బ్యాంకుల విలీనం ఎన్‌పీఏల సమస్యకు పరిష్కారం చూపుతుందా.. ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన నిర్ణయాన్ని నిరసిస్తూ దేశంలో మంగళవారం బ్యాంకు ఉద్యోగుల సమ్మె సాగుతోంది.
పది ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి నాలుగు పెద్ద బ్యాంకులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి.
గత ఆగస్టులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకుల విలీన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ చర్యతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య పన్నెండుకు తగ్గుతుందని, దేశ ఆర్థిక వ్యవస్థ ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడానికి ఇది దోహదపడుతుందని ఆమె అన్నారు.
అయితే ఏఐబీఈఏ మాత్రం బ్యాంకుల విలీనంతో ఆర్థిక ప్రగతి ఊపందుకోదని చెబుతోంది.
''బ్యాంకుల్లో సామాన్య ప్రజలు జమ చేసుకున్న డబ్బు రూ.127 లక్షల కోట్లు ఉంది. అది భద్రంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం. పెద్ద బ్యాంకులు పెద్ద రిస్క్‌లు తీసుకుంటాయి. బ్యాంకింగ్ రంగాన్ని జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉంది'' అని ఏఐబీఐఈ ముఖ్య కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం అన్నారు.
''అమెరికాలో పెద్ద బ్యాంకులు విఫలమయ్యాయి. భారత్‌లో అలా జరగకూడదు. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు పెద్ద బ్యాంకులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్యాంకులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ)ని, రూ.15 లక్షల కోట్ల వరకూ అవి ఉన్నాయని వెంకటాచలం అన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై దృష్టి తక్కువగా పెడుతోందని అభిప్రాయపడ్డారు. ఎన్‌పీఏలంటే వసూలు కాకుండా మిగిలిపోయిన మొండి రుణాలు.
బ్యాంకుల విలీనం తర్వాత ఈ డబ్బును వెనక్కిరప్పిస్తారా అని ప్రశ్నించారు.
''పెద్ద బ్యాంకులు పెద్ద రుణాలు ఇస్తాయి. వాటికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి వాళ్లు డబ్బు తిరిగి చెల్లించలేదు. రుణాల్లో రైతులు, విద్యార్థులకు ఇచ్చేవి చాలా తక్కువ శాతం. అనుభవాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఇలా ఎందుకు చేస్తోంది'' అని వెంకటాచలం అన్నారు.
ఏఐబీఐఈ, బీఈఎఫ్ఐ పిలుపుతో చేపడుతున్న ఈ సమ్మెకు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా సంకేతాత్మకంగా మద్దతు తెలుపుతోంది.
''ఎన్‌పీఏలపై ప్రభావవంతంగా పనిచేయాలి. ఇందుకోసం చట్టాలు సవరించాలి. రుణాలు ఎగ్గొట్టేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ, అలా చేయడం లేదు. అప్పులు మాఫీ చేస్తున్నారు. ఫలితంగా బ్యాంకులు నష్టపోతున్నాయి. సంక్షోభ పరిస్థితులు ఏర్పడుతున్నాయి'' అని బీఈఎఫ్ఐ వైస్ ఛైర్మన్ అనూప్ ఖరే అన్నారు.
''ఎన్‌పీఏలను మాఫీ చేస్తే ఆ ప్రభావం డిపాజిటర్లపై పడుతుంది. అందుకే ఆందోళన నెలకొని ఉంది. ప్రభుత్వం దీన్ని పరిష్కరించాలి'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
భారతీయ బ్యాంకుల నిజంగానే పెద్ద సంక్షోభం అంచుల్లో ఉన్నాయా? విలీనం వల్ల ఆర్థికవ్యవస్థ లాభపడుతుందా?
బ్యాంకుల విలీనానికి ఎన్‌పీఏలే కారణమని చెబుతున్నారు. ఇంతవరకూ వీటిని వసూలు చేయలేకపోతున్నారన్నది వాస్తవం. మరి, ఇలాంటప్పుడు ఏం చేయాలి?
''ఎన్‌పీఏలు ఎక్కువగా ఉన్న బ్యాంకుల్లో అసమర్థత, అవినీతి ఎక్కువగా ఉంది. పెద్ద బ్యాంకుల్లో విలీనమైతే వాటిపై నియంత్రణ వస్తుంది. కానీ, ఉద్యోగులు ఇలాంటి నియంత్రణను కోరుకోవడం లేదు. అందుకే వ్యతిరేకిస్తున్నారు. కానీ, అది సరికాదు'' అని ఆర్థికవేత్త భరత్ ఝుంఝున్‌వాలా అన్నారు.
''కొన్ని బ్యాంకులు సమర్థంగా పనిచేస్తున్నాయి. కొన్ని చేయట్లేదు. సమర్థంగా పనిచేసే బ్యాంకులతో కలిపితే చేయలేకపోతున్నవాటిని గాడిలో పెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తోంది'' అని చెప్పారు.
బ్యాంకుల గురించి వచ్చిన కొన్ని వార్తల వల్ల ఆందోళనపూరితమైన వాతావరణం ఏర్పడిందని ప్రముఖ పాత్రికేయురాలు సుష్మ రామ్‌చంద్రన్ అభిప్రాయపడ్డారు.
''దేశంలో ఇప్పటివరకూ ఏ పెద్ద బ్యాంకూ వైఫల్యం చెందలేదు. డిపాజిటర్లందరి డబ్బు సురక్షితంగా ఉండేందుకు మన రిజర్వు బ్యాంకు అన్ని చర్యలూ తీసుకుంటుంది'' అని ఆమె చెప్పారు.
బ్యాంకుల విలీనం వల్ల డిపాజిటర్లపై ఎలాంటి ప్రభావమూ ఉండదని భరత్ ఝుంఝున్‌వాలా అభిప్రాయపడ్డారు.
''ప్రైవేటీకరణ జరిగితేనో, డిపాజిట్లపై భద్రతపరమైన నిబంధనలు సడలిస్తేనే పరిస్థితి వేరుగా ఉండేది. విలీనం వల్ల డిపాజిటర్లకు లాభమే'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
విలీనం తర్వాత ఉద్యోగాలు పోతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని, అయితే ప్రభుత్వం ఇప్పటివరకూ దీని గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదని సుష్మ రామచంద్రన్ చెప్పారు.
''విలీనం తర్వాత బ్యాంకు ఉద్యోగులు తమ విభాగాల నుంచి ఇతర విభాగాలకు వెళ్లాల్సి రావొచ్చు. డిజిటల్ బ్యాంకింగ్ పెరిగినకొద్దీ వారి నైపుణ్యాలు కూడా పెరుగుతాయి'' అని అన్నారు.
ఎన్‌పీఏలపై ప్రభావం గురించి స్పందిస్తూ.. ''కొన్ని ఎన్‌పీఏలు సహజసిద్ధమైనవి. మార్కెట్ పరిస్థితులు, ఇతర కారణాల వల్ల రుణాలు చెల్లించలేకపోవచ్చు. అయితే, బ్యాంకుల రుణాల్లో అలాంటివాటి శాతం చాలా తక్కువగానే ఉంటుంది. రాజకీయ ఒత్తిడి, అధికారుల అసమర్థత, అవినీతి కారణంగా సమస్యలు వస్తుంటాయి. తప్పుడు రుణాలు ఇస్తే ఎన్‌పీఏలుగా మారుతాయి. వృద్ధి రేటు మందగించినప్పుడు ఎన్‌పీఏలు పెరగడం సహజమే. దానిపై విలీనం ప్రభావం ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు'' అని భరత్ ఝుంఝున్‌వాలా చెప్పారు.
విలీనం దీర్ఘకాలికంగా ఆర్థిక వ్యవస్థకు మంచిదేనని సుష్మా రామచంద్రన్ అభిప్రాయపడ్డారు.
''భారత్‌కు ఇంకా చాలా బ్యాంకులు రావాల్సిన అవసరం ఉంది. విదేశీ పెట్టుబడుదారుల కోసమే కాదు.. భారీ జనాభాను బ్యాంకులతో అనుసంధానించేందుకు అవి అవసరం'' అని అన్నారు.
ఇవి కూడా చదవండి
- బిచ్చగాడి గుడిసెలో లక్షల నగదు, ఫిక్సెడ్ డిపాజిట్ల పత్రాలు...
- 'పప్పు' చేసిన అద్భుతం... అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డఫ్లో జంటకు నోబెల్
- ఆధార్‌తో లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు పనిచేయదు... మరి ఎలా చేయాలి...
- నింజా టెక్నిక్: వ్యాసం రాయమంటే 'ఖాళీ' పేపర్ ఇచ్చిన అమ్మాయికి అత్యధిక మార్కులు.. ఎలా?
- నిర్మలా సీతారామన్: 'దుబాయ్ తరహా మెగా షాపింగ్ పండుగలు.. గృహ నిర్మాణ ప్రాజెక్టులకు 10 వేల కోట్లు'
- హుజూర్నగర్ ఉప ఎన్నికలో గెలిచేదెవరు...
- ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీలో 'టాలీవుడ్'
- Exit Polls: మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు...
- డెబిట్ కార్డులు, ఏటీఎంలు త్వరలో కనిపించకుండా పోతాయా...
- కంట్లో ప్రతిబింబించిన చిత్రంతో పాప్‌సింగర్ ఇల్లు కనిపెట్టి వేధించిన యువకుడు
- తండ్రి శవాన్ని తీసుకెళ్లడానికి నిరాకరిస్తున్న కొడుకులు.. కారణమేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








