రాయల్ వశిష్ట: గోదావరిలో 300 అడుగుల లోతులో మునిగిన బోటును ఎలా బయటకు తీశారంటే....

- రచయిత, వి శంకర్
- హోదా, బీబీసీ కోసం
గోదావరిలో ప్రమాదవశాత్తు మునిగిన రాయల్ వశిష్ట పున్నమి బోటు ఎట్టకేలకు బయటపడింది. సుదీర్ఘ యత్నాలు, విభిన్న ప్రయోగాల తర్వాత నీటమునిగిన బోటుని ఒడ్డుకి చేర్చగలిగారు. బోటులో ఆరు మృతదేహాలు వెలికితీశారు. ఇంకా ఉంటాయని భావిస్తున్నారు.
ఈ ప్రమాదంలో 51మంది మరణించగా ఇప్పటి వరకూ 11 మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది. బోటు బయటకు తీసే క్రమంలోనే మృతదేహాల నుంచి దుర్వాసన రావడంతో మొత్తం మృతదేహాలు లభిస్తాయనే అంచనాతో ఉన్నారు. బోటు అడుగున క్యాబిన్ లో ఇరుక్కున్న వారి మృతదేహాల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. మంగళవారం 8 మృతదేహాలు లభించాయని అధికారులు తెలిపారు.
ఆ నిర్ణయమే ఈ ఆపరేషన్ ని మలుపుతిప్పింది..!
బోటు ప్రమాదానికి గురయ్యి 37రోజులు గడిచినప్పటికీ, బోటు వెలికితీసేందుకు చేపట్టిన ఆపరేషన్ మాత్రం 13 రోజుల పాటు సాగింది. తొలుత ప్రయత్నాలు విఫలమయ్యాయి.
వివిధ మార్గాల్లో కృషి చేసినా, ఊరించడమే తప్ప బోటు వెలిక్కి రాకపోవడంతో చివరకి ఏమవుతుందోననే ఆందోళన కనిపించింది.
అయితే గోదావరి నీటి మట్టం ప్రమాద స్థలంలో 50 అడుగుల వరకూ చేరుకోవడంతో ఆశలు చిగురించాయి.
డైవర్స్ ని రంగంలో దింపాలని ధర్మాడి సత్యం తీసుకున్న నిర్ణయం ఫలితాన్నిచ్చింది. స్వయంగా సత్యం విశాఖపట్నం వెళ్లి 10మంది టీమ్ తో ఉన్న ఓం శివశక్తి అండర్ వాటర్ సర్వీసెస్ సంస్థను కచ్చులూరు తీసుకు రావడం ఈ ఆపరేషన్ కి టర్నింగ్ పాయింట్ గా చెబుతున్నారు.
మూడు రోజుల్లోనే మూడు సార్లు నేరుగా బోటు దగ్గరకు వెళ్లి, తాళ్ళు కట్టడంతో బోటుని కదిలించడం సులువయ్యిందని ఆపరేషన్ లో పాల్గొన్నవారు చెబుతున్నారు.

చివరి ప్రయత్నాలు ఎలా సాగాయి..?
సోమవారం ఖచ్చితంగా బోటు బయటకు తీయగలమని అంతా భావించినా ఇసుక కారణంగా అంచనా తప్పిందని ఈ ఆపరేషన్ లో పాల్గొన్న వనమాడి రాజు బీబీసీకి తెలిపారు.
‘‘నేరుగా బోటుకి తాడు కట్టి లాగాము. కానీ పై భాగం మాత్రమే బయటకి వచ్చింది. ఇసుక పేరుకుపోవడంతో కొంత కదిలినా సోమవారం నాడే బోటు మొత్తం బయటకు తీసుకురావడం సాధ్యం కాలేదు. అయినా ప్రయత్నాలు ఆపలేదు. పదే పదే తాళ్ళు తెగిపోయినా ఆపరేషన్ కొనసాగించాము. ఎట్టకేలకు దాన్ని ఒడ్డుకు లాగగలిగాము. మాకు సముద్రంలో చాలా బోట్లు తీసిన అనుభవం ఉంది కానీ ఇదో గొప్ప అనుభవం"అంటూ వనమాడి రాజు బీబీసీకి చెప్పుకొచ్చారు.
‘దిగువకు వెళ్లి ఇసుక, మట్టి తొలగించాము..’
వరదల సమయం కావడంతో నీటిలో బోటు ఎక్కువ భాగం ఇసుకలో కూరుకుపోవడంతో కదిలించడం కష్టం అయ్యిందని డైవర్స్ బృందానికి నాయకత్వం వహించిన వీరేశ్ తెలిపారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘మేము 150అడుగుల లోతు వరకు వెళ్లగలం. ఈ బోటు ప్రమాదంలో మా సహాయం అందించాలని ఎదురు చూస్తున్నాం. వెలికితీసేందుకు ఎవరైనా మమ్మల్ని సంప్రదిస్తే రంగంలో దిగాలని భావించాం. ధర్మాడి సత్యం మాతో మాట్లాడడంతో వెంటనే వచ్చాము. కానీ బోటు దిగువన చాలా ఇబ్బంది అనిపించింది. మృతదేహాల దుర్వాసన తో పాటుగా ఇసుక, మట్టి పేరుకుపోవడంతో మేము కట్టిన తాళ్ళు ఫలితం ఇవ్వలేదు. అయినా ఇసుకను తొలగించి, కీలక భాగంలో కట్టిన సింగిల్ రోప్ సహయంతోనే బోటు ని బయటకు తీసుకురాగలిగాము. బంధువులను కోల్పోయి కడచూపు కోసం ఎదురు చూస్తున్న వారికి సహకరించామనే తృప్తి మిగిలింది’’ అంటూ చెప్పుకొచ్చారు.

దూరప్రాంతాల నుంచి వచ్చిన బంధువులు..
బోటు బయటకు లాగడంతో మృతదేహాలను మెడికల్ అండ్ హెల్త్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
అంబులెన్స్ లో రంపచోడవరం ఆస్పత్రికి తరలించారు. అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అప్పగిస్తామని సబ్ కలెక్టర్ ప్రవీణ్ తెలిపారు.
పాపికొండల పర్యటనలో ప్రాణాలు కోల్పోయిన తమ బంధువుల కడచూపు కోసం వివిధ ప్రాంతాలకు చెందిన వారు కచ్చులూరు చేరుకున్నారు.
బోటు ఒడ్డుకి చేరుతున్న కొద్దీ ఉత్కంఠగా ఎదురుచూశారు. 38రోజుల తర్వాత కనీసం చివరి చూపు దక్కుతుందని ఆశిస్తున్నామని మంచిర్యాల కి చెందిన రమేష్ తెలిపారు. తమ బంధువు, విద్యుత్ శాఖ ఉద్యోగి అయిన రమ్యశ్రీ కోసం వచ్చామన్నారు. ఎంతో శ్రమకోర్చి బోటు ని ఒడ్డుకి చేర్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
తమపని తాము చేసుకుంటూ పోయిన ధర్మాడి సత్యం బృందం
పాపికొండల పర్యాటకంలో ఈ ఏడాది సెప్టెంబర్ 15నాడు పెను విషాదం అలుముకుంది. ఆరోజు మధ్యాహ్నం వశిష్ట రాయల్ పున్నమి బోటు దేవిపట్నం మండలంలోని కచ్చులూరు మందం సమీపంలో బోల్తా పడిన ప్రమాదంలో 51మంది ప్రాణాలు కోల్పోయారు. పైగా, బోటు నీటిలో మునిగిపోవడం, ఆనాటి నుంచి ఆనవాలు లేకపోవడంతో కలకలం రేగింది.
బోటు వెలికి తీసేందుకు విస్తృత ప్రయత్నాలు జరిగాయి. విడతల వారీగా విభిన్న పద్ధతుల్లో వెలికితీసేందుకు యత్నించారు. అయినా ఫలించక పోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయ. ప్రభుత్వ తీరుపై పలువురు విపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. గోదావరిలో మునిగిన బోటు బయటికి తీసుకొస్తామని మంత్రులు ధీమా వ్యక్తం చేసినప్పటికీ నెల రోజులకు పైగా నీటిలో మునిగి ఉన్న బోటు బయటకు వస్తుందా రాదా అన్న సందేహాలు మాత్రం కొనసాగాయి. దానికి తోడు పదేపదే ప్రయత్నాలు ఫలించకపోవడంతో అవి మరింత పెరిగాయి.
గోదావరిలో బోటు వెలికితీసేందుకు కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం తరపున రూ.22.7లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదరడంతో ధర్మాడి సత్యం బృందం రంగంలో దిగింది. 25మంది సభ్యులు బోటును బయటకు తీసేందుకు కృషి చేశారు. నదిలో నీటి మట్టం పెరగడంతో మధ్యలో పదిరోజుల పాటు పనులు నిలిపివేశారు. కానీ రెండో విడత ప్రయత్నాల్లో విశాఖ కు చెందిన ఓం శివ శక్తి అండర్ వాటర్ సర్వీసెస్ సంస్థకు చెందిన డైవర్స్ సహాయంతో చేసిన ప్రయత్నాలు కొలిక్కివచ్చాయి. ఎట్టకేలకు బోటును మంగళవారం(22.10.2019) బయటకి తీశారు.

38 రోజుల పాటు కొనసాగిన ఈ ఆపరేషన్‌లో ఏ రోజు ఏమి జరిగిందో చూద్దాం..
సెప్టెంబర్ 15 బోటు ప్రమాదం. సహాయక చర్యల్లో 3హెలికాప్టర్లు, ఎన్డీఅర్ ఎఫ్ సహా వివిధ బృందాలు.
సెప్టెంబర్ 16 నాటికి మొత్తం 26మంది పర్యాటకుల ఆచూకీ లభ్యం, అత్యధికులు స్థానిక గిరిజనులు రక్షించిన వారే.
సెప్టెంబర్ 17.. 12 మృతదేహాలు లభ్యం.
సెప్టెంబర్ 18 కొనసాగిన సహాయక చర్యలు, మృతదేహాల ఆచూకీ కోసం సాగిన ప్రయత్నాలు మరో 6మృతదేహాలు లభ్యం.
సెప్టెంబర్ 20 నాటికి లభ్యమైన మొత్తం 34 మృతదేహాలు.
సెప్టెంబర్ 20 తర్వాత పెరిగిన గోదావరి ఉధృతి, సహాయక చర్యలకు ఆటంకం.
సెప్టెంబర్ 25న బాలాజీ మెరైన్స్ సంస్థకు బోటు వెలికితీత కాంట్రాక్ట్ అప్పగింత.
సెప్టెంబర్ 28 నాటికి తాళ్ళు, ప్రొక్లెయినర్ సహా సామగ్రిని కచ్చులూరు మందం వద్దకు తరలించిన సత్యం బృందం.
సెప్టెంబర్ 29 బోటు వెలికితీత పనులు ప్రారంభం.
సెప్టెంబర్ 30 రోప్ కి బలమైన వస్తువు తగలడంతో బయటకి లాగేందుకు ప్రయత్నం, తాడు తెగిపోవడంతో విఫలం.
అక్టోబర్ 1 కొనసాగిన ఆపరేషన్, లంగరు వేసి లాగిన సత్యం బృందం.
అక్టోబర్ 2 నీటిలో లంగరు బండకు తగలడంతో వంగిపోయిన లంగరు.
అక్టోబర్ 3 వర్షం కారణంగా పనులకు ఆటంకం.
అక్టోబర్ 4 మళ్ళీ పెరిగిన వరద ఉధృతి, తాత్కాలికంగా ఆపరేషన్ నిలిపివేత.
అక్టోబర్ 14 వరకూ ఆగిన ప్రయత్నాలు.
అక్టోబర్ 15 న మళ్ళీ ఆపరేషన్ కోసం రంగంలోకి సత్యం బృందం, శాటిలైట్ ఫోన్ అందుబాటులో లేకపోవడంతో ముందుకు సాగని ప్రయత్నాలు.
అక్టోబర్ 16 ధర్మాడి సత్యం తమ సంప్రదాయ పద్ధతిలో రోప్ ని ఉచ్చు తరహాలో నీటిలో దింపి, లాగేయందుకు ప్రయత్నాలు, విఫలం.
అక్టోబర్ 16 బోటు కోసం వేసిన లంగరుకి రెయిలింగ్ తగిలి బయటకు రావడంతో ఆపరేషన్ లో స్పష్టత.
అక్టోబర్ 18 గోదావరిలో బాగా తగ్గిన నీటిమట్టం, డైవర్స్ ని రంగంలో దింపాలని నిర్ణయం.
అక్టోబర్ 19 దేవిపట్నం చేరుకున్న విశాఖకు చెందిన శివశక్తి అండర్ వాటర్ సర్వీసెస్ టీమ్, నీటిలోపలికి వెళ్లేందుకు అధికారుల అనుమతి కోసం నిరీక్షణ.
అక్టోబర్ 20 నదిలో దిగి బోటు పరిస్థితి పరిశీలించిన డైవర్స్.
అక్టోబర్ 21 బోటుకి తాళ్ళు కట్టి వచ్చిన డైవర్స్, బోటు లాగేందుకు చేసిన ప్రయత్నాల్లో బయటపడిన బోటు కి చెందిన కొన్ని భాగాలు.
అక్టోబర్ 22 బోటుకి 3 తాళ్ళు కట్టిన డైవర్స్, లాగడానికి చేసిన ప్రయత్నాల్లో తెగిపోయిన రెండు తాళ్ళు.. చివరగా ఓకే తాడుతో ఒడ్డుకి చేరిన బోటు.
ఇవి కూడా చదవండి:
- రాయల్ వశిష్ట: బోటులో 7 మృతదేహాలు, ఒకరి ఎముకల గూడు.. వీటిని ఎలా గుర్తించారు?
- గోదావరిలోంచి బోటును బయటకు తీయలేరా?
- గోదావరి పడవ ప్రమాదాలు: ప్రభుత్వాలు తీసుకున్న చర్యలేంటి? ఫలితాలేమైనా ఉన్నాయా?
- దేవీపట్నం: బోటు ప్రమాదాలు ఆపాలంటే ఎవరెవరు ఏమేం చేయాలి?
- గోదావరిలో పడవ ప్రమాదం: బోటును బయటకు తీయడంలో ఆలస్యం ఎందుకు?
- గోదావరిలో పడవ మునక: 'భర్తను, బిడ్డను పోగొట్టుకుని ఎలా బతకాలి...'
- ఆర్టోస్: ఇది మా కూల్ డ్రింకండీ
- ఆల్కహాల్‌తో చేతులు కడుక్కునే నిరంకుశ నియంత.. నికొలస్ చాచెస్కూ
- భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర - దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్
- కడప జిల్లాలోని కొన్ని గ్రామాల్లో భూమి కుంగుతోంది.. కారణమేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










