పవన్ కల్యాణ్: ‘‘ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇస్తున్నా.. పరిష్కరించకపోతే అమరావతి వీధుల్లో నడుస్తా...’’

ఫొటో సోర్స్, Janasena Party
ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరతతో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. ఆదివారం విశాఖపట్నంలో 'లాంగ్ మార్చ్' చేపట్టారు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి నుంచి హెలికాప్టర్‌లో విశాఖ చేరుకున్న పవన్ కల్యాణ్.. విశాఖపట్నంలోని మద్దిలపాలెం నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు ఈ ఆందోళన కార్యక్రమం ప్రారంభించారు. ఆయనతో పాటు భవన నిర్మాణ కార్మికులు, పవన్ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ప్రదర్శనలో పాల్గొన్నారు.
ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కాకముందే ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారంటే ప్రభుత్వం విఫలమైందని అర్థమని పవన్ కల్యాణ్ విమర్శించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. పవన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇస్తున్నా...
‘‘భవన నిర్మాణ కార్మికుల విషయంలో ప్రభుత్వానికి రెండు వారాల గడువు ఇస్తున్నాను. ఒక్కో భవన నిర్మాణ కార్మికుడికి రూ. 50 వేలు పరిహారం చెల్లించాలి.
చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి.
రెండు వారాల్లో ఏ స్పందనా లేకపోతే నేను అమరావతి వీధుల్లో నడుస్తాను. ఎవరు ఆపుతారో చూద్దాం. పోలీసులను పెట్టుకోమనండి.. ఏం చేస్తారో చేసుకోండి.’’

ఫొటో సోర్స్, @bolisetti_satya
‘‘జగన్ గారు మ్యాన్ ఫ్రైడే...’’
‘‘జగన్ గారు, విజయసాయి రెడ్డి గారు మ్యాన్ ఫ్రైడే.. అంటే ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లేవారిని మ్యాన్ ఫ్రైడే అంటారు. శుక్రవారం, శుక్రవారం కోర్టులకు వెళ్లి వచ్చే వారు ఏం పరిపాలన అందిస్తారు.
మీరు దిల్లీలో ఏం చేస్తున్నారో నాకు తెలుసు. కానీ నేను బహిరంగంగా చెప్పను. దిల్లీలో పరిపాలిస్తున్న వారు నాకు అభిమాన నాయకులు. నేను త్వరలో దిల్లీ వెళ్తాను.
ఇక్కడ ప్రభుత్వాలని దింపేసి అధికారంలోకి రావాలని నాకు లేదు.’’
‘‘ఆంధ్రప్రదేశ్ కులాలుగా చీలిపోయింది.. ఛీ....’’
‘‘రెండు వారాల్లో మా డిమాండ్లు పరిష్కరించకపోతే కొత్త కార్యాచరణ ప్రకటిస్తాం. ఈసారి అఖిలపక్షం అనను.
తెలంగాణలో ఆర్‌టీసీ కార్మికుల సమస్యల మీద అన్ని పార్టీలూ ఏకమై ఉద్యమిస్తున్నాయి. కానీ మన రాష్ట్రంలో.. కులాలుగా చీలిపోయి ఉంది.. ఛీ.
భవన నిర్మాణ కార్మికులు నా కులం వాళ్లా? కులాలను దాటి ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.
భవన నిర్మాణ కార్మికుల సమస్యలపట్ల సంఘీభావం తెలిపిన బీజేపీ, సీపీఎం, సీపీఐ నాయకులకు ధన్యవాదాలు.
చనిపోయిన 36 మంది భవన కార్మికుల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటిద్దాం.’’

ఫొటో సోర్స్, @Sivasia2
వైసీపీ ఎమ్మెల్యేలకు జీతాలు తీసుకునే అర్హత లేదు
‘‘ఒక ప్లంబర్ సెల్ఫీ వీడియోలో ఎందుకు చనిపోతున్నాననేది చెప్పి చనిపోతే.. రాజకీయ నాయకులు పట్టించుకోవటం లేదు. ఎగతాళి చేస్తున్నారు.
ఇన్ని లక్షల మంది కార్మికులు పనులు లేక పస్తులు ఉంటూ చనిపోతుంటే.. ప్రజల డబ్బుల నుంచి నెలకు రెండున్నర లక్షల రూపయాలు చొప్పున జీతాలు తీసుకునే అర్హత వైసీపీ ఎమ్మెల్యేలకు లేదు.
వారు అరు నెలల పాటు జీతాలు తీసుకోవద్దని కోరుతున్నాను. వైసీపీ ఎమ్మెల్యేల మీద నాకు వ్యక్తిగత ద్వేషమేమీ లేదు.
వైసీపీ నాయకులు అధికారంలోకి రాగానే.. బొత్స సత్యనారాయణ గారు ‘రాజధాని కట్టం’ అన్నారు.
విజయసాయిరెడ్డి గారు నా గురించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. నేను ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడే వాడిని కాదని ఆయనకు చెప్పదలచుకున్నాను. నేను ఎన్నో చూసి వచ్చాను. పరిధి దాటితే తాట తీస్తాం.
సూట్‌కేసు కంపెనీలు పెట్టే విజయసాయిరెడ్డి గారు కూడా నన్ను విమర్శిస్తే సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితి ఈ దేశానికి వచ్చింది.’’

ఫొటో సోర్స్, @KarrotuRaju
అంబేడ్కర్, కాన్షీరాం కూడా ఓడిపోయారు...
‘‘నేను రెండు చోట్ల ఓడిపోయాను కాబట్టి మాట్లాడే అర్హత నాకు లేదంటున్నారు. అంబేడ్కర్ ఓడిపోయారు. కాన్షీరాం ఓడిపోయారు. నేను వారితో పోల్చుకోవటం లేదు. గెలుపోటములు కాదు మాకు పోరాటమే మాకు ముఖ్యం.
రెండున్నర సంవత్సరాలు జైల్లో ఉన్న వీళ్లు.. నా గురించి ఏం మాట్లాడతారు? దేనికి వెళ్లారు జైలుకు?
టంగుటూరి ప్రకాశం లాగా స్వాతంత్ర్య ఉద్యమం కోసం వెళ్లారా? లేక మానవ హక్కుల కోసం ఉద్యమించో వెళ్లారా? సూట్‌కేసు కంపెనీలు పెట్టి అక్కడి డబ్బులు ఇక్కడికి, ఇక్కడి డబ్బులు అక్కడికి పంపించి జైలుకు వెళ్లారు.
వీళ్లు నన్ను దత్తపుత్రుడు, డీఎన్ఏ అని విమర్శిస్తున్నారు. నా డీఎన్ఏ గురించి మాట్లాడే హక్కు ఏ వైసీపీ నాయకుడికి ఉంది?’’

ఫొటో సోర్స్, Janasena Party
నేను ప్రజలకు దత్తపుత్రుడిని...
‘‘రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయింది. వైసీపీ నాయకులు ఇసుకని చాలా తేలికగా మాట్లాడుతున్నారు. వారికి తెలుసా పాలన అంటే?
ఒక రాష్ట్ర నాయకుడికి, ఒక ముఖ్యమంత్రికి పాలన నడపటం ఎంత కష్టమో నాకు తెలుసు. జగన్ రెడ్డి మీద నాకు ద్వేషమేమీ లేదు. ఆయన బాగా పనిచేస్తే నాకన్నా సంతోషించే వారు ఎవరూ లేరు.
కానీ.. ప్రజలకు సమస్యలు వస్తే నాకన్నా పోరాడే వారు లేరు. దేశ ప్రయోజనాలను ఆశించి, భవిష్యత్ తరాల కోసం ఏం ఇవ్వగలనని ఆలోచించి.. నేను ఓడిపోయినా పార్టీని నడుపుతున్నాను.
టీడీపీతో నేను విభేదించాను. వారు సమాధానం చెప్పారు. కానీ మేం కలవలేదు. వైసీపీ నాయకులు నన్ను చంద్రబాబుకు దత్తపుత్రుడు అంటున్నారు.. నేను నా ప్రజలకు దత్తపుత్రుడిని. కష్టాల్లో ఉన్న ప్రజలకు దత్తపుత్రుడిని.
భవన నిర్మాణ కార్మికులు నన్ను అడిగినపుడు.. ఒక కుమారుడిలాగే నేను స్పందించాను.
ఇసుక లేకపోవటానికి కారణం వర్షాలు, వరదలు అంటున్నారు. టీడీపీ విధానంలో లోపాలు ఉంటే సరిచేయండి. కానీ ఇసుకను ఆపేస్తామంటే ఎలా? ఎన్ని రోజులు?
ఇతర రాష్ట్రాల్లో వర్షాలు రాలేదా? వరదలు రాలేదా? అక్కడ భవన నిర్మాణ కార్మికులు ఎందుకు చనిపోవటం లేదు? ఇక్కడే ఎందుకు చనిపోతున్నారు?’’

ఫొటో సోర్స్, Janasena Party
ఆరు నెలల్లో ప్రభుత్వం విఫలమైంది...
‘‘దత్తపుత్రుడు, డీఎన్‌ఏ, బీ-టీం వంటి మాటలన్నీ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఎన్నికల సమయంలో మాట్లాడారు. ఇప్పుడూ మాట్లాడుతున్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించిన తర్వాత వారు చేసిన విమర్శలకు చాలా బలంగా సమాధానం చెప్తా. అప్పటిదాకా సంయమనం పాటిస్తా.
ఆరు నెలలు కూడా కాలేదు ఇంకా. ఇంతమంది కార్మికులు, ఆడపడుచులు, జనసైనికులు రోడ్ల మీదకు వచ్చారంటే.. గళం విప్పారంటే.. ప్రజలు రోడ్ల మీదకు వచ్చారంటే ప్రభుత్వం విఫలమైందని అర్థం.
ఈ కార్యక్రమం చేపట్టటానికి నాకేమన్నా సరదానా? అడుగు తీసి అడుగు వేయాలంటే ఊపిరి ఆగిపోయేంత ఒత్తిడి ఉంటుంది నాకు.. సరదానా నాకు. పార్టీని నడపటమంటే ఆషామాషీ అనుకుంటున్నారా? ఒక పార్టీ పెట్టి మాట్లాడమనండి ఒక్కొక్కడిని. ఒక భావజాలాన్ని పట్టుకుని చచ్చిపోయే వరకూ నువ్వు నిలబడగలవా?
రాష్ట్ర విభజన సమయంలో మాట్లాడే దమ్ము వైసీపీ లేకుండా పోయింది.’’

ఫొటో సోర్స్, Janasena Party
అద్భుతమైన పాలన అందిస్తే.. నేను సినిమాలు చేసుకుంటా..
‘‘ప్రజాప్రతినిధులు బాధ్యతగా ఉండి ఉంటే.. నేను జనసేన పార్టీ పెట్టేవాడిని కాదు. నాకేం సరదాలు కాదు. అధికారం కోసం అర్రులు చాసేవాడ్ని కాదు. డబ్బుల కోసం అర్రులు చాసేవాడ్ని కాదు.
సినిమాలు చేసి కోట్లు వదులుకున్న వాడిని. ప్రజల కోసం సినిమాలు వదిలిపెట్టి వచ్చా. రాజకీయం నాకు ఒక బాధ్యత. నేను శ్రామికుడిని. వైసీపీ అద్భుతమైన పాలన అందిస్తే.. నేను వెళ్లి సినిమాలు చేసుకుంటాను.
భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు నన్ను కలచివేశాయి. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్ని లక్షలు జీతాలు తీసుకుంటున్నారో అడగండి? కూలీ పనులు చేసుకునే వారి శ్రమ గురించి, సమస్యల గురించి మీకు తెలుసా? చిన్న జీవితం వారిది.
జగన్ రెడ్డి లాగా వేల కోట్లు లేవు.. వైసీపీ ఎమ్మెల్యేల లాగా కోట్లు పెట్టి ఎన్నికల్లో పోటీ చేయలేరు. వైసీపీ నాయకులు, కన్నబాబు మమ్మల్ని విమర్శిస్తున్నారు. మీ బతుకులు తెలీవా మాకు? నిన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది నాగబాబు గారు. మేము.
గాజువాకలో ఓడిపోయాం.. భీమవరంలో ఓడిపోయాం.. అయితే మాకు తెలిసింది పోరాటం. ఓడిపోయిన వ్యక్తికి ఇంత ప్రేమ.. ఇంత ఘనస్వాగతం.. మీ గుండెల్లో ఇచ్చిన స్థానం కన్నా ఏం కావాలి నాకు?’’
విద్యుత్ షాక్.. ముగ్గురి పరిస్థితి విషమం...
ఇదిలావుంటే.. జనసేన సభలో విద్యుత్ షాక్‌కు గురై పలువురు గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో కింగ్ జార్జ్ ఆస్పత్రికి తరలించారు.
అయితే.. పవన్ కల్యాణ్ సభ వేదిక మీదకు వచ్చిన సమయంలో టీడీపీ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రసంగిస్తున్నపుడు ఈ ప్రమాదం సంభవించింది.
‘‘కరెంట్ షాక్ కొడుతోంది.. అందరూ అక్కడి నుంచి జరగండి’’ అంటూ అయ్యన్నపాత్రుడు మైక్‌లోనే హెచ్చరించారు. జనరేటర్‌ను ఆపివేయాలని సూచించారు.
పవన్ కల్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు స్పందించి.. అంబులెన్స్ పిలిపించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

వ్యాన్‌లో సభా స్థలికి పవన్ కల్యాణ్...
మద్దిలపాలెం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు లాంగ్ మార్చ్ ర్యాలీ నిర్వహించాలని పవన్ తలపెట్టారు. అయితే.. అభిమానుల తాకిడి అధికంగా ఉండటంతో.. పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్‌లో నడవకుండా వాన్ ఎక్కి సభస్థలానికి చేరుకున్నారు.
జనసేన ఇసుక లాంగ్ మార్చ్‌లో తాము పాల్గొనబోమని వామపక్ష పార్టీలు స్పష్టం చేశాయి. ఈ నిరసన కార్యక్రమానికి జనసేన బీజేపీని కూడా ఆహ్వానించింది. అయితే.. బీజేపీతో కలసి నడిచే వారితో తాము నడవలేమని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో 35 లక్షల మందికి పైగా నిర్మాణ కార్మికులు ఉన్నారని.. ఇసుక సరఫరా లేకపోవటంతో నెలల తరబడి నిర్మాణ కార్యక్రమాలు నిలిచిపోయి పనులు లేక బాధ పడుతున్నారని.. పలువురు కార్మికులు ఆత్మహత్య కూడా చేసుకున్నారని.. పవన్ అంతకుముందు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, పరిష్కరించటానికి, అండగా ఉండటానికి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
పవన్ పెయిడ్ ఆర్టిస్టులా మాట్లాడుతున్నారు - వైసీపీ
టీడీపీ నేతలను పక్కన పెట్టుకుని ఇసుక అక్రమాల గురించి పవన్ కల్యాణ్ మాట్లాడటం దారుణం అని అనకాపల్లి ఎమ్మెల్యే, వైసీపీ అధికార ప్రతినిధి గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు.
"నలభై రోజుల నుంచి రాష్ట్రంలో తీవ్ర వర్షాలు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇసుక ఎలా తియ్యాలో పవన్ కల్యాణ్ ఏదైనా కొత్త టెక్నాలజీ ఉందేమో చెప్పాలి.
ఆయన ఒకసారి వచ్చి ఇసుక డిపోల్లో చూడాలి. రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో ఇసుక అందుబాటులోకి వస్తుంది. మా ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉంది.
లాంగ్ మార్చ్ అని చెప్పిన పవన్ కనీసం 2 కి.మీ. కూడా నడవలేదు. కేంద్రంలో మాకు పెద్దలు తెలుసు అని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? బీజేపీ, టీడీపీతో కలసి రాష్ట్రాన్ని పవన్ నాశనం చేస్తున్నారు. పెయిడ్ ఆర్టిస్టులా మాట్లాడుతున్న ఆయన మళ్లీ సినిమాలు తీసుకోవడం మంచిది" అని అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు.
పరిష్కారాన్ని చూపించడంలో పవన్ విఫలం
మీడియా దృష్టికి, రాష్ర్టంలోని ఇతర వర్గాల దృష్టికి ఇసుక సమస్యలు, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు తీసుకెళ్లడంలో పవన్ విజయం సాధించారు, కానీ పరిష్కారం చూపడంలో విఫలమయ్యారని కృష్ణ యూనివర్శిటీ జర్నలిజం విభాగం ప్రొఫెసర్ డాక్టర్ వినయ్ కుమార్ అన్నారు.
"పవన్ సమస్యలను ఎత్తిచూపడంతో పాటు ప్రాక్టికల్‌గా సమస్యకు పరిష్కారం చూపించాలి. మేధావులు, ప్రజలతో చర్చించి ఆ రెమిడీని సూచించాలి. ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగడుతూనే రెమిడీని చూపించాలి. కానీ ఆయన ప్రతిసారీ రెమెడీని చూపడంలో విఫలం అవుతున్నారు.
ఆయనపై తెలుగుదేశం దత్తపుత్రుడనే ముద్ర పడుతోంది. నదులన్నీ బంగాళాఖాతంలో కలుస్తున్నట్లుగా ఆయన నుంచి ఏ ఆలోచన వచ్చినా అది తెలుగుదేశం పార్టీదే అనే ముద్ర పడుతోంది. తెలుగుదేశం నేతలను పక్కన పెట్టుకుని నేను తెలుగుదేశం దత్తపుత్రుణ్ని కాదు అని చెప్పడాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు? ఆయన నిజాయతీగా ఉంటారు అనే భావన ఎలా కలుగుతుంది? ఆయన ప్రజల దత్తపుత్రుణ్ని అని నిరూపించుకోవాలి. ఆ బాధ్యత ఆయనపై ఉంది.
పవన్‌కు సొంత ముద్ర లేకుండా పోతోంది. ఆయన ఏం మాట్లాడినా చంద్రబాబుకు ఫేవర్‌గా మాట్లాడుతున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనే అభిప్రాయం ప్రజల్లో వస్తోంది. బీజేపీకి, తెలుగుదేశానికి అనుసంధానకర్త అయ్యారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. టీడీపీకి కష్టాలు వస్తే పవన్ బయటకు వస్తారు అనే వాదన పెరుగుతోంది. జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను కలుపుకుని, జాతీయ సమస్యలపై కూడా పవన్ పోరాడితే బాగుంటుంది" అని వినయ్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- భారతదేశ కొత్త మ్యాప్‌లో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఎందుకు చూపించలేదు?
- ఐఎస్ కిల్లర్: నేను 100 మందికి పైగా చంపాను!
- పెగాసస్ స్పైవేర్: మీకు తెలీకుండానే మీ ఫోన్‌ను హ్యాక్ చేస్తుంది
- పిడికెడు మిరపకాయలు, గుప్పెడు అన్నం... అయిదేళ్లు ఆదే ఆమె ఆహారం
- వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఈ అస్థిపంజరం కోసం నాజీలు, సోవియట్లు ఎందుకు పోరాడారు?
- వివాహేతర సంబంధం: చట్టాలు రూపొందించే మత నాయకుడికి అవే చట్టాల కింద బహిరంగ శిక్ష
- స్టాకర్వేర్: భార్యలు, భాగస్వాములపై నిఘా కోసం పెరుగుతున్న స్పైవేర్ వినియోగం.. రెండో స్థానంలో భారత్
- తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
- చైనా రైతులు సరిహద్దు దాటి రష్యాలోకి ఎందుకు అడుగుపెడుతున్నారు?
- ఇదో బానిసల మార్కెట్... వేలాది మహిళలను ఆన్లైన్లో అమ్మేస్తున్నారు: బీబీసీ రహస్య పరిశోధన
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








