"తెలంగాణలో లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి": ఆదివాసీల హక్కుల పోరాట సమితి

- రచయిత, రాజేశ్ పెదగాడి
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ తొమ్మిది గిరిజన తెగలు దిల్లీలో నిరసన చేపట్టాయి.
''ఛలో దిల్లీ'' పేరుతో రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఆదివాసీల హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ), యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆదివాసీ (యూఎఫ్‌ఏ), ఆదివాసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ (ఏఈడబ్ల్యూసీఏ) సంయుక్తంగా చేపట్టాయి.
''అస్థిత్వ పోరాటం'' పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్, కాగజ్‌నగర్‌ల నుంచి ప్రత్యేక రైళ్లలో గిరిజనులు దిల్లీకి తరలివచ్చినట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ కిశోర్ కుమార్ తెలిపారు.
ఒక్క తెలంగాణ నుంచే 20,000 మంది హాజరయ్యారని ఆయన వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచీ గిరిజనులు వచ్చినట్లు పేర్కొన్నారు.

మహారాష్ట్రలో బీసీలు..
లంబాడాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మరో 33 జాతులు ఎస్టీ జాబితాలో ఉన్నాయి. గోండు, ప్రధాన్, కోలి, తోటి, నాయక్పోడ్, ఆంద్ లాంటివి వీటిలో ప్రధానమైనవి.
లంబాడాలు మాత్రం మహారాష్ట్రలో బీసీలు. తెలంగాణలో ఎస్టీలు.
1976లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెంగళ్‌రావు హయాంలో లంబాడాలను మొదటిసారిగా ఎస్టీ జాబితాలో చేర్చారు.
సాంస్కృతికంగా, భాషాపరంగా, కట్టుబొట్టు, రూపురేఖల పరంగా మిగిలిన ఆదివాసీలకు లంబాడాలకు తేడా ఉంటుంది.

''పదేళ్లలో పది లక్షల మంది పెరిగారు''
''1971 జనాభా లెక్కల ప్రకారం.. లంబాడాల జనాభా 1.32 లక్షలు మాత్రమే. కానీ ఒక్క దశాబ్దంలోనే వారి జనాభా 11 లక్షలకుపైనే అయిపోయింది. అక్రమంగా ఎస్టీ రిజర్వేషన్ హోదా కోసం భారీగా లంబాడాలు తెలంగాణకు వలస వచ్చారు''అని యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆదివాసీ కోఆర్డినేటర్ చెంచు రామకృష్ణ అన్నారు.

''అందుకే వారిని తొలగించాలి''
''ఎస్సీ, ఎస్టీల జాబితా సవరణ సమయంలో రాజ్యాంగంలో ఆర్టికల్ 342 పూర్తిగా ఉల్లంఘనకు గురైంది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు జాబితాలో ఉన్నవి మా తొమ్మిది తెగలే'' అని ఏఈడబ్ల్యూసీఏ ప్రతినిధి ఎం.శ్రీనివాస్ చెప్పారు.
''రాష్ట్రపతి నోటిఫికేషన్, అసెంబ్లీ తీర్మానం, ట్రైబల్ అడ్వైజరీ కమిటీ లాంటివేమీ లేకుండానే లంబాడాలకు రిజర్వేషన్లు కల్పించారు. అందుకే లంబాడాలను ఎస్సీ, ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని మేం డిమాండ్ చేస్తున్నాం'' అని ఆయన బీబీసీకి వివరించారు.

''అన్ని విధాలుగా నష్టపోయాం''
''సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగాల్లో మిగతా ఆదివాసీలకు ఎంతో అన్యాయం జరుగుతోంది. తెలంగాణలో అసలైన గిరిజనులందరూ అడవుల్లోనే ఉంటారు. ప్రధాన రహదారుల పక్కన వారు కనిపించరు. స్థానిక రిజర్వేషన్ల ప్రకారం షెడ్యూల్ ప్రాంతాల్లోని ఉద్యోగాలు స్థానిక గిరిజనులకే ఇవ్వాలి. అయితే మేం కూడా అడవుల్లోనే ఉంటున్నామని చెబుతూ వలస వచ్చినవారు ఆ ఉద్యోగాలను దోచుకుంటున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, పీహెచ్‌డీ స్కాలర్‌షిప్‌లు ఇలా అన్నింటిలోనూ వారే ఉంటున్నారు. 65ఏళ్లలో వారు ఎంత ముందుకు వెళ్లారో.. మేం అంత వెనక్కు వెళ్లిపోయాం. మేం అన్ని విధాలుగా నష్టపోయాం'' అని ఎం.శ్రీనివాస్ అన్నారు.

''నష్టం లేదా అన్యాయం అనే మాటలు దీనికి సరిపోవు. తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలను పరిశీలిస్తే వెయ్యి మంది లంబాడాలు ఉంటే కేవలం పది మందే మా ఆదివాసీలు ఉంటున్నారు. కొన్ని తెగలయితే యూనివర్సిటీ గుమ్మం కూడా తొక్కలేదు. ప్రాథమిక విద్య కూడా దారుణమైన పరిస్థితిలో ఉంది'' అని కిశోర్ కుమార్ అన్నారు.

రాజకీయ దురుద్దేశంతోనే ఈ నిరసనలు: లంబాడీ హక్కుల పోరాట సమితి
రాజకీయ దురుద్దేశాలతోనే కొందరు ఇలాంటి నిరసనలను వెనకుండి నడిపిస్తున్నారని లంబాడీ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు తెజావత్ బెల్లయ్య నాయక్ వ్యాఖ్యానించారు. బీబీసీతో ఆయన మాట్లాడారు.
''1971లో తెలంగాణలోని లంబాడాలను డీనోటిఫైడ్ ట్రైబ్స్ (డీఎన్‌టీ) గిరిజనుల జాబితాలో ఉన్నారు. 1981 జనాభా లెక్కల్లో మమ్మల్ని ఎస్‌టీల కిందకు తీసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా పది లక్షల వరకు జనాభాలో పెరుగుదల కనిపించింది. మహారాష్ట్ర నుంచి వలస వచ్చాం అనడంలో అర్థంలేదు.
రాజ్యాంగంలో నిబంధనలను ఉల్లంఘించి హక్కులు పొందాం అనడం సరికాదు. ఐదు పరామితులను అనుసరించి ఓ తెగకు ఎస్టీ హోదా కల్పిస్తారు. వాటికి అనుగుణంగా మాకు హోదా ఇచ్చారు.
జనాభా ప్రకారం చూస్తే.. తెలంగాణ గిరిజనుల్లో లంబాడాల వాటా 70 శాతం వరకు ఉంది. అందుకే వారి శాతం విద్య, ఉద్యోగాల్లో కాస్త ఎక్కువగా కనిపిస్తుంది. జనాభా ప్రాతిపదికన చూస్తే గోండు, కోయ లాంటి గిరిజనుల ప్రాతినిథ్యం ఉండాల్సిన దానికంటే ఎక్కువే ఉంది'' అని ఆయన అన్నారు.


ఇవి కూడా చదవండి.
- అండమాన్ సెంటినల్: ఆ ఆదివాసీలను బయట ప్రపంచంలోకి తీసుకొచ్చినపుడు ఏమైంది?
- అమెజాన్ ఆదివాసి తెగ: బ్రెజిల్ ప్రభుత్వంతో పోరాడుతున్న ఈ తెగ జనాభా 120 మాత్రమే
- చెలమలో నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం నడుస్తున్న గిరిజన మహిళలు
- భారత్‌లో 10 లక్షల గిరిజన కుటుంబాలను అడవుల నుంచి పంపించేస్తున్నారు.. ఎందుకు?
- 'గోల్డెన్ పాస్‌పోర్టుల' కోసం సంపన్నులంతా ఎందుకు ఎగబడుతున్నారు?
- దిల్లీ అగ్నిప్రమాదం: ‘ముగ్గుర్ని కాపాడా.. కానీ, నా సోదరుడిని కాపాడుకోలేకపోయా’
- ఎడిటర్స్ కామెంట్: వందేళ్ల రష్యా అక్టోబర్ విప్లవం తెలుగు సమాజానికి ఏం చేసింది?
- ‘#StopTeluguImposition’: తెలుగు భాషను తమపై రుద్దవద్దని తమిళులు ఎందుకు అంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









