రాయల్ వశిష్ట: బోటులో 7 మృతదేహాలు, ఒకరి ఎముకల గూడు.. వీటిని ఎలా గుర్తించారు? బయటకు తీసిన బోటును ఏం చేశారు?

రాయల్ వశిష్ట బోటు
ఫొటో క్యాప్షన్, రాయల్ వశిష్ట బోటు
    • రచయిత, వి శంకర్
    • హోదా, బీబీసీ కోసం

పాపికొండల విహారయాత్రలో ప్రమాదానికి గురయ్యి, గోదావరి నదిలో మునిగిపోయిన బోటు ఒడ్డుకి చేరింది. 38 రోజుల జలదిగ్బంధనం నుంచి ఎంతో శ్రమకోర్చి బోటుని బయటకు లాగగలిగారు. ధర్మాడి సత్యం బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేయగలిగింది.

ప్రమాదానికి గురయిన సమయంలో బోటులో మొత్తం 77మంది ఉన్నారు. వారిలో నలుగురు పిల్లలతో కలిపి 69 మంది పర్యాటకులున్నారు. ఐదుగురు బోటు సిబ్బందితో పాటు మరో ముగ్గురు డాన్సర్లు ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

ప్రమాదం నుంచి 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. 51 మందిని ఈ ప్రమాదంలో మృతులుగా నిర్ధరించారు. సోమవారం నాటికి 40 మృతదేహాలు లభ్యమయ్యాయి. అవి కూడా వివిధ ప్రాంతాల్లో లభించాయి.

మంగళవారం మధ్యాహ్నం బోటు వెలికితీత పూర్తికావడంతో మిగిలిన వారి మృతదేహాలు లభ్యమవుతాయని ఆశించారు. దూర ప్రాంతాల నుంచి కూడా కొందరు మృతుల బంధువులు కచ్చులూరు వరకూ వచ్చారు. తమవారి కడచూపు కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.

బోటులో ఎనిమిది మందికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి.

ఇప్పటి వరకూ గుర్తించిన వారిలో బోటు సరంగి సంగాడి నూకరాజు, కొమ్ముల రవి, బస్కి ధర్మరాజు, పోలాబత్తుల సత్యనారాయణ, సురభి రవీందర్, కర్రి మణికంఠ ఉన్నారు.

మరో మృతదేహం ఆనవాళ్లు గుర్తించాల్సి ఉందని వైద్యులు చెబుతున్నారు.

గుర్తించిన మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగిస్తామని ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేష్ కిషోర్ బీబీసీ కి తెలిపారు.

మరొకరి మృతదేహానికి సంబంధించిన ఎముకల గూడు మాత్రమే లభించడంతో గుర్తు పట్టేందుకు పరీక్షలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

బోటులో లభించిన ఆధార్ కార్డు, క్రెడిట్ కార్డు, పాన్ కార్డు
ఫొటో క్యాప్షన్, బోటులో లభించిన ఆధార్ కార్డు, క్రెడిట్ కార్డు, పాన్ కార్డు

మరో ముగ్గురి ఆనవాళ్లు కూడా లభించలేదు..

తీవ్రంగా శ్రమించి, ఆపరేషన్ పూర్తి చేసినప్పటికీ ఇంకా ముగ్గురి జాడ లభ్యం కాలేదు.

బోటు వెలికితీత తర్వాత కూడా అవి లభించకపోవడంతో ఆ ముగ్గురు ఎవరనే దానిపై బంధువుల్లో ఆందోళన కనిపిస్తోంది.

బోటు బయటకు వచ్చిన సమాచారంతో రాజమహేంద్రవరం ఆస్పత్రికి చేరుకున్న బంధువులు ఆనవాళ్లు కనుగొనే యత్నాల్లో ఉన్నారు.

మంచిర్యాలకు చెందిన రమ్యశ్రీ జాడ ఇంకా లభించకపోవడంతో రెండు రోజులుగా పడిగాపులు కాస్తున్న ఆమె బంధువుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

ఆమె బంధువు రమేష్ బీబీసీ తో మాట్లాడుతూ "ఆరుగురిని గుర్తించారు. ఏడో శవం అడా, మగా అన్నది తెలియకుండా ఉంది. అధికారులు కూడా స్పష్టంగా చెప్పలేదు. రమ్యశ్రీ ఆరోజు జీన్స్ ఫాంట్ వేసుకుని ఉందనే ఆనవాలు చెప్పాము కానీ అలాంటి మృతదేహం రాలేదని అంటున్నారు. ఇప్పటికే ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రిలో మనోవేదన తో ఉన్నారు. ఇప్పుడు ఆచూకీ కూడా లేకపోతే మరింత కుంగిపోయే ప్రమాదం ఉంది "అంటూ వాపోయారు.

బోటు లభించిన దేవుడి గొంది ప్రాంతం
ఫొటో క్యాప్షన్, బోటు లభించిన దేవుడి గొంది ప్రాంతం

దేవుడి గొందిలో బోటు..

కచ్చులూరు మందం సమీపంలో ప్రమాదానికి గురయిన బోటుని సుమారు 100 మీటర్ల దిగువన కనుగొన్నారు. నీటి ప్రవాహ వేగానికి కొట్టుకుని వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.

మంటూరు పరిధిలోని దేవుడిగొంది వద్ద బయటకు తీసిన బోటుని అక్కడే వదిలేశారు.

బోటులో పలువురు పర్యటకులకు సంబంధించిన ఆనవాళ్లు బయటపడుతున్నాయి. ఆధార్ కార్డులు, బ్యాంక్ క్రెడిట్ కార్డులు కూడా కొన్నింటిని స్థానికులు గుర్తించారు.

ఆపరేషన్ నిర్వహించిన ధర్మాడి సత్యం బృందం కాకినాడ తరలివెళ్లింది.

కాగా, ఇప్పుడు ఆ బోటు పరిస్థితి ఏమిటన్నది ఇంకా స్పష్టత కనిపించడం లేదు. బోటుని ఏం చేయాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని రంపచోడవరం సబ్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య బీబీసీ‌తో చెప్పారు.

‘‘మృతదేహాలు చిక్కుకుని ఉండడంతో వాటిని బంధువులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా కొందరి జాడ తెలియాలి. వారికోసం ఏమి చేయాలన్నది ఆలోచిస్తాం. బోటు ప్రస్తుతం అక్కడే ఉంటుంది. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు సాగుతోంది. తర్వాత బోటును ఏం చేయాలన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుంది’’ అని ఆయన అన్నారు.

బోటులో లభించిన లైఫ్ జాకెట్లు
ఫొటో క్యాప్షన్, బోటులో లభించిన లైఫ్ జాకెట్లు

మృతదేహాలు ఎలా గుర్తించారు?

ప్రమాదం జరిగి 38 రోజులు గడిచిపోవడంతో మృతదేహాల గుర్తింపు సమస్యగా మారింది.

రాజమహేంద్రవరం ఆస్పత్రిలో ఉన్న మృతదేహాలను అనవాళ్ళను బట్టి గుర్తించినట్టు సూపరింటెండెంట్ రమేష్ కిషోర్ వెల్లడించారు.

‘‘బోటులో ఉన్న పట్టిసీమకు చెందిన యువకుడి మృతదేహాన్ని తాళం చెవుల ఆధారంగా గుర్తించాము. అతని దగ్గర ఇంటి తాళం తోపాటుగా బోటుకి సంబంధించిన కొన్ని తాళాలు కూడా లభించాయి. దాంతో కర్రి మణికంఠ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేశాము. వరంగల్ కి చెందిన సురభి రవీందర్ తల లభించలేదు. మొండెం మాత్రమే దక్కింది. ఆయన ఒంటికి ఉన్న బట్టలు, పర్సులో ఉన్న కార్డుల సహాయంతో నిర్దరణకు వచ్చాము. మిగిలిన వాటిలో ఒక మృతదేహానికి జీన్స్ వేసుకుని ఉండడంతో రమ్యశ్రీ బంధువులు వచ్చారు. కానీ మొలతాడు, ఇతర అనవాళ్ళతో పురుషుడి మృతదేహంగా తేలింది. రమ్యశ్రీ కి సంబంధించిన ఆధారాలు దొరకలేదు’’ అంటూ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)