గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేస్తే డ్రగ్స్ వినియోగం పెరుగుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రియాలిటీ చెక్ టీం
- హోదా, బీబీసీ న్యూస్
అమెరికా అధ్యక్ష పదవి కోసం పోటీ చేసే అవకాశం కోసం తలపడుతున్న డెమొక్రటిక్ పార్టీ నేతల మధ్య.. గంజాయిని చట్టబద్ధం చేసే అంశం మీద తీవ్ర భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. టెలివిజన్లలో ప్రసారమైన వీరి చర్చల్లో ఈ అంశం నిప్పు రాజేసే అంశంగా మారింది.
డెమొక్రటిక్ పార్టీ రేసులో ప్రస్తుతం ముందంజలో ఉన్న జో బిడెన్.. ఎటువైపూ మొగ్గటం లేదు. అమెరికా వ్యాప్తంగా గంజాయిని చట్టబద్ధం చేయటానికి ముందు.. గంజాయి వాడకం అనేది ఇతర డ్రగ్స్ (మాదకద్రవ్యాల)ను వినియోగించటానికి ఒక 'మార్గం'గా పనిచేస్తుంది అనేందుకు మరిన్ని ఆధారాలు కావాలని ఆయన అంటున్నారు.
''నేను దేశవ్యాప్తంగా దీనిని చట్టబద్ధం చేయటానికి ముందు.. దీని వెనుక ఉన్న శాస్త్రీయ విజ్ఞానం గురించి మరిన్ని వివరాలు మనకు తప్పక తెలియాలని కోరుకుంటున్నా'' అని ఆయన చెప్పారు.
అయితే.. కోరీ బుకర్, కమలా హ్యారిస్ వంటి ఇతర డెమొక్రటిక్ నేతలు ఈ వైఖరిని తప్పుపట్టారు. దీనికి సంబంధించిన ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయని.. గంజాయిని చట్టబద్ధం చేయాలని వారు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గంజాయిని చట్టబద్ధం చేయటానికి మద్దతిస్తున్న సెనెటర్ బుకర్.. ఇలా చట్టబద్ధం చేయటాన్ని వ్యతిరేకిస్తున్నట్లు బిడెన్ చెప్పినపుడు ఆయన ''మత్తులో ఉండి వుంటార''ని జోక్ చేశారు. ''మనం స్పష్టంగా చెప్పుకుందాం.. గంజాయి అనేది డ్రగ్ వినియోగానికి మార్గం కాదు.. దానిని చట్టబద్ధం చేయాలి'' అని సెనెటర్ కమలా హ్యారిస్ పేర్కొన్నారు.
బెర్నీ సాండర్స్, ఎలిజబెత్ వారెన్ వంటి ఇతర సీనియర్ డెమొక్రాట్ నాయకులు సైతం.. గంజాయి చట్టబద్ధతకు తాము మద్దతు తెలుపుతున్నామని చెప్పారు.
మరోవైపు.. ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన ఒక సర్వేలో.. గంజాయిని చట్టబద్ధం చేయాలనే వాదనకు ప్రజా మద్దతు గత దశాబ్ద కాలంలో స్థిరంగా పెరిగిందని.. ఇప్పుడు మూడింట రెండు వంతుల మంది అమెరికన్లు దీనికి మద్దతిస్తున్నారని వెల్లడైంది.
సైన్స్ ఏం చెప్తోంది?
అమెరికాలో వైద్యం కోసం గంజాయిని వాడటాన్ని 33 రాష్ట్రాలు చట్టబద్ధం చేశాయి. ఇక 11 రాష్ట్రాలు, వాషింగ్టన్ డీసీలు గంజాయిని సరదాగా వినియోగించటాన్ని చట్టబద్ధం చేశాయి. కానీ.. జాతీయ స్థాయిలో మాత్రం - గంజాయి వాడకం చట్ట వ్యతిరేకంగానే ఉంది.
మరి.. గంజాయిని చట్టబద్ధం చేయటం.. మరింత ప్రమాదకరమైన మత్తుమందులను ఉపయోగించటానికి దారితీయవచ్చు అనటానికి ఆధారం ఉందా?
అమెరికా ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆన్ డ్రగ్ అబ్యూస్ ఇలా చెప్తోంది: ''గంజాయి వినియోగం అనేది.. ఇతర చట్టబద్ధ, చట్టవ్యతిరేక మత్తుపదార్థాల వినియోగానికి దారితీసే అవకాశం ఉందని కొంత పరిశోధన సూచిస్తోంది.''
ఇందుకు జంతువుల మీద ప్రయోగాలను ఉటంకిస్తోంది. గంజాయి ఉన్న పదార్థాలను ఉపయోగించిన తర్వాత.. ఇతర మాదకద్రవ్యాల పట్ల ప్రతిస్పందన పెరిగినట్లు ఆ ప్రయోగాలు చెప్తున్నాయి.
అయితే.. ఒక్క గంజాయి వల్ల మాత్రమే ఇలా జరగటం లేదని.. మద్యం, నికొటిన్ వినియోగం వల్ల కూడా ఇదే తరహా ప్రభావం కనిపించిందని కూడా ఆ సంస్థ వెల్లడిస్తోంది. అలాగే.. గంజాయిని ఉపయోగించే ప్రజల్లో అత్యధిక శాతం మంది ఇతర, తీవ్రమైన మత్తుపదార్థాలను వినియోగించరని కూడా పేర్కొంటోంది.
జంతువుల మీద చేసిన పరిశోధన.. మద్యం, నికొటిన్, గంజాయిల రుచి చూసిన తర్వాత కొకెయిన్‌కు మెదడు స్పందించే తీరులో మార్పును చూపిస్తోందని న్యూయార్క్‌లోని మెయిల్‌మాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన డెనిస్ కాండెల్ చెప్పారు.
''గంజాయి వాడకానికి, ఇతర మాదకద్రవ్యాల వాడకానికి మధ్య స్పష్టమైన సంబంధం ఉందని నిర్ధారించటం సాధ్యం కాదు. ఎందుకంటే.. మనం నియంత్రించలేని అనేక అంశాల పాత్ర ఇందులో ఉంది'' అని ఆమె పేర్కొన్నారు.
అమెరికన్ జర్నల్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్‌లో ఇటీవల ప్రచురించిన ఒక పరిశోధన పత్రం.. ''గంజాయిని సరళీకరించటం వల్ల ఇతర మత్తుపదార్థాల వినియోగం మీద చూపే ప్రభావానికి సంబంధించిన సాక్ష్యాలు నిర్ధారితంగా లేవు. మద్యం లేదా పొగాకు వినియోగం ఎలా ప్రభావం చూపాయి అనే దాని మీద పరిమితమైన ఆధారాలే ఉన్నాయి'' అని చెప్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
గంజాయిని చట్టబద్ధం చేసిన రాష్ట్రాల్లో ఏం జరిగింది?
గంజాయిని చట్టబద్ధం చేసిన రాష్ట్రాల్లో టీనేజర్లు మాదకద్రవ్యాలను వాడటం తగ్గటమో, కనీసం స్థిరంగా ఉండటమో జరిగిందనేందుకు ఆధారం ఉంది.
అలాగే.. గంజాయిని చట్టబద్ధం చేయటం వల్ల - 26 సంవత్సరాలు, ఆపైన వయసు గల వయోజనుల్లో గంజాయి వినియోగం తగ్గటానికి బదులు పెరుగుతుందని ఒక పరిశోధన సూచిస్తోంది.
అంతేకాదు.. గాఢమైన గంజాయి రకాలను తరచుగా ఉపయోగించటానికి - మానసిక అనారోగ్యాలు - ముఖ్యంగా చిన్న వయసు వారిలో - పెరగటానికి సంబంధం ఉందనే ఆధారాలు కూడా వెలుగుచూశాయి.
వాషింగ్టన్, ఓరెగాన్, అలాస్కా, కొలరాడో రాష్ట్రాలన్నీ 2014 - 2016 మధ్య గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేశాయి. ఇలా చట్టబద్ధం చేసిన తొలి రాష్ట్రాల్లో ఇవి ఉన్నాయి. మరింత శక్తివంతమైన మాదకద్రవ్యాల వినియోగం విషయంలో ఈ రాష్ట్రాల్లో ప్రత్యేకమైన పోకడలేవైనా కనిపించాయా?
అమెరికా అధికారులు మాదక ద్రవ్యాల అధిక వినియోగం వల్ల సంభవించే మరణాల వివరాలు సేకరిస్తాయి. ఆ వివరాల ప్రకారం.. 2013-17 సంవత్సరాల మధ్య 35 రాష్ట్రాల్లో ఈ మరణాలు గణనీయంగా పెరిగాయి. ఈ 35 రాష్ట్రాల్లో అలాస్కా ఉంది. కానీ వాషింగ్టన్, కొలరాడో, ఓరెగాన్‌లు లేవు.
ఈ మరణాల్లో ఎక్కువగా.. వైద్యపరంగా ఉపయోగించే మత్తుపదార్థాలను (మెథాడోన్ మినహా) అధిక మోతాదులో తీసుకోవటం వల్ల సంభవించినవే ఉన్నాయి.
అలాస్కాను పక్కనపెడితే.. కొలరాడో, వాషింగ్టన్, ఓరెగాన్‌లలో 2013-16 మధ్య ఈ మత్తుపదార్థాల మరణాలు గణనీయంగా పెరగలేదు. గత సంవత్సరానికి సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు.
గంజాయి వినియోగం చట్టబద్ధంగా ఉన్న ఈ నాలుగు రాష్ట్రాల్లో కొకెయిన్ వినియోగానికి సంబంధించిన అంచనాలు చూస్తే.. 2013-16 సంవత్సరాల మధ్య జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉన్నాయి. అయితే.. ఈ రాష్ట్రాల్లోని మూడు రాష్ట్రాల్లో.. గంజాయి చట్టబద్ధత జరగటానికి ముందు 2012లో కూడా ఈ రేటు అధికంగానే ఉంది.
మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రభావితం చేసే.. అందుబాటులో ఉండటం, సరఫరా, చికిత్స, పునరావాస కార్యక్రమాలు, చట్టం అమలు ప్రాధాన్యతలు, సామాజిక - ఆర్థిక పరిస్థితులు వంటి అనేక విభిన్న అంశాలు ఉంటాయనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ఖచ్చితమైన నిర్ధారణలు చేయటం కష్టం.
కాబట్టి.. గంజాయిని చట్టబద్ధం చేసిన ప్రాంతాల్లో ఇతర మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించిన పోకడలను స్పష్టంగా గుర్తించటానికి ఇంకా సుదీర్ఘ కాలం పాటు పరిశోధనలు సాగించాల్సిన అవసరం ఉంది.

ఇవి కూడా చదవండి
- భారత బ్యాంకుల్లో వేల కోట్ల కుంభకోణాలు... ఈ మోసాలు ఎందుకు పెరుగుతున్నాయి
- భారత నగరాలు ప్రపంచంలోనే అత్యంత కలుషితమైనవి ఎందుకయ్యాయి
- జియో వినియోగదారుల మీద ఎందుకీ ఐయూసీ చార్జీల భారం?
- తెలంగాణ: ఆర్టీసీ చరిత్రలో చివరి సమ్మె ఇదే అవుతుందా?
- భారత ఆర్థిక వ్యవస్థలు సైబర్ దాడుల్ని తట్టుకోగలవా?
- నింజా టెక్నిక్: వ్యాసం రాయమంటే 'ఖాళీ' పేపర్ ఇచ్చిన అమ్మాయికి అత్యధిక మార్కులు.. ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








