మధ్యాహ్న భోజన పథకం: దక్షిణ భారత్‌లో అమలవుతోంది, ఉత్తరాదిలో ఎందుకు కావడం లేదు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రితికా ఖేరా
- హోదా, ఐఐఎం - అహ్మదాబాద్
పిల్లల్ని ఏ పాఠశాలకు పంపించాలని నిర్ణయం తీసుకోవడంలో మధ్యాహ్న భోజన పథకం ప్రధాన పాత్ర పోషిస్తోంది. తెల్లవారితే జీవనోపాధి బాట పట్టే తల్లిదండ్రులకు ఈ పథకంతో ఎంతో ఉపశమనం లభిస్తోంది.
బడుల్లోనే చిన్నారులు పొట్ట నింపుకోవడంతో వారికి సౌకర్యంగా ఉంటోంది. మరోవైపు పిల్లల మధ్య తారతమ్యాలను మధ్యాహ్న భోజన పథకం తగ్గిస్తోంది. నా డబ్బాలో ఏముంది? నీ డబ్బాలో ఏముంది? అంటూ పిల్లలు ఒకరితో మరొకరు పోల్చుకోవడమూ తగ్గుతోంది.
మధ్యాహ్న భోజన పథకంలో రెండు అంశాల గురించి ప్రధానంగా చర్చించుకోవాలి. వాటిలో మొదటిది పిల్లల్ని తెల్లవారగానే పాఠశాలకు పంపించడం. ఇది అంతతేలిక కాదు. వారిని నిద్రలేపడంతో మొదలుపెడితే.. స్కూల్‌డ్రెస్ వేయడం, బ్యాగ్ సర్దడం, టిఫిన్ తినిపించడం, మధ్యాహ్నం తినడం కోసం బాక్సు సిద్ధం చేయడం ఇలా అన్ని పనులు దగ్గరుండి చేయాల్సిందే. ఒకవేళ మధ్యాహ్నం స్కూల్‌లోనే భోజనం పెడితే.. పనులకు వెళ్లే మహిళలకు కొంత పని తగ్గుతుంది.
చాలామంది పేదలు తమ పిల్లలను ఖాళీ కడుపుతోనే చదువుకోవడానికి పంపుతున్నారు. పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత భోజనం పెడుతున్నారు. కడుపు ఆకలి కేకలు పెడుతుంటే పిల్లలు చదువుపై అసలు దృష్టి పెట్టగలరా? ఈ కోణంలో చూస్తే మధ్యాహ్న భోజన పథకం ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తుంది. కొత్త విద్యార్థుల సంఖ్య, పిల్లల హాజరు శాతం పెరగడంతోపాటు అభ్యాస నైపుణ్యాలను మెరుగు పరచడంలోనూ ఇది తోడ్పడుతుంది. మరోవైపు పోషకాహార లోపంపై పోరాటంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
రెండోది సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో మధ్యాహ్న భోజన పథకం పాత్ర ఎంతో ఉంది. బడి గంట మోగగానే పిల్లలు చేతులు కడుక్కొని, ప్లేట్లు పట్టుకొని వరుసలో కూర్చుంటారు. అంతా కలిసి భోజనం చేస్తారు. వీటిలో ప్రతిచర్యా దేనికదే ముఖ్యమైనది. చేతులు, ప్లేట్లు కడుక్కోవడమనేది వ్యక్తిగత శుభ్రతకు తొలి మెట్టు. ఆరోగ్యంపైనా ఇది అవగాహన కల్పిస్తుంది. వరుసలో నిలబడటాన్ని క్రమశిక్షణలో భాగంగా చెబుతుంటారు. కలిసి కూర్చుని తినడం... మనమంతా ఒకటేనని చెప్పకనే చెబుతుంది. ప్రజాస్వామ్య పాఠంలో ఇది మొదటిది.
(పాఠశాలలో భోజనాలతో ఎంతో సాధించొచ్చని జపాన్‌లో తీసిన ఈ వీడియో చెబుతోంది)
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ఎన్నో ప్రయోజనాలను చేకూర్చే ఇలాంటి మధ్యాహ్న భోజన పథకం ప్రాముఖ్యతను భారత్‌లో చాలామంది గుర్తించకపోవడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఈ పథకం అమలులో రాష్ట్రాల మధ్య వ్యత్యాసం, మీడియాలో వస్తున్న వార్తలు దీనికి కారణం కావొచ్చు. చివరిసారిగా 2013లో మధ్యాహ్న భోజన పథకం దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఓరోజు విషతుల్యమైన ఆహారం తీసుకోవడంతో బిహార్‌లో 23 మంది మృత్యువాతపడ్డారు. ఘటన జరిగిన పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేవు. పైగా అక్కడి వంట నూనెను పురుగుల మందు వేసిన డబ్బాలో పోశారు.
అయితే 12 కోట్ల మంది చిన్నారులు హాయిగా పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు. దేశంలో చాలాచోట్ల ఈ పథకం చక్కగా అమలవుతోంది. ఈ విషయాన్ని మీడియాతోపాటు ప్రజలు కూడా గుర్తించట్లేదు.

ఫొటో సోర్స్, SHAWN SEBASTIAN
ఇదీ చరిత్ర
1995లో మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంతకు ముందు.. 1950లలోనే తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో ఈ పథకం అమలయ్యేది. దీన్ని రాష్ట్రం మొత్తానికీ అమలుచేసేలా అప్పటి ముఖ్యమంత్రి ఎంజీఆర్ చర్యలు తీసుకున్నారు. ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత, మీడియా అపహాస్యాల నడుమ ఈ పథకాన్ని పటిష్ఠంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేసింది. కరుణానిధి సహా తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలన్నీ దీన్ని కొనసాగించాయి. గుజరాత్‌తోపాటు మధ్యప్రదేశ్, ఒడిశాలలోని కొన్ని ప్రాంతాలు కూడా తమిళనాడు బాటలో నడిచాయి.
కేంద్ర ప్రభుత్వ పథకం ప్రకారం.. వండిన భోజనాన్నే పిల్లలకు రాష్ట్రాలు అందించాలి. అయితే, చాలా రాష్ట్రాలు పిల్లలకు సరకులు ఇచ్చి పంపించేవి. 2001లో ఈ పద్ధతి మారింది. పథకాన్ని యథాతథంగా అమలుచేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని భయపడిన రాష్ట్రాలు వెంటనే చర్యలకు ఉపక్రమించాయి.
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం జులై 2002 నుంచి వండిన భోజనాన్ని పాఠశాలల్లోనే పిల్లలకు వడ్డించడం మొదలుపెట్టాయి. అయితే అప్పటికీ చాలా పాఠశాలలకు వంట మనిషి, సహాయకులతోపాటు వంటగదులు, గిన్నెలు లాంటి సదుపాయాలు కూడా అందుబాటులో ఉండేవి కాదు. అయినప్పటికీ పిల్లలకు భోజనం పెట్టేందుకు ప్రయత్నించేవారు.

ఫొటో సోర్స్, Twitter/ncbn
అప్పట్లో రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఓ చిన్న సర్వే చేపట్టాం. అక్కడ ఆహారాన్ని వండేందుకు అవసరమైన నీరు, వంట చెరకు కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులే స్వయంగా వెళ్తున్నట్లు దానిలో తేలింది. వంట చేయడంలో పిల్లలు, టీచర్లు పాలుపంచుకోవడంతోపాటు మౌలిక సదుపాయాలూ సరిగా ఉండటంలేదనే వార్తలు ఎక్కువ కావడంతో రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగింది. దీంతో చర్యలకు ఉపక్రమించాయి.
క్రమంగా వంటవారు, సహాయకులను నియమించుకోవడం మొదలైంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో వంట గదులు, నీటి సదుపాయాలు ఏర్పాటయ్యాయి. అయితే అన్ని రాష్ట్రాల్లోనూ ఈ పురోగతి ఒకేలా లేదు. బిహార్ గాడిన పడేందుకు దాదాపు మూడేళ్లు పట్టింది.
రోజూ క్రమం తప్పకుండా వంట వండటమనేది తొలినాటి మధ్యాహ్న భోజన పథక తొలి లక్ష్యం. మొదటి దశాబ్దం (2002-12)లో దీనిపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. దశాబ్దం చివరినాటికి ఈ పథకం అమలు తప్పనిసరైంది. భోజనం పెట్టని పాఠశాలలు తరచూ వార్తలో నిలిచేవి.

ఫొటో సోర్స్, SWATI NARAYAN
రెండో తరం లక్ష్యం వేరు
గత దశాబ్దంలో భోజనంలో పోషక స్థాయుల పెంపుపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. ఈసారి కూడా దక్షిణాది రాష్ట్రాలే ఈ పథకం అమలులో ముందున్నాయి. తమిళనాడుతోపాటు కొంతవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా మధ్యాహ్న భోజన పథకంలో రోజూ గుడ్డును ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టింది. కొన్ని రాష్ట్రాలు వారాల వారీ మెనూను సిద్ధం చేయడం ప్రారంభించాయి. అయితే చాలాచోట్ల ఈ మెనూను పాఠశాలలు సరిగ్గా పాటించట్లేదు. ఉత్తర్ ప్రదేశ్ (యూపీ)లో మీర్జాపూర్‌లో అయితే ఉప్పు నంజుకొని రోటీలు తినమంటున్నారనే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది.
మధ్యాహ్న భోజన పథకం సహా సామాజిక భద్రతా పథకాల అమలులో అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తున్న రాష్ట్రాల్లో యూపీ కూడా ఒకటి. అయితే భారత్ అంటే ఉత్తర్ ప్రదేశ్ మాత్రమే కాదని గుర్తుపెట్టుకోవాలి.
మధ్యాహ్న భోజన పథకం లాంటి సామాజిక భద్రతా పథకాలను పటిష్ఠంగా అమలుచేసే తమిళనాడుతోపాటు ఇప్పటివరకూ వెనుకబడిన రాష్ట్రంగా భావించిన ఒడిశా లాంటి రాష్ట్రాలు కూడా చిన్నారుల సంరక్షణలో నిబద్ధతను కనబరుస్తున్నాయి.
మధ్యాహ్న భోజన పథకంతోపాటు ఐసీడీఎస్‌లోనూ ఒడిశా ప్రభుత్వం గుడ్లను పంపిణీ చేస్తోంది. మూడు నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారులకు అంగన్వాడీల్లో వారానికి ఐదుసార్లు, పాఠశాలల్లో వారానికి రెండు సార్లు అందిస్తోంది. కర్నాటక మినహా దక్షిణాది రాష్ట్రాలు, కొన్ని తూర్పు రాష్ట్రాలు పాఠశాలల్లో గుడ్లను పంపిణీ చేస్తున్నాయి. ఉత్తర భారతంలో ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ఈ పథకం అమలు చెప్పుకోదగిన స్థాయిలో లేదు. గుడ్లను పంపిణీ చేయాలనే ప్రతిపాదన ఇక్కడ రాజకీయాలకు కేంద్ర బిందువైంది.
అసలు గుడ్లనే ఎందుకు పంపిణీ చేస్తున్నారు?
వీటిలో చాలా పోషకాలుంటాయి. మరోవైపు గ్రామాల్లో వీటి పంపిణీతో చాలా ప్రయోజనాలుంటాయి. మాంసం, పాలు లాంటి ఇతర మాంస ప్రొటీన్లతో పోలిస్తే ఇవి అంత త్వరగా చెడిపోవు. ఇతర ఆహార పదార్థాల కంటే వీటిలో ఎక్కువ పోషకాలుంటాయి.
అయితే కొందరి నుంచి గుడ్ల పంపిణీపై అభ్యంతరాలు వస్తున్నాయి. బలవంతంగా పిల్లలతో గుడ్లు తినిపించాలనే ప్రతిపాదనేదీ లేదు. శాకాహారులను ఎలాగైతే బలవంత పెట్టకూడదో.. మాంసాహారులనూ తినకుండా అడ్డుకోకూడదు. కర్నాటకలో గుడ్ల పంపిణీని మొదలుపెట్టకుండా పదేపదే అడ్డుకుంటున్నారు. అక్కడ ఓ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించినప్పుడు ఆశ్చర్యానికి గురయ్యాను. శాకాహార కుటుంబాలకు చెందిన తల్లులు.. తమ పిల్లలకు గుడ్లు పెట్టాలని టీచర్లను అడుగుతున్నారు. పోషకాలపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహనతో భవిష్యత్తులో మార్పులు వచ్చే అవకాశముంది.

ఫొటో సోర్స్, Getty Images
వార్తల్లో రెండు రాష్ట్రాలు
ఈ పథకం అమలులో ఎదురవుతున్న అవరోధాలను తొలగించేందుకు కొన్ని రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు ఆవిష్కరణలు, మెరుగైన విధానాలతో ముందుకు వెళ్తున్నాయి.
అయితే ఇటీవల ఉత్తర్ ప్రదేశ్‌లోని మీర్జాపుర్‌లో ఓ పాఠశాలలో ఉప్పుతో రోటీలు తినమని పిల్లలకు పెడుతున్న దృశ్యాలు వార్తల్లో నిలిచాయి. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వైరుద్ధ్యమైన స్పందనలు వచ్చాయి. మొదట తప్పును జిల్లా పరిపాలన విభాగం అధికారులు అంగీకరించారు. అయితే కొద్దిసేపటికే ఘటనను వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టుపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయించారు. మరోవైపు జర్నలిస్టును తప్పుపట్టేలా స్థానికులపై ఒత్తిడి చేశారు. గ్రామంలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయించారు. పాఠశాలకు కొత్త గ్యాస్ స్టవ్ కూడా అందించారు. ప్రస్తుతం కూరగాయలు కూడా సరఫరా చేస్తున్నారు.
మరోవైపు పశ్చిమ్ బెంగాల్ నుంచి కూడా ఇలాంటి వార్త ఒకటి వచ్చింది. ఈ ఘటనను బీజేపీ ఎంపీ వెలుగులోకి తీసుకొచ్చారు. దీంతో వెంటనే మెనూను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. చేపలను కూడా మెనూలో చేర్చింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవడంతో ఈ ఘటనపై పెద్దగా చర్చ జరగలేదు. జరుగుతున్న పరిణామాలను పట్టించుకోకుండా మీడియాతో దురుసుగా ప్రవర్తించి యూపీ ప్రభుత్వం వివాదానికి కేంద్ర బిందువైంది.
ఇవి కూడా చదవండి:
- పిల్లల్లో పోషకాహార లోపానికి బ్యాక్టీరియాతో పరిష్కారం దొరుకుతుందా
- ఒక్క ఏడాదిలో 12 లక్షల మంది పిల్లలు చనిపోయారు
- గుడ్లు ఎక్కువగా తింటే గుండె జబ్బులు వస్తాయా...
- ఇంతమంది చిన్నారులు ఎందుకు చనిపోతున్నారు...
- ఆహార వృథాయే ఆకలి కేకలకు అసలు కారణమా?
- అత్యధిక పోషక విలువలున్న 25 ఆహార పదార్థాలు ఇవే
- పిల్లలు లావైపోతున్నారా, ఏం చేయాలి?
- ఎవరు ఎక్కువ ఆరోగ్యవంతులు.. మగవాళ్లా లేక ఆడవాళ్లా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








