భారత్-చైనా సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు: రెండు వైపులా భద్రతా సిబ్బందికి గాయాలు

భారత్-చైనా సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు

ఫొటో సోర్స్, Getty Images

చైనా-భారత్ భద్రతా బలగాలు వివాదాస్పద సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలకు దిగినట్లు భారత మీడియా వార్తలు ప్రచురించింది. రెండు వైపులా భద్రతా సిబ్బంది గాయపడినట్లు పేర్కొంది.

ఉత్తర సిక్కింలో మూడు రోజుల క్రితం ఈ ఘర్షణలు చోటుచేసుకున్నట్లు సమాచారం.

లద్దాఖ్‌లోని వివాదాస్పద ప్రాంతంలో ఘర్షణల అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన సంగతి తెలిసిందే.

గత ఏడాది జూన్‌లో లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో చోటుచేసుకున్న ఈ ఘర్షణల్లో 20మంది భారత సైనికులు మరణించారు. వీటిలో మరణించిన చైనా సిబ్బందిపై ఎలాంటి సమాచారం లేదు.

తాజాగా సిక్కింలోని నకులా పాస్ దగ్గర ఘర్షణలు చోటుచేసుకున్నట్లు సైనిక అధికారుల సమాచారం.

భారత ప్రాంతాల్లోకి గస్తీ కాస్తున్న చైనా బృందం ప్రవేశించేందుకు ప్రయత్నించిందని, వారిని బలవంతంగా వెనక్కి పంపించామని అధికారులు తెలిపారు.

సైన్యం

ఫొటో సోర్స్, Getty Images

‘అన్నీ సర్దుకున్నాయి.. మీడియా సంయమనం పాటించాలి’

'సిక్కిం సెక్టార్‌లో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణకు సంబంధించి మాకు చాలా ప్రశ్నలొస్తున్నాయి.

సిక్కిం ఉత్తర ప్రాంతంలోని నకులా ప్రాంతంలో ఈ ఏడాది జనవరి 20న రెండు దేశాల సైనికుల మధ్య చిన్నపాటి ఘర్షణ తలెత్తింది.

ప్రోటోకాల్స్ ప్రకారం స్థానిక కమాండర్ల మధ్య చర్చలతోనే ఆ సమస్య పరిష్కారమైపోయింది.

అవాస్తవాలు రాయకుండా మీడియా సంయమనం పాటించాలని కోరుతున్నాం'' అని ప్రభుత్వ, సైనిక వర్గాలు చెప్పాయి.

కాగా ఈ అంశంపై చైనా వైపు నుంచి ఇంకా స్పందన లేదు.

భూటాన్, నేపాల్, చైనాల కూడలిలో సిక్కిం ఉంటుంది.

భారత్-చైనా సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు

ఫొటో సోర్స్, AFP

వరుస చర్చలు..

ప్రపంచంలో అత్యంత సుదీర్ఘ సరిహద్దు వివాదం భారత్, చైనాల మధ్య నడుస్తోంది. సరిహద్దులకు అవతల ఉన్న ప్రాంతాలు తమవంటే తమవని రెండు దేశాలూ చెబుతున్నాయి.3400 కి.మీ. పొడవైన ఈ సరిహద్దుల్లో చాలాచోట్ల నదులు, సరస్సులు, మంచు కొండలు ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో నిర్దిష్టమైన సరిహద్దు నిర్ణయించడం కష్టమవుతోంది. ఇదే రెండు దేశాల భద్రతా సిబ్బంది ఎదురురెదురు పడటానికి కారణం అవుతోంది. కొన్నిసార్లు ఘర్షణలకూ దారితీస్తోంది. గతేడాది లద్దాఖ్‌లో విధ్వంసకర ఘర్షణల అనంతరం పరిస్థితులను శాంతింప చేసేందుకు రెండు దేశాలు వరుస చర్చలు చేపడుతున్నాయి. గత ఆదివారం కూడా సైనిక కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి.ఘర్షణల వల్ల రెండు దేశాలూ భారీగా నష్టపోవాల్సి వస్తోంది. ఎందుకంటే భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో చైనా కూడా ఒకటి.రెండు దేశాలూ 1962లో యుద్ధానికి దిగాయి. ఈ యుద్ధంలో భారత్ పరాజయం చవిచూసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)