భూమిలో మూడు అడుగుల లోతులో పాతిపెట్టారు.. బతికి బయటపడ్డ చిన్నారి

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి

ఫొటో సోర్స్, Anoop Kumar Mishra

ఫొటో క్యాప్షన్, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి

ఉత్తరప్రదేశ్ బరేలీలో ఒక నవజాత శిశువును సజీవంగా భూమిలో పాతిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది.

ఒక గ్రామంలో మట్టి గుంతలో ఉన్న ఒక కుండలో పాప సజీవంగా ఉన్నట్టు గ్రామస్థులు గుర్తించినట్లు పోలీసులు మీడియాకు చెప్పారు.

"పుట్టిన కొన్ని నిమిషాలకే చనిపోయిన కూతురిని పూడ్చి పెట్టడం కోసం ఒక తండ్రి గుంత తవ్వుతున్న సమయంలో ఒక కుండలో ఉన్న పాప బతికుండడం గుర్తించాడు" అని ఎస్పీ అభినందన్ సింగ్ మీడియాకు చెప్పారు.

"ఆ నవజాత శిశువును ఒక కుండలో పెట్టి భూమిలో మూడు అడుగుల లోతులో పూడ్చిపెట్టారు. పాప బతికుందని తెలిసిన తర్వాత ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాం. ప్రస్తుతం చిన్నారికి చికిత్స అందిస్తున్నారు" అన్నారు.

ఆ చిన్నారికి చికిత్స అందిస్తున్న వైద్యులు మాత్రం పాప పరిస్థితి అప్పుడే ఏమీ చెప్పలేమంటున్నారు.

మీడియాతో మాట్లాడిన ఎన్ఐసీయూ ఇంచార్జ్ డాక్టర్ విమల్ కుమార్ "పాప పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. చిన్నారికి హైపోథెర్మియా ఉంది. ఫీడ్ తీసుకోవడం లేదు. అందుకే ఆరోగ్య పరిస్థితి స్థిరంగా లేదు. చికిత్స అందిస్తున్నాం. అప్పుడే ఏదీ చెప్పలేం" అన్నారు.

కుండలో సజీవంగా కనిపించిన చిన్నారి

సంచిలో కుండ, ఆ కుండలో పాప

పోలీసులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు.

"మేం ఆ చిన్నారి తల్లిదండ్రులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాం. ఇద్దరూ కలిసే పాపను సజీవంగా పాతిపెట్టి ఉంటారని మాకు అనుమానంగా ఉంది" అని ఎస్పీ చెప్పారు.

"నేను గుంత తవ్వుతున్నప్పుడు మూడు అడుగుల లోతులో ఒక మట్టి కుండ తగిలింది. అందులో ఉన్న పాప బతికుండడం కనిపించింది. దాంతో ఆ చిన్నారిని బయటకు తీశాను" అని చిన్నారిని గుర్తించిన గ్రామస్థుడు చెప్పాడు.

అతని భార్య పూజ మీడియాతో "మా ఆడపడుచుకు నిన్న పాప పుట్టింది. పాప తల వెనుక భాగం సరిగా పెరగలేదని డాక్టర్ చెప్పారు. అబార్షన్ చేయాలన్నారు. దాంతో మేం అబార్షన్ చేయించాం. పుట్టగానే చనిపోయిన పాపను ఖననం చేయడానికి నా భర్త, ఆడపడుచు భర్త స్మశానానికి తీసుకెళ్లారు. అక్కడ గుంత తీసేటపుడు, ఇంకో పాప కనిపించింది. ఒక పెద్ద కుండలో చిన్నారిని పెట్టారు. ఆ పాపకు బట్టలు కూడా వేసున్నారు" అని చెప్పారు.

కుండలో సజీవంగా కనిపించిన చిన్నారి
ఫొటో క్యాప్షన్, పాప దొరికిన ప్రాంతం

భ్రూణ హత్యలు

భారత్‌లో లైంగిక నిష్పత్తి ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే చాలా దారుణంగా ఉంది. సామాజికంగా మహిళల పట్ల వివక్ష ఉంది. ఆడపిల్లలను ఆర్థికంగా భారంగా భావిస్తున్నారు. ఇది పేద సమాజాల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

భారత్‌లో కొడుకులకే ప్రాధాన్యం ఇస్తుండడంతో, చాలా ఏళ్ల నుంచీ లక్షలాది బాలికల భ్రూణ హత్యలు జరుగుతున్నాయి అని సామాజిక కార్యకర్తలు చెప్పారు.

అక్రమంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న క్లినిక్‌లు గర్భంలో ఆడ శిశువులు ఉన్న విషయం చెప్పడంతోపాటు, గర్భస్రావాలు కూడా చేస్తున్నాయి. దీనితోపాటు ఆడపిల్లలు పుడితే వారిని చంపేయడం కూడా ఎక్కువగా జరుగుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)