షాద్ నగర్ అత్యాచారం-హత్య: ‘ప్లీజ్ పాపా, కొంచెం సేపు మాట్లాడు, దెయ్యంలా వెంటపడిండు... నాకు భయం అయితాంది’

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్ శివార్లలోని షాద్ నగర్ వద్ద వెటర్నరీ డాక్టర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి, హత్య చేసి, శవాన్ని కాల్చేశారు. గురువారం ఉదయం ఔటర్ రింగ్ రోడ్ చింతపల్లి గ్రామ శివార్లలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గర్తించారు.
ఈ ఘటనతో సంబంధం ఉందని భావిస్తున్న నలుగురు నిందితులను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. "ఈ ఘటన చాలా హేయమైనది, ఆమె తన సోదరికి ఫోన్ చెయ్యకుండా 100 నంబరుకు కాల్ చేసి ఉండాల్సింది. 100కు కాల్ చేసి ఉంటే ఆమెను రక్షించగలిగి ఉండేవాళ్లం" అని ఆయన అన్నారు.
బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి శంషాబాద్‌లోని వారి ఇంటికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను ఇంటి నుంచి బయటకు వెళ్లనీయకుండా అక్కడ ఉన్న స్థానికులు అడ్డుకున్నారు. బాధితురాలి హత్యకు న్యాయం చెయ్యాలని, దోషులను ఉరితియ్యాలని వాళ్లు డిమాండ్ చేశారు.

మృతురాలు పశు వైద్యురాలు. నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం నర్సాయపల్లి ఆమె సొంతూరు. ఈ కుటుంబం శంషాబాద్‌లో నివాసం ఉంటోంది.
మృతురాలు బుధవారం సాయంత్రం గచ్చిబౌలి వెళ్ళారు. బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయల్దేరి శంషాబాద్ దగ్గర తొండుపల్లి టోల్ ప్లాజాకి కాస్త దూరంలో బండి పెట్టి అక్కడి నుంచి క్యాబ్‌లో వెళ్లారు. రాత్రి 9 గంటల సమయంలో తిరిగి ప్లాజా దగ్గరకు వచ్చారు.
అప్పుడే మృతురాలితో ఆమె సోదరితో ఫోన్లో మాట్లాడింది. ఆ సంభాషణను సోదరి రికార్డ్ చేసింది. తిరిగి రాత్రి 9.44 ప్రాంతంలో సోదరి మళ్లీ కాల్ చేయగా, ఫోన్ స్విచాఫ్ అయి ఉంది. అప్పుడు కుటుంబ సభ్యులు టోల్ ప్లాజాకు వెళ్లారు. రాత్రంతా వెతికి అర్థరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కేసు నమోదయింది. గురువారం తెల్లవారుజామున షాద్ నగర్ దగ్గర్లో స్థానికులు కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించారు. ఉదయం అక్కడకు చేరిన బంధువులు, గొలుసు, చున్నీ ఆధారంగా ఆ మృతదేహం డాక్టర్‌దేనని గుర్తించారు. పోలీసులు అక్కడే పోస్టుమార్టం పూర్తి చేయించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

బాధితురాలు తన సోదరికి చెప్పిన కథనం ప్రకారం, ఒక లారీ డ్రైవర్ ఆమె దగ్గరకు వచ్చి మీ బండి పంక్చర్ అయిందనీ, తాను బాగు చేయిస్తాననీ అన్నాడు. అవసరంలేదు తానే పంక్చర్ షాపుకు వెళ్తానన్నప్పటికీ తాను సాయం చేస్తానంటూ తీసుకెళ్లాడు. దీంతో అతనికి దూరంగా టోల్ ప్లాజా దగ్గర నిలబడమని బాధితురాలికి సోదరి సూచించగా, ఆమె నిరాకరించారు. అందరూ చూస్తారని భయపడింది. కాసేపటికి ఫోన్ స్విచాఫ్ అయింది.
ఉదయం ఏడు గంటలకు షాద్ నగర్ పోలీసులకు మృతదేహం గురించి సమాచారం వచ్చింది. పోల్చి చూడగా అది రాత్రి మిస్ అయిన కేసుకు సంబంధించినదే అని తేలింది.
"ప్రస్తుతానికి ఎటువంటి ఆధారాలూ లభించలేదు. నిందితుల కోసం గాలిస్తున్నాం. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. శరీరం ఆమెదే అని చున్నీ ఆధారంగా బంధువులు గుర్తించారు" అని బీబీసీతో చెప్పారు శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి.
గురువారం సాయంత్రం మృతురాలి అంత్యక్రియలు పూర్తయ్యాయి.

ఫొటో సోర్స్, UGC
చనిపోయేముందు మృతురాలికి, ఆమె సోదరికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ:
బాధితురాలు: పోయావా పాపా ఆఫీస్‌కి.
సోదరి: హా.
బాధితురాలు: నాదిప్పుడు అయిపోయింది. వచ్చినా ఇప్పుడు.
సోదరి: హా.
బాధితురాలు: మాట్లాడు.. కొంచెం సేపు మాట్లాడు.
సోదరి: ఏమైందే.
బాధితురాలు:మాట్లాడు పాపా నీకు తర్వాత చెప్తా.
సోదరి: యాక్సిడెంట్ అయిందా? చెప్పు.
బాధితురాలు:నాకు చాలా టెన్షన్ గా ఉందే.
సోదరి: యాక్సిడెంట్ అయిందా?
బాధితురాలు: అక్కడ ఎప్పుడూ బైక్ పెట్టి పోతానని చెప్పినా కదా. ఆ రోజు అక్కడ పెట్టిన, నిలబడ్డ. టోల్ కలెక్ట్ చేసేటాయన పిలిచి ఇక్కడ బైక్ పెట్టకండి మేడమ్, ఇంతకు ముందే పోలీసువాళ్లు తీసుకొనిపోయిన్రు అంటే.. ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఇంకొక దారి ఉంటుంది కదా, అక్కడ పెట్టాను. ఇప్పుడు దిగి వచ్చాను పాపా ఇక్కడికి. స్కూటీ పంక్చర్ అయింది.

సోదరి: మరి వదిలేసి రా. ఇంకేంటి?
బాధితురాలు: వదిలేస్తే ఎట్ల, మల్ల పొద్దున ఎవరు తీసుకొస్తరే?
సోదరి: ఇంక రేపొద్దున్న ఎవరినైనా తీసుకెళ్లి చేయించి తీసుకురావాలి.
బాధితురాలు: ఎవర్ని తీసుకెళ్లాలి?
సోదరి: మెకానిక్‌ని.
బాధితురాలు: మెకానిక్ నా?
సోదరి: అవును మెకానిక్‌ని. కొంచెం దూరం కూడా పోదానె పంక్చర్ అయితే? చూడాలి వస్తందేమో.
బాధితురాలు: వెనకాల టైర్.
సోదరి: నాకు తెలీదు కదా.
బాధితురాలు: అయితే.. చెప్తా విను. ఇక్కడొక లారీ ఉందే. అందులో జనాలు ఉన్నారు. అందులో ఒకాయన నేను చేయించుకొస్తా అని తీసుకొని పోయిండు స్కూటీ.
సోదరి: తీసుకురాలేదా మళ్లీ స్కూటీ?
బాధితురాలు: తీసుకొచ్చిండు. క్లోజ్ ఉంది షాప్ అని తీసుకొచ్చింది. మళ్లీ ఇంకో షాప్‌కు పోయి చేయించుకొస్తా అని తీసుకెళ్లిండు. భయం అయితాంది పాపా నాకు.
సోదరి: ఎవరూ లేరా అక్కడ?
బాధితురాలు: వెహికల్స్ ఉన్నాయి. టోల్ ఉంటాది చూడూ.. ఆడ. నేను వెళ్తా అంటే వద్దు నేనే వెళ్తా అని దెయ్యంలా వెంట పడిండు. వద్దు మధ్యలో ఆగిపోతోంది అన్నాడు. నాకు భయం అయితాంది పాపా.
సోదరి: ఎందుకు? ఏమైతుంది? ఉండు అక్కడ, టోల్ గేట్ దగ్గర.
బాధితురాలు:వాళ్లు బయటనే నిలబడిండ్రు.
సోదరి: ఎవరు?
బాధితురాలు: లారీస్ వాళ్లు.
సోదరి: నువ్వు, టోల్ గేట్ ఉంటుంది కదా.. అక్కడికి వెళ్లి నిలబడు.
బాధితురాలు: అక్కడకా? నువ్వు మాట్లాడు పాపా.. భయం అయితాంది.
సోదరి: టోల్ ప్లాజా దగ్గర ఇస్తారు కదా టికెట్లు.. అక్కడికెళ్లు, అక్కడికెళ్లి నిలబడు.
బాధితురాలు: వీళ్లేంటే.. సడెన్‌గా ఎవరూ కనిపస్తలేరు.
సోదరి: దెయ్యాల్లా ఈడనే ఉన్నరు అంతసేపు.
బాధితురాలు: కనిపించిన్రులే. నేను పోతున్నా పాపా.. ఎక్కి స్టార్ట్ చేసిన. కిందికొచ్చి.. మేడమ్ మేడమ్ టైర్ పంక్చర్ అయిందని. బస్టాండ్ వరకూ వెళ్లదా.. బస్టాండ్ దగ్గర షాప్ ఉంటదే, అక్కడ చేయించుకుంటా అంటే, లేదు మేడమ్ వద్దు మేడమ్ నేను చేయించుకొస్తా అని ఎవడో ఒక పిలగాడ్ని పంపించిండు. ఆ దెయ్యం పిలగాడు పోయిండు. ఉత్తగ వచ్చిండు. సర్లేండి మళ్లీ ఎక్కడో ఇంకొక షాప్ ఉందని చెప్పిండు. ఇంక లేట్ అవుతోంది నేను వెళ్తా అంటే.. లేదు మేడమ్, మధ్యలో ఆగిపోతే ఇబ్బంది అవుతుంది. కష్టం అవుతుందని దయ్యాల్లాగా నా వెంట పడిండ్రే.
సోదరి: నిజంగానే సడెన్‌గా మధ్యలో ఆగిపోతే అప్పుడేం చేస్తావ్?
బాధితురాలు: నాకు ఇక్కడ చాలా భయం అయితాంది.
సోదరి: టోల్ గేట్ దగ్గరకు వెళ్లి నిలబడు.
బాధితురాలు: ఆ టోల్ బూత్ దగ్గర ఏం నిలబడాలే. అందరూ నన్నే చూస్తారు. ఆడ నిలబడితే.
సోదరి: చూస్తే చూడనీ.. కాస్త జనాలైనా ఉంటారు కదా ఆడ.
బాధితురాలు: చాలా భయం అవుతోంది వాల్లను చూస్తుంటే.
సోదరి: టోల్ బూత్ దగ్గరకు వెళ్లు. వెల్లి ఆడ నిలబడు.
బాధితురాలు: ఏడుపొస్తోందే..
సోదరి: సరే, అంత లేటుగా వెళ్లడం అవసరమా.
బాధితురాలు: లేటు కాదే తల్లి.
సోదరి: సరేమరి. మళ్లీ చేస్తా.
బాధితురాలు: భయం అయితాంది పాపా. ఇంకా తీస్కరాలేదే.. దెయ్యం ముసుగోడు.
సోదరి: తీసుకొస్తడు లే.
బాధితురాలు: నాకు ఇక్కడ అస్సలు నిలబడాలనే లేదు.
సోదరి: వెళ్లు టోల్ గేట్ దగ్గరికి. టోల్ గేట్ దగ్గరికి వెళ్లి నిలబడు.
బాధితురాలు: అక్కడ నిలబడితే అందరూ చూస్తరు వచ్చేటోళ్లు.. పోయేటోళ్లు.
సోదరి: చూడనీ.
బాధితురాలు: నువ్వు కొంచేపు మాట్లాడు పాపా బైక్ వచ్చే వరకు. టెన్షన్ అయితాంది.
సోదరి: ఇంక బైక్ వచ్చే వరకు నేను ఇక్కడ కూసుని మాట్లాడుకుంటే, ఆళ్ళు ఏమనుకుంటారు?
బాధితురాలు: ఐదు నిమషాలు.. ఇట్ల చేసావేమే దెయ్యం పిల్ల నువ్వు? రోడ్డు మీద ఉంటే..
సోదరి: ఎగబడి ఎగబడి ఇంత రాత్రి పూట పోవడం అవసరమా మరి?
బాధితురాలు: మరి ఒక పనైపోయింది కదా పాపా నాకు.
సోదరి: పనైపోయిందంటే.. అంత ఇంపార్టెంటా? రేపు పోకూడదా?
బాధితురాలు: రేపు ఇన్‌స్పెక్షన్.. మీటింగ్ అని చెప్పిన్రు మాకు.
సోదరి: సరేలే మళ్లీ కొంచెంసేపైన తర్వాత చేస్తా.
బాధితురాలు: మళ్లీ ప్రతి సండేనో, మండేనో టెంపుల్‌కి తీసుకుపోతున్నారు. అస్సలు కుదురుతనే కుదురుతలేదు. నాకు వాళ్లను చూస్తుంటే చాలా భయంగా ఉందే.. ఈ దయ్యం పిల్లగాడు ఇంకా రాలేదు.
సోదరి: సరే కొంచెంసేపైన తర్వాత మళ్లీ చేస్తా.
బాధితురాలు: (ఏడుస్తూ..) ప్లీజ్ పాపా..
సోదరి: సరే కొంచెంసేపైన తర్వాత చేస్తా.

ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/gettyimages
పోలీసు వర్గాలు చెబుతున్న వివరాల ప్రకారం..
బుధవారం సాయంత్రం 6.19 నిమిషాలకు ఇంటినుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు మృతురాలు బయలుదేరింది. టోల్ గేట్ ప్రక్క రోడ్డులో స్కూటీని పార్క్ చేసి మాదాపూర్‌కు బయలు దేరింది.
సాయంత్రం 7 గంటలకు మాదాపూర్‌లోని బ్యూటీ సెలూన్‌కు వెళ్లింది. తిరిగి రాత్రి 8.30 గంటల ప్రంతంలో సెలూన్ నుంచి బయలుదేరింది.
దాదాపుగా 9.15 నిమిషాలకు శంషాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు చెరుకుంది.
రాత్రి 9.45 నిమిషాల వరకు కూడా మృతురాలి ఫోన్ ఆన్‌లోనే ఉందని పోలీసులు గుర్తించారు.
మృతురాలిని ఫాలో చేసిన చేసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనూమానిస్తున్నారు.
టోల్ గేట్ ప్రక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతంలోకి ఆమెను బలవంతంగా తీసుకుని వెళ్లినట్లు సీసీటీవీ రికార్డు లభించినట్లు తెలుస్తోంది.
అక్కడ అత్యాచారం చేసి చంపినట్లుగా భావిస్తున్నారు.
రాత్రి పన్నెండు తరువాత మృతదేహాన్ని దుప్పట్లతో చుట్టి, ఆమె స్కూటీపైనే హైవేపైన అండర్ పాస్ వరకూ తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు.
ఈ క్రమంలో హైవేలోని పెట్రోల్ బంకులో పెట్రోల్ కొనుగొలు చేసినట్లుగా గుర్తించారు.
ఉదయం 4.30 సమయంలో మృతదేహాం కాలిపొతున్నట్లుగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అర్థరాత్రి పన్నెండు గంటల ప్రాంతం వరకు మృతురాలి కొసం గాలించిన కుటుంబ సభ్యులు.. పన్నెండు గంటల సయమంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సైబరాబాద్ పోలీసు కమిషనర్ బీబీసీతో ఏమన్నారంటే..
‘‘మాకు దొరికిన మెటీరియల్ ఎవిడెన్స్ ఆధారంగా చూస్తే రేప్ జరిగినట్టే భావిస్తున్నాం. కానీ, అప్పుడే చెప్పలేం. దొరికాక చెప్పగలం. ఇంకా ఎవరినీ పట్టుకోలేదు. మా దగ్గర అనుమానితులు ఎవరూ లేరు. ఎవరో కావాలని పుకారు లేపారు. మొత్తం పది బృందాలు ఏర్పాటు చేశాం. అనేక కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నాం. లారీ వాళ్లు, ఆ చుట్టుపక్కల వాళ్లే ఈ పని చేశారనే అనుమానం ఉంది మాకు’’ అని బీబీసీతో చెప్పారు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్.

ఫొటో సోర్స్, twitter/TelanganaDGP
‘ప్రమాదంలో ఉన్న మహిళలు, అమ్మాయిలు ఈ హెల్ప్‌లైన్ నంబర్లను గుర్తుంచుకోండి’
‘ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు, మీ ఆత్మస్థైర్యమే మీకు రక్షణ’ అని తెలంగాణ డీజీపీ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
‘‘అనుకోని ప్రమాదంలోగానీ, చిక్కుల్లోగానీ ఇరుక్కుంటే అధైర్యపడకండి. ధైర్యంగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉంటూ వేగంగా కదలండి, వీటన్నింటికంటే ముందుగా పరిస్థితులను చురుగ్గా అర్థం చేసుకోవడం ప్రధానం’’ అని రాసి ఉన్న ఒక పోస్ట్‌ను ఆ ట్వీట్‌లో జత చేశారు.
ప్రమాదంలో ఉన్న బాధితుల ఆసరా, రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వివిధ హెల్ప్ లైన్ నెంబర్లకు తమ సమాచారాన్ని అందించడం చాలా ముఖ్యమని, ‘ఈ నెంబర్లను మీ మొబైల్ ఫోన్లలో సేవ్ చేసుకోండి’ అని తెలిపారు.
- విద్యార్థులపై వేధింపులు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే పోకిరీలపై ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో 100 నెంబర్ అందుబాటులో ఉంది. అలాగే షీ టీం ల్యాండ్ లైన్ నెంబర్ 0402785235 కు గానీ, వాట్సాప్ నెంబర్ 9490616555 కు గానీ కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
- అలాగే దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ఫ్రీ నెంబర్లు 112, 100, 1090, 1091 లలో ఏదో ఒక దానికి ఫోన్ చేసి తాము ప్రమాదంలో ఉన్న సమాచారాన్ని అందించి, రక్షణ పొందండి.
అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 28 షీ టీమ్‌ల ఈమెయిల్ ఐడీలు, వాట్సాప్ నెంబర్లను కూడా తెలంగాణ డీజీపీ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- వెటర్నరీ డాక్టర్ సోదరి: ‘నేను కానీ, అక్క కానీ 100కి కాల్ చేయలేకపోవటానికి కారణం ఏంటంటే..’
- షాద్‌నగర్ అత్యాచారం, హత్య: నిందితులకు 14 రోజుల రిమాండ్.. జైలుకు తరలించిన పోలీసులు
- వెటర్నరీ డాక్టర్ సోదరి: ‘‘ప్రపంచం ఇంత క్రూరంగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు’’
- ‘కొత్త రకం మోసం’: శిక్షణ అని చెప్పి ముక్కూమొహం తెలియని వ్యక్తితో పెళ్లి చేసేశారు
- రేప్, డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు ఈమెకు యోగా ఎలా ఉపయోగపడింది
- ఆర్టీసీ కార్మికులు రేపటి నుంచి విధుల్లోకి చేరవచ్చు, యూనియన్లను నమ్మి మోసపోకండి: కేసీఆర్
- నాడూ, నేడూ.. పొలాల్లోనే పాఠశాల... చెట్ల కింద స్పెషల్ క్లాసులు... ఎక్కడో కాదు ఆంధ్రాలోనే
- బాల్ ఠాక్రే నుంచి ఉద్ధవ్ ఠాక్రే: శివసేన ఎలా మారింది? ఎందుకు మారింది?
- రైల్వే పోటీ పరీక్షల్లో తెలుగే టాప్.. గతేడాది తెలుగు భాషలో పరీక్ష రాసిన 9.89 లక్షల మంది అభ్యర్థులు
- గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేస్తే డ్రగ్స్ వినియోగం పెరుగుతుందా?
- ప్రపంచ 5జీ నెట్‌వర్క్‌ను చైనా కబ్జా చేస్తోందా?
- "ఆర్టీసీ మహిళా కార్మికుల కన్నీళ్లు చూసి మా ఆవిడ ఏడ్చేసింది.. ఉబికివస్తున్న కన్నీటిని నేను ఆపుకున్నాను"
- చైనాలోని ముస్లిం శిబిరాలపై ఓ యువతి చేసిన టిక్‌టాక్ వీడియో వైరల్
- భారత ఆహారం ఘోరమన్న అమెరికా ప్రొఫెసర్.. సోషల్ మీడియాలో వాడివేడి చర్చ
- ‘మహిళల ప్రమేయంతోనే అత్యాచారాలు జరుగుతున్నాయి’ - భాగ్యరాజా
- మీ పెంపుడు కుక్కతో జాగ్రత్త... ముద్దులు పెడితే ప్రాణాలు పోతున్నాయి
- గణితశాస్త్రంతో కంటికి కనిపించని వాటిని కనుక్కోవచ్చా... అసలు గణితం అంటే ఏమిటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










