ఎస్సెక్స్: లారీ కంటైనర్‌లో 39 మృతదేహాలు.. 25ఏళ్ల లారీ డ్రైవర్ అరెస్ట్..

ఏరియల్ వ్యూ

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, గ్రేస్ ప్రాంతంలో ఒక లారీ కంటైనర్‌లో 39 మంది మృతదేహాలను పోలీసులు గుర్తించారు

లండన్‌ నగరంలోని ఎస్సెక్స్ కౌంటీలోని గ్రేస్ ప్రాంతంలో ఒక లారీ కంటైనర్‌లో 39 మంది మృతదేహాలను పోలీసులు గుర్తించారు.

స్థానిక కాలమానం ప్రకారం, అర్థరాత్రి 1.40 గంటలకు ఈస్ట్రన్ అవెన్యూలోని వాటర్‌గ్లాడ్ పారిశ్రామిక పార్కులో ఈ కంటైనర్‌ను అంబులెన్స్ సర్వీస్ గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది.

లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న 25 ఏళ్ల నార్తరన్ ఐర్లండ్‌కు చెందిన వ్యక్తే ఈ హత్యలు చేసి ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

ఈ లారీ బల్గేరియా నుంచి వేల్స్‌లోని హోలీహెడ్, ఆంగ్లెసీ పట్టణాల గుండా బ్రిటన్‌లోకి శనివారం ప్రవేశించిందని ఎస్సెక్స్ పోలీసులు చెప్పారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం మృతుల్లో 38 మంది పెద్దవాళ్లు, ఒక టీనేజర్ ఉన్నారని పోలీసు అధికారులు వెల్లడించారు.

సంఘటనా స్థలంలో అధికారులు

బాధితులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే దీనికి చాలాకాలం పట్టొచ్చని సూపరింటెండెంట్ ఆండ్రూ మరినెర్ తెలిపారు.

''ఈ సంఘటనకు సంబంధించి లారీ డ్రైవర్‌ను అరెస్ట్ చేశాం. ప్రస్తుతం అతను పోలీసు కస్టడీలో ఉన్నారు. మా విచారణ కొనసాగుతోంది'' అని ఆండ్రూ వివరించారు.

ఈ సంఘటనతో ఆందోళన చెందినట్లు ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ చెప్పారు.

''నాకు రెగ్యులర్ అప్‌డేట్లు వస్తున్నాయి. ఎస్సెక్స్ పోలీసులతో కలసి హోం శాఖ కార్యాలయం పనిచేస్తుంది.. ఏం జరిగిందో తేలుస్తాం. చనిపోయిన వారు, వారి కుటుంబ సభ్యుల గురించే నేను ఆలోచిస్తున్నాను'' అని ప్రధాన మంత్రి వెల్లడించారు.

'ఈ దుర్ఘటనతో షాక్‌కు గురయ్యాను. బాధపడ్డాను'' అని హోం శాఖ కార్యదర్శి ప్రీతి పటేల్ తెలిపారు.

మ్యాప్

'ఇదొక విచారకరమైన వార్త' అని తుర్రాక్ ఎంపీ జాకీ డొయ్‌లీ-ప్రైస్ తెలిపారు. ''ప్రజల అక్రమ రవాణా కిరాతకమైన, ప్రమాదకరమైన వ్యాపారం'' అని ఆమె ట్వీట్ చేశారు. ఈ హత్యలు చేసిన వారికి చట్ట ప్రకారం శిక్ష పడేలా ఎస్సెక్స్ పోలీసులు చూడాలని ఆమె కోరారు.

నార్తరన్ ఐర్లాండ్ సరకు రవాణా అసోసియేషన్ పాలసీ మేనేజర్ సీమస్ లెహెనీ స్పందిస్తూ.. ఈ లారీ కనుక బల్గేరియా నుంచి హోలీహెడ్ గుండా బ్రిటన్‌లోకి ప్రయాణిస్తే.. ఇదొక 'అసాధారణ మార్గం' అని అన్నారు.

''(ఇంగ్లండ్‌లోని) డోవర్, (ఫ్రాన్స్‌లోని) కలైస్ వంటి ప్రాంతాల్లో భద్రత, తనిఖీలు పెరిగాయని అంతా అంటున్నారు. కాబట్టి, (ఫ్రాన్స్‌లోని) చెర్‌బర్గ్ లేదా రాస్‌కఫ్‌ల నుంచి (ఐర్లండ్‌లోని) రస్లర్ మీదుగా ప్రయాణించి, ఆ తర్వాత డబ్లిన్ వరకూ రోడ్డు మార్గంలో రావడం సులభమైన మార్గంగా కనిపిస్తుండవచ్చు'' అని సీమస్ తెలిపారు.

''ఇది చాలా సుదీర్ఘమైన మార్గం. చుట్టూ తిరిగి రావాలి. ప్రయాణానికి ఒకరోజు ఎక్కువ పడుతుంది.''

ఏరియల్ వ్యూ
ఫోరెన్సిక్

ఫొటో సోర్స్, Leon Neal/Getty Images

ఈస్ట్రన్ అవెన్యూలోని తమ ప్రాంతాలకు సిబ్బంది వెళ్లలేకపోతున్నారని జీఎస్ఎఫ్ కార్ విడిభాగాల సంస్థకు చెందిన గ్లెన్ ఫ్రీలాండ్ చెప్పారు. దీనికి సమీపంలోనే ఈ మృతదేహాలు లభ్యమయ్యాయి.

''ఈరోజు ఉదయం పనిచేసేందుకు మేనేజర్ వెళ్లారు. కానీ, ఆ ప్రాంతం మొత్తాన్ని కట్టుదిట్టం చేశారు. మమ్మల్ని వేరే ప్రాంతానికి తరలించారు'' అని ఫ్రీలాండ్ చెప్పారు.

2000వ సంవత్సరం జూన్ నెలలో డోవర్ పట్టణంలో ఒక లారీ వెనుక భాగంలో 58 మంది చైనా వలసదారులు ఊపిరాడక మృతి చెందారు. ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఊచకోత కోశారనే నేరంపై ఒక డచ్ లారీ డ్రైవర్‌ను ఆ తర్వాతి సంవత్సరం జైలుకు పంపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)