'నో' అని చెబుతూనే నొప్పించకుండా మెప్పించడం ఎలా?

ఫొటో సోర్స్, Getty Images
ఆఫీసులో, పని చేసే దగ్గర బాసులు, సహోద్యోగులు, క్లయింట్లు, ఇతరులు చేసే డిమాండ్లన్నిటికీ మీరు ఎల్లప్పుడూ ‘ఎస్’ చెబుతున్నట్లయితే.. బహుశా మీరు చాలా ముఖ్యమైన వ్యక్తినని, మీ స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని భావిస్తుండవచ్చు.
సమస్య ఏమిటంటే... మీ మీద బాధ్యతల భారం పెరిగిపోవడానికి అది కారణం కావచ్చు. పైగా మీ లక్ష్యాలను సాధించటానికి బదులుగా నిరాశకు గురిచేయవచ్చు. అది మీ వృత్తినైపుణ్య ప్రతిష్ట మీద, మీ కెరీర్ అవకాశాల మీద ప్రభావం చూపవచ్చు.
ఈ మాట చెప్తున్నది బ్రూస్ టుల్గాన్. రెయిన్‌మేకర్ థింకింగ్ అనే అమెరికా సంస్థ వ్యవస్థాపకుడు ఆయన. బిజినెస్ మేనేజర్లకు ప్రొఫెషనల్ శిక్షణనిచ్చే సంస్థ అది. ఆయన ‘ద అర్ట్ ఆఫ్ మేకింగ్ యువర్‌సెల్ఫ్ ఇన్‌డిస్పెన్సబుల్ ఎట్ వర్క్’ వంటి పుస్తకాల రచయిత కూడా.
‘‘విజయవంతంగా ముందుకు సాగటానికి ఏకైక మార్గం ‘నో’ చెప్పటం ఎలాగో నేర్చుకోవటం.. ఇతరులు తమకు గౌరవం దక్కుతోందని భావించేలా చేయటం’’ అని బీబీసీతో చెప్పారు టుల్గాన్.

ఫొటో సోర్స్, Bruce Tulgan
పని అనేది సాధారణంగా చాలా ఒత్తిడితో కూడుకుని ఉండటమే కాక.. తీవ్ర పోటీతత్వంతో కూడుకున్నది. అందువల్ల నో చెప్పటం.. అదే సమయంలో గౌరవం దక్కుతోందని భావించేలా చేయటం సంక్లిష్టమైన సమస్యే.
మీరు ప్రొఫెషనల్‌గా అద్భుతంగా రాణించాలనే ఆలోచనతో ఎల్లప్పుడూ ‘ఎస్’ చెప్తున్నట్లయితే.. చివరికి మీ సమయం, శక్తి, డబ్బు కూడా వృధా కావచ్చునని.. పైగా అసలైన ముఖ్యాంశాల నుంచి మీ దృష్టి మరలవచ్చునని టుల్గాన్ వివరిస్తున్నారు.
అందుకే.. మీ ప్రతిష్టను మెరుగుపరచుకోవటానికి, నమ్మకమైన వృత్తి సంబంధాలను నిర్మించుకోవటానికి.. ఎప్పుడు, ఎలా ‘నో’ చెప్పాలో నేర్చుకోవటం అవసరమంటారీ నిపుణుడు.
‘‘నో’ చెప్పటం ద్వారా సానుకూల ప్రభావం ఉండేలా చూసుకోవటం మీ లక్ష్యం’’ అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పనిలో ‘నో’ చెప్పటానికి బ్రూస్ టుల్గాన్ సూచిస్తున్న నాలుగు వ్యూహాలివీ...
1. సరైన ప్రశ్నలు అడిగి, నోట్ చేసుకోవాలి
మిమ్మల్ని ఏదైనా చేయాలని చెప్పినపుడు మొదటిగా చేయాల్సిన పని సరైన ప్రశ్నలు అడగటం, వారు చెప్పే సమాధానాలను మీరు నమోదు చేసుకుంటున్నట్లుగా వారికి చూపటం.
మీరు ఆ పని చేసినట్లయితే, మీరు ఆ వ్యక్తి మీద మాత్రమే కాదు, ఆ వ్యక్తి కోరిన దాని మీద కూడా గౌరవం చూపుతున్నట్లు అవుతుంది.
మీరు ‘నో’ చెప్పాల్సిన వ్యక్తి మీ బాస్ కాదని అనుకుందాం. వారు మీకు అప్పగించాలని భావిస్తున్న పని గురించి మీరు ఎన్ని ప్రశ్నలు అడిగితే, ఎంత ఆసక్తి కనబరిస్తే.. ‘నో’ చెప్పటం అంత సులభమవుతుంది.
మీరు గనుక మంచి ప్రశ్నలు అడిగినట్లయితే.. సంబంధిత అంశం విషయంలో మీ నైపుణ్యాన్ని, విజ్ఞాన్ని ప్రదర్శించటానికి అది ఒక అవకాశమవుతుంది.
నిజానికి, సరైన ప్రశ్నలు అడగటం.. ఆ పని చేయటానికి ఎంత ఎక్కువ శ్రమ అవసరమో, సంస్థ ప్రాధాన్యాల్లో ఆ పని ఎంత ముఖ్యమో ఎదుటి వ్యక్తికి అర్ధమయ్యేలా చేయగలదు.

ఫొటో సోర్స్, Getty Images
2. ‘నో’ చెప్పటానికి మంచి కారణాలు ఇవ్వటం
మీరు ప్రతిస్పందించే తీరులోనే అసలు కిటుకు ఉంది. ఒకవేళ మీరు ‘నో’ చెప్పబోతున్నట్లయితే ప్రత్యామ్నాయాలు ప్రతిపాదించటం ముఖ్యం.
వ్యతిరేక సమాధానం న్యాయమైనదేనని చూపటానికి అలా ఎందుకో వివరించాల్సి ఉంటుంది. మీరు వేరే పనులు చేస్తున్నారనేది సాధారణంగా చెప్పే కారణం. అదే పరిస్థితి అయితే.. మీకు ఉన్న ఇతర బాధ్యతల గురంచి సవివరంగా, విస్పష్టంగా వివరించటం మంచిది.
‘‘ఐ యామ్ సారీ, నేను వేరే పనులు చేయాల్సి ఉంది’’ అని మాత్రమే చెప్తే సరిపోదు. మరైతే మరింత సమర్థవంతమైన స్పందనలు ఏమిటి?
‘‘ఇప్పుడే కాదు.. నాకు ఇంకొన్ని వివరాలు అవసరం’’ అని చెప్పటం. ‘‘నేను ఫలానా పని చేస్తున్నాను’’ అని ఆ పనులు ఏమిటో స్పష్టంగా వివరించటం. అవసరమైన వివరాలన్నీ అందించటం. దానివల్ల మీరు చెప్పే సమాధానం ఏదో సాకు లాగా కనిపించదు.
ఒకవేళ మీ బాస్ కానీ, మీ కన్నా ఎక్కువ అధికారం గల వ్యక్తి కానీ అడిగినట్లయితే.. మీకు కొత్తగా మరో పని అప్పగించటానికి బదులుగా, మీ ప్రాధాన్యతలను మార్చటానికి వారికి అవకాశం ఇవ్వొచ్చు.
అదే సమయంలో.. మీ సమయాన్ని ఎంత నిర్దిష్టంగా కేటాయిస్తున్నారో వారికి అర్ధమయ్యేలా వివరించాలి. తద్వారా మీరు వారు చెప్పిన పనిని తప్పించుకోవాలని చూస్తున్నారనో, మీ సమయాన్ని నిరుత్పాదకంగా వెచ్చిస్తున్నారనో వారు భావించే వీలుండదు.
కొంత మంది.. ఎవరైనా ఏదైనా పని చెప్పినపుడు ‘అది నా పని కాదు’ అని బదులిస్తుంటారు. కానీ ఆ మాటకు అనేక ప్రతికూల అర్థాలుంటాయి. అవి ఘర్షణకు దారితీస్తాయి. మీరు అలా బదులిస్తే.. ‘నువ్వు నా బాస్‌వి కాదు’, ‘నువ్వు నాకు ఆ పని చెప్పజాలవు’ అనే అర్థంలో మీరు మాట్లాడుతున్నారని ఎదుటి వ్యక్తి భాష్యం చెప్పుకోవచ్చు.
‘నో చెప్పటానికి మరో పద్ధతి.. వారి వినతికి మీరు వేగంగా స్పందించే పరిస్థితిలో లేరని వివరించటం.
అంటే.. ఆ రంగంలో మీరు నిపుణులు కాదని, ఆ పని చేయాలంటే అది ఎలా చేయాలో అధ్యయనం చేయటానికి కొంత సమయం వెచ్చించాల్సి ఉంటుందని మీరు చెప్తున్నారన్న మాట.
మీరు ఇలా కూడా బదులివ్వవచ్చు: ‘‘ఈ అవకాశం కల్పించినందుకు థాంక్స్. నన్ను చేయమంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ ముందు నేను నేర్చుకోవాలి.’’

ఫొటో సోర్స్, Getty Images
3. పని పూర్తయ్యే ఏర్పాటు చేయటం
ఎదుటి వ్యక్తి చెప్పిన పని పూర్తి చేయటానికి మీరు ఏర్పాటు చేయవచ్చు. ‘‘ఈ విషయంలో నేను చేయగల సాయం ఇది’’ అని చెప్పొచ్చు. లేదంటే ‘‘ఇంకెవరైనా చేస్తారేమో కనుక్కోవడానికి సాయం చేయమంటారా?’’ అని అడగొచ్చు.
ఒకవేళ వారు అడిగిన పని అర్జంట్ కాకపోతే.. ‘‘నేను హెల్ప్ చేస్తాను.. కానీ రెండు వారాలు పడుతుంది’’ అని మీరు చెప్పొచ్చు. ఒకవేళ వారు అడుగుతున్న పని మీరు చేసే దారే లేదని మీరు నిజంగా భావించినట్లయితే.. ‘‘చూడండి.. ఆ పని నేను చేయలేను. కానీ ఈ రకంగా మీకు హెల్ప్ చేయగలను’’ అని చెప్పవచ్చు.
మీ ప్రొఫెషనలిజాన్ని, సాయం చేయటానికి మీ సన్నద్ధతను చాటటానికి ఇదొక పద్ధతి.
4. ఆ పని ఎంత వరకూ వచ్చిందో తెలుసుకోవటం
మీకు ఇంతకుముందు ఆ పని చెప్పిన వ్యక్తిని కలిసి, ఆ పని ఎంత వరకూ వచ్చింది? ఎలా జరిగింది? పూర్తయిందా? పరిష్కారమయిందా? సరైన వ్యక్తి దొరికారా? అని అడిగి తెలుసుకోవాలి. ‘‘మీకు ఫలానా పనులు అవసరమైతే అవి నేను బాగా చేయగలను.. గుర్తుపెట్టుకోండి’’ అని కూడా చెప్పవచ్చు.
మీరు చెప్పిన సమాధానం వ్యతిరేకంగా ఉన్నా కూడా.. మంచి సంబంధాలను నిర్మించుకోవటం, విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవటం కొనసాగించటం ముఖ్యం.
ఇవి కూడా చదవండి:
- ఆస్ట్రేలియా క్రికెటర్లు స్లెడ్జింగ్ చేసినప్పుడు విరాట్ కోహ్లీ చెప్పిన మర్యాద కథ
- సింగపూర్: కోట్లు ఇస్తామన్నా ఈ రెండు ఇళ్ల యజమానులు కదలటం లేదు.. ఎందుకు?
- సిరాజ్‌పై మళ్లీ జాత్యహంకార వ్యాఖ్యలు.. హైదరాబాద్ క్రికెటర్‌పై ఆస్ట్రేలియాలో విద్వేషం కక్కిన ప్రేక్షకులు
- ‘అన్నీ పోను రూ. 500 నెల జీతం’.. అందుకే కార్మికులు తిరగబడి ఫ్యాక్టరీని ధ్వంసం చేశారా
- బెడిసికొట్టిన ఆస్ట్రేలియా స్లెడ్జింగ్... అసలు ఆ జట్టు సంస్కృతి మారదా?
- జస్ప్రీత్ బూమ్రా: ఆస్ట్రేలియన్లను ఆశ్చర్యపరుస్తున్న బౌలింగ్ సంచలనం
- ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్... సక్సెస్‌కు ఆయన చెప్పిన ఆరు సూత్రాలు
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- 127 ఏళ్ల కిందట ప్రపంచానికి భారత ఘనతను చాటిన వివేకానందుడి ప్రసంగం ఇదే..
- ‘ఎవరికీ ద్రోహం చేయలేను... అందుకే ఇద్దరినీ ఒకేసారి పెళ్లి చేసుకున్నా’
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








