నిర్మలా సీతారామన్: ‘దుబాయ్ తరహా మెగా షాపింగ్ పండుగలు.. గృహ నిర్మాణ ప్రాజెక్టులకు 10 వేల కోట్లు’

ఫొటో సోర్స్, Getty Images
దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అందులో భాగంగా... దేశవ్యాప్తంగా స్తంభించిపోయిన గృహ నిర్మాణ రంగానికి చేయూత ఇచ్చేందుకు రూ. 10,000 కోట్ల నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
నిధులు లేక నిర్మాణం చివరి దశలో నిలిచిపోయిన నాన్-ఎన్‌పీఏ, నాన్-ఎన్‌సీఎల్‌టీ ప్రాజెక్టులను పూర్తిచేయటానికి అవసరమైన నిధులను అందించటానికి ఈ స్పెషల్ విండో నెలకొల్పుతున్నట్లు చెప్పారు.
ఈ ప్రాజెక్టులు అందుబాటులో ఉండే మధ్య ఆదాయ కేటగిరీ ప్రాజెక్టులు అయి ఉండాలన్నారు. ఇటువంటి ప్రాజెక్టులు సుమారు 3 లక్షల నుంచి 3.5 లక్షల వరకూ ఉన్నాయని విలేకరులు అడిగిన ప్రశ్నలకు నిర్మల బదులిచ్చారు.
భారత ఆర్థికాభివృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆరేళ్ల కనిష్ట స్థాయికి తగ్గి 5 శాతంగా నమోదైంది. మందకొడిగా సాగుతున్న వృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం పలు చర్యలు ప్రకటించింది.
బ్యాంకుల విలీనం, ఫారిన్ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు, దేశీయ పెట్టుబడిదారుల మీద అధిక సర్‌చార్జీని ఉపసంహరించటం, ఆటో రంగానికి పునరుద్ధరణ ప్యాకేజీ వంటి చర్యలు అందులో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రి శనివారం దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే...
''ఆర్థికవ్యవస్థ పుంజుకుంటున్న సంకేతాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. వార్షిక స్థిర పెట్టుబడి రేటు పెరుగుతోంది. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం కన్నా తక్కువగానే నిలువరించాం. ఒక ఆర్థిక వ్యవస్థ ఎంత బాగుందనే దానికి ఇది ముఖ్యమైన సూచిక.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రస్తుతం చాలా బలంగా ఉన్నాయి. అవి పుంజుకుంటున్న సంకేతాలూ ఉన్నాయి. విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు ఆగస్టు చివర్లో బాగా పెరిగాయి.
ఆగస్టులో ప్రకటించిన చర్యల్లో.. బ్యాంకులకు పాక్షిక క్రెడిట్ గ్యారంటీ పథకం వల్ల ఇప్పటివరకూ ఏడు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు (ఎన్‌బీఎఫ్‌సీలకు) ప్రయోజనం చేకూరింది.
బ్యాంకులు పన్ను రేట్లు తగ్గింపులను బదలాయిస్తున్నాయి. సెప్టెంబర్ 19వ తేదీన ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులతో సమావేశమై ఈ బదిలీని సమీక్షిస్తాను.

ఫొటో సోర్స్, PTI
గృహ నిర్మాణం, ఎగుమతుల రంగాలకు సంబంధించి జాతీయ స్థాయి సంప్రదింపుల ద్వారా రూపొందించిన కొన్ని చర్యలను ఇప్పుడు ప్రకటిస్తున్నాం.
రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ ఆర్ ట్యాక్సెస్ ఆన్ ఎక్స్‌పోర్ట్ ప్రొడక్ట్స్ (ఆర్ఓడీటీఈపీ) కొత్త పథకం. 2020 జనవరి నాటికి.. మర్కండైజ్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా స్కీమ్ (ఎంఈఐఎస్) పూర్తిగా రద్దయి దాని స్థానంలో ఈ కొత్త పథకం అమలవుతుంది.
ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్.. ఈసీఐఎస్ పరిధిని విస్తరిస్తుంది. ఎగుమతులకు వర్కింగ్ క్యాపిటల్ అందించే బ్యాంకులకు అధిక బీమా కవర్ అందిస్తుంది. ఈ చర్య వల్ల ప్రభుత్వానికి ఏటా రూ. 1,700 కోట్లు వ్యయమవుతుందని అంచనా.
పన్ను అసెస్‌మెంట్‌లో మానవ జోక్యాన్ని తొలగించాం. ఇదిక పూర్తిగా ఆటోమేటెడ్‌గా జరుగుతుంది. అసెస్‌మెంట్ యూనిట్ గోప్యంగా ఉంటుంది.
దుబాయ్‌లో నిర్వహిస్తున్నట్లుగా భారతదేశం కూడా ఏటా మెగా షాపింగ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తుంది. 2020 మార్చిలో దేశ వ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో వీటిని నిర్వహిస్తాం. ఇది పర్యాటకం, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ఎగుమతి రంగాలకు ప్రయజనం కలిగిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగించుకోవటం ద్వారా.. ఎగుమతులకు పట్టే సమయాన్ని తగ్గించటానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. విమానాశ్రయాలు, ఓడరేవుల్లో టర్న్ అరౌండ్ సమయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తగ్గించటానికి కార్యాచరణ ప్రణాళికను 2019 డిసెంబర్ నాటికి అమలు చేస్తాం. దీనిని మంత్రుల బృందం పర్యవేక్షిస్తుంది.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏల) విషయంలో వాణిజ్య విభాగానికి చెందిన సీనియర్ అధికారి సారథ్యంలో ఎఫ్‌టీఏ యుటిలైజేషన్ మిషన్‌ను ఏర్పాటు చేస్తాం. ప్రతి ఎఫ్‌టీఏలోని రాయితీ టారిఫ్‌లను వినియోగించుకోవటానికి ఈ మిషన్, ఎఫ్ఐఈఓ ఎగుమతుల సంస్థలతో కలిసి పనిచేస్తుంది.
ప్రాధాన్య రంగమైన చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు తోడ్పాటునివ్వటం కోసం.. ఎగుమతులకు రుణాల లభ్యత అధికంగా అందుబాటులో ఉండటానికి వీలుగా అదనంగా 36,000 కోట్ల నుంచి 68,000 కోట్లు విడుదల చేస్తాం.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద అర్హులైన గృహ కొనుగోలుదారులకు.. ఈసీబీ (బాహ్య వాణిజ్య రుణాలు) మార్గదర్శకాలను సడలిస్తాం.
నిధులు లేక చివరి దశలో ఆగిపోయిన అఫర్డబుల్, మిడిల్ ఇన్‌కమ్ ప్రాజెక్టులను పూర్తిచేయటానికి అవసరమైన నిధులను అందించటానికి రూ. 10,000 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తాం. దీనికి ప్రభుత్వంతో పాటు, బయటి పెట్టుబడిదారులు కూడా నిధులు సమకూరుస్తారు.''
ఇవి కూడా చదవండి:
- ఐఫోన్11: భారత మార్కెట్లో యాపిల్ ఫోన్ల ఆధిపత్యం సాధ్యమేనా
- బంగారు చెవిదుద్దును కోడిపుంజు మింగేసింది.. కోసి బయటకు తీశారు
- చెన్నైలో 20 ఏళ్ల కిందట కిడ్నాపైన బాలుడు.. అమెరికా నుంచి తిరిగొచ్చాడు. ఎలాగంటే..
- బ్యాంకు ఖాతాలో 90 లక్షలు వచ్చాయి... డ్రా చేశారు, ఖర్చుపెట్టేశారు... ఆ తర్వాత ఏం జరిగింది?
- ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన నగరం కారకస్‌లో రాత్రి జీవితం ఎలా ఉంటుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








