ఎర్రకోట: చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని, తెగిపడిన తలలెన్ని?

ఎర్రకోట

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జైదీప్ వసంత్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్

ఏటా ఈ కోట మీద భారత ప్రధానమంత్రి స్వాతంత్ర్య దినోత్సవం రోజున త్రివర్ణ పతాకం ఎగురవేస్తారు.

1649లో మొఘల్‌ చక్రవర్తి షాజ‌హాన్‌ ఎర్రకోటను నిర్మించారు. ఎర్రకోట కేంద్రంగా దిల్లీ నగరం ఏడుసార్లు నిర్మితమైంది. మొఘ‌ల్‌ సామ్రాజ్య వైభవానికి, పతనానికి ఈ ఎర్రకోట సాక్షీభూతంగా నిలిచింది.

ప్రేమ, అనురాగం, ద్వేషం, ద్రోహం, రాజకీయ కుట్రలు, అంతర్గత కుమ్ములాటలకు ఎర్రకోట వేదిక. చక్రవర్తుల వైభవాన్నే కాదు, పతనాన్నీ ఇది చూసింది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన 1857 తిరుగుబాటుకు కూడా ఎర్రకోటే కేంద్రం.

ముంతాజ్ మరణంతో షాజహాన్‌కు ఆగ్రా కోటపై విరక్తి కలిగి..

‘‘1628వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఒక రోజున ఆగ్రాలోని తన సింహాసనం మీద ఆలోచిస్తూ కూర్చున్నషాజ‌హాన్‌.. ఆగ్రా కోట చాలా చిన్నగా ఉందని భావించారు. ఆగ్రా, లాహోర్ కోటలకన్నా పెద్ద కోటను దిల్లీలోని యమునా తీరంలో నిర్మించాలని ఆయన నిర్ణయించారు’’ అని తన పుస్తకం ‘సిటీ ఆఫ్‌ మై హార్ట్’లో రాణా సాఫ్వీ పేర్కొన్నారు.

తన ప్రియసఖి ముంతాజ్ మరణించిన తర్వాత షాజ‌హాన్‌కు ఆగ్రా కోట మీద విరక్తి కలిగిందని కొందరు అంటారు. ‘‘హిందూ ఆచారులు, ముస్లిం హకీమ్‌ల సలహా మేరకు ఫిరోజ్‌షా కోట్ల, సలీంగఢ్ మధ్య ప్రాంతాన్ని కోట నిర్మాణ ప్రాంతంగా ఎంపిక చేశారు’’ అని షాజ‌హాన్ ఆత్మకథ ‘పాదుషా నామా’ను ఉటంకిస్తూ సాఫ్వీ రాశారు.

ఎర్రకోట నిర్మాణానికి 1639 ఏప్రిల్ 29న షాజ‌హాన్ ఆదేశాలు జారీ చేశారు. అదే సంవత్సరం మే 12న కోటకు శంకుస్థాపన జరిగింది.

ఆ ప్రాంతంలో షాజహనాబాద్ అనే పట్టణం నిర్మించాలని చక్రవర్తి నుంచి ఆదేశాలు వచ్చాయి.

షాజహనాబాద్‌లో మసీదులు, ఇళ్లు, పార్కులు నిర్మించుకునేందుకు తన భార్యలు, పిల్లలను షాజ‌హాన్‌‌ ప్రోత్సహించారు.

చక్రవర్తి కుమార్తెలలో ఒకరైన జహనారా.. చాందినీ చౌక్ అనే మార్కెట్‌ను నిర్మించారు.

ప్రస్తుతం దిల్లీలోని టౌన్‌హాల్‌ ప్రాంతంలో బేగం సరాయ్‌ స్ట్రీట్‌ను సందర్శకుల కోసం ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం నిగమ్‌‌ బోధ్‌ ఘాట్‌లో స్మశాన వాటికగా ఉన్న ప్రాంతంలో షాజ‌హాన్ కుమారుడు దారాషికో తన ఇల్లు నిర్మించుకున్నారు.

జూన్ 15, 1648లో ఖిలా-ఈ-ముబారక్‌గా పిలిచే కోటలోకి షాజ‌హాన్‌ చక్రవర్తి ప్రవేశించారు.

ఫతేపూర్‌ సిక్రీలో ఉన్న ఎర్రరాతిని నదీ మార్గంగుండా కోట ప్రాంతానికి తరలించి నిర్మించారు.

ఎరుపు రంగు రాతితో కట్టింది కాబట్టే దానికి ఎర్రకోట అనే పేరు వచ్చింది.

షాజహాన్ కాలంలో ఎర్రకోట

ఫొటో సోర్స్, Hulton archive

ఫొటో క్యాప్షన్, షాజహాన్ కాలంలో ఎర్రకోట

తాజ్‌మ‌హ‌ల్‌ను డిజైన్‌ చేసిన అహ్మద్‌ లాహోరి ఎర్రకోట డిజైన్‌లో కూడా పాలుపంచుకున్నారు.

ఇస్లామిక్, మొఘ‌ల్‌, ఫార్సీ, హిందూ సంస్కృతుల సమ్మేళనం ఈ నిర్మాణంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కోటను స్ఫూర్తిగా తీసుకుని రాజస్థాన్‌, ఆగ్రా, దిల్లీలలో ఇలాంటి కోటలు మరికొన్ని వెలిశాయి.

కోటలోని దివాన్-ఈ-ఆమ్‌లో చక్రవర్తి సామాన్యుల సమస్యలు వింటారు. దివాన్‌-ఈ-ఖాస్‌లో మంత్రులు, సామంత రాజులతో చక్రవర్తి సమావేశమవుతారు.

దారాషికో షాజ‌హాన్‌ పెద్ద కొడుకు. ఆయనంటే షాజ‌హాన్‌కు వల్లమాలిన ప్రేమ. అందుకే తన మిగిలిన కొడుకులను వివిధ ప్రాంతాలకు రాజప్రముఖ్‌లుగా పంపిన షాజ‌హాన్‌, దారాషికోకు మాత్రం ఏటా రెండు కోట్ల రూపాయలు చెల్లిస్తూ తన వద్దే ఉంచుకున్నాడు.

దారాషికో

ఫొటో సోర్స్, Getty Images

రాజకీయ కుట్రలకు కేంద్రం

ఆదర్శ రాజ్యం నిర్మించాలన్న తపన దారాషికోలో ఉండేది. అందుకోసం ఆయన వివిధ మతాల గ్రంథాలను తర్జుమా చేస్తూ కాలం గడిపారు.

ఇదే సమయంలో ఔరంగ‌జేబ్‌ సామ్రాజ్యానికి అధిపతి అయ్యేందుకు ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు.

‘‘1657లో షాజ‌హాన్‌ జబ్బుపడ్డారు. ఆ సమయంలో ఆయన స్థానంలో పాలన నిర్వహించగలిగేవారు ఎవరూ లేరు’’ అని బర్క్ లీ యూనివర్సిటీలో చరిత్ర ప్రొఫెసర్‌గా పని చేస్తున్న మునిస్‌ ఫారూఖీ అన్నారు.

దీన్ని అవకాశంగా తీసుకున్న ఔరంగ‌జేబ్, తన అన్న మీద కుట్రలు మొదలుపెట్టాడు.

సైన్యాన్ని నడిపించే విషయంలో దారాషికోకు సరైన అవగాహనలేదని ఔరంగ‌జేబ్‌ నమ్మేవారు.

పైగా నిత్యం మత కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండే దారాషికోకు అధికారం చేపట్టే అర్హతలేదని కూడా ఔరంగ‌జేబ్‌ భావించేవారు.

అన్నదమ్ముల మధ్య విభేదాలు చివరకు యుద్ధం వరకూ తీసుకెళ్లాయి.

1659లో ఆగ్రా సమీపంలోని సమూగ‌ధ్‌ ప్రాంతంలో దారాషికో, ఔరంగ‌జేబ్‌లు తలపడ్డారు. ఔరంగ‌జేబ్‌ ఊహించినట్లుగానే దారాషికో ఆ యుద్ధంలో ఓడిపోయారు.

రక్షణగా ఉంటానని మాటిచ్చిన దారాషికో కమాండర్ ఆయన్ను ఔరంగ‌జేబ్‌కు అప్పగించాడు.

1659 సెప్టెంబర్ 8న, ఎర్రకోటకు వెళ్లే దారిలో దారాషికోను చూసేందుకు భారీ ఎత్తున ప్రజలు గుమిగూడారు.

మొఘ‌ల్‌ సైన్యాలు ఆయన్ను చుట్టుముట్టి ఉన్నాయి. అది ఔరంగ‌జేబ్‌ విజయోత్సవ ర్యాలీ అనడంకన్నా, దారాషికో పరాభవ ర్యాలీ అనవచ్చని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.

దారషికో, ఆయన కొడుకు మండాలను ఏనుగు మీద కూర్చోబెట్టారు. ‘‘ఆయన చక్రవర్తిలాగా లేరు. ఒంటిమీద ఎలాంటి నగలు లేవు. రాచతలపాగా కానీ, కశ్మీరీ శాలువగానీ కనిపించలేదు.

కత్తి పట్టుకున్న సైనికుడొకరు ఆయన ముందు నడుస్తున్నారు. తప్పించుకోడానికి ప్రయత్నిస్తే దారాషికో తల తెగ నరకాలని ఆ సైనికుడికి స్పష్టమైన ఆదేశాలున్నాయి’’ అని ఇటలీ యాత్రికుడు నికోలో మాకియవెల్లి పేర్కొన్నారు.

దారాషికోను ఔరంగ‌జేబ్‌ ముందు ప్రవేశపెట్టారు. ఎలాంటి విచారణ లేకుండానే మరణశిక్ష విధించారు. మరుసటి రోజు దారాషికో తలను నరికి ఔరంగ‌జేబ్‌కు చూపించారు.

హుమయూన్‌ చక్రవర్తి సమాధి సమీపంలో దారాషికోను ఖననం చేశారు. ఇందుకోసం ఎలాంటి మతపరమైన సంప్రదాయాలను పాటించలేదు.

కొన్నాళ్లకు ఔరంగ‌జేబ్‌ తన కూతురు జబ్దతున్నిసానిని దారషికో కొడుకు సిఫిర్‌‌కు ఇచ్చి వివాహం చేశారు.

దారాషికో పుస్తకప్రియుడు. తన కోసం దిల్లీలో ప్రత్యేకంగా ఒక లైబ్రరీయే నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఇది దిల్లీలో క‌శ్మీరీగేట్‌ ప్రాంతంలో ఉంది.

ఔరంగజేబు

ఫొటో సోర్స్, Getty Images

అధికారానికి కేంద్రం

ఎర్రకోటలో రాజుల వైభవం గురించి చరిత్రకారుడు దేబాశీష్ దాస్ తన పుస్తకంలో పేర్కొన్నారు.

‘‘షాజ‌హాన్ ఉదయం 4 గంటలకే నిద్రలేచేవారు. తన యోగక్షేమాలను ప్రజలకు తెలిపేందుకు ఆయన ఉదయమే జరోఖా-ఈ-దర్శన్ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించేవారు.

దర్శానీ సంప్రదాయాన్ని పాటించే కొందరు చక్రవర్తిని చూడనిదే ఏ పనీ ప్రారంభించరు. ఇది ఒకరకమైన హిందూ సంప్రదాయం’’ అని రాశారు.

ఔరంగ‌జేబ్‌ మరణంతో మొఘలుల పతనం, అలాగే ఎర్రకోట వైభవ పతనం కూడా ప్రారంభమైంది.

1739లో నాదిర్‌షా దిల్లీ మీద దాడి చేసి ఎర్రకోటలో ఉన్న మయూరాసనం( నెమలి సింహాసనం), కోహినూర్‌ వజ్రాలను పట్టుకుపోయారు.

రొహిల్లాలు, మరాఠాలు, సిక్కులు, అఫ్గాన్‌లు, బ్రిటిషర్లు దిల్లీని దోచుకున్నారు. 1748లో అఫ్గాన్‌కు చెందిన షా అబ్దాలీతో జరిగిన యుద్ధంలో మొఘల్ పాలకుడు స‌ర్‌ హింద్‌ మ‌హ్మ‌ద్‌ షా ‌రంగీలా మరణించారు.

‘‘మ‌హ్మ‌ద్‌ షా‌ మరణం తర్వాత అహ్మ‌ద్‌ ‌షా మొఘలు రాజ్యానికి రాజయ్యాడు. కానీ ఆయన తన తల్లి స్నేహితుడైన జావేద్‌ ఖాన్ చేతిలో కీలుబొమ్మ. అప్పటి అవధ్ పాలకుడైన స‌ఫ్ధ‌ర్‌జంగ్‌ జావేద్‌ ఖాన్‌ను చంపేశారు.

ఈ సమయంలో మరాఠాలు ఉత్తర భారతదేశపు రాజ్యాల మీద దాడులు చేస్తున్నారు.

స‌ఫ్ధ‌ర్‌ జంగ్‌ రాజ్యమైన అవ‌ధ్‌ మీద కూడా మరాఠాల దాడులు మొదలయ్యాయి. మరాఠాలతో పోరాడలేమని నిర్ణయానికి వచ్చిన స‌ఫ్ధ‌ర్‌జంగ్‌, మొఘలులకు మరాఠాలకు మధ్య ఒక ఒప్పందాన్ని కుదిర్చారు.

దీని ప్రకారం మరాఠాలు అఫ్గాన్ రాజు అబ్దాలీ మీద దాడి చేసేందుకు అంగీకరించగా, అందుకు ప్రతిగా 50 లక్షల రూపాయలు, నాగ్‌పూర్‌, మథురల నుంచి ఫౌజ్ దారి, పంజాబ్-సింథ్‌ల మీద చౌత్, అజ్మీర్-ఆగ్రాల మీద సుబేదారి చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది.

మరోవైపు మొఘలు అంతర్గత విభేదాలు కూడా తారాస్థాయికి చేరాయి. అయితే మరాఠాలు వీటి మీద ఆసక్తి చూపించ లేదు. ఒప్పందం ప్రకారం దిల్లీ మీద వారు దాడులు చేయలేదు.

1757 జనవరిలో అబ్దాలీ మొఘలుల మీద విజయం సాధించి దిల్లీని ఆక్రమించుకున్నారు. అలంగీర్‌ కుమార్తెను తన కొడుకు తైమూరుకిచ్చి పెళ్లి చేసిన అబ్దాలి, తాను కూడా ఇద్దరు మొఘ‌ల్‌ రాణులను వివాహం చేసుకున్నారు.

కోట్ల రూపాయల విలువ చేసే సంపదలు, పెళ్లి చేసుకున్న మహిళలు, వారి సేవకులను తీసుకుని అఫ్గానిస్తాన్ బయలుదేరిన అబ్దాలీ అలంగీర్‌ రెండో కొడుకును మొఘల్ సింహాసనం మీద కూర్చోబెట్టి వెళ్లారు. అయితే తన తండ్రి హత్య తర్వాత తానే మొఘలు చక్రవర్తినని అలంగీర్‌ పెద్ద కొడుకు రెండో షాఆలం ప్రకటించుకున్నారు.

మరోవైపు మొఘలు, అఫ్గాన్‌ల‌ మధ్య యుద్ధాలను మరాఠాలు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. 1788 నుంచి 1803 వరకు దిల్లీకి తామే అసలైన పాలకులమని వారు ప్రకటించుకున్నారు.

కొంత కాలానికి బ్రిటిష్ సైన్యాలు లార్డ్ లేక్ ఆధ్వర్యంలో దిల్లీని తమ కాలనీగా మార్చుకున్నాయి. అప్పటికే షా ఆలం మరాఠాల గుప్పిట్లో ఉండేవారు.

తర్వాత ఆయన బ్రిటిష్ పాలనను అంగీకరించడంతో దిల్లీ మీద పెత్తనం ఈస్ట్ ఇండియా కంపెనీ చేతికి వచ్చింది.

బ్రిటిష్ వారు నియమించిన ఖిల్లేదార్ ఆధ్వర్యంలోనే ముఖ్యమైన నిర్ణయాలు జరుగుతుండేవి.

1813 సంవత్సరం నాటికి ఖిల్లేదార్ జీతం సంవత్సరానికి రూ.12 లక్షలు ఉండేది. ఎర్రకోటతోపాటు, దిల్లీలోని పలు ప్రాంతాలు ఖిల్లేదార్ ఆధ్వర్యంలో ఉండేవి.

ఆ సమయంలో దిల్లీ ఒకింత ప్రశాంతంగా ఉండేది. అయితే 1857లో దిల్లీ మీద మరో దాడి జరిగింది.

ఎర్రకోట

ఫొటో సోర్స్, Getty Images

చివరి మొఘల్ పాలకుడు

1837లో రెండో బహదూర్ షా మొఘలు సామ్రాజ్య పాలకుడయ్యారు. తన పూర్వీకులలాగానే ఆయన జరోఖా దర్శన్ నిర్వహించేవారు.

దేశంలోని ముస్లింలు, హిందువులు ఆయన్ను గౌరవించేవారు. అయితే ఆయన తన తుది వరకు బ్రిటీష్ వారు నియమించిన ఖిల్లేదార్ ఇచ్చే పెన్షన్ మీద ఆధారపడటంకన్నా మరేమీ చేయలేక పోయారు.

1857 ఏప్రిల్‌లో బ్రిటిష్ సైన్యంలో పని చేస్తున్న సైనికుడు మంగళ్ పాండే, బ్రిటిష్ వారిపై బెంగాల్ లోని బారక్ పూర్ ప్రాంతంలో తిరుగుబాటు చేశారు.

దీని ప్రభావం మేరఠ్ మీదుగా దిల్లీ వరకు చేరింది. సిపాయిల తిరుగుబాటు ఎర్రకోట వరకు పాకి కొందరు బ్రిటీష్ సైనికాధికారులు, వారి కుటుంబీకుల హత్యకు దారి తీసింది.

మే నెలలో జరిగిన ఘర్షణల సందర్భంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటానికి బహదూర్ షా మద్దతు పలికారు. అయితే దీనికి నాయకత్వం వహించడానికి మాత్రం ఆయన అంగీకరించ లేదు.

ఆ తర్వాత ఝాన్సీ, అవధ్, కాన్పూర్, బిహార్, బెంగాల్ ప్రాంతాలలో కూడా తిరుగుబాట్లు జరిగాయి. కానీ సరైన సమన్వయం, నాయకత్వం లేకపోవడంతో ఈ తిరుగుబాటు విఫలమైంది.

నాలుగు నెలల తర్వాత బ్రిటీషర్లు ఎర్రకోట మీద తిరిగి పట్టుసాధించగలిగారు. ఈ ఘటనల తర్వాత బ్రిటీష్ సైనికుల్లో ఆగ్రహం మరింత పెరిగింది. వారు సమీపంలోని ప్రాంతాలపై దాడులు, లూటీలు చేయడం ప్రారంభించారు.

బ్రిటిష్ వారి ఒత్తిడితో చాలామంది దిల్లీ విడిచి వెళ్లాల్సి వచ్చింది. అందులో బహదూర్ షా ఒకరు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేశారని, తమ నాయకత్వంపై తిరుగుబాటు చేశారని, క్రైస్తవులను హత్య చేశారని బహదూర్ షాపై బ్రిటిష్ పాలకులు ఆరోపణలు చేశారు.

దివాన్-ఈ-లో విచారణ జరిగింది. ఆయన్ను రంగూన్ ( ప్రస్తుత యాంగూన్- మయన్మార్) ప్రవాసం పంపారు. ఆయన సంతానాన్ని హత్య చేశారు.

బ్రిటిష్ ఆక్రమణ

ఫొటో సోర్స్, Getty Images

బ్రిటిష్ ఆక్రమణ

బ్రిటిష్ పాలకులు ఎర్రకోటను రాజనివాసం నుంచి ఆర్మీ క్యాంప్ చేశారు. కోట రూపు రేఖలను కూడా మార్చారు. యుద్ధ సమయంలో కోట కొంత దెబ్బతిన్నది. తర్వాత దానికి మరమ్మతులు చేశారు.

బంగారు, వెండి తాపడాలతో తయారైన కోట పైకప్పు(సీలింగ్) మొఘలు చక్రవర్తుల పతనం సమయంలోనే లేకుండా పోయింది. దివాన్ -ఈ-ఆమ్ ను ఆసుపత్రిగానూ, దివాన్ -ఈ-ఖాస్ ను నివాస ప్రాంతంగానూ మార్చేశారు బ్రిటీష్ అధికారులు.

1857 తిరుగుబాటు తర్వాత భారతదేశ పాలనను ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటీష్ ప్రభుత్వం వశం చేసుకుంది. 1877, 1903, 1911లలో ఎర్రకోటలో బ్రిటీష్ దర్బార్ జరిగింది. ఈ కార్యక్రమాలు రాజ్యాల నుంచి అధికారం బ్రిటీష్ పాలకుల చేతుల్లోకి వెళ్లడానికి నిదర్శనంగా నిలిచింది.

1911 దిల్లీ దర్బార్ సందర్భంగానే బ్రిటీష్ ఇండియా రాజధానిని కలకత్తా నుంచి దిల్లీకి మారుస్తున్నట్లు బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటించింది. ఎర్రకోట నుంచే బ్రిటీష్ రాజు, రాణి ముసమ్మాన్ బురుజు నుంచి జరోఖా దర్శన్ ఇచ్చారు.

సుభాష్ చంద్రబోస్

ఫొటో సోర్స్, NETAJI RESEARCH BUREAU

స్వేచ్ఛా నినాదం

అప్పటి బర్మాలో మొఘల్ చక్రవర్తి బహదూర్ షాను ఖననం చేసిన ప్రాంతంలోనే సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీని ఉద్దేశించి ప్రసంగించారు.

అప్పుడే ‘చలో దిల్లీ’ అనే నినాదాన్ని ఇచ్చారు సుభాష్ చంద్రబోస్.

ఎర్రకోట దగ్గర బ్రిటిష్ వారి సమాధుల మీదుగా నడవాలని బోస్ సైనికులకు ఉద్బోధించారు.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బోస్ ఆధ్వర్యంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏమీ చేయలేకపోయింది. జపాన్ ఓడిపోవడం, నేతాజీ మరణంలో ఉద్యమం ఆగిపోయింది.

ఆర్మీ అధికారులు మేజర్ జనరల్ షానవాజ్ ఖాన్, కల్నల్ ప్రేమ్ సెహగల్, కల్నల్ గురుబక్ష్ సింగ్ థిల్లాన్ లను బ్రిటిష్ అధికారులు బందీలుగా పట్టుకున్నారు. ఎర్రకోటలోనే వారిని విచారించారు.

ఈ అధికారుల తరఫున వాదించడానికి కాంగ్రెస్ పార్టీ కమిటీని ఏర్పాటు చేసింది. జవహర్ లాల్ నెహ్రూ, బులభాయ్ దేశాయ్, అసఫ్ అలీ, తేజ్ బహదూర్ సప్రూ, కైలాస్ నాథ్ కట్జూ (సుప్రీం కోర్టు మాజీ జడ్జి మార్కండేయ కట్జు తాత ) ఈ ముగ్గురు అధికారుల తరఫున వాదించారు. 1945 నవబర్, 1946 మే నెలల్లో ఈ కేసుపై విచారణ జరిగింది.

ఎన్నికలు దగ్గరకు రావడంతో ఈ ముగ్గురు అధికారులు వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది.

వీరు భారతదేశంలో మూడు ప్రధాన మతాలకు చెందినవారని, అందువల్ల దేశమంతా వీరి కోసం ఏకమవుతోందని ప్రభుత్వ ఇంటెలిజెన్స్ బ్రిటిష్ నాయకత్వానికి తెలిపారు.

‘‘ఈ ముగ్గురి కోసం 40 కోట్లమంది’’ అనే నినాదం అప్పట్లో ఉధృతంగా వినిపించింది. ఆ రోజుల్లో వారిని ఎర్రకోటలోని సలీమ్ గఢ్ లో బంధించి ఉంచారు. వీరికి మరణశిక్ష పడుతుందని అంతా ఊహించగా, అందుకు భిన్నంగా బ్రిటీష్ ఆర్మీ కమాండర్ ఈ ముగ్గురి విడుదలకు ఆదేశించారు.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జవహర్ లాల్ నెహ్రూ ఎర్రకోట మీదనే తొలిసారి జెండా ఎగరవేశారు.

2003 డిసెంబర్ వరకు ఇది భారత సైన్యానికి క్యాంపుగా ఉండేది. ప్రస్తుతం భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది. 2007లో యునెస్కో ఎర్రకోటను ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)