లీసా మోంట్గోమేరీ: 67 ఏళ్ల తరువాత తొలిసారిగా ఒక మహిళకు మరణ శిక్ష అమలు చేసిన అమెరికా

67 ఏళ్ల తరువాత తొలిసారిగా అమెరికాలో ఒక మహిళకు మరణ శిక్ష అమలు చేశారు.
అమెరికాకు చెందిన లీసా మోంట్గోమేరీ అనే మహిళకు ఇండియానా రాష్ట్రంలోని టెర్రె హాట్ జైల్లో విషపు ఇంజెక్షన్ ఇచ్చారు. అమెరికా సుప్రీం కోర్టు ఆమెపై విధించిన స్టే ఎత్తి వేయడంతో మరణ శిక్ష ఖాయమైంది.
52 ఏళ్ల లీసా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని, చిన్న వయసులోనే తీవ్ర హింసకు గురయ్యారని ఆమె తరపు లాయర్లు వాదించడంతో ఈ కేసు పలువురి దృష్టిని ఆకర్షించింది.
2004లో లీసా మిస్సౌరీకి చెందిన ఒక గర్భవతిని అత్యంత దారుణంగా హత్య చేసిన కారణంగా అక్కడి న్యాయస్థానం ఆమెకు మరణశిక్ష విధించింది.
23 ఏళ్ల బాబీ జో స్టినెట్ అనే గర్భవతిని హత్య చేసి, కడుపులోంచి బిడ్డను బయటకి తీసి, ఎత్తుకుని పారిపోయారు.
లీసాను తన చివరి కోరిక ఏమిటని అడుగగా "ఏమీ లేదు" అని జవాబు ఇచ్చారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
బుధవారం మధ్యాహ్నం 12.00 గంటలకు ఆమెకు మరణ శిక్ష అమలు చేసారు. ఇందులో భాగం పంచుకున్న వారంతా సిగ్గు పడాలని, మానసిక పరిస్థితి సరిగా లేని లీసాకు మరణ శిక్ష విధించడం అన్యాయమని లీసా తరపు లాయర్ కెలీ హెన్రీ అన్నారు.

గతంలో కోవిడ్ కారణంగా ఒకసారి, జడ్జ్ స్టే విధించడంతో మరొకసారి లీసాకు మరణ శిక్ష అమలు వాయిదా పడింది. చివరకు సుప్రీం కోర్టు కలుగజేసుకోవడంతో బుధవారం ఆమెకు శిక్షను అమలు పరిచారు.
లీసా మానసిక పరిస్థితిపై విచారణ జరిపేందుకు సోమవారం ఇండియానా కోర్టు జడ్జ్ స్టే విధించారు.
లీసాకు పుట్టుకతోనే మెదడు దెబ్బ తిందని, ఆమె తీవ్ర మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని లాయర్లు వాదించారు.
చిన్నతనంలో లీసా తండ్రి ఆమెను లైంగికంగా, శారీరకంగా వేధించారని, తల్లి ఆమెను వేశ్యావృత్తిలోకి దించారని లీసా కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు ఇచ్చిన చికిత్స కూడా హింసాత్మకంగా ఉండేదని, లీసా ఎంతో వేదన అనుభవించారని ఆమె తరపు లాయర్లు వాదించారు.
మిస్సౌరీలో హత్యకు పాల్పడిన సమయంలో లీసాకు మతిస్థిమితం లేదని, వాస్తవ ప్రపంచంతో సంబంధాలు కోల్పోయారని లాయర్లు వాదించారు. 41 మంది ప్రస్తుత, మాజీ న్యాయవాదులు, పలు మానవ హక్కుల సంఘాలు ఈ వాదనకు మద్దతు తెలిపాయి.
అయితే ప్రాణాలు కోల్పోయిన జో స్టినెట్ కుటుంబ సభ్యులు మాత్రం లీసాకు మరణ శిక్ష విధించడం సరైనదేనని భావిస్తున్నారు.
లీసా, జో స్టినెట్‌తో ఆన్‌లైన్ స్నేహం ఏర్పరచుకున్నారు. ఇద్దరికీ పెంపుడు కుక్కల పట్ల ప్రేమ ఉండడంతో మంచి దోస్తీ కుదిరింది. ఒకరోజు లీసా, స్టినెట్ ఇంటికి వెళ్లి తాడుతో ఆమె గొంతు బిగించి చంపేసారు. తరువాత కడుపులో ఉన్న బిడ్డను బయటకు లాగి ఎత్తుకుపోయారు.
బిడ్డను జో కొడుతున్న లీసాను పోలీసులు అనుమానించి విచారించారు. మొదట ఆ బిడ్డకు తానే జన్మనిచ్చానని లీసా వాదించినా, తరువాత నేరాన్ని అంగీకరించారు.
2007లో లీసా నేరం చేసినట్లు రుజువైంది. వెంటనే ఆమెకు మరణ శిక్ష విధించారు.
ఇవి కూడా చదవండి:
- రైతుల నిరసనలు: సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలోని ఆ నలుగురు ఎవరు?
- కోడి రామ్మూర్తి నాయుడు: ‘కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
- భారత్‌లో తయారవుతున్న ఈ పెన్నులకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ... ఎందుకంటే...
- డోనల్డ్ ట్రంప్‌ను అధ్యక్ష పదవిలోంచి తీసేయొచ్చా... 25వ రాజ్యాంగ సవరణ ఏం చెబుతోంది?
- వందల ఏళ్ల పాటు ఆఫ్రికాలో 'కనిపించిన' ఆ పర్వతాలు ఎలా మాయమయ్యాయి?
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- "నన్నెందుకు వదిలేశావు? పురుగుల మందు తాగి చనిపోతున్నా"
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- మైనారిటీలకు రక్షణ కల్పించడంలో పాకిస్తాన్ విఫలం అవుతోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








