హైదరాబాద్ ‘ఎన్‌కౌంటర్’: సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ అంటే ఏంటి? ఎందుకు చేస్తారు?

దిశ అత్యాచారం, హత్య కేసులోని నలుగురు నిందితులు శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ శివారులోని చటాన్ పల్లి బ్రిడ్జి వద్ద ‘ఎన్‌కౌంటర్’లో చనిపోయినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ చెప్పారు.
సీన్ రీ-కన్‌స్ట్రక్షన్‌లో భాగంగా నిందితులు దిశను దహనం చేసిన స్థలంలోకి తీసుకెళ్లగా, వారు తప్పించుకొని పోలీసులపై దాడి చేశారని, ఈ క్రమంలోనే కాల్పులు జరిపినట్లు ఆయన తెలిపారు.
11 ఏళ్ల కిందట 2008లో వరంగల్‌లోనూ ఇదే తరహా ఘటన జరిగింది. అప్పుడు బీటెక్ విద్యార్థులు స్వప్నిక, ప్రణీతలపై యాసిడ్ దాడి కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు యువకులను సీన్ రీ-కన్‌స్ట్రక్షన్‌కు తీసుకెళ్లాక, నిందితులు తమ నుంచి ఆయుధాలు లాక్కొని దాడి చేయడానికి ప్రయత్నించారని, ప్రతిదాడిలో తాము కాల్పులు జరపడంతో వారు చనిపోయారని పోలీసులు వెల్లడించారు.
ఇలా చాలా కేసుల్లోనూ సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ అనే మాట వార్తల్లో వస్తుంటుంది. అసలు సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ అంటే ఏమిటి? ఎందుకు చేస్తారు? దాని వల్ల ఉపయోగమేంటి?

"సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ అంటే... ఆ నేరం ఎలా చేశారు? అన్నది తెలుసుకోవడం. ఉదాహరణకు ఒక దొంగతనం జరిగిందనుకోండి. ఆ దొంగలు దొరికిన తర్వాత వారిని పోలీసులు దొంగతనం జరిగిన ప్రదేశానికి తీసుకెళ్తారు. అప్పుడు.. ‘ఇలా ఈ గోడ దూకాము, ఇంట్లోకి వెళ్లేసరికి వాళ్లు నిద్రపోతూ ఉన్నారు. నేను ఇంట్లోని ఆ బీరువాను తెరిచాను, దాంట్లో ఇంత బంగారం ఉంది. ఇన్ని నగలు దొరికాయి’ అంటూ దొంగలు పోలీసులకు ప్రత్యక్షంగా చూపించడం. మొత్తం ఎక్కడెక్కడ ఏం చేశారు? ఏమేమి వస్తువులను చోరీ చేశారు? అన్న విషయాలు చెబుతూ... పూర్తి నేరం ఎలా జరిగిందో మళ్లీ చేసి చూపించడం... దానినే సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ అంటారు" అని తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై. గోపిరెడ్డి బీబీసీకి వివరించారు.
ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటని అడిగినప్పుడు... కేసు దర్యాప్తును పక్కాగా చేసేందుకు, కోర్టుకు సరైన ఆధారాలు సమర్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు.
"నిందితులు చెప్పకపోతే ఆ సంఘటన ఎలా జరిగిందన్నది పక్కాగా చెప్పలేం. పోలీస్ స్టేషన్‌లో విచారించినప్పుడు నిందితులు అబద్ధాలు చెబుతుండొచ్చు. అలాంటప్పుడు, వాళ్లు చెప్పిన విషయాలు, సంఘటనా స్థలంలో చూసినవి ఒకేలా ఉన్నాయా? అని పోలీసులు పోల్చి చూస్తారు. దాని వల్ల ఉపయోగం ఏంటంటే... కోర్టుకు ఎక్కువ ఆధారాలను సమర్పించేందుకు వీలుంటుంది" అని గోపిరెడ్డి వివరించారు.
"సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ అనేది చట్టంలోనే ఉంది. కేసును పక్కాగా దర్యాప్తు చేసేందుకు నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకుంటారు. అందులో భాగంగానే ఈ సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేస్తారు" అని ఆయన చెప్పారు.

దిశ కేసులో సీన్ రీ-కన్‌స్ట్రక్షన్‌లో ఏం జరిగింది?
దిశ కేసులో సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ గురించి సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మీడియాకు వివరించారు.
"నలుగురు నిందితులను మా కస్టడీలోకి తీసుకున్న తర్వాత విచారించాం. అప్పుడు వాళ్లు చాలా విషయాలు చెప్పారు. బాధితురాలి ఫోన్‌తో పాటు, మరికొన్ని వస్తువులను కూడా ఇక్కడ (నేరం జరిగిన ప్రదేశంలో) పాతిపెట్టామని చెప్పారు. దాని ప్రకారం, వాళ్లను ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజామున పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చారు. మొదట ఆ వస్తువులను అక్కడ పెట్టాం, ఇక్కడ పెట్టామని చెప్పారు. తర్వాత నలుగురూ పోలీసుల మీద రాళ్లు రువ్వారు, కర్రలతో పాటు, ఇతర వస్తువులతో మా పోలీసుల మీద దాడి చేశారు. అలాగే, పోలీసుల దగ్గర నుంచి రెండు ఆయుధాలను కూడా లాక్కొని కాల్పులు ప్రారంభించారు. సరెండర్ అవ్వాలని హెచ్చరించినా వాళ్లు వినకపోవడంతో పోలీసులు వాళ్ల మీద కాల్పులు జరిపారు" అని సజ్జనార్ చెప్పారు.
పోలీసుల ఆయుధాలను నిందితులు ఎలా ఉపయోగించుకోగలిగారు?
మొత్తం పది మంది పోలీసులు ఈ నలుగురు నిందితులను సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ కోసం చటాన్ పల్లికి తీసుకొచ్చారని, ఏ1, ఏ4 నిందితులు పోలీసుల దగ్గర ఉన్న ఆయుధాలను లాక్కొన్నారని సజ్జనార్ చెప్పారు.
అయితే, నిందితులకు బేడీలు లేవా? పోలీసుల ఆయుధాలను నిందితులు ఎలా ఉపయోగించగలిగారు? అని ప్రశ్నించగా.. సజ్జనార్ సమాధానం ఇస్తూ.. నిందితులకు బేడీలు వేయలేదని, ఆయుధాలు అన్‌లాక్ చేసి ఉన్నాయని, ఆయుధాలను ఉపయోగించడం నిందితులకు తెలుసునని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- షాద్ నగర్ అత్యాచారం-హత్య: ‘ప్లీజ్ పాపా, కొంచెం సేపు మాట్లాడు, దెయ్యంలా వెంటపడిండు... నాకు భయం అయితాంది’
- షాద్ నగర్ అత్యాచారంపై రేణూ దేశాయి: ‘‘ఒక తల్లిగా నేను చేయగలిగింది.. నా కూతుర్ని భయంతో పెంచడమేనా?’’
- ‘దిశ’ అత్యాచారం: "నాకు చాలా బాధేసింది.. ఆ బాధితురాలు కూడా సాటి ఆడదే" - ఓ నిందితుడి భార్య ఆవేదన
- జయాబచ్చన్: 'అలాంటి నేరగాళ్లను బహిరంగంగా కొట్టి చంపాలి’
- బిల్లా, రంగా ఎవరు.. వాళ్లను ఉరి తీయాలని దేశమంతా ఎందుకు కోరుకుంది...
- హైదరాబాద్ రేప్ ఎన్‌కౌంటర్: ఒకవైపు హర్షాతిరేకాలు.. మరోవైపు అనాగరికం అంటూ విమర్శలు
- గద్దర్: ‘తెలంగాణ ప్రభుత్వంలో టెంపరరీ పోస్టుకు అప్లికేషన్ పెట్టుకున్నాను’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








