వివాహేతర సంబంధం: చట్టాలు రూపొందించే మత నాయకుడికి అవే చట్టాల కింద బహిరంగ శిక్ష

ఫొటో సోర్స్, AFP
ఇండోనేషియాలో కఠినమైన వివాహేతర సంబంధాల నియంత్రణ చట్టాలను రూపొందించే సంస్థలో సభ్యుడికే ఆ చట్టాల కింద శిక్ష పడింది.
వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు ముఖ్లిస్ బిన్ మహమ్మద్‌కు అక్కడి అధికారులు 28 బెత్తం దెబ్బల శిక్ష అమలు చేశారు.
ఇండోనేషియాలోని అకెహ్ ప్రాంతంలో చట్టాలను రూపొందించే అకెహ్ ఉలేమా కౌన్సిల్ (ఎమ్‌పీయూ)లో ముఖ్లిస్ సభ్యుడు.
ముఖ్లిస్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకు 23 బెత్తం దెబ్బల శిక్ష వేశారు.
ఇండోనేషియాలోకెల్లా అకెహ్‌లో సంప్రదాయవాదం ఎక్కువ. ఈ ఒక్క ప్రాంతంలోనే కఠినమైన ఇస్లామిక్ షరియా చట్టాలు అమలవుతున్నాయి.
స్వలింగ సంపర్కంలో పాల్గొనేవారికి, జూదం ఆడేవారికి కూడా ఇక్కడ బెత్తం దెబ్బల శిక్ష విధిస్తారు.

ఫొటో సోర్స్, AFP
''ఇది దేవుడి చట్టం. దోషిగా తేలితే ఎవరికైనా దండన తప్పదు, వాళ్లు ఎమ్‌పీయూ సభ్యులైనా సరే'' అని అకెహ్ బెసర్ జిల్లా డిప్యూటీ మేయర్ హుస్సేని వాహబ్ బీబీసీతో చెప్పారు.
ముఖ్లిస్.. అకెహ్ బెసర్ జిల్లాలోనే ఉంటున్నారు.
శిక్ష ఎదుర్కొన్న జంట గత సెప్టెంబర్‌లో అధికారులకు చిక్కింది. స్థానికంగా ఉన్న ఓ బీచ్ సమీపంలో కార్లో వీళ్లున్నప్పుడు పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
గురువారం వీరికి శిక్ష అమలు చేశారు.
ఎమ్‌పీయూ నుంచి ముఖ్లిస్‌ను బహిష్కరించనున్నట్లు హుస్సేని తెలిపారు.
అకెహ్‌లో షరియా చట్టాలు 2005 నుంచి అమలవుతున్నాయి. అప్పటి నుంచి బహిరంగంగా బెత్తం దెబ్బల శిక్ష ఎదుర్కొన్న తొలి మత నాయకుడు ముఖ్లిసే.

ఫొటో సోర్స్, AFP
అకెహ్‌లో చట్టాల రూపకల్పనలో స్థానిక ప్రభుత్వానికి ఎమ్‌పీయూ సలహాలు, సూచనలు చేస్తుంటుంది.
ఓ దశాబ్దం క్రితం సొంతంగా కఠినమైన ఇస్లామిక్ చట్టాలు ప్రవేశపెట్టుకునేందుకు అకెహ్‌కు ఇండోనేషియాలో ప్రత్యేక హక్కులు కల్పించారు.
దీంతో 2014లో స్వలింగ సంపర్కానికి వ్యతిరేకంగా చట్టాలు వచ్చాయి. ఆ మరుసటి ఏడాది నుంచి అవి అమలవుతున్నాయి.
వివాహేతర సంబంధం, జూదం, మద్యం తాగడం, ఉత్పత్తి, సరఫరా కూడా షరియా చట్టాల కింద శిక్షార్హమే.
2017లో అకెహ్‌లో శృంగారంలో పాల్గొంటూ దొరికిపోయిన ఇద్దరు పురుషులకు 83 బెత్తం దెబ్బల శిక్ష విధించారు.

ఫొటో సోర్స్, AFP
ఈ శిక్షలను బహిరంగంగానే ఓ వేదిక ఏర్పాటు చేసి అమలు చేస్తారు. శిక్షలను వీక్షించేందుకు చిన్నారులకు అనుమతి లేదు.
శిక్షను అమలు చేసే వ్యక్తి వివరాలు బయటకు తెలియకుండా, పూర్తిగా ముసుగు ధరింపజేస్తారు. ఒక్క కళ్లు మాత్రమే బయటకు కనిపించేలా వీరి దుస్తులు ఉంటాయి.
అకెహ్‌లో ముస్లింలతోపాటు ఇతర మతాలవారికీ ఈ షరియా చట్టాలు వర్తిస్తాయి.
ఇవి కూడా చదవండి.
- ఇదో బానిసల మార్కెట్... వేలాది మహిళలను ఆన్లైన్లో అమ్మేస్తున్నారు: బీబీసీ రహస్య పరిశోధన
- తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
- సెక్స్ కోసం మహిళను మగాడు బలవంతం చేస్తే అది రేప్... మరి అదే పని ఒక మహిళ చేస్తే
- ఈ మహిళలు నల్లచీరలు కట్టుకుని ఎందుకు మాట్లాడుతున్నారు
- సౌదీ అరేబియాలో ఇకపై పెళ్ళికాని జంటలు హోటల్లో కలిసి ఉండవచ్చు...
- పెగాసస్ స్పైవేర్: మీకు తెలీకుండానే మీ ఫోన్‌ను హ్యాక్ చేస్తుంది
- ‘ఈ అసమానతలు మాకొద్దు’ - చిలీ నిరసనల్లో పాల్గొన్న 10 లక్షలమంది నినాదం ఇదే
- WhatsApp నిఘా కుంభకోణం: ఇజ్రాయెల్ కంపెనీ NSO ఏమంటోంది
- 'ఐఫోన్ నన్ను 'గే'గా మార్చింది' అంటూ యాపిల్ కంపెనీపై కేసు వేసిన రష్యన్
- అరబ్ దేశాల్లో మతాన్ని వదిలేసేవారు పెరుగుతున్నారు :బీబీసీ సమగ్ర సర్వే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








