దిల్లీ కాలుష్యం: ఆరోగ్యం ఎలా దెబ్బతింటుంది... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఫొటో సోర్స్, Getty Images
దిల్లీని కమ్మేసిన విషపూరిత పొగమంచు సమస్య పరిష్కారంలో విఫలమయ్యారని, కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలు ఇతరులపైకి నెట్టేస్తున్నాయని సుప్రీంకోర్టు ఆరోపించింది.
పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి నిర్మాణాత్మక చర్యలు చేపట్టడానికి బదులు అధికారులు గిమ్మిక్కులు చేస్తున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
దిల్లీలో ప్రమాదకర సూక్ష్మ కాలుష్య రేణువులు పీఎం 2.5 స్థాయి గరిష్ఠ సురక్షిత స్థాయి కంటే 10 రెట్లు అధికంగా ఉంది.
దిల్లీ ఏటా కాలుష్యం కారణంగా ఉక్కిరిబిక్కిరవుతోందని.. అయినా, ఏమీ చేయలేకపోతున్నామని జస్టిస్ అరుణ్ మిశ్రా అన్నారు. ''రాష్ట్ర పాలనావ్యవస్థ ఏమీ చేయడం లేదు. బాధ్యతను ఒకరిపై ఒకరు నెట్టేస్తున్నారు. ఎన్నికల గిమ్మిక్కులు తప్ప ఇంకేం చేయడం లేదు'' అన్నారాయన.

ఫొటో సోర్స్, Getty Images
కాలుష్య తీవ్రతను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా దిల్లీ ప్రభుత్వం వాహనాల వినియోగాన్ని నియంత్రించడానికి గాను సరి-బేసి విధానాన్ని మళ్లీ అమల్లోకి తెచ్చింది. ఇది ఎంతవరకు ఫలితమిస్తుందన్న విషయంలో స్పష్టత లేదు.
దిల్లీ కాలుష్యానికి కార్లు ప్రధాన కారణం కాదని నిపుణులు చెబుతున్నారు. పొరుగు రాష్ట్రాల్లోని రైతులు పంట వ్యర్థాలను పొలాల్లో తగలబెడుతుండడమే ఈ కాలుష్యానికి కారణమని చెబుతున్నారు.
ప్రజలు వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని.. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం సమయాల్లో బయటకు రావొద్దని ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది. పాఠశాలలకు కూడా సెలవులిచ్చారు. భవన నిర్మాణ పనులు చేపట్టరాదని ఆదేశాలు జారీ చేశారు.
'సరి-బేసి' విధానం వల్ల పెద్ద సంఖ్యలో కార్లు రోడ్లపైకి రాకుండా ఉంటాయని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ విధానాన్ని అతిక్రమించి రోడ్లపైకి వచ్చే వాహనాలకు రూ.4 వేల జరిమానా విధిస్తారు. గత ఏడాది కంటే ఇది రెట్టింపు జరిమానా.
సరి-బేసి విధానం ఫలితమిస్తుందనడానికి ఆధారాలు చూపించాలని దిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

కాలుష్యానికి కారణమేంటి?
కేజ్రీవాల్ మాటల ప్రకారం దిల్లీ గ్యాస్ చాంబర్‌లా మారడానికి కారణం వాహనాలు ఒక్కటే కాదని.. శీతాకాలంలో దిల్లీ పరిసర రాష్ట్రాల రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టడం ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.
పంట వ్యర్థాలు తగలబెట్టడం వల్ల వచ్చే పొగలోని సూక్ష్మ రేణువులు, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ అన్నీ కలిసి కాలుష్యం తీవ్రమయ్యే సమయంలోనే బాణసంచా కాల్చడం వల్ల వెలువడే కాలుష్యం దాన్ని మరింత తీవ్రంగా మారుస్తుంది.
పారిశ్రామిక, వాహన కాలుష్యం, భవన నిర్మాణల వల్ల ఏర్పడే ధూళి వల్లా పరిస్థితి జటిలమవుతోంది.
రానున్న వారం రోజుల్లో వర్షం పడి కాలుష్యం తగ్గుతుందని భావిస్తున్నారు. అయితే, గురువారంలోగా వర్షం కురిసే సూచనలు లేవు.

కాలుష్యానికి కారణాలు చెప్పే ప్రయత్నంలో కేంద్ర, రాష్ట్ర రాజకీయ నేతల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
పంజాబ్, హరియాణాల్లో పంట వ్యర్థాలు తగలబెట్టడమే కారణమని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించగా.. కేజ్రీవాల్ పొరుగు రాష్ట్రాలను విలన్‌గా చూపించి రాజకీయం చేస్తున్నారని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఆరోపించారు.
పంట వ్యర్థాలు దహనం నియంత్రణకు సంబంధించి వ్యక్తమవుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు కోర్టు ముందు హాజరుకావాలంటూ ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.
దిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది. ఒక దశలో పీఎం 2.5 కాలుష్యం చైనాలోని బీజింగ్ కంటే ఏడు రెట్లు అధికంగా దిల్లీలో నమోదైంది. కొద్దికాలం కిందట వరకు బీజింగ్ కూడా కాలుష్య సమస్యపై పోరాడింది.

పంట వ్యర్థాలు ఇప్పుడే ఎందుకు తగలబెడతారు?
వ్యవసాయ రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాల్లో గతంలో ఏప్రిల్ చివరి వారంలో పంటలు వేసేవారు. కానీ.. భూగర్భ జలాల పరిరక్షణ లక్ష్యంతో జూన్ రెండో వారం తరువాత నుంచి పంటలు వేసుకునేలా ప్రభుత్వాలు దశాబ్దం కిందట రైతులను ఆదేశించి.. అందుకు తగ్గట్లుగా మార్పులు చేశాయి. వర్షాకాలంలో పంట పండిస్తే భూగర్భ జలాల అవసరం ఉండదన్నది ఆ ఆదేశాల లక్ష్యం.
అయితే, జూన్‌లో పంటలు వేస్తే అక్టోబరులో పంట కాలం ముగుస్తోంది. ఆ తరువాత రెండో పంటకు పొలాలను సిద్ధం చేయడానికి రైతులకు సమయం తక్కువగా ఉంటుంది. పంట వ్యర్థాలను తొలగించడానికి వాటిని తగలబెట్టడమే సులభ, తక్కువ సమయంలో పని పూర్తయ్యే విధానంగా రైతులు భావిస్తుంటారు.
ఇదే కాలంలో ఉత్తర భారత దేశంలో గాలి వీచే దిశ మారి పంటవ్యర్థాలు తగలబెట్టడం వల్ల ఏర్పడే పొగ దిల్లీ వైపు వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ జాగ్రత్తలు తీసుకుంటే..
పొగమంచు, కాలుష్యం బారిన పడకుండా ఉండడానికి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ పలు సూచనలు చేసింది.
* కాలుష్యం తీవ్రంగా ఉన్నప్పుడు బరువైన పనులు చేయొద్దు.
* బయటకు వచ్చినప్పుడు విశాలమైన మార్గాలు కాకుండా సన్నని మార్గాలు, చిన్నచిన్న వీధుల్లోంచి వెళ్లడం మంచిది. విశాలమైన మార్గాలతో పోల్చితే సందుల్లో కాలుష్యం తక్కువగా ఉంటుంది.
* స్మాగ్‌ను తట్టుకునే మాస్క్‌లను వినియోగించాలి.
* వ్యర్థాలను తగలబెట్టడం మానుకోవాలి.
* కారు ప్రయాణాలు తగ్గించాలి.
ఇవి కూడా చదవండి:
- పెగాసస్ ఎటాక్: వాట్సాప్‌ను తీసేస్తే మీ ఫోన్ సేఫ్ అనుకోవచ్చా?
- జపాన్‌లో భూత్ బంగళాలు... నానాటికీ పెరుగుతున్న సమస్య
- వెయ్యి మంది ప్రాణాలు తీసిన హంతకుడు.. కెమెరాల ముందు తన పాత్రలో తనే నటించాడు..
- బిగ్‌బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్.. ప్రైజ్‌మనీతో ఏం చేయబోతున్నారు...
- భూపత్ డాకూ: భారత్ నుంచి పారిపోయిన ఈ దోపిడీ దొంగకు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది
- రక్తం చిందినట్టు ఎరుపు రంగులోకి మారిపోయిన ఆకాశం.. ‘ఇది అంగారక గ్రహం కాదు.. మా ఊరే’
- వేముగోడులో రజకులను ఎందుకు వెలివేశారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








