సమత సామూహిక అత్యాచారం, హత్య కేసులో ముగ్గురు దోషులకు మరణ శిక్ష

ఆసిఫాబాద్ సామూహిక అత్యాచారం, హత్య కేసులో ముగ్గురు దోషులకు మరణ శిక్ష విధిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పునిచ్చింది.
2019 నవంబర్ 24న తెలంగాణ రాష్ట్రం ఆసిఫాబాద్ జిల్లా ఎల్లపటార్ గ్రామం దగ్గర ఒక దళిత మహిళను ముగ్గురు వ్యక్తులు దారి కాసి, పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేసి, హత్య చేశారు. అదే సమయంలో దిశ కేసు జరగడంతో, సమత కేసు కూడా వెలుగులోకి వచ్చింది.
ఈ కేసులో నిందితులను పోలీసులు వెంటనే పట్టుకున్నారు. దాదాపు 20 రోజుల్లోనే చార్జిషీటు వేశారు. ప్రభుత్వం కూడా ఫాస్ట్రాక్ కోర్టును నియమించింది. చార్జిషీటు వేసిన రోజు నుంచి రోజూ కోర్టులో ఇదే కేసు విచారించారు.
ఏ1, ఏ2, ఏ3 లుగా ఉన్న షేక్ బాబు, షేక్ షంషుద్దీన్, షేక్ మక్దూమ్‌లకు ఉరి శిక్ష విధించారు. ఐపీసీ సెక్షన్లు 302 రెడ్ విత్ 34 తో పాటూ, ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టంలోని 3, 4, 5 సెక్షన్ల కింద కూడా నిందితులపై నేరం రుజువు అయింది. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల చట్టం ప్రత్యేక కోర్టు ఇంచార్జి జడ్జి ఎంజి ప్రియదర్శని ఆ ముగ్గురికీ ఒక్కొక్కరికీ 5 వేల చొప్పున జరిమానా విధించారు. అయితే వీరికి విధించిన మరణ శిక్షను హైకోర్టు ధృవీకరించాల్సి ఉంది.
ఈ కేసులో విచారణ, తీర్పు వేగంగా వచ్చాయనే చెప్పాలి. 2019 డిసెంబర్ 11న ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. ''60 రోజులైంది. నవంబర్ 24న ఆమె మరణించారు. డిసెంబరు 14న పోలీసులు చార్జిషీట్ వేశారు పోలీసులు. డిసెంబరు 23 నుంచి 31 వరకూ విచారణ జరిగింది. ఈ నెలంతా డిఫెన్స్, వాద ప్రతివాదాలు జరిగాయి. ఇప్పుడు తీర్పు వచ్చింది'' అని ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీస్ స్పెషల్ కోర్టు ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది (పీపీ) ఎం రమణా రెడ్డి బీబీసీతో చెప్పారు.


ఏం జరిగింది?
"రోడ్డు మీద చెప్పు కనిపించింది. ఆ పక్కనే కిందికి వెళ్తే ఆమె వస్తువులు అమ్ముకునే సంచి. ఇంకా కిందకు వెళ్తే.. శరీరం... బట్టల్లేవు... వంటినిండా రక్తం ఉంది. ఆమె జుట్టు ఎవరో పట్టుకుని గుంజినట్టు ఉంది. ఛాతీ మీద గోళ్లతో గీరి రక్తం వచ్చిన ఆనవాళ్లు. అరచేతులు, చేతివేళ్లు కోసుకుపోయాయి. తల కణతపై కొడితే కనుగుడ్లు బయటకు వచ్చేశాయి. శరీరం మీద గట్టిగా నొక్కడంతో రక్తం గడ్డకట్టి నల్లగా అయిన ఆనవాళ్లు. గొంతుకోసి చంపేశారు."
ఆసిఫాబాద్ సామూహిక అత్యాచారం, హత్య తరువాత బాధితురాలి (ప్రభుత్వం బాధితురాలి పేరును 'సమత'గా మార్చింది. అందుకే ఆమె పేరును సమతగా సంబోధిస్తున్నాం) శరీరం ఇలా కనిపించింది. తన భార్య శరీరాన్ని చూసిన ఆ భర్త కళ్లల్లో ఇప్పటికీ ఆ దృశ్యం చెదరలేదు. ఘటన జరిగిన 15 రోజుల తరువాత ఆయన భార్య ఏ పరిస్థితుల్లో దొరికిందో వివరిస్తూ బీబీసీ తెలుగుతో చెప్పిన మాటలివి.
"ఆమె అసలు ఆడమనిషి శరీరంగానే కనిపించలేదు. నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు సమత అత్త.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
తెలంగాణలోని నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన భార్యాభర్తలు కొంత కాలంగా ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలోని ఓ గ్రామంలో ఉంటున్నారు. ఇంటింటికీ తిరిగి బుడగలు, ఆడవారి హెయిర్ పిన్నులు వంటి వస్తువులు అమ్మడం, తల వెంట్రుకలు తీసుకుని వాటి బదులు స్టీలు సామాను అమ్మడం వారి కుటుంబ వృత్తి.
జైనూరు, లింగాపూర్ పరిసర గ్రామాల్లో రోజుకు ఒకటో రెండో ఊళ్లకు వెళ్లి వస్తువులు అమ్ముకుంటారు. వ్యాపారానికి అనుకూలంగా ఉంటుందని, ఆరేళ్ల నుంచి తమ పిల్లలిద్దర్నీ ఖానాపూర్ లోని తమ తల్లితండ్రుల దగ్గర వదిలి, జైనూరులో గది తీసుకుని ఉంటున్నారు ఈ భార్యాభర్తలు. రోజూ భర్త, తన భార్యను ఒక ఊరిలో వదలి, తను మరో ఊరు వెళ్లి మధ్యాహ్నానికో, సాయంత్రానికో తన పని ముగించుకుని, భార్య దగ్గరకు వెళ్లి ఆమెను బండి ఎక్కించుకుని ఇంటికి చేరుకుంటారు.
నవంబర్ 24 ఉదయం అలానే సమతను ఒక గ్రామం దగ్గర వదిలారు ఆమె భర్త.
"ఆరోజు ఉదయం ఆరు గంటలకు బయటకు వచ్చి టీ తాగి జైనూరు నుంచి 25 కి.మీ. దూరంలోని గ్రామానికి వెళ్లాం. పది, పదిహేను రోజలకొకసారి ఒక ఊరు చొప్పున వెళ్తాం. 6.30 గంటల ప్రాంతంలో ఆమెను దించి నేను వెనక్కి 10 కి.మీ. దూరంలో ఉన్న వేరే ఊరికి వెళ్లాను. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆమె కోసం వెళ్లాను. ఫోన్ స్విచాఫ్ అని వచ్చింది. ఆ ఊరు వెళ్లి ఒక మహిళను అడిగితే 10.30కే వెళ్లిపోయింది అన్నారు. వేరే ఊరిలో చూశాను. ఆ పక్క ఊరిలోనూ చూశాను. ఎక్కడా లేదు. మేం ఉండే రూంకి ఫోన్ చేశాను.. అక్కడికీ రాలేదన్నారు. మళ్లీ మొదట దించిన ఊరికే వెళ్లాను. పదిన్నరకే వెళ్లిపోయిందని చెప్పారంతా. ఆమె కనిపిస్తే చెప్పండని నా నంబర్ ఇచ్చి, జైనూర్ వచ్చి సామాన్ల సంచి ఇంట్లో పెట్టి మరొకరిని తోడు తీసుకెళ్లి వెతికాను. జాడ లేదు. నేను లేకుండా ఎక్కడకూ వెళ్లదు ఆమె. ఇక వెతికి వెతికి మా తమ్ముడికి ఫోన్ చేశాను. వదిన కనిపించడం లేదు. మనవాళ్లను తీసుకుని రా అన్నాను" అంటూ ఆరోజు జరిగిన విషయాలు చెప్పారు సమత భర్త.
సమత సొంతూరు నుంచి వచ్చిన బంధువులు, మిత్రులు కలిసి వెతికారు. చివరకు రాత్రికి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు, బంధువులు కలిసి వెతికారు. ఒకవేళ సమతకి ఏమైనా జరిగి ఉంటే ఆమె శరీరాన్ని మాయం చేయడానికి ప్రయత్నిస్తారన్న అనుమానంతో గుంపులుగా విడిపోయి ఆ చుట్టుపక్కల ఊళ్లల్లో పహారా కాశారు.
"తెల్లారాక మళ్లీ వెతికాం. స్థానికులూ వెతికారు. ఈలోపు మా ఊరి అబ్బాయికి రోడ్డుపై చెప్పు కనిపించింది. రోడ్డు పక్కన కిందవైపు సామాన్ల సంచి ఉంది. ఇంకా కింద చెట్ల మధ్య శరీరం దొరికింది. అన్నా బాడీ అని అరిచాడు. అందరం అక్కడకు వెళ్లాం" అని వివరించారు సమత భర్త.

'క్రూరమైన ఘటన'
"ఒళ్లంతా నెత్తురు చేశారు. చేతులు విరిచేశారు. శరీరం మొత్తం కమిలిపోయింది. బట్టల్లేవు. పీక కోశారు. వెంట్రుకలు పీక్కుంది. గిజ గిజ కొట్టుకుంది. కానీ పీక కోసినంక ఏం చేస్తది. ఒక బొమ్మను ఆడుకున్నట్టు ఆడుకున్నారు నా కోడల్ని. అవన్నీ చూస్తే ప్రాణం ఊసిపోయింది. వెంట్రుకలు చెదిరిపోయాయి. ఆడమనిషి శరీరంలా లేదసలు. ఒక రాక్షసి శరీరంలా కనిపించింది నాకు" అంటూ కన్నీరు పెట్టుకున్నారు సమత అత్త.
బాధితురాలు సమతకు ఇద్దరు పిల్లలు. నానమ్మ దగ్గరుండి ఏడు, ఆరు తరగతుల్లో చదువుకుంటున్నారు ఆ అబ్బాయిలు. "పిల్లల్ని ఎలా పెంచాలి? ఆమె ఉండుంటే ఆ కుటుంబానికి ధైర్యం ఉండేది. ఇప్పుడా ధైర్యం లేదు" అని బాధపడ్డారు సమత అత్త.
"నా కొడుకూ కోడలూ ఎప్పుడూ కలిసే వస్తారు. ఒక్కరోజు కూడా వాళ్లు విడిగా ఎటూ వెళ్లలేదు. ఊరు మీదకు వెళ్లినప్పుడు కూడా, నా కొడుకు వచ్చే వరకూ ఆగుతది. ఆటో ఎక్కదు నా కోడలు" అంటూ కోడల్ని గుర్తుచేసుకుందామె.
"ఆమె లేకపోవడం మొత్తం లోటే. ఏం తోచడం లేదు. పిల్లలు తల్లి లేనివాళ్లైపోయారు. ఇద్దరం కలిసే పనిచేసుకునేవాళ్లం. ఆ ఏరియాలో వ్యాపారం ఎక్కువ ఉంటుంది. కానీ నేను అక్కడకి ఇక వెళ్లలేను. ఆమె జ్ఞాపకాలే వస్తాయి. నేనిక అక్కడ తిరగలేను. ఆమె ఉంటే కుటుంబాన్ని కాపాడుకునేది" అంటూ భార్యను గుర్తు చేసుకున్నారు భర్త.

ఇవి కూడా చదవండి.
- ఆసిఫాబాద్ అత్యాచారం, హత్య: ‘అది ఆడమనిషి శరీరంలానే లేదు... నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’
- ‘చిన్న పాప సార్... సెక్స్ అంటే ఏంటో తెలీదు.. అట్లాంటి బిడ్డను రేప్ చేసి చంపినారు’
- హైదరాబాద్ ‘ఎన్కౌంటర్’: సీన్ రీ-కన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు?
- పోలీసుల నిర్లక్ష్యం వల్లే మహాత్మా గాంధీ హత్యకు గురయ్యారా?
- ఉందో లేదో తెలియని యతి... నేపాల్ సర్కారును ఎలా చిక్కుల్లోకి నెట్టింది?
- కేంద్ర బడ్జెట్ 2020: గత ఏడాది హామీల సంగతేమిటి? ఈసారి బడ్జెట్ నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారు?
- కరోనావైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో...
- రాజధాని రగడ-రాజకీయ క్రీడ!: ఎడిటర్స్ కామెంట్
- రాళ్లలో దొరికే సిలికాన్.. మన జీవితాలను ఎలా మార్చేసింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









