బీసీసీఐ ప్రెసిడెంట్: నాడు విజయనగరం రాజ కుమారుడు.. నేడు కోల్‌కతా ‘ప్రిన్స్’.. 65 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టు కెప్టెన్‌కు పగ్గాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రవీణ్ కాసం
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి సౌరవ్ గంగూలీ బీసీసీఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
47 ఏళ్ల సౌరవ్ గంగూలీ ఇప్పటి వరకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ) అధ్యక్షుడిగా కొనసాగారు.
ముంబయిలో బుధవారం జరిగిన బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో సౌరవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు బోర్డు ప్రకటించింది. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విటర్‌లో ప్రకటించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గంగూలీ ఎన్నికతో దాదాపు 65 ఏళ్ల తర్వాత ఓ కెప్టెన్ బీసీసీఐ అధ్యక్ష పదవి మళ్లీ చేపట్టినట్లయింది.
గతంలో భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన పూసపాటి విజయానంద గజపతి రాజు (విజ్జీ) 1952లో బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు.
ఆయన తర్వాత కెప్టెన్‌గా వ్యవహరించి, బీసీసీఐ అధ్యక్షుడైన ఘనత సౌరవ్ గంగూలీకి దక్కింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరీ గజపతి రాజు?
విజయనగర పాలకుడు పూసపాటి విజయ రామరాజు రెండో కుమారుడు, గజపతి వంశ యువరాజు పూసపాటి విజయానంద గజపతి రాజు (పీవీజీ రాజు) పుట్టింది విజయనగరంలోనే అయినప్పటికీ తర్వాత కాలంలో కుటుంబంతో కలిసి వారణాసికి వెళ్లిపోయారు.
క్రికెట్‌లో ఆయనను విజ్జీగా పిలుస్తుంటారు. విజయానంద్.. సర్ విజయ్‌గా కూడా సుపరిచితులు.
భారత తొలితరం క్రికెటర్‌లలో విజ్జీ ఒకరు. బీసీసీఐ అధ్యక్షుడిగానూ పనిచేశారు. క్రికెటర్‌గానే కాకుండా రాజకీయ నాయకుడిగానూ గుర్తింపు పొందారు.

ఫొటో సోర్స్, Getty Images
క్రికెటర్‌గా...
విజ్జీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కేవలం రెండు నెలలు మాత్రమే సాగింది. 1932లో ఇంగ్లండ్ పర్యటనకు డిప్యూటీ వైస్ కెప్టెన్‌గా ఎన్నికైనప్పటికీ ఆ టూర్‌కు వెళ్లలేదు.
ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల విషయానికి వస్తే ఆయన మొత్తంగా 47 మ్యాచ్‌లు ఆడి 18 సగటుతో 1,228 పరుగులు చేశారు.
1936లో ఇంగ్లండ్‌లో పర్యటించిన భారత జట్టుకు విజ్జీ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ సిరీస్‌లో ఆయన మూడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడి కేవలం 33 పరుగులు చేశారు.
ఈ సిరీస్‌లో భారత్ 2-0తో ఓడిపోయింది. ఒక టెస్టును మాత్రం డ్రా చేసుకోగలిగింది.
ఇదే ఆయనకు క్రికెటర్‌గా తొలి, తుది పర్యటన కూడా.
ఆ తర్వాత ఆటతీరు, కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు రావడంతో క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
బీసీసీఐ అధ్యక్షుడిగా రెండో ఇన్నింగ్స్..
విజ్జీ క్రికెటర్‌గా విఫలమైనా బీసీసీఐ అధ్యక్షుడిగా రాణించారు. 1954 నుంచి 1957 వరకు మూడేళ్ల పాటు బీసీసీఐకి అధ్యక్షుడిగా వ్యహరించారు.
ఉత్తరప్రదేశ్ టీంను తీర్చిదిద్దేందుకు, కాన్పూర్‌లో గ్రీన్ పార్క్ స్టేడియం ఏర్పాటుకు ఆయన కృషి చేశారు.
బీసీసీఐ ఆయన పేరుతో ఇంటర్ యూనివర్సిటీ జోనల్ టోర్నమెంట్ నిర్వహిస్తోంది.
ఆయన సేవలకు గుర్తుగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ విజయనగరంలో నిర్మించిన క్రికెట్ స్టేడియానికి విజ్జీ స్టేడియంగా పేరు పెట్టింది.
1959లో భారత్-ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన సిరీస్‌కు ఆయన కామెంటేటర్‌గా వ్యవహరించారు.
క్రికెట్ అంటే విజ్జీ అమితమైన అభిమానం చూపేవారని ఆయనతో అనుబంధమున్న డాక్టర్ బీఎస్‌ఆర్ మూర్తి బీబీసీతో అన్నారు.
‘‘చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే విజ్జీకి చాలా ఇష్టం. కాశీలోని ప్యాలెస్ చూసుకునేందుకు ఆంధ్రా నుంచి ఆయన వెళ్లిపోయారు. అయితే, క్రికెట్ ప్రాక్టీస్ కోసమే ఇక్కడి నుంచి కొందరిని తన వెంట తీసుకువెళ్లారు. ప్రత్యేకంగా కాశీలో మైదానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రొఫెషనల్ కోచ్‌లను తెప్పించుకుని, శిక్షణ తీసుకున్నారు’’ అని చెప్పారు.
జాతీయ జట్టుకు ఎంపిక కాకముందే విజ్జీ తనకంటూ ప్రత్యేక జట్టును ఏర్పాటు చేసుకుని ఇంగ్లాండ్ వెళ్లి క్రికెట్ ఆడొచ్చారని మూర్తి వివరించారు.
‘‘జాతీయ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రా క్రికెట్ అసోసోయేషన్‌లకు అధ్యక్షుడిగానూ విజ్జీ పనిచేశారు. ఆ తర్వాత బీసీసీఐ ప్రెసిడెంట్‌గా సేవలందించారు. 1960ల్లో విశాఖ పార్లమెంటు ఎంపీగానూ పనిచేశారు. యునైటెడ్ ప్రావిన్సులో న్యాయశాఖ మంత్రి పదవి కూడా నిర్వర్తించారు’’ అని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
'క్రికెట్ వ్యాప్తికి విశేష కృషి'
బీసీసీఐ అధ్యక్షుడిగా దేశ వ్యాప్తంగా క్రికెట్‌ను మెరుపు వేగంతో విస్తరించిన ఖ్యాతిని సర్ విజయ్ దక్కించుకున్నారని ''ఫిప్టీ ఇయర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1956-2006' పుస్తకంలో జీఎస్ రామ్మోహన్ పేర్కొన్నారు.
ఆ కాలంలో దేశంలోని జమీందారీలు, నవాబులు, రాజులకు తెల్లదొరలతో సాన్నిహిత్యానికి క్రికెట్ ఉపయోగపడిందని ఆయన విశ్లేషించారు.
విజయనగరం మహారాజు పీవీజీ రాజుతో పాటు నవాబ్ నగర్ రాకుమారుడు రంజిత్ సిన్హా (ఈయన పేరు మీదే రంజీ ట్రోఫీ నిర్వహిస్తున్నారు), పోరుబందర్ మహారాజు, కల్నల్ సీకే నాయుడు, పటౌడీ నవాబులు ఇలా అనేక సంస్థానాలకు చెందిన రాజులు, నవాబులు భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించారని రచయిత పేర్కొన్నారు.
''సర్ విజయ్ (విజ్జీ) క్రికెటర్‌గా రిటైర్ అయిన తర్వాత కూడా ఆటకు ఎంతో సేవ చేశారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌తో పాటు ఉత్తర్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగానూ వ్యవహరించారు'' అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం
డాక్టర్ బి.శ్యాం సుందర్ రాజు రాసిన 'విజయనగరం జమిందారీ ఇన్ కొలోనియల్ ఆంధ్రా, 1802-1949' పుస్తకంలో సర్ విజయ్ ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన కృషిని వివరించారు.
1941లో విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రమహాసభ సమావేశానికి సర్ విజయ్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం విషయంలో రాయలసీమ ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి ఆయన కృషి చేశారు.
అధ్యక్షుడిగా ఎన్నికైన వేళ ఆయన మాట్లాడుతూ, ''22 ఏళ్ల నుంచి నేను ఆంధ్రాకు దూరంగా ఉన్నాను. నన్ను చాలా మంది యూపీ మ్యాన్ (ఉత్తర్ ప్రదేశ్ మనిషి) అంటారు. కానీ, నేను మొదట ఆంధ్రుడ్ని, ఆ తర్వాతే ఇంకేమైనా'' అని పేర్కొన్నారు.
ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుపై ఆయన మాట్లాడుతూ, ''ఆంధ్రులు కాంగ్రెస్‌కు అనుకూలురు అని బ్రిటిష్ వారు భావిస్తున్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ తరహా ఉద్యమాలు జరుగుతాయని వారు భయపడుతున్నారు. అందుకే ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కష్టమైన విషయమే'' అని చెప్పారు.
తెలుగు ప్రాంతానికి ప్రత్యేకంగా బడ్జెట్ ఉండాలని ఆయన మద్రాసు గవర్నర్‌ను కూడా కలిశారు.
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటన్ తరఫున భారత్ పోరాడేలా కాంగ్రెస్ నాయకులను ఒప్పించేందుకు 1942 ఏప్రిల్‌లో సర్ స్టాఫర్డ్ క్రిప్స్ భారత పర్యటనకు వచ్చారు. దీన్నే క్రిప్స్ రాయబారంగా పిలుస్తుంటారు.
క్రిప్స్ భారత్‌లో పర్యటించినప్పుడు విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడిగా సర్ విజయ్ ఆయనను కలసి ప్రత్యేక ఆంధ్రరాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు.
ఇవి కూడా చదవండి
- సౌరవ్ గంగూలీ.. నాయకుడిగా నడిపించగలడా.. రాజకీయాలను ఎదుర్కోగలడా
- 'దాదాగిరీ' సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతుందా?
- నింజా టెక్నిక్: వ్యాసం రాయమంటే 'ఖాళీ' పేపర్ ఇచ్చిన అమ్మాయికి అత్యధిక మార్కులు.. ఎలా?
- #100WOMEN: కృత్రిమ గర్భసంచితో నెలలు నిండని శిశువులకు ప్రాణదానం
- జపాన్ ఎందుకంత క్లీన్‌గా ఉంటుంది... ఏమిటా రహస్యం?
- 'పోర్న్‌ను పురుషులే కాదు, మహిళలూ ఎంజాయ్ చేసేలా చేయాలి'
- కంట్లో ప్రతిబింబించిన చిత్రంతో పాప్‌సింగర్ ఇల్లు కనిపెట్టి వేధించిన యువకుడు
- భారత్-పాకిస్తాన్లలో గోదాములు నిండుగా ఉన్నా ఆకలికేకలు
- రేప్, డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు ఈమెకు యోగా ఎలా ఉపయోగపడింది
- ఆల్కహాల్‌తో చేతులు కడుక్కునే నిరంకుశ నియంత.. నికొలస్ చాచెస్కూ
- ధోనీ రిటైర్మెంట్ ఎప్పుడు... గంగూలీ, ద్రావిడ్‌లకు వర్తించిన లాజిక్ అతనికి వర్తించదా...?
- రాయల్ వశిష్ట: గోదావరిలో 300 అడుగుల లోతులో మునిగిన బోటును ఎలా బయటకు తీశారంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








