చైనా: అబ్బాయిల్లో 'మగతనం' పెంచడానికి ప్రభుత్వం చర్యలు.. సోషల్ మీడియాలో విమర్శలు

చైనా సైనికుల శిక్షణ

ఫొటో సోర్స్, BARCROFT MEDIA/GETTY IMAGES

    • రచయిత, కెర్రీ అలెన్
    • హోదా, బీబీసీ మానిటరింగ్
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

దేశంలోని అబ్బాయిలు మరీ 'అమ్మాయిల్లా' తయారవుతున్నారంటూ చైనా విద్యాశాఖ జారీ చేసిన ఒక నోటీసు కలకలం సృష్టిస్తోంది.

చాలా మంది ఆన్‌లైన్ యూజర్లు ఈ నోటీసు మహిళలను కించపరిచేలా ఉందని ఆరోపిస్తే, మరికొందరు మాత్రం చైనా మేల్ సెలబ్రిటీలు దీనికి కొంత వరకు బాధ్యులని వాదించారు.

దేశంలో అత్యంత పాపులర్ అయిన మేల్ రోల్ మోడల్స్ 'ఆర్మీ హీరోల్లా' బలంగా క్రీడాకారుల్లా ఉండడం లేదని చైనా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

ఫుట్‌బాల్ అభిమాని అయిన అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా తమ దేశంలో మెరుగైన స్పోర్ట్స్ స్టార్లను తయారు చేయాలని చాలాకాలం నుంచీ ప్రయత్నిస్తున్నారు.

దీంతో, చైనా విద్యా శాఖ తమ అంతిమ లక్ష్యం గురించి గత వారం ఒక నోటీస్ జారీ చేసింది.

కౌమారదశలో ఉన్న అబ్బాయిలు మరీ 'అమ్మాయిల్లా' తయారవకుండా స్కూళ్లలో వారికి అందించే శారీరక శిక్షణను పూర్తిగా సంస్కరించాలని, ఉపాధ్యాయుల నియామకాలను బలోపేతం చేయాలని ప్రతిపాదించింది.

రిటైర్ అయిన క్రీడాకారులను, క్రీడా నేపథ్యం ఉన్న వారిని కూడా రిక్రూట్ చేసుకోవాలని ఈ నోటీసులో సలహా ఇచ్చారు. విద్యార్థుల్లో 'మగతనం' పెంచే ఉద్దేశంతో క్రీడలను, ముఖ్యంగా ఫుట్‌బాల్ లాంటి క్రీడల్లో కఠిన శిక్షణ ఇవ్వాలని సూచించారు.

సున్నితంగా, నాజూకుగా కనిపించే, 'సామాజిక బాధ్యత' కలిగిన మేల్ స్టార్లను తప్ప వేరే ఎవరినీ తెరపైకి అనుమతించని మీడియా ఉన్న దేశంలో దీనిని ఒక నిర్ణయాత్మక చర్యగా భావిస్తున్నారు.

కానీ, ఇలాంటి చర్యల తీసుకోబోతున్నట్లు చైనా ఇంతకు ముందే సంకేతాలు ఇచ్చింది.

చైనా యువకుల్లో చాలామంది, బలహీనంగా, పిరికిగా ఉంటున్నారని ఆ దేశ అత్యున్నత సలహా మండలి ప్రతినిధి సీ జెఫూ అన్నారు.

"చైనాలోని యువకుల్లో అమ్మాయిల్లా సుకుమారంగా ఉండే ఒక ట్రెండ్ పెరుగుతోంది. దానిని సమర్థంగా ఎదుర్కోకపోతే చైనా మనుగడ, అభివృద్ధే ప్రమాదంలో పడిపోతుంది. దీనికి కొంత వరకూ ఇంట్లో పెరిగే వాతావరణం కూడా కారణం. చైనా అబ్బాయిలను ఎక్కువగా వాళ్ల తల్లులు, బామ్మలే పెంచుతున్నారు" అని సీ జెఫూ అన్నారు.

దేశంలోని కొంతమంది మేల్ సెలబ్రిటీలను చూసి, కొంతమంది అబ్బాయిలు అసలు 'ఆర్మీ హీరోలు' కావాలని కోరుకోవడం లేదని, అందుకే, యువకులకు సమతుల విద్యను అందించడంలో స్కూళ్లు కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు.

టీఎప్ బాయ్స్

ఫొటో సోర్స్, VCG/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, అబ్బాయిల బాండ్ 'టీఎఫ్ బాయ్స్'

మగాళ్లు ఎందుకు భయపడుతున్నారు

చైనా విద్యా శాఖ నోటీసుపై చాలా మంది చైనీయులు ప్రతికూలంగా స్పందించారు.

కొన్ని లక్షల మంది చైనీయులు సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది ప్రభుత్వం చెబుతున్నది లింగ వివక్షను ప్రోత్సహించేలా ఉందన్నారు.

"సున్నితంగా ఉండడం, ఒక అవమానకరమైన విషయమా" అని ఒక వీబో యూజర్ అడిగాడు. ఆయన కామెంటుకు 2 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.

"అబ్బాయిలు కూడా మనుషులే. భావోద్వేగాలు, బలహీనంగా లేక సున్నితంగా ఉండడం అనేవి మనిషి లక్షణాలు" అని మరో యూజర్ అన్నారు.

"మగవాళ్లు దేనికి భయపడతారు, మహిళలా సమానంగా ఉండడానికా?" అని ఇంకొకరు ప్రశ్నించారు.

దేశంలో మహిళల కంటే ఎక్కువగా 7 కోట్ల మంది మగాళ్లు ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇలాంటి వికృతమైన లైంగిక నిష్పత్తి లేదు. ఇంత 'మగతనం' సరిపోదా అని మరో యూజర్ అన్నాడు.

"ఈ ప్రతిపాదనలేవీ మహిళల నుంచి రాలేదు. చైనా అగ్ర నాయకత్వంలో పురుషాధిపత్యం గణనీయంగా ఉందనే విషయాన్ని ఇంతకు ముందే చాలా మంది రాశారు" అని మరొకరు కామెంట్ చేశారు.

కొన్ని మీడియా సంస్థలు మాత్రం ప్రభుత్వ చర్యలకు సానుకూలంగా స్పందించాయి. గ్లోబల్ టైమ్స్ వార్తా పత్రిక ఇది కొంతమంది మద్దతు గెలుచుకుందని రాసింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం సీనో వీబోలో మేల్ సెలబ్రిటీలను నిందిస్తూ కొందరు కామెంట్లు పెట్టారు. ఈ సెలబ్రిటీలను ఎక్కువగా 'లిటిల్ ఫ్రెష్ మీట్స్' అని వర్ణిస్తుంటారు.

చైనాలోని కొందరు మేల్ యూత్ ఐకాన్లను ఉద్దేశిస్తూ ఇంటర్నెట్‌లో ఎక్కువగా ఈ పదం ఉపయోగిస్తున్నారు. వీళ్లంతా నాజూకుగా, ఆకట్టుకునేలా, చాలా సుకుమారంగా కనిపిస్తుంటారు.

టీఎఫ్ బాయ్స్ అనే అబ్బాయిల బ్యాండ్, చైనా గాయకుడు లూ హాన్ ఇంకా చాలామంది ఈ కేటగిరీలోకి వస్తారు. మరోవైపు యావ్ మింగ్ లాంటి చైనా బాస్కెట్ బాల్ ఆటగాళ్లు అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించారు.

అధ్యక్షుడు షీ జీన్‌పింగ్

ఫొటో సోర్స్, WPA POOL/GETTY IMAGES

అయితే ప్రభుత్వం తమ ప్రతిపాదనల్లో ముఖ్యంగా ఫుట్‌బాల్ శిక్షణ గురించే చెప్పింది.

ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. 2050 నాటికి చైనా వరల్డ్ ఫుట్‌బాల్ సూపర్ పవర్ అవుతుందని ఆశిస్తున్నట్లు అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇంతకు ముందే చెప్పారు.

కానీ, ఫుట్‌బాల్‌లో రాణించాలని చైనా పదే పదే చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అది అసాధ్యమైన లక్ష్యంగా కనిపిస్తోందనే ఎగతాళి కూడా మొదలైంది.

రెండేళ్ల క్రితం చైనా నేషనల్ ఫుట్‌బాల్ టీమ్ కోచ్‌ మార్సెల్లో లిప్పీ రిజైన్ చేసినపుడు ఇలాంటి స్పందనలు వచ్చాయి. లిప్పీ 2006 ఫిఫా వరల్డ్ కప్‌ గెలుచుకున్న ఇటలీని లీడ్ చేశారు.

మరోవైపు, దేశంలోని యువకులకు కొత్త రోల్ మోడల్స్‌ను పరిచయం చేయాలని, ప్రమోట్ చేయాలని చైనా కొన్ని నెలలుగా ప్రయత్నిస్తోంది.

ఇక చైనాలోని మహిళల విషయానికి వస్తే, కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్లుగా మహిళలు గణనీయమైన పాత్ర పోషించారు.

గత ఏడాది చైనా సాధించిన అంతరిక్ష విజయాలు 24 ఏళ్ల స్పేస్ కమాండర్ ఝో చెంగ్యూ లాంటి వారి పేరు వైరల్ అయ్యేలా చేశాయి.

కానీ, చైనా యువకుల్లో సైనికులు, పోలీసులు, ఫైర్ ఫైటర్స్‌ కావాలనే ఆసక్తి తగ్గిపోతోందని సీ జెఫూ గత ఏడాది అన్నారు.

దేశంలో 'లిటిల్ ఫ్రెష్ మీట్స్' ట్రెండ్ విజయవంతంగా కొనసాగుతోందని నిరూపితమైంది. కానీ మేల్ యూత్ సెలబ్రిటీలు చాలా నిశిత పరిశీలనలో ఉన్నారు.

ఇటీవల కొంత కాలంగా టాటూలు, ఇయర్ రింగ్స్ వేసుకున్న మేల్ యూత్ ఐకాన్లను స్క్రీన్ మీద చూపించడానికి చైనా మీడియా కూడా ఇబ్బంది పడుతోంది.

చైనా టాప్ పాప్ స్టార్స్‌లో ఒకరు 2019లో బయట సిగరెట్ తాగుతూ కనిపించడంపై కూడా ఆన్‌లైన్లో తీవ్ర విమర్శలు వచ్చాయి.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)