సిస్టర్ అభయ హత్య కేసులో ఫాదర్, నన్‌కు జీవిత ఖైదు

ఫొటో సోర్స్, Getty Images
దాదాపు 30 ఏళ్ల క్రితం కేరళలో సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ హత్య కేసులో ఫాదర్ థామస్ కొత్తూర్, సిస్టర్ సెఫీలకు జీవిత ఖైదు ఖరారైంది.
1992లో 21 ఏళ్ల సిస్టర్ అభయను హత్య చేసి, సాక్ష్యాలను నాశనం చేసినందుకుగానూ దోషులకు జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం కోర్టు తీర్పు చెప్పింది.
ఫాదర్ థామస్, సిస్టర్ సెఫీ రహస్యంగా లైంగిక చర్యలో పాల్గొంటుండగా చూసిన సిస్టర్ అభయను వీరిద్దరూ కలిసి హత్య చేసినట్లుగా కోర్టు ధృవీకరించింది.
మొదట సిస్టర్ అభయ ఆత్మహత్య చేసుకున్నారని స్థానిక పోలీసులు భావించారు. అయితే, బాధితురాలి కుటుంబం, మానవ హక్కుల కార్యకర్తలు అనుమానాలు వ్యక్తం చేయడంతో తదుపరి దర్యప్తు కొనసాగించారు.
కోర్టు తీర్పుపై సెఫీ (55) స్పందించలేదు. ఫాదర్ కొత్తూరు (69) మాత్రం తాను అమాయకుడినని, ఏ తప్పూ చేయలేదని బుధవారం స్థానిక మీడియాతో చెప్పారు.
అసలేం జరిగింది?
1992 మార్చ్ 27 తెల్లవారుజామున సిస్టర్ అభయ నిద్ర లేచి, నీళ్లు తాగడానికి కాన్వెంట్ కిచెన్‌లోకి వెళ్లారు. వంటింట్లో కొత్తూర్, సెఫీ రహస్యంగా సెక్సులో పాల్గొనడం చూశారు.
అభయ ఈ విషయాన్ని బయటపెట్టేస్తారన్న భయంతో ఫాదర్ కొత్తూర్, సెఫీ కలిసి అభయను హత్య చేసి అక్కడే ఉన్న నూతిలో పడేశారని కోర్టు తేల్చింది.
ఈ కేసులో పోలీసుల దర్యాప్తు వివాదాస్పదమైంది. మొదట, ఆమె ఆత్మహత్య చేసుకొన్నట్లు స్థానిక పోలీసులు భావించారు.
తరువాత ఈ కేసును 1993లో సీబీఐకి అప్పగించారు. ఇది ఆత్మహత్య కాదు, హత్య అని సీబీఐ నిర్థరించింది. కానీ దోషులెవరన్నది స్పష్టంగా తెలియలేదు.
2008లో హై కోర్టు ఆదేశం మేరకు సీబీఐ ఈ కేసులో పునఃవిచారణ జరిపి కొత్తూర్, సెఫీ, పూత్రిక్కయిల్‌లను అదుపులోకి తీసుకుంది. కానీ, వాళ్లు ముగ్గురూ బెయిల్ మీద బయటికొచ్చేశారు.
సుదీర్ఘ విచారణ అనంతరం, ఈ మంగళవారం నాడు కోర్టు తుది తీర్పును ప్రకటించింది.
"ఎట్టకేలకు సిస్టర్ అభయ కేసులో న్యాయం జరిగింది. ఇక ఆమె ఆత్మకు శాంతి లభిస్తుంది" అని ఈ హత్య కేసులో న్యాయం కోసం పోరాడిన మానవ హక్కుల కార్యకర్త జోమోన్ పుతెంపురక్కల్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: ఆ జ్యోతిష్యుల గ్రామంలో హత్యలు ఎందుకు జరుగుతున్నాయి?
- కేరళ సైనేడ్ హత్యలు: భర్త, అత్తమామలు సహా ఆరుగురిని ‘విషమిచ్చి చంపిన ఆదర్శ కోడలు’
- ATM - ఎనీ టైమ్ మీల్: అన్నార్తులను ఆదుకుంటున్న హైదరాబాదీ ఆలోచన...
- ఐయూడీ: ఈ పరికరంతో గర్భం రాదు... ఎక్కువ మంది మహిళలు వాడట్లేదు
- మనిషి సగటు శక్తి కంటే గర్భిణుల సామర్థ్యం ఎక్కువా
- మగవాళ్ళకు గర్భ నిరోధక మందును కనిపెట్టిన భారత్
- తల్లి గర్భానికి కోతలు ఎందుకు పెరుగుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








