విదేశాలకు వెళ్లాలనే కోరిక ముందు కులం ఓడిపోయింది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దల్జీత్ అమీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
పంజాబీ పత్రికల్లో పెళ్లి సంబంధాల ప్రకటనల తీరును చూస్తే చాలు, మారుతున్న సామాజిక ధోరణి కళ్లకు కడుతుంది. సాధారణంగా పెళ్లి ప్రకటనల్లో యువతీయువకుల రూపురేఖలు, రంగు, కులం, విద్యార్హతలు, ఉద్యోగాలు, ఆస్తుల వివరాలు ఉంటాయి. కానీ గత రెండు దశాబ్దాలుగా వాటిల్లో చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తోంది.
మొదటి ప్రకటన: ఆస్ట్రేలియాలో ఉంటున్న జాట్ యువకునికి ఐఈఎల్‌టీఎస్‌లో కనీసం ఆరు బ్యాండ్స్ వచ్చిన యువతి కావలెను. ఖర్చులు యువకుని తరపు వాళ్లవే. కోర్టులో పెళ్లి.
ఆ తర్వాత కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది.
రెండో ప్రకటన: జాట్ యువకునికి ఆరు బ్యాండ్స్ వచ్చిన యువతి కావలెను. ఖర్చులు యువకుని తరపువాళ్లవే. కులం పట్టింపు లేదు.
మూడో ప్రకటన: కెనడా పౌరసత్వం కలిగిన జాట్ యువకునికి తగిన యువతి కావలెను. భారతదేశంలోనే ఉన్న సోదరుణ్ని సంప్రదించండి.
నాలుగో ప్రకటన: బ్రిటన్ పౌరసత్వం కలిగిన జాట్ యువతికి కష్టించి పని చేసే అందమైన యువకుడు కావాలి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ధోరణులపై చర్చించే ముందు, ఈ ప్రకటనలను కొంచెం నిశితంగా గమనించాలి.
వీటన్నిటిలో ఎక్కువగా కనిపించే అంశం ఐఈఎల్‌టీఎస్. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజీల్యాండ్ తదితర దేశాలకు వీసా రావాలంటే ఐఈఎల్‌టీఎస్ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. స్టూడెంట్ వీసాలతో పాటు, జీవిత భాగస్వామి (యువతి/యువకుడు) వీసా కూడా లభిస్తుంది. అందుకే ఒక తప్పనిసరి అర్హతగా మారిన ఐఈఎల్‌టీఎస్ అనేక సంప్రదాయ భావాలను మారుస్తోంది.
పంజాబీ సమాజంలో ఈ కొత్త అర్హత మిగతా సంప్రదాయ అంశాలనన్నిటినీ వెనక్కి నెట్టేస్తోంది. ఈ కొత్త అర్హత పంజాబ్ సమాజం ఆకాంక్షలను, దాని దిశను సూచిస్తుంది. పంజాబ్ యువత తమ కలలను నిజం చేసుకోవడానికి కులాన్ని పక్కన పెట్టడం కనిపిస్తుంది.
అమ్మాయి తరపు వారే పెళ్లి ఖర్చులు పెట్టుకోవడం పంజాబ్‌లో సర్వసాధారణం. కానీ పంజాబ్‌లోని పెళ్లి ప్రకటనల్లో ఈ ధోరణి మారడం స్పష్టంగా గమనించవచ్చు. అంటే ఐఈఎల్‌టీఎస్‌తో పెళ్లి మార్కెట్‌లో యువతులకు డిమాండ్ పెరిగింది. అందుకే యువకులు అమ్మాయిల కుటుంబాలు విధించే షరతులను పాటించడానికి సిద్ధంగా ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ధోరణిని బట్టి, పంజాబ్ సంప్రదాయ వివాహ సంబంధాలలో మార్పులు వస్తున్నట్లు గమనించవచ్చు. సాధారణంగా పంజాబీ హిందువులు, సిక్కులు తమ కులం లోపల, తమ గోత్రానికి బయట వివాహాలు చేసుకుంటారు. తమ తల్లి తరపు బంధువులను కానీ, తండ్రి తరపు బంధువులను కానీ పెళ్లి చేసుకోరు. అయితే ఈ వివాహ ప్రకటనలను బట్టి చూస్తే, కనీసం ఐఈఎల్‌టీఎస్ విషయంలో అలాంటి సంప్రదాయాలను పక్కన పెడుతున్న ధోరణి కనిపిస్తుంది.
ఐఈఎల్‌టీఎస్‌లో అర్హత సాధించడానికి ప్రాముఖ్యం పెరుగుతున్న దృష్ట్యా, పెళ్లిళ్లలో కులం ప్రస్తావన తగ్గిపోయి, 'కులరహిత' భావన పెరిగిపోతోంది. ఐఈఎల్‌టీఎస్ ప్రస్తావన లేని ప్రకటనల్లో మాత్రం మనకు ఇలాంటి మినహాయింపులు కనిపించవు. అయితే ఏ సంస్థ వద్దా కూడా దీనికి సంబంధించిన పూర్తి గణాంకాలు లేవు.
కులం పునాదులు చాలా బలమైనవి. కానీ పంజాబ్ సమాజాన్ని గమనిస్తే, విదేశాలకు వెళ్లాలనే కోరిక... కులం పునాదుల కన్నా బలమైనదని స్పష్టమవుతుంది.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









