‘ఈ అసమానతలు మాకొద్దు’ - చిలీ నిరసనల్లో పాల్గొన్న 10 లక్షలమంది నినాదం ఇదే

చిలీ నిరసనలు

ఫొటో సోర్స్, AFP

దేశంలో పాతుకుపోయిన అసమానతలకు ప్రభుత్వం ముగింపు పలకాలని కోరుతూ చిలీ రాజధాని శాంటియాగోలో జరిగిన శాంతియుత నిరసనల్లో పది లక్షలమందికిపైగా పాల్గొన్నారు.

దేశంలో సంస్కరణలు జరగాలంటూ నినాదాలు చేస్తూ, చేతుల్లో జెండాలు పట్టుకొని నగరంలో కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ ఈ ప్రదర్శన నిర్వహించారు.

చాలా రోజులుగా జరుగుతున్న ఈ నిరసనల్లో నేటి ప్రదర్శన ఓ చారిత్రక ఘట్టం అని శాంటియాగో గవర్నర్ పేర్కొన్నారు.

‘ప్రజల సందేశాన్ని ప్రభుత్వం వినింది’ అని దేశాధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా అన్నారు.

‘మనమందరం మారాం. నేడు ఎంతో ఉత్సాహభరితంగా, శాంతియుతంగా జరిగిన మార్చ్‌లో ఐక్యతతో కూడిన చిలీని ప్రజలు కోరారు. ఇది భవిష్యత్తుపైన కొత్త ఆశలకు దారి చూపుతోంది’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.

శుక్రవారంనాడు దేశంలో నిరసనల వల్ల ఆందోళనకర పరిస్థితి నెలకొంది. వాల్‌పైరసో నగరంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు కాంగ్రెస్ భవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో రాజకీయనేతలను, అధికారులను కట్టుదిట్టమైన భద్రత నడుమ బయటకు తీసుకురావల్సొచ్చింది.

చిలీ నిరసనలు

ఫొటో సోర్స్, Reuters

మార్చ్‌లో ఏం జరిగింది?

శాంటియాగోలో శుక్రవారం నాటి మార్చ్‌లో పదిలక్షల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారని గవర్నర్ కర్లా రుబిలార్ తెలిపారు. ఈ సంఖ్య దేశ జనాభాలో 5శాతం కంటే ఎక్కువ. ‘కలల చిలీకి ఈ నిరసనకారులు ప్రతిరూపం’ అని ఆమె పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

రాజధానితో పాటు అన్ని ప్రధాన నగరాల్లోనూ నిరసనకారులు రోడ్డెక్కారు.

‘మేం అడుగుతోంది నీతి, నిజాయతీ కలిగిన ప్రభుత్వాన్ని మాత్రమే’ అని ఫ్రాన్సిస్కో యాంగిటార్ అనే వ్యక్తి చెప్పారు.

అధ్యక్షుడు పినెరా రాజీనామా చేయాలని చాలామంది ఆందోళనకారులు నినాదాలు చేశారు.

ఈ నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి?

మొదట మెట్రో ధరలు పెంచడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాంతో దేశ వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. ఇంధన ఖర్చులు అధికంగా ఉండటం.. కరెన్సీ బలహీనపడటం వల్ల బస్, మెట్రో చార్జీలు పెంచామని ప్రభుత్వం చెప్తోంది. కానీ ఇది పేదల నుంచి డబ్బులు పిండటానికి ప్రభుత్వం చేపట్టిన మరొక చర్య మాత్రమేనని ఆందోళనకారులు మండిపడ్డారు.

ఆ తరువాత పెరిగిన ధరల్ని ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ దేశంలోని ఇతర సమస్యలు, పెరుగుతున్న జీవన వ్యయం, అసమానతలపైన పోరాడుతూ ప్రజలు ఆందోళనలు ఉద్ధృతం చేశారు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

కొన్ని రోజులుగా సాగుతున్న ఈ ఆందోళనల్లో లూటీలు, విధ్వంసకర ఘటనలు కూడా జరిగాయి. ఈ నిరసనల కారణంగా గత వారం రోజుల్లో కనీసం 16మంది చనిపోయారు. వందల మంది గాయపడ్డారు. 7వేల మందికి పైగా ఆందోళనకారులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

దేశ రాజధాని శాంటియాగోలో భద్రతా చర్యలను సైన్యం తన అధీనంలోకి తీసుకుంది. ఇప్పుడు అక్కడ అత్యవసర పరిస్థితి నెలకొంది. రాత్రుళ్లు కర్ఫ్యూ అమల్లో ఉంది. 20వేల మందికి పైగా పోలీసులు వీధుల్లో గస్తీ కాస్తున్నారు.

లాటిన్ అమెరికాలోని ధనిక దేశాల్లో చిలీ ఒకటి. కానీ, అక్కడ అసమానతలు కూడా ఎక్కువగా ఉన్నాయి. 36 సభ్య దేశాలున్న ‘ఓఈసీడీ’ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్)‌లో ఆర్థిక అసమానతల విషయంలో మొదటి స్థానంలో ఉన్న దేశం అదే.

ఆందోళనలకు ముగింపు పలికే ప్రయత్నాల్లో భాగంగా ఓ సంస్కరణల ప్యాకేజీని అధ్యక్షుడు పినెరా ప్రకటించారు. కనీస పింఛను, కనీసం వేతనాల పెంపు లాంటి అంశాలను అందులో చేర్చారు. కానీ, ఆందోళనలను ఆ ప్రకటన చల్లార్చలేకపోయింది.

నిరసనకారులు శుక్రవారం సాయంత్రం భద్రతా బలగాలతో ఘర్షణ పడుతుంటే.. దేశాధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా సంపన్న ప్రాంతంలోని ఒక ఇటాలియన్ రెస్టారెంట్‌లో పార్టీలో పాల్గొన్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. ఇది.. చిలీ రాజకీయ కులీనులకు - వీధుల్లో సాధారణ ప్రజలకు మధ్య ఉన్న అంతరానికి అద్దం పడుతోందని కొందరు వ్యాఖ్యానించారు.

''ఇది కేవలం మెట్రో చార్జీల పెంపు మీద వ్యక్తమైన నిరసన కాదు.. నిరుపేదలను ప్రధానంగా దెబ్బతీసిన సుదీర్ఘ అణచివేత మీద పెల్లుబికిన నిరసన'' అని నిరసనల్లో పాల్గొన్న ఒక విద్యార్థి అభివర్ణించారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)