#100WOMEN: సంతాన నిరోధక మాత్రలు మగాళ్లకు ఎందుకు లేవు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రొఫెసర్ లీజా కాంపో-ఇంగ్లెస్టైన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు దాదాపు 50 ఏళ్ల నుంచి పురుషులు ఉపయోగించదగ్గ గర్భనిరోధక మాత్రల తయారీ కోసం పరిశోధనలు చేస్తున్నారు.
దీనికి సంబంధించిన ఎన్నో అధ్యయనాలు, నివేదికలు చూస్తుంటాం. కానీ ఈ మాత్రలు ఇప్పటికీ మందుల షాపుల్లోకి రాలేదు.
నిధుల లేమి, పురుషుల ఉదాసీనత వల్ల ఈ మాత్రల ఉత్పత్తి భారీ ఎత్తున జరగడం లేదు. దానితోపాటు గర్భం దాల్చకుండా ఉండే బాధ్యతలను మహిళలే తీసుకుంటారని ఇప్పటికీ అనుకుంటూ వస్తున్నారు.
అయితే, పురుషులకు కూడా ఇలాంటి మాత్రలు ఉంటే, వాటిని వేసుకోడానికి మగాళ్లు కూడా సులభంగా అంగీకరిస్తారని చాలా అధ్యయనాల్లో తేలింది.
మాత్రలు లేదా ఇంప్లాంట్స్ టెక్నాలజీ ద్వారా సంతానోత్పత్తిని నియంత్రించే మార్గాన్ని పాటించాలని అనుకుంటున్నట్లు బ్రిటన్‌లో లైంగికంగా చురుగ్గా ఉన్న మూడో వంతు పురుషులు అంగీకరించారు.
ప్రస్తుతం బ్రిటన్‌లో దాదాపు మూడోవంతు మహిళలు గర్భనిరోధక మాత్రలను ఉపయోగిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గర్భ రాకుండా ఆపడం ఎవరి బాధ్యత?
సర్వేలో పాల్గొన్న 10 మందిలో 8 మంది గర్భం రాకుండా చూసుకోవడం అనేది ఒకరి బాధ్యతే కాదని, మహిళలు, పురుషులు దానిని పరస్పరం షేర్ చేసుకోవాలని అభిప్రాయపడ్డారు.
మరోవైపు, అమెరికాలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య లైంగికంగా చురుగ్గా ఉన్న వారిలో 77 శాతం మంది పురుషులు వేసక్టమీ లేదా కండోమ్ బదులు వేరే గర్భనిరోధకాలు ఉపయోగించడంపై ఆసక్తి చూపించారు.
బహిరంగంగా ఇంతమంది దానిని అంగీకరిస్తూ, తమ లైంగిక పాత్రలను వదిలించుకుంటున్నతర్వాత కూడా పురుషుల గర్భనిరోధక మాత్రలు వాస్తవానికి తయారవుతాయా అనే ప్రశ్న తలెత్తుతూనే ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది వాడే గర్భనిరోధకాలు ఏవి?
అమెరికాలో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా లైంగికంగా చురుగ్గా ఉన్న జంటల్లో మూడో వంతు జంటలు అసలు ఎలాంటి గర్భనిరోధకాలూ ఉపయోగించడం లేదు.
దానితోపాటూ జంటలు గర్భనిరోధకాలు ఉపయోగించే విషయానికి వస్తే, మహిళలు గర్భనిరోధకాలు తీసుకోవడం ఎక్కువగా నడుస్తోంది.
వివాహితలు లేదా లైంగిక సంబంధాలు పెట్టుకునే మహిళల్లో సుమారు 19 శాతం మంది గర్భం రాకుండా ఉండడానికి వేసక్టమీపైనే నమ్మకం ఉంచుతున్నారు. 14 శాతం మంది మహిళలు కాపర్-టీ ఉపయోగిస్తున్నారు. 9 శాతం మంది మహిళలు గర్భనిరోధక మాత్రలు, ఐదు శాతం మంది ఇంజెక్షన్లు ఉపయోగిస్తున్నారు.
పురుషులకు సంబంధించిన గర్భనిరోధకాలను వారు ఉపయోగించడం చాలా తక్కువ. కేవలం 8 శాతం పురుషులు మాత్రమే కండోమ్ ఉపయోగిస్తున్నారు. ఇక రెండు శాతం మంది మాత్రమే వేసక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గర్భనిరోధక మాత్రలకు ముందు ఏం చేసేవారు?
గర్భనిరోధక మాత్రలకు ముందు కూడా పురుషులు గర్భం నిరోధించే ప్రక్రియలో భాగం అయ్యేవారు. ఉదాహరణకు వారు కండోమ్ ఉపయోగించాల్సి వస్తుంది.
1960వ దశకంలో మహిళల కోసం గర్భనిరోధక మాత్రలు భారీ స్థాయిలో తయారైనప్పుడు, గర్భం వద్దు అనే నిర్ణయం మహిళల చేతుల్లోకి వచ్చింది. తమ సెక్సువల్ పార్ట్‌నర్‌క చెప్పకుండా కూడా మహిళలు ఈ పనిని చేయగలిగేవారు.
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా మహిళలు గర్భనిరోధక మాత్రలు ఉపయోగిస్తున్నారు. యూరప్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లో వీటిని అత్యధికంగా వినియోగిస్తున్నారు.
అటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఉత్తర అమెరికాలో గర్భం రాకుండా ఉపయోగించే వాటిలో గర్భనిరోధక మాత్రలు రెండో స్థానంలో ఉన్నాయి. ఆసియాలో అవి మూడో స్థానంలో ఉన్నాయి.
గత కొన్ని దశాబ్దాలుగా గర్భనిరోధక మాత్రల వల్ల మహిళల జీవితం కాస్త సరళతరం అయ్యింది. తమకు సౌకర్యంగా ఉండేలా, ఎప్పుడు తల్లి కావాలో వారు ఒక నిర్ణయం తీసుకోగలుగుతున్నారు. దానివల్ల ఉన్నత విద్య, ఉద్యోగ రంగాల్లో కూడా వారికి ప్రయోజనం లభించింది.
మహిళా హక్కుల్లో వీటిని ఒక కీలక మలుపుగా చెప్పడానికి కారణం కూడా అదే. అందుకే 20వ శతాబ్దపు అత్యంత ప్రముఖ ఆవిష్కరణల్లో గర్భనిరోధక మాత్రలు కూడా ఒకటిగా నిలిచాయి.

ఫొటో సోర్స్, Getty Images
స్త్రీ పురుష సమానత్వం
సమాజంలో లైంగిక సమానత్వం అనేది పెరుగుతోంది. దాని పరిధి విస్తృతం అవుతోంది. గర్భనిరోధకాల వల్ల, వాటికి సంబంధించిన దుష్ప్రభావాలనే కాకుండా, భావోద్వేగపరమైన, సామాజిక, ఆర్థిక, కాలానికి సంబంధించిన సవాళ్లను కేవలం మహిళలు మాత్రమే ఎదుర్కోవాల్సి వస్తోంది.
అలాంటప్పుడు, మనకు పురుషులు ఉపయోగించే గర్భనిరోధక మాత్రలు ఇప్పటికీ ఎందుకు రావడం లేదు.
మహిళల గర్భనిరోధక మాత్రల కోసం పరిశోధనల జరిగినపుడు, ఆ తర్వాత దశాబ్దంలోపే వాటిని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు. పురుషుల మాత్రలను 1970లోనే తొలిసారి పరీక్షించినపుడు, వాటిని మార్కెట్లోకి తీసుకురావడానికి ఇంత సుదీర్ఘ కాలం ఎందుకు పడుతోంది.
పురుషుల కోసం గర్భనిరోధక మాత్రలు తయారు చేయడం మహిళల గర్భనిరోధక మాత్రలతో పోలిస్తే చాలా కష్టం అని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
పురుషుల గర్భనిరోధక మాత్రలు వీర్యం ఉత్పత్తిని అడ్డుకుని తమ పని పూర్తి చేస్తాయి. కానీ అలా చేయాలంటే ఏ హార్మోన్లు అవసరం అవుతాయో, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి.
అంతే కాదు, దీనికి సామాజిక, ఆర్థిక కారణాలు కూడా అడ్డొస్తున్నాయి. సంతానోత్పత్తికి సంబంధించిన సైన్స్, మెడిసిన్ ప్రపంచం పూర్తిగా మహిళల శరీరంపై కేంద్రీకృతమై ఉంది. ఇందులో పురుషులను నిర్లక్ష్యం చేశారు.
ఉదాహరణకు గైనకాలజిస్ట్ ఏం చేస్తారో, ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ ఆండ్రాలజిస్ట్ గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. పురుషుల సంతానోత్పత్తికి సంబంధించిన నిపుణులను ఆండ్రాలజిస్ట్ అంటారు.

ఫొటో సోర్స్, Getty Images
పరిశోధనలు ఎందుకు ముందుకుసాగలేదు
మహిళల గర్భనిరోధక మాత్రలు వచ్చిన చాలా దశాబ్దాల తర్వాత పురుషుల కోసం అలాంటి మాత్రలు తయారు చేయాలనే ప్రయత్నం మొదలైంది., ఆ తర్వాత నిధుల లోటు ఎదురవడంతో ఆ పరిశోధనలు అటకెక్కాయి.
పురుషుల కోసం తయారైన ఇలాంటి మాత్ర 'క్లీన్ షీట్స్' పై రీసెర్చ్ ఆగిపోయి ఉంది. ఈ గర్భనిరోధక మాత్ర సెక్స్ సమయంలో పురుషులకు వీర్యం తయారవకుండా చేస్తుంది. నిజానికి వీర్యం బయటకు రావడాన్ని పురుషుల సెక్సువాలిటీలో కీలకంగా భావిస్తారు.
అయితే చాలా దశాబ్దాల క్రితం జరిగిన పరిశోధనల ప్రకారం సుదీర్ఘ కాలం లైంగిక సంబంధాల్లో ఉండే మహిళలకు తమ పురుష భాగస్వామిపై చాలా నమ్మకం ఉంటుంది. ఇక కాజువల్ సెక్స్ విషయానికి వస్తే పురుషులు ఒక వేళ గర్భనిరోధకాలు ఉపయోగించినా మహిళలు వారిని పెద్దగా నమ్మడం జరగదు.

ఫొటో సోర్స్, iStock
అది మహిళల పని
గర్భనిరోధకాలు ఉపయోగించడం మహిళల పనిగా సమాజంలో చూస్తున్నారు. పురుషులు గర్భనిరోధకాలు వాడరనే భావన కూడా ఉంది.
అయితే ఇప్పుడు జెండర్ పాత్ర మారుతోంది. పురుషులు ఇంటి బాధ్యతలు తీసుకోవడం, పిల్లలను చూసుకోవడం లాంటి పనులు కూడా చేస్తున్నారు.
ఈ సమానత్వం గర్భనిరోధకాల వరకూ వెళ్లచ్చు. ఎందుకంటే దీనిపై జరిగిన అధ్యయనాల్లో యువకులు గర్భనిరోధకాలు ఉపయోగించడాన్ని కూడా పంచుకునే ఒక బాధ్యతలాగే చూస్తున్నట్టు చెబుతున్నాయి.
పురుషుల్లో బాగా చదువుకున్నవారు, ఆధిపత్యం చూపేవారు, సంప్రదాయపరంగా లైంగిక పాత్రను నమ్మని కొన్ని సమూహాల్లో పురుషుల గర్భనిరోధక మాత్రలు ఎప్పుడు వస్తాయా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అయితే, పురుషులు ఈ గర్భనిరోధక మాత్రలను స్వాగతిస్తున్నంత మాత్రాన మగాళ్లందరూ వాటిని ఉపయోగిస్తారని కూడా చెప్పలేం.
వేసక్టమీ విషయంలో మనం దాన్ని చూడచ్చు. పురుషుల వేసక్టమీ ప్రక్రియ 200 ఏళ్ల క్రితమే మొదలైంది. కానీ పిల్లలు పుట్టకుండా మహిళలకు చేసే ఆపరేషన్లు, పురుషులతో పోలిస్తే పది రెట్లు ఎక్కువగా జరుగుతున్నాయి.
పురుషుల గర్భనిరోధక మాత్రలను తయారు చేయడానికి సామాజిక, ఆర్థిక సవాళ్లను అధిగమించాలి. అందులో అత్యంత అవసరమైన మొట్టమొదటి అడుగు లైంగిక సమానత్వ పరిధిని పెంచడం.
పురుషుల గర్భనిరోధక మాత్ర కోసం మనం 50 ఏళ్ల నుంచీ వేచిచూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మరో 50 ఏళ్లు ఎదురుచూద్దాం అంటే కుదరదు.


'100 మంది మహిళలు' జాబితా ఏంటి?
బీబీసీ '100 వుమన్' సిరీస్ 2013 నుంచి ఏటా స్ఫూర్తిదాయకమైన, ప్రభావవంతమైన 100 మంది మహిళల గాథలను ప్రపంచవ్యాప్తంగా పాఠకులు, వీక్షకుల ముందుకు తెస్తోంది.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో #100Women హ్యాష్ ట్యాగ్‌తో బీబీసీ న్యూస్ తెలుగును అనుసరించండి.
ఇవి కూడా చదవండి:
- మెట్రో రైలు చార్జీల పెంపుపై నిరసన: దేశ రాజధానిలో హింస.. ముగ్గురి మృతి
- మహిళా ఆవిష్కర్తలు తక్కువ మందే ఉంటారెందుకు
- గర్భస్థ శిశువుల చేతుల్లో తొండల మాదిరి కండరాలు... పుట్టిన తరువాత ఏమై పోతున్నాయి...
- మధ్యాహ్న భోజన పథకం: దక్షిణ భారత్‌లో అమలవుతోంది, ఉత్తరాదిలో ఎందుకు కావడం లేదు
- భూమిలో మూడు అడుగుల లోతులో పాతిపెట్టారు.. బతికి బయటపడ్డ చిన్నారి
- 'మా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి' అని వీళ్లు కోర్టును ఎందుకు కోరుతున్నారు
- వయసులో ఉన్న స్త్రీలు గర్భసంచులను ఎందుకు తీయించుకుంటున్నారు
- మనుషుల అవయవాలు జంతువుల్లో వృద్ధి - ఈ పరిశోధనల లక్ష్యం ఏంటి
- 'మీరిలా చేస్తే గుండెపోటు వచ్చిన వ్యక్తి ప్రాణాలు కాపాడొచ్చు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








