కిమ్ జీ-యంగ్, బోర్న్ 1982: దక్షిణ కొరియాలో స్త్రీవాదులు, స్త్రీవాద వ్యతిరేకుల మధ్య ఉద్రిక్తతలు రాజేసిన ఫెమినిస్ట్ సినిమా

ఫొటో సోర్స్, LOTTE ENTERTAINMENT
- రచయిత, హ్యుంగ్ యెన్ కిమ్
- హోదా, బీబీసీ న్యూస్ కొరియన్
బుధవారం విడుదలైన ఒక సినిమా దక్షిణ కొరియాలో తీవ్ర లింగ వివక్షకు కారణమైంది. దీనిని ఒక ప్రముఖ నవల ఆధారంగా నిర్మించారు.
కిమ్ జి-యంగ్, బోర్న్ 1982( 1982లో పుట్టిన కిమ్ జి-యంగ్) అనే ఈ నవలను 2016లో ప్రచురించారు. ఇది పది లక్షల కాపీలకు పైగా అమ్ముడైంది.
ఇది ఉద్యోగానికి, కుటుంబానికి మధ్య నలిగిపోతూ, జీవితంలోని ప్రతి దశలో లింగ వివక్షను ఎదుర్కున్న ఒక 30 ఏళ్ల మహిళ కథ.
కొరియాలోని ప్రముఖ స్త్రీవాద నవలల్లో ఒకటైన ఈ పుస్తకం చాలా ప్రశంసలు అందుకుంది. కానీ ఇది దేశంలో స్త్రీవాద వ్యతిరేకుల నుంచి తీవ్ర అభ్యంతరాలు ఎదుర్కుంది.
ఇప్పుడు, ఈ నవల ఆధారంగా తాజాగా విడుదలైన సినిమాతో దేశంలో మరోసారి వివాదాలు రాజుకున్నాయి.
తరతరాల నుంచీ కొరియన్లు కిమ్ జీ-యంగ్ అనే పేరు పెట్టుకోవడం ఎక్కువగా వస్తోంది. అందుకే ఆ పేరు ప్రతి కొరియన్ మహిళకూ తనదిలాగే అనిపిస్తుంది.
ఈ నవలను చా నామ్-జూ రాశారు. పుట్టినప్పటి నుంచి తల్లయ్యే వరకూ ఒక మహిళ పడే కష్టాలను మగ సైకియాట్రిస్ట్ కోణంలో చెప్పారు.

ఫొటో సోర్స్, LOTTE ENTERTAINMENT
పుట్టినప్పటి నుంచీ కష్టాలే
ఇందులో కథానాయిక పుట్టినపుడు, ఆడపిల్ల పుట్టినందుకు క్షమించమని ఆమె తల్లి అత్తగారిని వేడుకుంటుంది.
జీ-యంగ్ స్కూలుకు వెళ్లేటపుడు, ఉద్యోగం పొందినపుడు, పెళ్లై ఒక బిడ్డకు తల్లైనపుడు ప్రతి దశలో సమాజంలో బలంగా పాతుకుపోయిన లింగ వివక్షను ఎదుర్కుంటుంది.
ఆసియాలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో దక్షిణ కొరియా ఒకటైనప్పటికీ, సామాజిక సంప్రదాయాలు అక్కడ ఇంకా అలాగే ఉన్నాయి.
అది ఎంతగా అంటే, కిమ్ జీ-యంగ్ పుస్తకం చదివామని చెప్పుకున్న నటీమణులు, గాయనిలపై కూడా విమర్శలు, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ పుస్తకంలో సంప్రదాయాలను పూర్తిగా వక్రీకరించారని, మగవాళ్లందరూ ఇలాగే ఉంటారనిపించేలా, వారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని విమర్శకులు మండిపడ్డారు.
నవలలోని మగ పాత్రలను మహిళలపై వివక్ష చూపే సంస్కృతిని మౌనంగా ఆమోదించినట్లు చూపించారని ఆరోపించారు. లింగ విభేదాలను ఇది మరింత ఎక్కువ చేసిందని కూడా విమర్శకులు వాదిస్తున్నారు.
ఈ సినిమా తీస్తున్నట్టు మొదట ప్రకటించినపుడు కూడా ఇలాగే ఉద్రిక్తతలు రేగాయి. ఇందులో కథానాయికగా నటించిన జంగ్ యు-మికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క రోజులోనే వేల విద్వేషపూరిత కామెంట్స్ వచ్చాయి.
కొందరైతే, ఈ సినిమాను విడుదలను అడ్డుకోడానికి పిటిషన్ వేయాలని కూడా కోరారు. మరి కొందరు సినిమా ఇంకా రిలీజ్ కాకముందే.. వెబ్ పోర్టళ్లలో దీనికి చెత్త రేటింగ్స్ ఇచ్చారు.

ఫొటో సోర్స్, NEWS1
వివక్ష, బహిష్కరణ, హింస
కొరియా మహిళ జీవితంపై రాసిన ఈ నవలపై ఇంత వివాదం ఎందుకు అనే న ప్రశ్నకు "నవలలో టైమింగ్ చాలా బాగుంటుంది" అని సియోల్‌లోని చంగ్-ఆంగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ లీనా-యంగ్ బీబీసీతో అన్నారు.
‘‘ఈ పుస్తకంలో ప్రత్యేకంగా ఒకరి గురించి లేదా కష్టాలు పడిన ఒక మహిళ గురించి చెప్పలేదు. కానీ దాదాపు ప్రతి మహిళ కథ ఇంతే" అని ప్రొఫెసర్ లీ చెప్పారు.
ఈ కథ కిమ్ జీ-యంగ్ జీవితంతోపాటూ సాగుతుంది. ఆ దారిలో కొందరికి వివక్ష, బహిష్కరణ, హింస లాంటివి కనిపిస్తాయి. అది బాధ కలిగిస్తుంది.
ఆ పుస్తకంలో కిమ్ జీ-యంగ్ జీవితంలోని కనిపించే ప్రతి సన్నివేశం, ఒక్కో వయసు మహిళకు సంబంధించినది అని ఆమె చెప్పారు.
ఒక కొరియా మహిళ, ఇందులో కథానాయిక కిమ్ జీ-యంగ్ లాగే, అన్నీ చేయగలదు. అంటే ఆమె కష్టపడి చదువుతూ పెరుగుతుంది. కష్టపడి పనిస్తుంది. ఎన్నో చేస్తుంది. కానీ ఆమె కెరీర్ పురోగతి విషయంలో మాత్రం వాస్తవికత బయటపడుతుంది అంటారు లీ.
దక్షిణ కొరియాలో మహిళలకు ఇచ్చే వేతనాలు పురుషుల కంటే 63 శాతం తక్కువగా ఉంటాయి. అభివృద్ధి చెందిన దేశాల వేతనాల్లో అతిపెద్ద వ్యత్యాసం ఇదే.
కిమ్ జీ-యంగ్ సినిమాలో ఒక సన్నివేశంలో కథానాయిక తన బిడ్డ వల్ల ఒక కెఫేలో కాఫీ ఒలకబోస్తుంది. దాంతో అక్కడ ఉన్నవారంతా ఆమెను మమ్-రోచ్ అంటూ తిట్టుకుంటారు.
మమ్మీ- కాక్రోచ్ రెండూ కలిపితే వచ్చే మమ్-రోచ్ అంటే బహిరంగ ప్రాంతాల్లో సభ్యతతో ప్రవర్తించని తల్లులు అని చెప్పేందుకు ఇలా అంటారు.

ఫొటో సోర్స్, JULIE YOON
ఆ వివక్షను నేనూ ఎదుర్కున్నా
పొరుగు దేశాలు జపాన్, చైనా, తైవాన్‌లో ఈ పుస్తకం బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది అని దక్షిణ కొరియా పబ్లిషర్ మినుమ్సా చెప్పారు. దీని ప్రచురణ హక్కులను బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, స్పెయిన్‌తోపాటు 17 దేశాలకు అమ్మారు.
బ్రిటన్ మార్కెట్ కోసం ఈ నవలను అనువదించిన ఎవ్హా వుమెన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జేమీ చాంగ్, అది మానసికంగా చాలా సవాలు లాంటిదన్నారు.
ఆ పుస్తకంలో అంతర్గతంగా మహిళల పట్ల ఉన్న ద్వేషం గురించి చాలా చెప్పారు. ఈ పుస్తకాన్ని అనువదించడానికి నేను వాటిని ఎదుర్కోవాల్సి వచ్చింది అన్నారు.
అది రాస్తున్నప్పుడు.. "కిమ్ జీ-యంగ్.. ఇన్ని జరిగినా నువ్వు మాట్లాడవేంటి, నువ్వు ఏదీ అనడం లేదేంటి, అని నన్ను నేనే అడుగుతూ వచ్చాను" అని చాంగ్ చెప్పారు.
"కిమ్ జీ-యంగ్ ఈ పోరాటం చాలా కాలం నుంచీ చెబుతున్నదే అని నాకు అర్థమైంది. ఇప్పుడు లైంగిక సమానత్వం ఉంది. మహిళలు ఏది చేయాలనుకుంటే అది చేయగలుగుతున్నారు" అన్నారు.
నా చుట్టూ ఉన్న వారు కొందరు, "ఇది పూర్తిగా కొరియా మహిళ కథ కదా.. విదేశీ పాఠకులు ఎందుకు చదువుతారు అన్నారు. కానీ మహిళల పట్ల ఉన్న ద్వేషానికి సంబంధించి కొరియాలో మాత్రమే కొన్నిఅంశాలు దీన్లో ఉన్నాయి, ఇది మా గురించి మేం చెప్పుకుంటున్నట్టు ఉంటుందని నాకు అనిపిస్తోంది" అన్నారు చాంగ్.
కొరియా పత్రిక 'హాంకూక్ ఇల్బో'తో మాట్లాడిన చిత్ర విమర్శకుడు హ్వాంగ్ జిన్ మి "ఈ పుస్తకం చదివిన మహిళా ప్రముఖులందరూ, లైంగిక అసమానత్వానికి గురైన బాధితుల తరఫున సాక్ష్యం ఇస్తారేమోనని కొందరు భయపడుతున్నట్టుంది" అన్నారు.
ఇవి కూడా చదవండి:
- #100WOMEN: పోర్న్‌హబ్‌తో కలిసి పనిచేస్తానని హాలీవుడ్ నటి బెల్లా థోర్న్ ఎందుకన్నారు...
- 'పోర్న్‌ను పురుషులే కాదు, మహిళలూ ఎంజాయ్ చేసేలా చేయాలి'
- బంగ్లాదేశ్ క్రికెటర్లు సమ్మె.. సందిగ్ధంలో భారత పర్యటన.. ఆ దేశ ప్రధానితో మాట్లాడానన్న గంగూలీ
- కెనెడాలో ఒక సిక్కు 'కింగ్ మేకర్' ఎలా అయ్యారు?
- ఈ ఊరిలో బిడ్డను కంటే 8 లక్షల రూపాయల బోనస్ ఇస్తారు
- చంద్రుడి మీదకు మళ్లీ మనిషిని పంపించటం కోసం కొత్త స్పేస్‌సూట్ ఆవిష్కరణ.. ప్రత్యేకతలివే
- సంతాన నిరోధక మాత్రలు మగాళ్లకు ఎందుకు లేవు
- ఉత్తర కొరియా: 'వాళ్లు మమ్మల్ని సెక్స్ టాయ్స్‌లా భావించారు'
- ‘పురుషుల ముందే టాయిలెట్‌కి వెళ్లాల్సి వచ్చేది’
- చైనాలో వ్యభిచార వ్యాపారం.. సెక్స్ బానిసత్వంలో మగ్గిపోతున్న ఉత్తర కొరియా అమ్మాయిలు
- పోర్నోగ్రఫీ సమస్యకు దక్షిణ కొరియా పోలీసుల షాక్ థెరపీ
- ఉత్తర కొరియాకు మిత్రదేశాలు ఎన్ని?
- మరో వందేళ్లూ మహిళలకు సమానత్వం కలే!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








