సెక్స్‌ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువ ఉంటారు, మగవాళ్లకా, ఆడవాళ్లకా?

Sex myths

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బాబీ డఫ్పీ
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

మన కంటే పక్కవారి సెక్స్ జీవితం మెరుగ్గా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. మరి దీనికి కారణాలేమిటో తెలుసా?

యువత చాలా ఎక్కువగా సెక్స్‌లో పాల్గొంటుందని మనం భావిస్తామని, అయితే నిజానికి మనం జరిగేదానికంటే ఎక్కువే ఊహించుకుంటామని ఓ పరిశోధన చెబుతోంది. ముఖ్యంగా అమ్మాయిల సెక్స్ జీవితాల విషయంలో మనం సంకుచితంగా ఆలోచిస్తామని వివరించింది.

సెక్స్‌ విషయంలో అపోహలపై నిర్వహించిన అధ్యయనాలపై ‘‘ద పెరిల్స్ ఆఫ్ పర్సెప్షన్’’ పేరుతో ఒక పుస్తకాన్ని ఐప్సోస్ రూపొందించింది.

అందులో భాగంగా తమ దేశంలోని 18 నుంచి 29 ఏళ్ల వయసున్న వారు గత నాలుగు వారాల్లో ఎన్నిసార్లు సెక్స్‌లో పాల్గొని ఉంటారో అంచనా వేయాలని కొందరు బ్రిటన్, అమెరికా పౌరులను సంస్థ అప్పట్లో కోరింది.

రెండు దేశాల్లోనూ నెలకు సగటున 14 సార్లు యువకులు సెక్స్‌లో పాల్గొంటూ ఉండొచ్చని అధ్యయనంలో పాల్గొన్నవారు అంచనావేశారు.

కానీ, నిజానికి నెలకు సగటున బ్రిటన్‌లో ఐదుసార్లు, అమెరికాలో నాలుగుసార్లు మాత్రమే సెక్స్‌లో పాల్గొంటున్నట్లు పరిశోధనలో తేలింది.

సెక్స్‌పై అపోహలు

ఫొటో సోర్స్, Alamy

అధ్యయనంలో పాల్గొన్నవారిలో చాలామంది.. యువకులు ప్రతి రెండు రోజులకు ఒకసారి సెక్స్‌లో పాల్గొంటారని అభిప్రాయం వ్యక్తంచేశారు. అంటే, ఏడాదికి 180 సార్లు. కానీ నిజానికి ఇది ఏడాదికి 50 సార్లకు అటూఇటూగా ఉంటోందని అధ్యయనంలో తేలింది.

అయితే, అమ్మాయిల సెక్స్ విషయానికి వస్తే పురుషులు మరింత తప్పుగా ఆలోచిస్తున్నారని బయటపడింది. అటు అమెరికా, ఇటు బ్రిటన్... రెండు దేశాల్లోనూ ఇలానే ఆలోచిస్తున్నట్లు వెల్లడైంది.

బ్రిటన్‌లో వయసులో ఉండే అమ్మాయిలు నెలకు 22సార్లు, అమెరికాలో అయితే 23 సార్లు సెక్స్‌లో పాల్గొంటూ ఉండొచ్చని అధ్యయనంలో పాల్గొన్న పురుషులు అభిప్రాయం వ్యక్తంచేశారు. అంటే వారంలో ఐదుసార్లు అమ్మాయిలు సెక్స్‌లో పాల్గొంటారని, కొన్ని ప్రత్యేక రోజుల్లో అయితే రోజుకు రెండు, మూడు సార్లు కూడా సెక్స్‌లో పాల్గొంటూ ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. కానీ, వాస్తవంలో ఇది సగటున నెలకు ఐదు సార్లు మాత్రమేనని తేలింది.

ఇలాంటి అపోహలకు చాలావరకు మన ఆలోచనా విధానం, చుట్టుపక్కల వారి ప్రభావమే కారణమని అధ్యయనకర్తలు వివరించారు.

సెక్స్‌పై అపోహలు

ఫొటో సోర్స్, Alamy

మనుషుల మనుగడ సెక్స్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే, సెక్స్‌పై మనుషుల్లో ఎన్నో అపోహలు ఉంటాయి. మనం చాలా ప్రవర్తనా పరమైన అంశాలను చుట్టుపక్కల వారిని చూసి నేర్చుకుంటాం. కానీ సెక్స్ అలా కాదు. అది నాలుగు గోడల మధ్య వ్యవహారం.

తోటి వారితో పోల్చి చూసుకోవడానికి మనకు ఎక్కువగా సమాచారం అందుబాటులో ఉండకపోవడంతో దీని గురించి వివరాల కోసం ఇతర మార్గాలను అన్వేషిస్తుంటాం. తప్పుదారి పట్టించే సర్వేలు, నీలి చిత్రాలు, మితిమీరిన మీడియా కవరేజీలను చూస్తుంటాం. అయితే ఇవి మన ఆలోచనా విధానాన్ని మార్చేస్తున్నాయి. వాస్తవాలకు దూరంగా మనల్ని తీసుకువెళ్తున్నాయి.

45 నుంచి 54 ఏళ్ల వయసు వచ్చేవరకు ఒక వ్యక్తికి తన జీవితంలో ఎంత మంది సెక్స్ పార్ట్‌నర్‌లు ఉంటారని భావిస్తున్నారు? అని కూడా అధ్యయనంలో భాగంగా ప్రశ్నించారు. అయితే, దీనిలో పాల్గొన్న పురుషులు మాత్రం దాదాపు సరిగ్గానే అంచనా వేయగలిగారు.

మగవారు 45 నుంచి 54 ఏళ్ల వయసు వచ్చే సరికి ఆస్ట్రేలియా, బ్రిటన్‌లలో 17 మంది, అమెరికాలో 19 మంది సెక్స్ పార్ట్‌నర్‌లు ఉంటారని అంచనా వేశారు. ఈ అంచనాలు వాస్తవానికి చాలా దగ్గర ఉన్నాయి.

అయితే, పురుషుల సమాచారాన్ని మహిళలతో పోల్చినప్పుడు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెక్స్ పార్ట్‌నర్‌ల విషయంలో పురుషులు చెప్పేదాని కంటే చాలా తక్కువ సంఖ్యను మహిళలు చెప్పారు.

పురుషులతో పోలిస్తే సగం కంటే తక్కువే సెక్స్‌ పార్ట్‌నర్‌లు ఉంటారని మహిళలు చెప్పారు. కానీ, ఇలా జరగడం దాదాపు అసాధ్యం.

ఎందుకంటే మహిళలు, పురుషులు దాదాపు జంటగానే సెక్స్‌లో పాల్గొంటారు. వీరి జనాభా నిష్పత్తి కూడా కొంచెం అటూఇటూగా ఒకేలా ఉంటుంది. కాబట్టి సెక్స్ పార్ట్‌నర్‌ల సమాచారం కూడా కొంచెం తేడాలతో సరిపోవాలి.

అయితే, ఈ తేడాలకు కొన్ని కారణాలు ఉన్నాయి. మగవారు వేశ్యల సేవలను ఉపయోగించడంతో మొదలుపెట్టి.. కొన్ని లైంగిక చర్యలను మహిళలు సెక్స్‌గా ఆమోదించకపోవడం వరకు ఇలా కారణాలు చెప్పుకోవచ్చు.

అధ్యయనంలో పాల్గొన్న మహిళా విద్యార్థులు ఇచ్చిన సమాధానాల్లోనూ ఇలాంటి తేడాలు స్పష్టంగా కనిపించాయి. సెక్స్‌ గురించి ప్రశ్నలు అడిగే ముందు వీరిని మూడు వర్గాలుగా విభజించారు. ఒక వర్గానికి కేవలం ప్రశ్నావళిని పూరించమని సూచించారు. రెండో వర్గానికి వీరు ఇచ్చే సమాధానాలను అధ్యయనకర్తలు లోతుగా విశ్లేషిస్తారని చెప్పి ప్రశ్నావళిని నింపమన్నారు. మూడో వర్గానికి ‘‘ఫేక్ లై డిటెక్టర్’’ మెషీన్‌ అమర్చి సమాధానాలు చెప్పమన్నారు.

దీంతో సమాధానాలను విశ్లేషిస్తారని చెప్పిన వర్గం మహిళలు సగటున 2.6 మంది సెక్స్ పార్ట్‌నర్‌లు ఉండొచ్చని చెప్పారు. సాధారణంగా ప్రశ్నావళిని పూరించినవారు మాత్రం ఈ సంఖ్య 3.4గా చెప్పారు. ఫేక్ లై డిటెక్టర్లు అమర్చిన వారు మాత్రం 4.4గా చెప్పారు. ఇది దాదాపుగా పురుషులు చెప్పిన సంఖ్యతో సమానం.

sex myths

ఫొటో సోర్స్, Alamy

అమెరికా డేటా విశ్లేషిస్తున్నప్పుడు కూడా ఇలాంటి తేడాలే బయటపడ్డాయి. అమెరికాలో మహిళల సెక్స్ పార్ట్‌నర్‌లపై వారు భిన్నంగా అంచనాలు చెప్పారు. అమెరికా మహిళలకు సగటున 27 మంది సెక్స్ పార్ట్‌నర్‌లు ఉండొచ్చని పురుషులు చెబుతుంటే.. మహిళలు మాత్రం 13 అనే చెబుతున్నారు. తమ పార్ట్‌నర్‌ల విషయంలో వారు చెప్పే సంఖ్య(12)కు ఇది దగ్గరగా ఉంది.

మహిళల విషయంలో పురుషులు చెప్పే సంఖ్య ఎక్కువగా ఉండటానికి.. కొందరు పురుషులు ఇచ్చే భారీ అంచనాలే కారణం. అధ్యయనంలో పాల్గొన్న 1000 మందిలో దాదాపు 20 మంది పురుషులు అయితే.. మహిళలకు 50 మంది కంటే ఎక్కువమందే పార్ట్‌నర్‌లు ఉండొచ్చని చెప్పారు. వీరి సమాధానాల వల్లే డేటాలో తేడాలు కనిపిస్తున్నాయి.

మనం ప్రపంచాన్ని ఎలా చూస్తున్నామో ఈ అపోహలు కళ్లుకు కడుతున్నాయి. ముఖ్యంగా మనలో వివక్ష పూరిత ధోరణికి ఇవి అద్దం పడుతున్నాయి. ముఖ్యంగా కొందరు యువకులు.. యువత, మహిళలపై చెప్పే అంచనాలు కలవరపాటుకు గురిచేసేలా ఉన్నాయి.

సెక్స్‌పై అపోహలను తొలగించడానికి వాస్తవాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. అదే సమయంలో ఈ అపోహలకు కారణం ఏమిటి? మన ఆలోచనా విధానం మనల్ని ఎలా తప్పు దారి పట్టిస్తుంది లాంటి అంశాలనూ వారికి వివరించి చెప్పాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)