పానిపట్ సినిమా వివాదం: 'అతడి నీడ పడిన చోట మృత్యువు కాటేస్తుంది'

ఫొటో సోర్స్, PAnipat film
పద్దెనిమిదో శతాబ్దంలో జరిగిన ఓ యుద్ధంపై ఇప్పుడు ట్విటర్ వేదికగా యుద్ధం జరుగుతోంది.
శుక్రవారం విడుదలైన 'పానిపట్' సినిమాలో అఫ్గాన్ నాయకుడు 'అహ్మద్ షా అబ్దాలీ' పాత్ర పోషించిన బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ''అతడి నీడ పడిన చోట మృత్యువు కాటేస్తుంది'' అంటూ రాశారు.
సినిమా విడుదలకు ముందు సంజయ్ దత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆ చిత్రంపై ఆసక్తి పెంచడానికి బదులు దాదాపు ఒక అంతర్జాతీయ వివాదానికి దారి తీసినంత పనిచేసింది. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలంటే అభిమానించే ఒక దేశ ప్రజలంతా ఆగ్రహించడానికి కారణమైంది.

ఫొటో సోర్స్, AFP
అఫ్గానిస్తాన్ ప్రజల ఆగ్రహానికి అసలు కారణమేంటి?
పానిపట్ సినిమాలో.. ఒక భారతీయ సామ్రాజ్యం, అబ్దాలీ నేతృత్వంలోని అఫ్గాన్ సైన్యం మధ్య 1761లో జరిగిన యుద్ధ కథను చెప్పారు.
ట్రైలర్ చూసినప్పుడు సినిమా ప్రారంభం నుంచి శుభం కార్డు పడేవరకు ఆసక్తికరంగా సాగేలా అనిపించింది.
అయితే, ఇది ఎంతోకొంత వివాదమవుతుందని అప్పుడే అనుకున్నారు... అఫ్గానిస్తాన్‌లో అబ్దాలీని హీరోగా కొలుస్తారు. ఆ దేశ జాతి పిత ఆయన. కానీ, భారత్‌లో మాత్రం అబ్దాలీ అంటే తమపై దండెత్తి లక్షలాది మంది మరాఠా యోధులను పానిపట్ యుద్ధంలో హతమార్చిన క్రూరుడు. దిల్లీకి సమీపంలో 1761లో ఈ యుద్ధం జరిగింది.

ఫొటో సోర్స్, Twitter/sanjayDutt
ఈ సినిమాను 2017లో ప్రకటించినప్పుడే దీనిపై వివాదం మొదలైంది. ముంబయిలోని అఫ్గాన్ కాన్సులేట్ నేరుగా భారత సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వద్ద ఈ విషయం ప్రస్తావించింది.
''అఫ్గాన్ ప్రజల హృదయాలు, మనసుల్లో అహ్మద్ షా అబ్దాలీపై అపారమైన గౌరవం ఉంది'' అని ముంబయిలోని అఫ్గానిస్తాన్ కాన్సుల్ జనరల్ నసీమ్ షరీఫీ అన్నారు.
ఈ సినిమాను నిర్మిస్తున్నప్పుడే దానిని చూసే అవకాశం కల్పించాలని కోరామని, కథను బయటపెట్టబోమని చెప్పామని, అయినా చిత్ర బృందం నుంచి మాకు ఎలాంటి సమాధానం రాలేదని నసీమ్ చెప్పారు.
అయితే, సంజయ్ దత్ ఈ చిత్రంలో తన పాత్ర ఫొటోతో ట్వీట్ చేయగానే అఫ్గాన్ ప్రజల ఆగ్రహం మొదలైంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
''అతడు క్రూరుడు.. దట్టమైన కోటు వేసుకుంటాడు. అబ్దాలీ అలాంటివారు కాదు. ఆహార్యం నుంచి ఆంగిక, వాచక, ఆహార్యాల్లో ఎక్కడా అఫ్గాన్‌లా లేదు.. పానిపట్‌లోని సంజయ్ దత్ పాత్రను ఒక అరబ్‌లా చూపించార''ని అఫ్గానిస్తాన్‌కు చెందిన బ్లాగర్ ఇలాహా వలీజాదె 'బీబీసీ'కి చెప్పారు.
బాలీవుడ్‌తో బంధం
గుండె దిటవున్న, దేశభక్తుడైన అఫ్గాన్ కథానాయకుడిగా అమితాబ్ బచ్చన్ నటించిన ఖుదాగవా నుంచి తరతరాలుగా అఫ్గాన్లు బాలీవుడ్ సినిమాలను చూస్తూ పెరిగారు.
తాలిబన్ల అంధయుగంలోనూ ఎంతోమంది శరణార్థులకు బాలీవుడ్ సినిమాలే సంతోషం, జీవితంపై ఆశకు ఆధారంగా నిలిచాయి.
అఫ్గాన్ ప్రజలు తమ వివాహ వేడుకల్లో బాలీవుడ్ సినిమా పాటలే వేసి ఆడిపాడతారు. బాలీవుడ్ సినిమాల్లోని డైలాగులంటే పడి చస్తారు. చాలామంది ఆ సినిమాలు చూసి హిందీ కూడా నేర్చుకున్నారు.

ఫొటో సోర్స్, VIACOM18 MOTION PICTURES
'పద్మావత్'పై ఆగ్రహం
కానీ, 2018లో వచ్చిన పద్మావత్ వంటి సినిమాలతో వారిలో బాలీవుడ్‌పై కొంత అసంతృప్తి మొదలైంది.
ఆ సినిమాలో రణవీర్ సింగ్ 12వ శతాబ్దంలో దిల్లీని పాలించిన అల్లాఉద్దీన్ ఖిల్జీ పాత్ర పోషించాడు. ఖిల్జీ టర్కీ-అఫ్గాన్ పాలకుడు.
ఈ సినిమాకు భారత్‌లో ప్రశంసలు దక్కినా ఖిల్జీని క్రూర, దుర్మార్గ పాలకుడిగా చూపించడం చాలామంది అఫ్గాన్ ప్రజలకు నచ్చలేదు.

ఫొటో సోర్స్, TWITTER.COM/AKSHAYKUMAR
'కేసరి'పై విమర్శలు
అనంతరం ఈ ఏడాది(2019)లో వచ్చిన 'కేసరి' కూడా అఫ్గాన్లకు ఆగ్రహం కలిగించింది.
బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి చెందిన 21 మంది సిక్కు సైనికులకు, 10 వేల మంది అఫ్గాన్ సైన్యానికి మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా రూపొందించారు.
దండయాత్రలు చేసి బలవంతంగా భూమిని లాక్కున్నవారిగా అఫ్గాన్లను ఒక మూస ధోరణిలో చూపించారంటూ ఈ సినిమాపై విమర్శలొచ్చాయి.
ఇలాంటి సినిమాలతో ఆవేదనకు గురైనవారు తమలాంటి వారితో సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో కనెక్టవుతూ అసంతృప్తిని పంచుకుంటున్నారని వలీజాదె చెప్పారు.
గతంలో అఫ్గాన్లు హిందీ సినిమాలను ఉత్తేజంతో చూసేవారు కానీ ఇప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారు. అఫ్గాన్లను తప్పుగా చూపించడమనేది ప్రపంచంలో చాలాచోట్ల ఉన్నదే కానీ బాలీవుడ్‌తో అఫ్గాన్లకు ఉన్న అవినాభావ సంబంధం కారణంగా వారు ఇలాంటిది కోరుకోవడం లేదు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ముస్లింలను ప్రతినాయక పాత్రల్లో చూపించే బాలీవుడ్ సినిమాలు పెరుగుతుండడాన్ని భారత్‌లో పాలక బీజేపీ వైఖరికి అనుకూలంగా మసలుకోవడానికి బాలీవుడ్ నిర్మాతలు చేస్తున్న ప్రయత్నంగా విమర్శకులు పేర్కొంటున్నారు.
''బాలీవుడ్‌కు ఉన్న నిగూఢ శక్తిని వాడుకోవడం తెలిసిన హిందూ ఆధిక్య పార్టీ మనకి ఉంది'' అని హఫింగ్టన్ పోస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎడిటర్ అంకుర్ పాఠక్ అన్నారు.
''ప్రధాన మంత్రి బాలీవుడ్ అగ్ర నటులతో సెల్ఫీలు దిగడం, వారితో ఇష్టాగోష్ఠులు ఏర్పాటుచేయడం కానీ.. జాతి నిర్మాణాన్ని చూపించేలాంటి బాలీవుడ్ చిత్రాలను ప్రోత్సహించడం వెనుక కానీ బీజేపీ, మోదీ ఆలోచనలకు తగినట్లుగా భారతదేశాన్ని సానుకూలంగా చూపించే చిత్రాలను నిర్మించేలా పైకికనిపించని ప్రోత్సాహం అందించడం ఉంది. ఇది చాలా ప్రమాదకర ధోరణి అని పాఠక్ అన్నారు.
''ఏ వర్గాన్నైనా తప్పుగా చూపించడం తీరని నష్టం కలిగిస్తుంది. ప్రస్తుత వాతావరణంలో దీన్నుంచి బయటపడాల్సిన అవసరం ఉంద''ని పాఠక్ అన్నారు.
పానిపట్ చిత్ర దర్శకుడు అశుతోష్ గోవరికర్ ఈ వాదనలన్నిటినీ కొట్టిపారేశారు.
ఆన్‌లైన్ చానల్ ఫిల్మ్ కంపేనియన్‌తో మాట్లాడిన అశుతోష్ ''ఈ సినిమా హిందూ-ముస్లింల గొడవకు సంబంధించింది కాదు. దండయాత్రకు వచ్చినవారిని అడ్డుకోవడానికి సంబంధించిన కథ ఇది. సరిహద్దులను, భూమిని కాపాడుకోవడం.. దేశభక్తి ప్రధానమైన సినిమా ఇది. ఆ క్రమంలో అబ్దాలీ దండయాత్రకు వచ్చినట్లు చూపించాం.. అదే సమయంలో అబ్దాలీ పాత్ర హుందాతనానికి భంగం కలిగించలేదు' అన్నారు.
అయితే, అఫ్గానిస్తాన్ ప్రధానికి సలహాదారుగానూ వ్యవహరించే కాన్సుల్ జనరల్ షరీఫీ మాత్రం రెండు దేశాలకు చెందిన నిపుణులతో సినిమా విడుదలకు ముందే సమీక్షించాలని గతంలోనే ప్రతిపాదించారు.
ఇవి కూడా చదవండి:
- ‘డియరెస్ట్ మోదీజీ... దక్షిణాది సినీ కళాకారులకు స్థానం లేదా?’ - ఉపాసన కొణిదెల
- బ్రిటన్ ఎన్నికల్లో కశ్మీర్ అంశం ప్రభావం చూపుతుందా?
- అమితాబ్ @77: అగ్ర నటుడి జీవితంలోని కొన్ని ఆసక్తికర విశేషాలు
- ది జోకర్: నవ్వించాల్సినవాడు ఇంత విలన్ ఎందుకయ్యాడు
- ఆ అందమైన అలవాటు వేణుమాధవ్‌కు ఉండేది: ఎల్బీ శ్రీరాం
- అమితాబ్ బచ్చన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు... అసలు ఎవరీ ఫాల్కే, ఈ అవార్డు ఎందుకిస్తారు
- ప్రభాస్ సాహో: ‘తెలుగు దర్శకులారా.. కాపీ కొట్టినా, సరిగ్గా కొట్టండి’ - లార్గో వించ్ డైరెక్టర్ తాజా ట్వీట్
- ప్రభాస్ సాహో సినిమాపై లార్గో వించ్ డైరెక్టర్ ఏమన్నారు? అభిమానులు ఎలా స్పందించారు? మధ్యలో అజ్ఞాతవాసిని ఎందుకు తెచ్చారు?
- జేమ్స్ బాండ్ చెడ్డవాడా? ఇప్పుడు మంచివాడిగా మారుతున్నాడా...
- "తెలంగాణలో లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి": ఆదివాసీల హక్కుల పోరాట సమితి
- చిన్న వయసులో ఫిన్లాండ్ ప్రధాని పదవి చేపట్టనున్న సనా మారిన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








