బంగ్లాదేశ్ క్రికెటర్లు సమ్మె.. సందిగ్ధంలో భారత పర్యటన.. ఆ దేశ ప్రధానితో మాట్లాడానన్న గంగూలీ

షకీబ్ అల్ హసన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షకీబ్ అల్ హసన్

డిమాండ్ల సాధన కోసం బంగ్లాదేశ్ క్రికెటర్లు సమ్మెకు దిగడంతో, నవంబర్లో ఆ జట్టు భారత పర్యటన సందిగ్ధంలో పడింది.

కానీ, కొత్తగా బీసీసీఐ పగ్గాలు అందుకున్న సౌరవ్ గంగూలీ మాత్రం బంగ్లాదేశ్ జట్టు భారత్ వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత్-బంగ్లా టెస్ట్ మ్యాచ్ చూడ్డానికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కూడా వస్తానని చెప్పారని, ఆ దేశ జట్టు ఎందుకు రాదో చూద్దాం అన్నారు.

అన్ని క్రికెట్ పోటీలను బహిష్కరిస్తున్నామని బంగ్లాదేశ్ టాప్ ఆటగాళ్లు సోమవారం ప్రకటించారు.

ఢాకాలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన టెస్ట్, టీ20 కెప్టెన్ షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, ముష్ఫికర్ రహీమ్.. క్రికెటర్ల 11 డిమాండ్లకు అంగీకరించేవరకూ ఎలాంటి క్రికెట్ పోటీల్లో ఆడేది లేదని చెప్పారు.

వీరితోపాటు దాదాపు 50 మంది క్రికెటర్లు అదే నిర్ణయం తీసుకున్నారు.

వేతనాలు పెంచాలని, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, దేశవాళీ వన్డే టోర్నీల్లో మార్పులు తీసుకురావాలని బంగ్లాదేశ్ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు.

బంగ్లాదేశ్ క్రికెటర్ల సమ్మె

ఫొటో సోర్స్, Bangladesh Cricket Board/website

ఇది ఆటగాళ్ల 'కుట్ర': బీసీబీ

బంగ్లాదేశ్ క్రికెటర్లు సమ్మె చేయడాన్ని ఆ దేశ క్రికెట్ తప్పు పట్టింది. దేశ క్రికెట్‌ను బలహీనపరచడానికి చేస్తున్న కుట్రగా వర్ణించింది.

అటగాళ్ల నిర్ణయంతో మంగళవారం అత్యవసరంగా సమావేశమైన బీసీబీ డైరెక్టర్లు ఆటగాళ్ల తీరుపై మండిపడ్డారు.

"వాళ్లకు ఆడాలని లేకపోతే, వాళ్లు ఆడరు. మీరు ఆడకపోతే ఏం సాధిస్తారు. డిమాండ్ల కోసం మీరు ఆడకూడదని ఎందుకు అంటున్నారో నాకు అర్థం కావడం లేదు" అని బీసీబీ అధ్యక్షుడు నాజ్ముల్ హసన్ అన్నారు.

టీమిండియాతో నవంబర్లో జరిగే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం బంగ్లాదేశ్ భారత్ రానుంది. సమయానికి ఈ వివాదం పరిష్కరించకపోతే ఆ పర్యటన ప్రమాదంలో పడనుంది.

ఆటగాళ్ల సమ్మె ప్రభావం దేశంలో జరుగుతున్న నేషనల్ క్రికెట్ లీగ్ ఫస్ట్ క్లాస్ టోర్నీపై కూడా పడింది.

"మా డిమాండ్లకు అంగీకరిస్తే, మేం మళ్లీ బరిలోకి దిగుతాం" అని స్టార్ ఆల్ రౌండర్, బంగ్లాదేశ్ టీ20 జట్టు కెప్టెన్ షకీబ్ చెప్పాడు.

"మేమంతా క్రికెట్ మెరుగు పడాలనే కోరుకుంటున్నాం. మాలో కొంతమంది మరో పదేళ్లు ఆడగలరు. కొంతమంది నాలుగైదేళ్లు ఆడగలరు. కానీ మేం మా తర్వాత వచ్చే ఆటగాళ్లకు ఒక మంచి వాతావరణం ఉండేలా చేయాలనుకుంటున్నాం. అలా బంగ్లాదేశ్ క్రికెట్ మరింత ముందుకు వెళ్తుంది" అన్నాడు.

ఇటు బీసీబీ అధ్యక్షుడు హసన్ మాత్రం "చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయి. కానీ ఆటగాళ్లే స్పందించడం లేదు. ఇది షాకింగ్.. మా ఆటగాళ్లు ఇలా చేస్తారని నేను అసలు ఊహించలేదు. ఈ కుట్ర వెనక ఎవరున్నారో గుర్తిస్తాం" అన్నారు.

బంగ్లాదేశ్ క్రికెటర్ల సమ్మె

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మీడియాతో బంగ్లాదేశ్ టెస్ట్, టీ20 కెప్టెన్ షకీబ్ అల్ హసన్(మధ్యలో)

బంగ్లాదేశ్ ఆటగాళ్ల డిమాండ్లు

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆటగాళ్లకు ఒక మ్యాచ్‌కు లక్ష బంగ్లాదేశీ టకాలు( దాదాపు 84 వేల రూపాయలు) చెల్లించాలని ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. అంటే తమ వేతనాలను 300 శాతం పెంచాలని కోరుతున్నారు.

గ్రౌండ్స్‌మెన్, లోకల్ కోచ్‌లు, అంపైర్లు, ఫిజియోలు, ట్రైనర్ల జీతాలు కూడా పెంచాలని ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ఉన్న మైదానాలు మెరుగు పరిచేందుకు, ఇండోర్ నెట్లకు, జిమ్స్, పరికరాలకు మరింత పెట్టుబడులు పెట్టాలని అడుగుతున్నారు.

దేశవాళీ పోటీల్లో కొన్ని మార్పులు కూడా ప్రతిపాదించారు. టీ20 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ మళ్లీ ఫ్రాంచైజీ మోడల్ కావాలని, 50 ఓవర్ల ఢాకా ప్రీమియర్ లీగ్‌లో ఆటగాళ్లు తమ జట్టును ఎంచుకునే స్వేచ్ఛను ఇవ్వాలని, వేతనాలపై మరోసారి చర్చించాలని చెప్పారు.

క్రికెటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకత్వం కూడా పదవి నుంచి దిగిపోవాలని, తర్వాత కమిటీని ఎన్నుకునేందుకు ఆటగాళ్లను అనుమతించాలని కూడా బంగ్లాదేశ్ క్రికెటర్లు కోరుతున్నారు.

బంగ్లాదేశ్ క్రికెటర్ల సమ్మె

ఫొటో సోర్స్, Getty Images

ప్రధాని వస్తానన్నారు.. జట్టు రాదా?: గంగూలీ

కొత్తగా బీసీసీఐ అధ్యక్షుడుగా బాధ్యతలు అందుకున్న సౌరవ్ గంగూలీకి ఈ సిరీస్ ఇప్పుడు సవాలుగా మారింది.

బంగ్లాదేశ్ టాప్ ఆటగాళ్లందరూ సమ్మె చేస్తున్నా, ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ఒక టెస్ట్ మ్యాచ్‌కు హాజరవడానికి అంగీకరించడంతో ఈ సిరీస్ ముందు అనుకున్నట్టే జరుగుతుందని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు.

"అది వారి అంతర్గత విషయం. కానీ, బంగ్లాదేశ్ ప్రధాని కోల్‌కతాలో జరిగే టెస్ట్ మ్యాచ్‌కు హాజరవుతానని చెప్పారు. ఆమే దానికి అంగీకరించినపుడు, వారి జాతీయ జట్టు ఎలా రాకుండా ఉంటుందో చూద్దాం" అని గంగూలీ మీడియాకు చెప్పారు.

నవంబర్ 3 నుంచి భారత్‌లో పర్యటించే బంగ్లాదేశ్ టీమిండియాతో మూడు టీ-20 మ్యాచ్‌లు కూడా ఆడుతుంది. ప్రపంచ చాంపియన్‌ షిప్‌లో భాగంగా రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది.

బంగ్లాదేశ్ ఈ పర్యటనను వదులుకుంటే టెస్ట్ సిరీస్‌లో భారత్ గెలిచినట్లు ఐసీసీ నిర్ణయిస్తుంది. దాంతో భారత్ ఖాతాలో 120 పాయింట్లు చేరుతాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)