‘చిన్న పాప సార్... సెక్స్ అంటే ఏంటో తెలీదు.. అట్లాంటి బిడ్డను రేప్ చేసి చంపినారు’

పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, UGC

    • రచయిత, హృదయ విహారి బండి
    • హోదా, బీబీసీ కోసం

'దిశ'ను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులు ఎన్కౌంటర్ లో మరణించినట్టు పోలీసులు వెల్లడించిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో #JusticeForSugaliPreethi హ్యాష్‌ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆ బాధిత కుటుంబాన్ని కలిసి సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ వేలాదిమంది సోషల్‌మీడియాలోనూ పోస్ట్‌లు పెడుతున్నారు.

ఇంతకీ ఎవరీ సుగాలి ప్రీతి? ఆమెకు న్యాయం చేయాలని ట్వీట్లు ఎందుకు హోరెత్తుతున్నాయి?

రెండేళ్ల కిందట 2017 ఆగస్టు 18న కర్నూలులోని ఒక స్కూల్ హాస్టల్లో పదో తరగతి విద్యార్థిని సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.

శవపరీక్ష చేసిన వైద్యులు 'ఆ బాలిక గర్భాశయ ద్వారం మానవ వీర్యంతో నిండిపోయింది. చనిపోయే ముందు ఆమెతో సెక్స్ జరిపారు. మెడపై తాడుతో బిగించిన గుర్తులున్నాయి' అని రిపోర్ట్ ఇచ్చారు. కానీ, స్కూలు యాజమాన్యం మాత్రం అది ఆత్మహత్య అని పేర్కొంది.

అయితే, ప్రీతి తల్లిదండ్రులు మాత్రం స్కూలు యాజమాన్యానికి సంబంధించిన కుటుంబ సభ్యులు అంటే తండ్రి, ఇద్దరు కుమారులు... ముగ్గురూ రేప్ చేసి చంపారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ముగ్గురిపై హత్యానేరం సెక్షన్ 302, పోక్సో యాక్ట్ 2012, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి, సంఘటన జరిగిన 30 రోజుల తర్వాత నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

నిందితుల్లో మూడో వ్యక్తి, నిందిత కుటుంబ పెద్ద ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. అరెస్ట్ అయిన ఎనిమిది రోజుల తర్వాత ముగ్గురు బెయిల్‌పై విడుదలయ్యారు.

చంద్రబాబు

ఫొటో సోర్స్, UGC

'చికెన్ చేసి తీసుకొస్తా అన్నాను.. మరుసటే రోజే చంపేశారు'

రాజకీయంగా, ఆర్థికంగా పలుకుబడి ఉన్న స్కూలు యాజమాన్యం, కేసును తప్పుదోవపట్టిస్తోందని ప్రీతి తల్లి పార్వతి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయమై గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయంటున్న ప్రీతి తల్లిదండ్రులతో బీబీసీ మాట్లాడింది.

''ఆగస్టు 17 మధ్యాహ్నం మూడు గంటలకు ప్రీతి నాకు ఫోన్ చేసింది. ఆరోజు చాలా డల్‌గా మాట్లాడింది. ఎందుకట్లున్నావ్ అని అడిగితే, స్కూల్లో వ్యాక్సిన్ వేశారని చెప్పింది. 'అమ్మా... నువ్వు ఎప్పుడొస్తావ్!' అని అడిగితే, ఆదివారం నీకోసం చికెన్ చేసి తీసుకొస్తా అన్నాను. కానీ మరుసటి రోజే నా బిడ్డను చంపేసినారు'' అని పార్వతి అన్నారు.

కర్నూలు పట్టణంలోని ఈఎస్ఐ కార్యాలయంలో పార్వతి అటెండర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త రాజు నాయక్, 'మీసేవ' కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. వీరి కుటుంబం కర్నూలులోనే ఉంటున్నా, పిల్లల చదువుకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని అదే ఊళ్లోని స్కూల్ హాస్టల్‌లో పెద్దకూతురు ప్రీతితోపాటు, చిన్న కొడుకును కూడా చేర్పించారు.

పార్వతికి చిన్నప్పుడే పోలియో రావడంతో, ఆమె సరిగా నడవలేరు. తన వైకల్యం ప్రభావం, పిల్లల పెంపకంపై ఉండకూడదని ఆమె తాపత్రయం.

''మరుసటిరోజు మధ్యాహ్నం 12గంటలకు పెద్దయ్య అనే ఒక కేర్ టేకర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. అమ్మాయి కళ్లు తిరిగిపడిపోయిందని చెప్పాడు. మా ఆయన వెంటనే స్కూలుకు వెళ్లారు. కొంతసేపటి తర్వాత ఇంకో ఫోన్ వచ్చింది. మీ పాప ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్పినారు. నాకేమీ అర్థం కాలేదు. నేను వికలాంగురాలిని. ఒక కాలు పనిచేయదు. స్కూల్ రెండో అంతస్తులో పాప ఉరివేసుకుంది. నేను పైకి ఎక్కలేకపోయాను'' అని పార్వతి చెప్పారు.

ప్రీతి తల్లిదండ్రులది ప్రేమవివాహం. పిల్లలను బాగా చదివించాలన్న ఆలోచన మినహా, తమకు బయటి ప్రపంచం తెలియదని పార్వతి అన్నారు. ప్రీతి మూడో తరగతి నుంచి అదే స్కూల్లో చదువుతోంది.

సుగాలి ప్రీతి
ఫొటో క్యాప్షన్, ప్రీతి గర్భాశయం జెల్లీ లాంటి జిగురు పదార్థంతో నిండివుందని డా.శంకర్ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ తెలిపింది.

'చిన్నపాప సార్... రేప్ చేసి చంపినారు'

''చిన్నపాప సార్... సెక్స్ అంటే ఏంటో తెలీదు. అట్లాంటి పసిపాపను రేప్ చేసి చంపినారు. నా బిడ్డ యోనిలో మానవ వీర్యం ఉందని డాక్టర్లు రిపోర్ట్ ఇస్తే, ఆ డాక్టర్లు తప్పుడు నివేదికలు ఇచ్చారని అధికారులు చెబుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినపుడు, ఆయనకు పోస్ట్‌మార్టమ్ చేసిన డా.శంకర్, ప్రీతికి కూడా పోస్ట్‌మార్టమ్ చేసి రిపోర్ట్ ఇచ్చారు. అప్పటినుంచి ఆయనను కూడా వేధిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చేసిన పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ కరెక్ట్ అయితే, మా పాపకు చేసిన రిపోర్ట్ ఎట్లా తప్పు అయితుంది?'' అని ప్రశ్నించారు పార్వతి.

ప్రీతి గర్భాశయం జెల్లీ లాంటి జిగురు పదార్థంతో నిండివుందని డా.శంకర్ పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ తెలిపింది. ఈ విషయాల్లో మరింత స్పష్టత కోసం, డా.శంకర్ రిపోర్ట్‌తోపాటు ప్రీతి శరీరం నుంచి సేకరించిన కొన్ని నమూనాలను కర్నూలు మెడికల్ కాలేజ్‌ పాథాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ బాలేశ్వరికి పంపారు. ఆమె కూడా ఈ నమూనాలను పరిశీలించి, 'ఆ జిగురు పదార్థం మానవ వీర్యమే! గర్భాశయం మొత్తం మానవ వీర్యంతో నిండిపోయింది. తల, బాడీ, తోకతో సంపూర్ణంగా తయారైన మానవ వీర్యకణాలను ఆమె గర్భాశయంలో గుర్తించాం' అని ప్రొఫెసర్ బాలేశ్వరి రిపోర్ట్ ఇచ్చారు.

''చనిపోవడానికి సరిగ్గా పదిరోజులు ముందు, రాఖీ పండగకు ప్రీతి ఇంటికి వచ్చింది. ఇంక ఆ హాస్టల్‌లో ఉండను. కరెస్పాండెంట్, ఆయన ఇద్దరు కొడుకులు నన్ను సతాయిస్తున్నారని నాతో చెప్పుకుంటూ ఏడ్చింది. ఇంట్లోనే ఉండి స్కూలుకు పోతాను కానీ, ఆ హాస్టల్‌కు మాత్రం నన్ను పంపొద్దు అని బాగా ఏడ్చింది. మేం హాస్టల్ ఇన్ఛార్జ్‌కు ఫోన్ చేస్తే, మీ అమ్మాయి తెల్లవారుజామున నిద్రలేవడం లేదు, అది తప్పించుకోవడానికి అట్ల చెప్పింది అన్నారు. ఏదో నచ్చజెప్పి ప్రీతిని మళ్లీ హాస్టల్‌కు పంపినాం. అంతే, మళ్లీ నా బిడ్డను ప్రాణాలతో చూడలేదు'' అని ప్రీతి తండ్రి రాజు నాయక్ బీబీసీతో అన్నారు.

సుగాలి ప్రీతి
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

'రూ.2 కోట్లు ఇస్తామన్నారు'

వైద్యుల నివేదికలను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించడంలేదని పార్వతి దంపతులు చెబుతున్నారు.

ఫైవ్ మెన్ కమిటీ, త్రీమెన్ కమిటీ, ఎక్స్‌పర్ట్స్ కమిటీల పేర్లతో రెండేళ్లు గడిపారని, కేసును నీరుగార్చేందుకు నిందితులు ప్రయత్నిస్తున్నారని ఆ తల్లిదండ్రులు బీబీసీతో అన్నారు.

''నా బిడ్డపై సామూహికంగా అత్యాచారం చేశారు. తన యుటరస్ వీర్యంతో నిండిపోయింది. రేప్ చేసినారు. ప్రీతి చనిపోయిన మరుసటి రోజే రూ.60 లక్షల రూపాయలు తీసుకుని కేసు విత్ డ్రా చేసుకోవాలని నన్ను అడిగినారు. మేము వద్దన్నాం. నువ్వు వికలాంగురాలివి, మీ ఆయనకు మంచి ఉద్యోగం లేదుకదా, ఎంతకాలమని నువ్వు పోరాడతావు? వాళ్లిచ్చే డబ్బులు తీసుకుని గమ్మునుండు అని చాలామంది చెప్పినారు. ఇప్పుడు రూ. 2 కోట్లు ఇస్తామంటున్నారు. కన్నతల్లిని, నేను కూడా డబ్బులు తీసుకుంటే, చనిపోయి యాడుందో నా బిడ్డ... ఇంక అది ఎవర్ని నమ్మల్ల సార్!'' అంటూ పార్వతి కన్నీంటి పర్యంతమయ్యారు.

''నా బిడ్డను ఎవరికి ఎర వేసినారో, అది ఎవరికింద నలిగిందో? ఆ క్షణంలో ఎంతబాధ పడివుంటుంది సార్. అమ్మా... అని నన్ను తలుచుకునివుంటుంది! ఇంక ఏ బిడ్డ కూడా ప్రీతి మాదిరి కాకూడదు. నా కూతురే నా ధైర్యం. నేను చచ్చిపోయినా సరే, నన్ను చంపినా సరే... వాళ్లకు ఉరి పడేంతవరకూ అవిటితనంతోనే పోరాడతాను'' అని పార్వతి చెప్పారు.

సుగాలి ప్రీతి

ఫొటో సోర్స్, UGC

'సీన్ ఆఫ్ అఫెన్స్‌లో ఆధారాలు సేకరించలేదు'

''పోలీసులు సీఆర్పీసీ 174ను ఫాలో కాలేదు. సీఆర్పీసీ 174 ప్రకారం, బాడీని తరలించేముందు క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్స్ నిపుణులు, పోలీస్ డాగ్స్‌, డెత్‌ను ధ్రువీకరించడానికి వైద్యులను కూడా పిలవాలి. కానీ ఇవేవీ జరగలేదు. ఇవన్నీ చేయకుండా, సీఐ మహేశ్వర రెడ్డి, ప్రీతి డెడ్ బాడీని మార్చురీకి తరలించారు'' అని రిటైర్డ్ లెక్చరర్, రాయలసీమ ఉద్యమకారుడు బాలసుందరం బీబీసీతో అన్నారు.

అయితే, ప్రీతి చనిపోయినపుడు స్కూల్లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోవడంతో, శాంతిభద్రతల దృష్ట్యా, మృతదేహాన్ని వెంటనే మార్చురీకి తరలించాల్సి వచ్చిందని సీఐ మహేశ్వర రెడ్డి బీబీసీకి వివరణ ఇచ్చారు.

ప్రీతి శరీరం నుంచి డా.శంకర్ సేకరించిన స్లైడ్స్, శ్వాబ్స్, రక్త నమూనాలను, ప్రీతి ఒంటిపై ఉన్న బట్టలను డీఎన్ఏ పరీక్ష నిమిత్తం హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ (ఎఫ్ఎస్ఎల్)కు పంపారు. కానీ, తమకు అందిన నమూనాల్లో పురుషుడి వీర్యం లేదని, ఈ ఆధారాలతో ప్రీతిపై అత్యాచారం జరిగినట్లు చెప్పలేమని ఎఫ్ఎస్ఎల్ నుంచి రిపోర్ట్ వచ్చింది.

ప్రీతిపై అత్యాచారం జరగలేదని, ఆమెది హత్య కాదు, ఆత్మహత్య అని డా.లక్ష్మినారాయణ సభ్యుడిగావున్న ఎక్స్‌పర్ట్స్‌ కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాత, పోలీసులు చార్జ్‌షీట్ ఫైల్ చేశారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక, ఎక్స్‌పర్ట్స్ నివేదిక తర్వాత, ఈ కేసులోని నిందితులపై హత్యానేరం, పోక్సో చట్టం కింద నమోదు చేసిన సెక్షన్లను తొలగించి, ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.

ఈ పరిణామాలతో ఆందోళన చెందిన ప్రీతి తల్లిదండ్రులు, కేసును సీబీఐకు అప్పగించాలని మానవహక్కుల కమిషన్‌ను కోరారు. స్పందించిన కమిషన్, కేసును సీబీసీఐడీకి అప్పగించాలని ఆదేశించింది. సీబీసీఐడీ అధికారులు కూడా సక్రమంగా దర్యాప్తు చేయలేదని, అసలు తమను సంప్రదించనేలేదని ప్రీతి తల్లిదండ్రులు చెబుతున్నారు.

తమకు న్యాయం చేయాలని, వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డిని కూడా తాము ఎన్నోసార్లు సంప్రదించామని పార్వతి దంపతులు చెబుతున్నారు. స్పందించిన జవహర్ రెడ్డి, ముగ్గురు సభ్యులతో ఓ కమిటీ వేశారని, వారు కూడా ప్రీతిపై అత్యాచారం జరగలేదని, ఆమెది ఆత్మహత్య అని నివేదిక ఇచ్చినట్లు బాలసుందరం తెలిపారు.

''సీబీసీఐడీ వల్ల ఒరిగిందేమీలేదు. నిజాయతీగా పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్ ఇచ్చిన డా.శంకర్‌పై తప్పుడు ఆరోపణలు చేసి, ఆయన్ను సస్పెండ్ చేయించారు. తిరిగి, డా.శంకర్ గురించి మేమే పోరాడాం. ఆయన్ను తిరిగి సర్వీస్‌లోకి తీసుకున్నారు'' అని బాలసుందరం అన్నారు.

సుగాలి ప్రీతి

ఫొటో సోర్స్, TWITTER

ఫొటో క్యాప్షన్, గత కొన్నిరోజులుగా #JusticeForSugaliPreethi అనే హ్యాష్‌ట్యాగ్ ట్విటర్‌లో టాప్ ట్రెండ్‌లో ఒకటిగా నిలిచింది.

'తండ్రీకొడుకులు కలసి రేప్ చేస్తారా?'

''ప్రీతి నాకు తెలుసు. ఆమె మా స్కూల్‌లోనే చదివేది. గతంలో కూడా ఆమె ఓసారి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ప్రపంచంలో ఏ తండ్రీకొడుకులైనా కలసి రేప్ చేస్తారా? మేం ఏ తప్పూ చేయలేదు. అందుకే మాకు అపరాధ భావం లేదు. అందరూ ఏకపక్షంగా ప్రీతి తల్లిదండ్రులనే సమర్థిస్తున్నారు. మా లాయర్ అనుమతి లేకుండా నేను ఇంతకంటే ఎక్కువగా మాట్లాడలేను'' అని నిందితుల్లో ఒకరు బీబీసీతో మాట్లాడారు.

ఆ తర్వాత, నిందితుల తరపు న్యాయవాది నాగేశ్వర్ రెడ్డితో బీబీసీ మాట్లాడింది.

''డా.శంకర్ ఇచ్చింది ప్రాథమిక రిపోర్ట్‌. అందులో రేప్ జరిగిందని డాక్టర్ చెప్పలేదు. అందుకే వారికి త్వరగా బెయిల్ వచ్చింది. అసలు, తండ్రీకొడుకులు కలిసి రేప్ చేశారని కేసు పెట్టడం ఏమిటి? వాళ్ల కుటుంబం కూడా ఆ స్కూల్ కాంపౌండ్‌లోనే ఉంటుంది. వారి భార్యాపిల్లలు అందరూ అక్కడే ఉంటారు. అలాంటిది ఈ తండ్రీకొడుకులు కలసి రేప్ చేస్తారా? ప్రీతిది పూర్తిగా ఆత్మహత్యే'' అని నాగేశ్వర్ రెడ్డి బీబీసీకి వివరించారు.

''ఈ కమిటీలన్నింటినీ పైస్థాయిలోనే మేనేజ్ చేస్తున్నారు. మేము ఇన్నిసార్లు ధర్నాలు చేస్తున్నా, ముఖ్యమంత్రి స్పందించడం లేదు. ఇక ఏంచేయాలో దిక్కుతోచక, పవన్ కల్యాణ్‌ను కలిశాం. ఆయన సానుకూలంగా స్పందించారు. సోషల్ మీడియాలో కూడా ప్రీతి విషయం ట్రెండ్ అవుతూ, ఇండియాలో టాప్ సెర్చ్‌గా ఉంది. అధికారులు, కమిటీల ద్వారా మాకు న్యాయం జరగలేదు. ఎక్స్‌పర్ట్స్ కమిటీ నివేదికను రద్దు చేయాలి'' అని బాలసుందరం అన్నారు.

''అగ్రకులానికి చెందిన 'దిశ' విషయంలో అందరూ స్పందించినారు. సుగాలీ బాలికను రేప్ చేసి చంపితే, ఏ ఒక్కరూ స్పందించలేదు. నిందితులు నిమ్నకులాలకు చెందితే ఎన్‌కౌంటర్ చేస్తారు. అదే నిందితులు అగ్రకులానికి చెందితే వదిలేస్తారా? ఈ కేసులోని నిందితుల నుంచి ప్రీతి తల్లిదండ్రులకు కూడా ముప్పు పొంచివుంది. ఎన్‌కౌంటర్ చేయమని మేము అడగడంలేదు, మాకు న్యాయం చేయండి. అగ్రకులాల పిల్లల మానప్రాణాలకే విలువ ఉంటుందా? మా పిల్లల మానప్రాణాలకు విలువ లేదా?'' అని బాలసుందరం ఆగ్రహం వ్యక్తం చేశారు.

''కళ్లు మూసుకుంటే, ఆ క్షణంలో నా బిడ్డపడిన బాధ గుర్తొస్తుంది. రాత్రిళ్లు మేలుకుని, క్రిమినల్ చట్టం, ఫోరెన్సిక్ సైన్స్‌కు సంబంధించి ఎన్నో పుస్తకాలు చదివేదాన్ని. ఆ స్కూల్లో ఎంతమంది అమ్మాయిలను వేధించారో, లొంగదీసుకున్నారో? పిల్లల భవిష్యత్తు ఏం కావాలి?'' అని పార్వతి అన్నారు.

ఈ వార్తలో తన బిడ్డ పేరు మార్చడానికి ఆమె ఇష్టపడలేదు.

''నా బిడ్డ పేరు మార్చొద్దు. ఎందుకు మార్చల్ల సార్? 'సుగాలి ప్రీతి' అనే రాయండి. అందరికీ తెలియల్ల... సుగాలి ప్రీతికి జరిగింది ఇంకెవ్వరికీ జరక్కూడదని. నా కూతురే నాకు స్ఫూర్తి. నేను వికలాంగురాలినే కానీ బలహీనురాలిని కాదు'' అని ఆమె అన్నారు.

ఈ కేసు గురించి మరింత సమాచారం కోసం కర్నూలు ఎస్పీ, డీఎస్పీ వినోద్ కుమార్, ప్రస్తుత దర్యాప్తు అధికారి రమాదేవిని కూడా బీబీసీ సంప్రదించింది. కానీ, కేసు కోర్టులో ఉండటంతో వారు మాట్లాడేందుకు ఇష్టపడలేదు. ఏదైనా కావాలంటే డీజీపీని కలవాలని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రమాదేవి సూచించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ప్రీతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఒక మహిళా అడిషనల్ ఎస్పీని దర్యాప్తు అధికారిగా నియమిస్తూ రాష్ట్ర హోంశాఖ మంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు.

ఇదివరకే చార్జిషీట్ దాఖలు చేసి, విచారణ దశలోని ఓ కేసును కోర్టు అనుమతితో మళ్లీ దర్యాప్తు చేయడానికి ఆదేశించడం జరిగింది అని డిసెంబర్ 9, 2019న కర్నూలు ఎస్పీ డా.ఫక్కీరప్ప ట్విటర్‌లో తెలిపారు.

(సుగాలి ప్రీతి తల్లిదండ్రులు తమ బిడ్డ పేరును మార్చవద్దని బీబీసీని కోరారు. ఇందుకు సంబంధించి లిఖితపూర్వక అనుమతిని బీబీసీకి ఇచ్చారు. వారి కోరిక మేరకు బాధితురాలి అసలు పేరునే కథనంలో పేర్కొన్నాం.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)