుకోమని ఇచ్చేవారు. 15 రోజులకొకమాటు ఒక వ్యాక్సీన్ ఇచ్చేవారు.

అది వేయించుకున్న తరువాత కడుపులో తిప్పేసి, వాంతులయ్యేవి. తిమ్మిరెక్కినట్లు ఉండేది.

మహిళలకు బలవంతంగా యోనిలో కాపర్ టీ (ఐయూడీ) పెట్టేవారు. లేదా స్టెరిలైజ్ చేసేవారని జియావుదున్ తెలిపారు.

"20 ఏళ్లు కూడా నిండని ఒక చిన్న పిల్లకి కూడా ఇదే చేశారు. తను చిన్న పిల్ల అని, వదిలేయమని మేమంతా ఎంతో బతిమాలాం" అని జియావుదున్ చెప్పారు.

అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) ఇటీవల జరిపిన ఒక దర్యాప్తులో.. జిన్జియాంగ్‌లో వీగర్లకు బలవంతంగా స్టెరిలైజ్ చేసే పద్ధతి విస్తృతంగా వ్యాప్తిలో ఉందని తేలింది.

అయితే, ఈ ఆరోపణలు "పూర్తిగా నిరాధారమైనవని" చైనా ప్రభుత్వం బీబీసీకి చెప్పింది.

వీటన్నిటితోపాటూ శిబిరాల్లో గంటల తరబడి చైనా జాతీయ గీతాలు పాడించేవారని, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌పై వచ్చే దేశ భక్తి కార్యక్రమాలను టీవీల్లో పెట్టి చూపించేవారని జియావుదున్ తెలిపారు.

"శిబిరాల్లోకి వెళ్లిన తరువాత బయట ప్రపంచం ఎలా ఉంటుందన్నదే పూర్తిగా మర్చిపోతాం. వాళ్లు చేస్తున్న బ్రెయిన్ వాష్ ప్రభావమో లేక వాళ్లు ఇస్తున్న మందుల ప్రభావమో కానీ.. కడుపు నిండితే చాలు అన్నది తప్ప మరో ఆలోచనే ఉండదు. అక్కడ కడుపు నిండా భోజనం చెయ్యడం కూడా గగనమే" అని ఆమె అన్నారు.

పుస్తకాల్లో షీ జిన్‌పింగ్ గురించి రాసిన పాఠాలను సరిగ్గా బట్టీ పట్టకపోతే తిండి పెట్టేవారు కాదని ఈ నిర్బంధ శిబిరాల్లో పని చేసిన ఒక మాజీ భద్రతా అధికారి బీబీసీకి తెలిపారు. ఆయన వేరే దేశంనుంచీ బీబీసీతో వీడియో లింక్ ద్వారా మాట్లాడారు.

"ఒకసారి, అరెస్ట్ చేసినవాళ్లని మేము నిర్బంధ శిబిరాల్లోకి తీసుకెళ్లినప్పుడు చూసాను.. అందరి చేతుల్లోనూ పుస్తకాలు ఉన్నాయి. వాళ్ల చేత బలవతంగా అందులోని పాఠాలను బట్టీ పట్టిస్తున్నారు. సరిగ్గా అప్పజెప్పకపోతే శిక్షలు వేస్తారు. ఒకసారి ఫెయిల్ అయినవాళ్లకి ఒక రంగు బట్టలు, రెండోసారి ఫెయిల్ అయితే మరో రంగు, మూడోసారి ఫెయిల్ అయినవారికి ఇంకో రంగు.. ఇలా వారు వేసుకున్న రంగుల బట్టీ వారెన్ని సార్లు ఫెయిల్ అయ్యారో తెలిసిపోతుంది.

అలాగే వివిధ రకాల శిక్షలు కూడా విధించేవారు. తిండి పెట్టకపోవడం, కొట్టడం కూడా ఈ శిక్షల్లో భాగాలు.

నేను అరెస్ట్ చేసినవారిని శిబిరాల్లో అప్పజెప్పడానికి వెళ్లేవాడిని. అక్కడ నిర్భాగ్యులైన వారిని చూశాను. వారిని విపరీతంగా హింసించేవారని కచ్చితంగా చెప్పగలను" అని ఆయన చెప్పారు.

భద్రతా అధికారి చెప్పిన వివరాలను విడిగా ధ్రువీకరించడం అసాధ్యం. కానీ ఆయన అందించిన పత్రాల ద్వారా నిర్బంధ శిబిరాల్లో ఆయన కొన్నాళ్లు ఉద్యోగం చేశారని తెలుస్తోంది. తన వివరాలు గోప్యంగా ఉంచినట్లైతే దీని గురించి మాట్లాడడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన తెలిపారు.

రేప్‌లు జరిగాయా లేదా అన్న విషయం తనకు తెలీదుగానీ కరంట్ షాక్‌లు మాత్రం ఇచ్చేవారని ఆయన చెప్పారు. రకరకాలుగా హింసంచిన తరువాత వారిని బలవంతంగా చెయ్యని నేరాలకు ఒప్పించేవారని, అలాంటివి కొన్ని తన మనసులోనే ఉన్నాయని ఆ గార్డ్ తెలిపారు.

శిబిరాల్లో షీ జిన్‌పింగ్ ఫొటోలు, పోస్టర్లు, నినాదాలు గోడల నిండా ఉంటాయని, ఈ రీ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం దృష్టి అంతా జిన్‌పింగ్ మీదే కేంద్రీకరించి ఉంటుందని, వీగర్లకు వ్యతిరేకంగా ఈ విధానాన్ని రచించినది జిన్‌పింగేనని చైనాలో పని చేసిన మాజీ బ్రిటిష్ రాయబారి చార్లెస్ పార్టన్ తెలిపారు.

"ఇది జిన్‌పింగ్ రూపొంచిందిన పాలసీ అని చెప్పడానికి ఏ సందేహం లేదు. అయితే, హింస, అత్యాచారాలకు పాల్పడమని జిన్‌పింగ్‌గానీ, పార్టీ ఉన్నతాధికారులు గానీ ఆదేశాలు ఇచ్చి ఉంటారని చెప్పలేం. కానీ జరుగుతున్న విషయాలు వారికి తెలియకుండా ఉండవు.

జరుగుతున్నవాటిని చూసీ చూడకుండా వదిలేస్తున్నారని నాకనిపిస్తోంది.

ఈ రీ ఎడ్యుకేషన్ విధానాన్ని కచ్చితంగా, నిష్కర్షగా అమలు చేయాలని ఆదేశాలు అయితే వెళ్లాయి.

అది ఇలా జరుగుతోంది. కఠినంగా అమలు చేయమన్నారు కాబట్టి వాస్తవంలో అక్కడి భద్రతా అధికారులకు ఎలాంటి అడ్డంకులూ లేవు. ఎవరూ అడ్డుకోవట్లేదు, ఏ నిబంధనలూ లేవు. వాళ్లు ఇంకెందుకు ఆగుతారు?" అని పార్టన్ అభిప్రాయపడ్డారు..

గుల్జిరా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గుల్జిరా

"వాళ్లు రేప్ మాత్రమే చేయరు, ఒళ్లంతా కొరుకుతారు. వాళ్లు మనుషులో, మృగాలో అర్థం కాదు" అని జియావుదున్ ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొంటూ చెప్పారు.

"శరీరంలో ఏ భాగాన్ని వదల్లేదు. అన్ని చోట్ల పళ్ల గాట్లు కనిపించేవి. వాటిని చూడ్డానికే అసహ్యంగా ఉండేది.

మూడుసార్లు ఈ బాధంతా అనుభవించాను. ఒక్కరు కాదు. ఇద్దరో, ముగ్గురో మీద పడి రక్కుతారు. రేప్ చేసి, దారుణంగా హింసిస్తారు" అని జియావుదున్ తెలిపారు.

తన గదిలో తన పక్కనే పడుకునే ఒక మహిళను.. ఎక్కువమంది పిల్లల్ని కన్నారనే నేరంపై అరెస్ట్ చేసి తీసుకొచ్చారని జియావుదున్ చెప్పారు.

ఆమెను అర్థరాతి గదిలోంచి ఎత్తుకెళ్లి మూడు రోజుల తరువాత తిరిగి తీసుకొచ్చారని, తన శరీరంపై కూడా ఇలాంటి పళ్ల గాట్లే కనిపించాయని జియావుదున్ తెలిపారు.

"గదికి తిరిగి వచ్చిన తరువాత తను ఏం మాట్లాడలేకపోయారు. వచ్చి నా మెడ చుట్టూ చేతులు వేసి నన్ను గట్టిగా పట్టుకుని పెద్దగా ఏడ్చారు. కానీ, ఆమె ఏమీ చెప్పలేదు."

ఈ అత్యాచారాలు, హింస గురించి బీబీసీ ప్రశ్నించినప్పుడు చైనా ప్రభుత్వం నేరుగా స్పందించలేదు. జిన్జియాంగ్‌లో ఉన్నవి నిర్బంధ శిబిరాలు కావని, "వృత్తి విద్య శిక్షణా శిబిరాలని" వారి ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

"చైనా ప్రభుత్వం, స్థానిక మైనారిటీ వర్గాల హక్కులు, ప్రయోజనాలను సమానంగా పరిరక్షిస్తుంది. మహిళల హక్కులకు ప్రాముఖ్యమిస్తుంది" అని వారి ప్రతినిధి తెలిపారు.

జియావుదున్ 2018 డిసెంబర్‌లో విడుదల అయ్యారు. పాలసీలో మార్పులు తెస్తున్నామంటూ కజక్‌స్తాన్‌లో జీవిత భాగస్వామి లేదా బంధువులు ఉన్నవాళ్లందరినీ అదే సమయలో విడుదల చేశారు. ఆ పాలసీ మార్పు ఏమిటో తనకు సరిగ్గా బోధపడలేదని ఆమె అన్నారు.

చైనా ప్రభుత్వం జియావుదున్ పాస్‌పోర్ట్ తిరిగి ఇచ్చేసింది. వెంటనే ఆమె కజక్‌స్తాన్ వెళిపోయారు. తరువాత వీగర్ మానవ హక్కుల ప్రోజెక్ట్ సహాయంతో అమెరికా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆమె వాషింగ్టన్ డీసీకి దగ్గర్లో ఉన్న ప్రాంతంలో స్థానిక వీగర్ కమ్యూనిటీలో ఒక మహిళ ఇంట్లో ఉంటున్నారు. వారిద్దరూ కలిసి వండుకుని తినడం, కలిసి బయటకు వాకింగ్‌కు వెళ్లడం చేస్తుంటారు. నెమ్మదిగా, ఎలాంటి ఆడంబరం లేకుండా జీవిస్తున్నారు.

జియావుదున్ ఇంట్లో దీపాలు తగ్గించి పెడతారు. శిబిరాల్లో పెద్ద లైట్లు, నిత్యం వెలుగుతూ ఉండేవి. వాటిని మర్చిపోవడానికన్నట్లు తన ఇంట్లో లైట్లు తగ్గించి ఉంచుతారు.

అమెరికాకు వచ్చిన తరువాత ఆమెకు ఆపరేషన్ చేసి గర్భసంచి తీసివేశారు. ఆమె అనుభంచిన హింస కారణంగా గర్భసంచి దెబ్బతింది.

"తల్లినయ్యే అవకాశం పోయింది" అని జియావుదున్ అన్నారు.

తన భర్త కూడా అమెరికా వచ్చి తనతోనే ఉండాలని ఆమె కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె భర్త కజక్‌స్తాన్‌లోనే ఉన్నారు.

నిర్బంధ శిబిరం నుంచి విడుదల అయిన తరువాత కజక్‌స్తాన్ వెళ్లేముందు జియావుదున్ జిన్‌జియాంగ్‌లోనే కొద్ది రోజులు ఉన్నారు. శిబిరాల్లో హింసను అనుభవించి, విడుదల అయిన వాళ్ల పరిస్థితులను చూశారు. ప్రజలపై ఆ పాలసీ ప్రభావం ఎలా ఉందో కళ్లారా చూశారు.

గత కొన్నేళ్లుగా జిన్‌జియాంగ్‌లో జననాల రేటు క్షీణించిందని వ్యక్తిగత అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది "జాతి విధ్వసం" అని విశ్లేషకులు అంటున్నారు.

జియావుదున్
ఫొటో క్యాప్షన్, జియావుదున్

విడుదల అయిన తరువాత చాలామంది మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని, మద్యం సేవిస్తున్నారని జియావుదున్ తెలిపారు.

శిబిరంలో మొట్టమొదటిసారి తనతో పాటూ గదిలోంచి ఎత్తుకెళ్లిన 20 ఏళ్ల యువతి అనేకసార్లు రోడ్డు మీద కళ్లు తిరిగి పడిపోతూ ఉండడం చూశానని, ఆమె మత్తు మందులకు బానిస అయిపోయారని జియావుదున్ చెప్పారు.

"ఆమె జీవచ్ఛవంలా బతికి ఉంది, అంతే. ఆమెపై జరిగిన అత్యాచారాలు ఆమెను పూర్తిగా చంపేశాయి.

జనాలను విడుదల చేస్తున్నామని అంటున్నారు కానీ నా ఉద్దేశంలో శిబిరం నుంచి బయటికొస్తున్న వాళ్లంతా జీవచ్ఛవాలుగానే మిగిలిపోతున్నారు.

అదే వాళ్ల ప్లాను.. నిఘా, నిర్బంధించడం, బలవంతపు బోధన, హింస, స్టెరిలైజ్ చెయ్యడం, లైంగిక దాడులు, అత్యాచారాలు.

అందరినీ నాశనం చెయ్యడమే వాళ్ల లక్ష్యం. ఈ విషయం అందరికీ తెలుసు" అని జియావుదున్ అన్నారు.

(ఫొటోలు: హన్నా లాంగ్-హిగ్గిన్స్)

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్ ‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌ లో సబ్‌స్క్రైబ్ చేయండి.)