ఊరు దాటాలంటే వాగు దాటాలి.. వాగు దాటాలంటే చెట్టు ఎక్కాలి

వీడియో క్యాప్షన్, వీడియో: పనికెళ్లే పెద్దలైనా, బడికెళ్లే చిన్నారులైనా రోజూ ఈ సాహసం చేయాల్సిందే
    • రచయిత, విజయ్ గజం
    • హోదా, బీబీసీ కోసం

ఊరు దాటాలంటే వాగు దాటాలి... వాగు దాటాలంటే చెట్టు ఎక్కాలి.. పనికెళ్లే పెద్దలైనా, బడికెళ్లే చిన్నారులైనా రోజూ ఈ సాహసం చేయాల్సిందే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ముందడుగు వేయాల్సిందే. ఇదీ ఒడిశాలోని గిరిజన గ్రామాల దుస్థితి.

రాష్ట్రంలోని గజపతి జిల్లా రాయగడ బ్లాక్‌లోని ఏడు గిరిజన గ్రామాలకు సరైన దారి లేదు. ఈ గ్రామాల ప్రజలు వేరే ఊరు వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉదృతంగా ప్రవహించే గెడ్డ(వాగు)ను దాటాలి. ఏడాదిలో దాదాపు ఆరు నెలలు వారిది ఇదే పరిస్థితి.

ఒడిశా

మామిడి చెట్టే వంతెన

రాయగడ బ్లాక్‌ మొత్తం గిరిజన ప్రాంతమే. ఐటీడీఏ పరిధిలోకి వచ్చే ఈ బ్లాక్‌లో ఎటుచూసినా పచ్చని చెట్లు, పంట పొలాలు, కొండలు కనివిందు చేస్తాయి.

కానీ, ఈ కొండల నడుమ ఉండే లిమర్ సింగ్, తబతర్ సింగ్, పతిలొడ, గడజుబ, అల్జర్, కింతే సింగ్, దిబ్రిసాయి గ్రామాల పరిస్థితి దారుణం.

వీరంతా బయటి ప్రపంచం చూడాలంటే పంట పొలాలు, కొండలు మధ్య ఉన్న ప్రమాదకర గెడ్డ దాటాలి. దాని కోసం ఒక చెట్టు ఎక్కాలి.

బయటకు వెళ్లడానికి వారికి ఉన్న ఏకైక మార్గం 60 మీటర్ల వెడల్పు ఉన్న ఈ గెడ్డ ఒక్కటే కావడంతో బడికెళ్లే చిన్నారుల నుంచి ముసలివాళ్ల వరకు అందరూ ఈ దారిని ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది.

ఈ గెడ్డ దగ్గర ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. గెడ్డను దాటడానికి వారంతా ఈ చెట్టునే నమ్ముకున్నారు. ప్రవాహం దాటడానికి వారికి ఈ పెద్ద చెట్టు వంతెనలా పనిచేస్తోంది. ఏడాదిలో ఆరు మాసాలు గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తూనే ఉంటుంది. దీంతో ఈ ఆరు నెలలూ ఆ మామిడి చెట్టే వారికి వంతెన. ఈ చెట్టు కొమ్మ గెడ్డపైన సగభాగం కన్నా ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి ఉంది.

ఒడిశా

'భయపడుతూనే దాటుతున్నాం'

బడికి వెళ్లాలంటే చాలా కష్టమవుతోందని పుత్తి సాహీ గ్రామానికి చెందిన జాంబుబతి రైకా అనే విద్యార్థిని చెబుతోంది. ఈ విద్యార్థిని ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూలుకు వెళ్లడానికి రోజూ చెట్టు ఎక్కి గెడ్డ దాటుతోంది.

''నేను 10వ తరగతి చదువుతున్నాను. మర్లబలో ఉన్న మా స్కూలుకు ఈ గెడ్డ దాటి వెళుతుంటాను. మా స్కూలు ఇంటి నుంచి ఐదు కిలోమీటర్ల ఉంటుంది. పైగా మధ్యలో ఈ గెడ్డ దాటాలి. నాకు చదువుకోవాలని ఉంది. గెడ్డ దాటి రోజూ స్కూలులు వెళ్లాలంటే బాగా ఇబ్బందిగా ఉంది. నీటిమట్టం పెరిగితే స్కూలుకు వెళ్లం. రోజూ ఇలా భయం భయంగా గెడ్డను దాటుతున్నాం'' అని ఆమె బీబీసీతో చెప్పింది.

చుట్టూ కొండలు ఉండటం వల్ల అక్కడ నుంచి వచ్చే వర్షపు నీరు కూడా ఈ గెడ్డలోకే వస్తుంది. అప్పుడు ఇందులో నీరు చాలా వేగంగా ప్రవహిస్తుంది. చెట్టు మీద నుంచి గెడ్డ దాటేటప్పుడు కింద పడిపోకుండా వెదురు కర్రలతో ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. మామిడి కొమ్మలకు రెండు వైపులా వెదురు గెడలు కట్టారు. దీన్ని ఇనుప వైర్లతో చుట్టారు. ఈ తాత్కాలిక వంతెన మామిడి కొమ్మల మీదుగా ఉండటంతో పడిపోకుండా ఉండేందుకు సన్నటి వెదురు బొంగులను కట్టారు. అయితే, ఈ వంతెన గుండా వెళుతూ ఏమాత్రం కాలుజారినా 20 అడుగుల క్రింద ఉన్న ప్రవాహంలో పడిపోతారు. గతంలో ఈ ప్రవాహంలో చాలా మంది పడ్డారని గ్రామస్తులు చెప్పారు.

''నేను 30 ఏళ్ల కిందట లిమిరిసింగ్ గ్రామానికి వచ్చాను. అప్పటి నుంచి ఈ గెడ్డను దాటాలంటే తప్పని సరిగా చెట్టు ఎక్కాల్సిందే. నీటి మట్టం పెరిగితే పిల్లల చదువుకు ఆటంకం కలుగుతోంది. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడం లేదు. మేం ఎలా బతకాలో చెప్పండి. బ్రిడ్జి, రోడ్లు లేకపోవడం వల్ల అందరికి అసౌకర్యంగా ఉంది. మేం బతకడమే కష్టంగా ఉంది. మా పిల్లలు గెడ్డను దాటాలటే రోజూ భయపడాల్సివస్తోంది'' అని కుసడి కర్జి పేర్కొన్నారు.

వంతెన నిర్మాణంపై తాము చాలా సార్లు అధికారులకు నివేదించినా పరిష్కారం లభించలేదని లిమిరిసింగ్ ఉప సర్పంచ్ సితన్ రేహేగా బీబీసీతో చెప్పారు.

''మాకు రోజు గడవాలంటే పని కోసం బయటకు వెళ్లాలి. కానీ, వెళ్లడానికి దారిలేదు, సరైన వంతెన లేదు. వర్షాకాలం వరదలు వస్తే మా పిల్లలు బడి మానేయాల్సి వస్తోంది. ఒక్క వంతెన నిర్మాణంతో మా కష్టాలు తీరుతాయి'' అని తెలిపారు.

ఒడిశా

'త్వరలోనే వంతెన నిర్మిస్తాం'

ఏడు గ్రామాల ప్రజల ఇబ్బందులను పరిష్కరించేందుకు త్వరలోనే వంతెన నిర్మిస్తామని రాయగడ బ్లాక్ అఫీసర్ లుకాస్ ప్రధాన్ తెలిపారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''వంతెన కావాలని ఏడు గ్రామాల ప్రజలు ఎప్పటి నుంచో అడుగుతన్నారు. అయితే, వంతెన నిర్మాణానికి రూ.4 కోట్లు ఖర్చు అవుతుంది. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. గతంలోనే సర్వే చేసి, టెండర్లు కూడా పిలిచాం. సాధ్యమైనంత త్వరలో బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమవుతుంది'' అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)