రష్యా, చైనాలు కజక్‌స్తాన్‌ను ఎందుకు విలీనం చేసుకోవాలనుకుంటున్నాయి

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, దిల్‌మురాద్ అలీవే
- హోదా, బీబీసీ ప్రతినిధి
కజక్‌స్తాన్ ప్రభుత్వం ఈ మధ్య తమ సార్వభౌమాధికారం, సమగ్రతల గురించి అధికంగా ప్రచారం చేస్తోంది. మాతృభూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత దేశ పౌరులందరిదీ అంటూ పిలుపునిస్తోంది.
కజక్‌స్తాన్ అధ్యక్షుడు కాసిం-జోమార్ట్ టోకాయేవ్ నుంచి జనవరి 5న ఒక ప్రకటన వెలువడింది.
“కజక్‌స్తాన్ ప్రజలు ఈ పవిత్ర భూమిని తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా పొందారు. దీన్ని వారు అన్ని విధాలుగా రక్షిస్తారు” అని ఆ ప్రకటనలో తెలిపారు.
కజక్‌స్తాన్ భౌగోళిక సరిహద్దుల గురించి పదే పదే వినిపిస్తున్న భిన్న వాదనల నేపథ్యంలో ఆ దేశ అధికారులు ఈ ప్రకటనలు చేస్తున్నారు.
గతంలో కజక్‌స్తాన్ తమ దేశంలో అంతర్భాగమని, మళ్లీ దాన్ని తమ భూభాగంలో విలీనం చేసుకోవాలని భావిస్తున్నట్లు రష్యా, చైనా రెండూ వ్యాఖ్యానించాయి.
గత ఏడాది డిసెంబర్‌లో రష్యాలో ఈ వాదన తెరపైకి వచ్చింది. అంతకుముందు ఏప్రిల్‌లో ఒక చైనా వెబ్‌సైట్‌లో కూడా ఇలాంటిదే ఒక కథనం వెలువడింది.
ఈ రెండు సందర్భాల్లో కూడా రష్యా, చైనా వాదనలతో కజక్‌స్తాన్ విభేదించింది.
మధ్య ఆసియాలో భాగమైన కజక్‌స్తాన్ గురించి గతంలో కూడా ఇలాంటి వాదనలు పలుమార్లు తెర పైకి వచ్చాయి. కానీ ఇంతకుముందెప్పుడూ కూడా ఆ దేశ ప్రభుత్వ అధికారులు ఇంత తీవ్రమైన స్వరంతో స్పందించలేదు.
కజక్‌స్తాన్ ప్రభుత్వం ఇన్నాళ్లూ చైనా, రష్యాలతో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చింది. ఈ రెండు దేశాలతోనూ తమకున్న ఆర్థిక, రక్షణ, వాణిజ్య సంబంధాలను దృష్టిలో ఉంచుకుని దౌత్యపరమైన ఎలాంటి వివాదాల్లోనూ చిక్కుకోకుండా జాగ్రత్తపడింది.
ఇప్పుడు తమ ప్రధాన పొరుగు దేశాలతో విభేదించడానికి ముఖ్య కారణం ఆ దేశ పౌరుల్లో పెరుగుతున్న దేశభక్తి అని నిపుణులు భావిస్తున్నారు.
రష్యా, చైనాలతో వ్యవహరించేటప్పుడు తమ జాతీయ ప్రయోజనాలు దెబ్బతినకుండా చూసుకోవాలని ప్రభుత్వంపై వస్తున్న అంతర్గత ఒత్తిడి కూడా మరో కారణం.
చూస్తుంటే, బయట శక్తులను ఎదురించడంకన్నా అంతర్గత అంశాలను ప్రసన్నం చేసుకోవడమే కజక్‌స్తాన్ వరుస ప్రకటనల వెనుక ఉద్దేశమని తోస్తోంది.

ఫొటో సోర్స్, AKORDAKZ
సరిహద్దుల గురించి రష్యాలో చర్చలు
కజక్‌స్తాన్ ప్రభుత్వ వార్తాపత్రిక వెబ్‌సైట్‌లో ఒక సుదీర్ఘ కథనం వెలువడింది.
ఈ కథనం ప్రకారం.. కజక్‌స్తాన్ భౌగోళిక భద్రతపై బయట నుంచి వస్తున్న కవ్వింపు చర్యలకు సమగ్రంగా, అధికారికంగా కూడా సరైన రీతిలో స్పందించాలని ఆ దేశ అధ్యక్షుడు కాసిం-జోమార్ట్ టోకాయేవ్ తెలిపారు.
"నిజం ఏమిటంటే, మన దేశాన్ని ఏ విదేశీ శక్తులూ స్వాధీనం చేసుకోలేవు. మనం ఎవరికీ అమ్ముడుపోము" అని ఆయన అన్నారు.
దేశ పౌరులందరూ కజక్‌స్తాన్ భాష నేర్చుకోవాలని, చరిత్రలో సోవియట్ కాలం గురించి పరిశోధించాలని ఆయన పిలుపునిచ్చారు.
'కజక్‌స్తాన్ ప్రజలే మధ్య ఆసియా విశాల భూభాగానికి అసలైన వారసులు' అంటూ ఆ దేశ పూర్వ అధ్యక్ష్యుడు నూర్ సుల్తాన్ నజర్‌బాయోఫ్ గతంలో అన్న మాటలను తిరిగి గుర్తు చేశారు.
నూర్ సుల్తాన్ గానీ, కాసిం-జోమార్ట్ టోకాయేవ్ గానీ రష్యా పేరు బహిరంగంగా ప్రస్తావించలేదు. కానీ, ఆ ఇద్దరు నాయకుల మాటలు, ప్రకటనలు వెలువరించిన సమయం సందర్భాలను బట్టి... రష్యా ప్రతినిధుల సభలో కజక్‌స్తాన్ సరిహద్దుల గురించి జరిగిన చర్చలనే ప్రస్తావిస్తున్నారని స్పష్టమైంది.
రష్యా పార్లమెంట్ సభ్యులు ఉవీచే స్లావ్ నికానిఫ్, యావ్గాని ఫెదోర్ఫ్ గత డిసెంబర్‌లో ఆ దేశ మీడియాలో ఒక ప్రకటన ఇచ్చారు. గతంలో కజక్‌స్తాన్ ఉనికిలోనే లేదని, దాన్ని రష్యాలో విలీనం చేయాలని వారన్నారు.
దీనికి జవాబుగా కజక్‌స్తాన్ ప్రభుత్వ అధికారులు, మంత్రులు కూడా బలంగా స్పందించారు. ఈ స్పందనపై కజక్‌స్తాన్ ప్రజల్లో హర్షం వ్యక్తమైంది.
గత మే నెలలో.. రష్యా నాయకత్వంలో 'యూరేషియన్ ఎకనామిక్ యూనియన్' ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని కూడా కాసిం-జోమార్ట్ టోకాయేవ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ యూనియన్ ఉద్దేశం కజక్‌స్తాన్‌తో సహా ఈ ప్రాంతంలోని పలుదేశాల సార్వభౌమత్వాన్ని పరిమితం చేయడమేనని విమర్శించారు.
దేశ జాతీయ ప్రయోజనాలను పరిరక్షించేందుకు కాసిం-జోమార్ట్ టోకాయేవ్ గళం ఎత్తారని కజక్‌స్తాన్ ప్రజలు ఆయన్ను పలు విధాలా ప్రశంసించారు.

ఫొటో సోర్స్, Getty Images
చైనాతో విరోధం
గత ఏడాది ఏప్రిల్‌లో చైనా వెబ్సైట్లో వచ్చిన ఒక కథనానికి కూడా కజక్‌స్తాన్ ప్రభుత్వం ఇదే విధంగా స్పందించింది.
కజక్‌స్తాన్ ఒకప్పుడు చైనాలో భాగమేనని, ఆ దేశంలో అధిక సంఖ్యాకులు మళ్లీ చైనాతో కలిసిపోవాలని కోరుకుంటున్నారని ఆ వెబ్‌సైట్ కథనంలో తెలిపారు.
ఈ విషయమై, ఏప్రిల్ 14న కజక్‌స్తాన్ విదేశాంగ శాఖ చైనాకు ఒక నిరసన లేఖ పంపింది. చైనా వెబ్సైట్లో వచ్చిన కథనం, ఇరు దేశాల మధ్య ఉన్న భద్రతా వ్యవస్థను దెబ్బ తీసేదిగా ఉందని ఆ లేఖలో స్పష్టం చేసింది.
చైనా ఆజ్ఞలకు తల ఒగ్గుతుందని కజక్‌స్తాన్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనాకు వ్యతిరేకంగా కజక్‌స్తాన్ మాట్లాడటం ఇదే మొదటిసారి.
చైనాకు జవాబు ఇవ్వడంపై కజక్‌స్తాన్‌లో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మీదట తమ దేశం మౌనంగా ఉండదని తెలియజెప్పడం పెద్ద విషయమని ప్రశంసించారు.

ఫొటో సోర్స్, Getty Images
రెండు బలమైన దేశాల మధ్య...
చైనా, రష్యా ఆ ప్రాంతంలో ఉన్న రెండు బలమైన దేశాలు. అక్కడి భౌగోళిక రాజకీయాల్లో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. వివిధ కారణాల వల్ల కజక్‌స్తాన్‌లో ప్రజలు ఈ రెండు దేశాలనూ అనుమానంతో చూస్తున్నారు.
రష్యా, కజక్‌స్తాన్‌కు మిత్ర దేశమే అయినప్పటికీ రష్యా విస్తరణవాద కాంక్షవల్ల తమకు సవాళ్లు ఎదురవుతాయని వారు భావిస్తున్నారు.
కజక్‌స్తాన్‌లో రష్యన్ సంతతికి చెందినవారు 35 లక్షలమంది ఉన్నారు. వీరు మొత్తం దేశ జనాభాలో 20 శాతం ఉంటారు. వీరిలో అధిక సంఖ్యాకులు కజక్‌స్తాన్‌కు ఉత్తరాన 6,846 కిలోమీటర్ల పొడవున్న రష్యా సరిహద్దుల్లో నివసిస్తున్నవారు.
రష్యా గతంలో.. పొరుగు దేశంలో ఉన్న రష్యన్ మైనారిటీలను సంరక్షించే సాకుతో అనేక సైనిక చర్యలను చేపట్టింది. ఈ కారణాల వల్ల రష్యాతో తమకు ముప్పు ఉందని కజక్‌స్తాన్ ప్రజలు భావిస్తున్నారు.
కజక్‌స్తాన్ జనాభా లెక్కల ప్రకారం స్థానిక కజక్ ప్రజల జనాభా మెల్లిమెల్లిగా పెరుగుతోంది. 2014లో 40 శాతం నుంచి 2020కి 68 శాతానికి పెరిగింది. ఇది మంచి పరిణామమేనని, దేశ ప్రజల్లో జాతీయవాదం పెంపొందించేందుకు తోడ్పడుతుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో కజక్‌స్తాన్‌లో సోవియట్ కాలం నుంచి ఉన్న ప్రాంతాల, పట్టణాల పేర్లను మారుస్తోంది. ఆ కాలం నుంచి దేశంలో చెలామణిలో ఉన్న లిపిని కూడా మార్చే ప్రయత్నాలు చేస్తోంది.
మరోవైపు, భారీ ఆర్థిక, రక్షణ వ్యవస్థగా వృద్ధి చెందుతున్న చైనా కూడా కజక్‌స్తాన్‌ను భయపెడుతోంది. చైనా నిశబ్దంగా ఆర్థిక విధానాల రూపంలో విస్తరణవాద విధానాలను అవలంబిస్తోంది. కజక్‌స్తాన్ సహజ వనరులను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది.
చైనా, కజక్‌స్తాన్ మధ్య ఉన్న ఆర్థిక ఒప్పందాలపై కజక్‌స్తాన్ ప్రజలు సందేహపడుతున్నారు. అధిక సంఖ్యలో చైనా ప్రజలు తమ దేశంలో ప్రవేశించడానికి ఈ ఒప్పందాలు తలుపులు తెరిచే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాకుండా చైనాలోని సింకియాంగ్ ప్రాంతంలో కజక్ సంతతితో సహా మైనారిటీల పట్ల ఆ దేశ వైఖరి కూడా ఈ ఆందోళనకు ఒక ముఖ్య కారణమే.
కజక్‌స్తాన్‌లో వ్యవసాయ భూములను చైనా కొనుగోలుదారులకు విక్రయించాలన్న ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకిస్తూ 2016 ఏప్రిల్, మే నెలల్లో అనేక మంది కజక్‌స్తాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు.
ఈ నిరసనల ఫలితంగా, దేశంలోని వ్యవసాయ భూములను ఇతర దేశాలకు లీజుకు ఇచ్చే ప్రణాళికను కజక్‌స్తాన్ ప్రభుత్వం వెనక్కు తీసుకుంది.
2019లో చైనాతో కలిసి పలు ఉమ్మడి ప్రోజెక్టులను చేపట్టాలని కజక్‌స్తాన్ ప్రభుత్వం యోచన చేసింది. అప్పుడు కూడా కజక్‌స్తాన్ ప్రజలు తీవ్రంగా నిరసనలు తెలియజేశారు.
ఇటీవల కాలంలో కజక్‌స్తాన్ ప్రజలు తమ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన సందర్భాల్లో చైనా పట్ల ఉన్న విముఖత ప్రధాన పాత్ర పోషించింది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పంచాయితీ: మహారాష్ట్ర ఎస్ఈసీకి అసెంబ్లీ జైలు శిక్ష విధించినప్పుడు ఏం జరిగింది?
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బడ్జెట్ 2021: కరోనా మహమ్మారితో భారత ఆర్థికవ్యవస్థకు ఎంత నష్టం... ఏంటి పరిష్కారం?
- దక్షిణ కోస్తా రైల్వే జోన్: ప్రకటించి రెండేళ్లు అవుతున్నా పనులు ఎందుకు మొదలు కాలేదు... అడ్డం పడుతున్నదేంటి ?
- వైట్ టైగర్: హాలీవుడ్ సినిమాల్లో అసలైన భారతదేశాన్ని చూపించేదెప్పుడు
- కాసిం సులేమానీ హత్య ఐఎస్‌కు వరంగా మారుతుందా
- మగాళ్లు రేప్ ఎందుకు చేస్తారు? అలాంటి ఆలోచనలు వారికి ఎందుకు వస్తాయి?
- సుభాష్ చంద్రబోస్ 'ద గ్రేట్ ఎస్కేప్': బ్రిటిష్ వాళ్ల కళ్లుగప్పి నేతాజీ దేశం ఎలా దాటారు?
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








