రాహుల్ సిప్లిగంజ్: బిగ్ బాస్-3 విజేత తన ప్రైజ్‌మనీతో ఏం చేయబోతున్నారు? - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, facebook/Star Maa
బిగ్‌బాస్ సీజన్-3 టైటిల్‌ను గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ గెలుచుకున్నారు. అగ్ర కథనాయకుడు చిరంజీవి చేతుల మీదుగా రూ.50 లక్షల నగదు బహుమతి, ట్రోఫీని రాహుల్ అందుకున్నారని 'ఈనాడు' వార్తాకథనం తెలిపింది.
''15 వారాలపాటు ఆసక్తికరంగా సాగిన ఈ షోలో రాహుల్ విజేతగానిలిచారు. యాంకర్, నటి శ్రీముఖి చివరి వరకు రాహుల్‌కు గట్టి పోటీ ఇచ్చారు. ఈ సందర్భంగా తనను విజేతగా నిలిపిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు రాహుల్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ ఏడాది జులై 21న ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్-3కి అగ్రనటుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
బిగ్ బాస్ సీజన్-3 సాగిందిలా..
* అగ్ర నటుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
* జులై 21 నుంచి నవంబరు 3 వరకు సాగింది.
* మొత్తం 17 మంది సభ్యులు పాల్గొన్నారు.
* వీరిలో వరుణ్ సందేశ్, వితిక భార్యాభర్తలు.
* బిగ్‌బాస్ హౌస్ నుంచి మొట్టమొదట ఎలిమినేట్ అయింది హేమ.
* వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తమన్నా సింహాద్రి, శిల్పా చక్రవర్తి, అలీ రెజా వచ్చారు.
* ఆరోవారంలో నాగార్జున విశ్రాంతి తీసుకోవడంతో నటి రమ్యకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
* తమతమ సినిమాల ప్రమోషన్ కోసం హీరో రామ్, నాని, వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ వెన్నెల కిశోర్ వచ్చారు.
* బ్యాండ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, పుల్లెల గోపీచంద్ 8వ వారం షోకు వచ్చారు.
'ప్రైజ్‌మనీతో ఏం చేస్తానంటే..'
''ప్రైజ్ మనీ గెలిచిన తర్వాత ఆ డబ్బుతో బార్బర్ షాప్ పెడతానని రాహుల్ ప్రకటించడంతో అతడికి సింప్లిసిటీ, కులవృత్తి మీదున్న గౌరవాన్ని అందరూ అభినందిస్తున్నారు' అంటూ ఆంధ్రజ్యోతి తన కథనంలో తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రైవేటు ఆస్పత్రుల్లో 61.04 శాతం సిజేరియన్లే
సుఖప్రసవానికి అవకాశం ఉన్నా ప్రైవేటు నర్సింగ్‌హోమ్‌లు డబ్బు కోసం సిజేరియన్ వైపే మొగ్గు చూపుతున్నాయని 'సాక్షి' పత్రిక కథనం పేర్కొంది.
''ప్రభుత్వాస్పత్రుల్లో సిజేరియన్ ప్రసవాలు తగ్గుతుండగా, ప్రైవేటులో మాత్రం ఏటా పెరుగుతుండటం ఆందోళన పెంచుతోంది. సిజేరియన్ ప్రసవం వల్ల తల్లీబిడ్డకు ఇబ్బందులుంటాయని తెలిసినా కొంతమంది వైద్యులు సిజేరియన్ వైపే మొగ్గుచూపుతున్నారు. వాస్తవానికి.. తీవ్ర ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నవారికి, అధిక రక్తపోటు ఉన్నవారికి, హెచ్‌ఐవీ సోకిన గర్భిణులకు ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్ ప్రసవం చేయాల్సి ఉంది. కానీ ఆరోగ్యంగా ఉన్న గర్భిణులు ప్రసవానికి వెళ్లినా సిజేరియన్లు చేస్తున్నారు. విజయవాడలాంటి నగరాల్లో ఇదొక పెద్ద వ్యాపారంగా మారిపోయింది. రాష్ట్రంలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు 62.16 శాతం సిజేరియన్ ప్రసవాలే జరిగాయి.
రాష్ట్రంలో సిజేరియన్ ప్రసవాల సంఖ్య సగటున 44.91 శాతంగా ఉంది. ఒకప్పుడు ప్రభుత్వాస్పత్రుల్లో కూడా సిజేరియన్ ప్రసవాలు ఎక్కువగా జరగ్గా ఈ సంఖ్య ఇప్పుడు గణనీయంగా తగ్గింది. 40 శాతానికి తగ్గకుండా ఉండే సిజేరియన్ ప్రసవాల సంఖ్య ఇప్పుడు 30.27 శాతానికి దిగొచ్చింది. కానీ ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం ఏటా పెరుగుతూ ఇప్పుడా సంఖ్య 61.04 శాతానికి చేరి కలవరపెడుతోంది. అంటే.. ప్రసవానికి వచ్చిన ప్రతి వంద మందిలో 61 మందికి సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నారు. ఒక్కో సిజేరియన్‌కు కనిష్టంగా రూ.30 వేలు, గరిష్టంగా రూ.60 వేల వరకు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు.
మొత్తం ప్రసవాల్లో గర్భిణులకు ఉన్న వివిధ రకాల అనారోగ్య సమస్యల వల్ల 15 శాతం సిజేరియన్ ప్రసవాలు అవసరమవుతాయని, అంతకుమించి జరిగితే తల్లీబిడ్డ ఇద్దరికీ ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతోంది. దక్షిణాది దేశాల్లో ఈ సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమని తాజాగా వెల్లడించింది'' అని ఆ కథనంలో తెలిపారు.

ఫొటో సోర్స్, facebook/Singireddy NirajanReddy
తెలంగాణ నుండి యూరప్‌కు వేరుశనగ ఎగుమతులు
తెలంగాణ నుంచి యూరప్ దేశాలకు వేరుశనగ ఎగుమతులు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారంటూ 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.
''జర్మనీ-నెదర్లాండ్స్ దేశాల పర్యటనలో పర్యటనలో ఉన్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బృందం ఆదివారం నెదర్లాండ్స్‌లోని అమ్‌స్టర్ డ్యాంలో వేరుశనగ దిగుమతిదారులు, కురగాయల విత్తనోత్పత్తి కంపెనీలతో సమావేశమైంది.
అనంతరం మంత్రి స్పందిస్తూ... తెలంగాణ నుండి యూరప్‌కు వేరుశనగ ఎగుమతులు చేస్తామన్నారు. దేశంలోనే వేరుశనగ ఉత్పత్తిలో ఉమ్మడి పాలమూరుది ప్రథమస్థానమన్నారు. రైతులకు లాభం చేకూర్చేలా దళారుల ప్రమేయం లేకుండా మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వేరుశనగ ఎగుమతులు జరిగేలా చూస్తామన్నారు. రబీలో ఏటా 2 లక్షల 50 వేల ఎకరాల విస్తీర్ణంలో వేరుశనగ సాగవుతుందన్నారు. కురగాయ పంటల విత్తనోత్పత్తిలో రైతుకు ఎక్కువ లాభం ఉంటుందన్నారు. యూరప్‌లో పేరొందిన కూరగాయల విత్తన కంపెనీలు పలు హైదరాబాద్‌లో ఉన్నాయన్నారు. విత్తనోత్పత్తిని చేపడితే తెలంగాణ రైతులకు అధిక ఆదాయం చేకూరుతుందన్నారు. తెలంగాణలోని పలు జిల్లాలు విత్తనోత్పత్తికి అనుకూలంగా ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో పందిరి జాతి, మిరప, బెండ, వంకాయ కూరగాయల విత్తనోత్పత్తిని చేపట్టి ఎగుమతిని ప్రోత్సహించనున్నట్లు మంత్రి పేర్కొన్నార''ని ఆ కథనంలో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
36 మంది ఆత్మహత్యలు: ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంఘ అధ్యక్షుడు రాజు
గత ఐదు నెలల్లో రాష్ట్రంలో 36 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంఘ అధ్యక్షుడు రాజు తెలిపారంటూ 'ఆంధ్రజ్యోతి' తన వార్తాకథనంలో తెలిపింది.
''గత ఐదు నెలల్లో రాష్ట్రంలో 36 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని.. వారంతా కుటుంబ గొడవలు, మతి భ్రమించి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతుండడం దుర్మార్గమని ఏపీ భవన నిర్మాణ కార్మికుల సంఘ అధ్యక్షుడు రాజు చెప్పారు. విశాఖలో పవన్ కల్యాణ్ నిర్వహించిన లాంగ్ మార్చ్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్న నిధుల నుంచి కొంత మొత్తాన్ని తీసి.. కార్మికులకు చెల్లించి ఆదుకోవాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశార''ని ఆ కథనంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- కొత్త రాజధానిలో జనాలు కరవు
- చైనాలో 5జీ నెట్వర్క్ ప్రారంభం... ప్రపంచ టెక్నాలజీలో భారీ ముందడుగు
- హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం.. స్కూళ్లన్నీ బంద్
- పిడికెడు మిరపకాయలు, గుప్పెడు అన్నం... అయిదేళ్లు ఆదే ఆమె ఆహారం
- ఆర్టీసీ సమ్మెకు ఆర్టీసీ ముగింపే సమాధానమన్న కేసీఆర్, స్పందించిన ఆర్టీసీ జేఏసీ నాయకులు
- కిమ్ జీ-యంగ్, బోర్న్ 1982: దక్షిణ కొరియాలో స్త్రీవాదులు, స్త్రీవాద వ్యతిరేకుల మధ్య ఉద్రిక్తతలు రాజేసిన ఫెమినిస్ట్ సినిమా
- సంస్కృతం - హిందీ - తమిళం - తెలుగు... ఏది ప్రాచీన భాష? ఏ భాష మూలాలు ఏమిటి?
- #100WOMEN: మహిళ 'అందం' అనే భారాన్ని మోయాల్సిన అవసరం ఏముంది: నందితా దాస్
- ఈ ఊరిలో బిడ్డను కంటే 8 లక్షల రూపాయల బోనస్ ఇస్తారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








