వాట్సాప్ హ్యాకింగ్: మీకు ఇలాంటి కాల్ ఎప్పుడైనా వచ్చిందా.. వస్తే అనుమానించాల్సిందే

- రచయిత, జో టిడీ
- హోదా, సైబర్ సెక్యూరిటీ రిపోర్టర్, బీబీసీ న్యూస్
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఫాస్టిన్ రుకుండోకు వాట్సాప్‌లో ఒక కాల్ వచ్చింది. పూర్తిగా కొత్త నంబర్.. తనకు తెలిసినవారి నుంచి కాదు. అయినా, ఆయన కాల్ లిఫ్ట్ చేశారు. అటువైపు నుంచి ఎవరూ ఏమీ మాట్లాడలేదు.. నిశ్శబ్దంగా ఉంది.
రుకుండో తిరిగి ఆ నంబర్‌కు కాల్ చేశాడు. ఎవరూ లిఫ్ట్ చేయలేదు.
రువాండాకు చెందిన రుకుండో బ్రిటన్‌లోని లీడ్స్‌లో నివసిస్తారు. ప్రైవసీ విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకుంటారు. తనకు కాల్ వచ్చిన నంబర్ గుర్తించడం కోసం ఆన్‌లైన్‌లో వెతికారాయన. స్వీడన్ నుంచి కాల్ వచ్చినట్లుగా గుర్తించారు.
ఆ తరువాత ఆ విషయం మర్చిపోయారాయన.
అలాంటి గుర్తు తెలియని నంబర్ల నుంచి తన ఫోన్‌కు కాల్స్ వస్తుండడంతో ఆయన ఆందోళన చెందారు. ఏకంగా ఫోనే మార్చేశారు.
కొత్త ఫోన్ కొన్న మర్నాడే దానికీ గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసినా అటు నుంచి ఎలాంటి స్పందనా ఉండడం లేదని రుకుండో 'బీబీసీ'కి చెప్పారు.
దాంతో అనుమానం వచ్చి ఫోన్లోని ఫైళ్లను పరిశీలించగా కొన్ని మిస్సయినట్లు గుర్తించారాయన.
'రువాండా నేషనల్ కాంగ్రెస్‌కు చెందిన కొందరికి ఈ విషయం చెప్పాను. వారు తమకూ అలానే జరుగుతోందన్నారు. నాకు కాల్స్ వచ్చిన నంబర్ల నుంచే వారికీ కాల్స్ వచ్చాయి. వారి ఫోన్లలోని సమాచారమూ కొంత పోయింది.''
రువాండా నేషనల్ కాంగ్రెస్ అనేది రువాండా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ఒక గ్రూప్.
వాట్సాప్ హ్యాక్ అవుతోందన్న వార్తలు చదివిన తరువాత రుకుండోకు విషయం అర్థమైంది.
''వాట్సాప్ హ్యాకింగ్‌పై బీబీసీలో కథనం చదవగానే నాకూ అచ్చంగా అలాగే జరిగిందని అర్థమైంది. అంటే నా ఫోన్ వాట్సాప్ ద్వారా హ్యాకయినట్లేనని తెలిసింది.''
'నేను ఫోనయితే మార్చాను కానీ నంబర్ మార్చలేదు కదా.. ఆ నంబర్‌కు ఫోన్ చేసి నాకు తెలియకుండానే నేనప్పటికి వాడుతున్న మొబైల్‌లో స్పైవేర్ ఇన్‌స్టాల్ చేస్తున్నారు.''

ఫొటో సోర్స్, Reuters
వాట్సాప్ హ్యాకింగ్ ద్వారా లక్ష్యంగా చేసుకున్న 1400 మందిలో తాను, తన స్నేహితులు కూడా ఉన్నారని అర్థమైందంటున్నారు రుకుండో.
టొరంటోలోని సిటిజన్ ల్యాబ్ నుంచి రుకుండోకు కాల్ చేసి ఆయన ఫోన్ హ్యాకయినట్లు చెప్పారు. ఆయన స్నేహితులకు మాత్రం ఇలాంటి కాల్ ఏమీ రాలేదు.
సిటిజన్ ల్యాబ్ సంస్థ ఫేస్‌బుక్‌తో కలిసి గత ఆర్నెలలుగా ఈ హ్యాకింగ్‌కు సంబంధించి దర్యాప్తు చేస్తోంది. దీని బాధితులెవరో గుర్తిస్తోంది.
'మా విచారణలో 20 దేశాలకు చెందిన 100 మంది బాధితులను గుర్తించాం. అందులో జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు ఉన్నారు' అని సిటిజన్ ల్యాబ్ వెల్లడించింది.
వాట్సాప్ హ్యాకింగ్‌కు వినియోగిస్తున్న పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్ రూపొందించి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని ప్రభుత్వాలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
హ్యాకర్లు ఈ సాఫ్ట్‌వేర్‌ను జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, రాజకీయ అసమ్మతివాదులు లక్ష్యంగా వాడుతున్నారు.
వాట్సాప్ కాల్ ద్వారా హ్యాకింగ్ అయిన తరువాత తనకు మళ్లీ ఇటీవల కాలంలో అలాంటి కాల్స్ ఏమీ రాకపోయినా... ఇప్పటికీ తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రైవసీ విషయంలో భయం కలుగుతోందన్నారు.
రువాండాలో ప్రభుత్వాన్ని విమర్శించేవారిని అరెస్టులు చేసి జైలులో పెడుతున్నప్పుడు 2005లో రుకుండో ఆ దేశం నుంచి పారిపోయారు.
2007లో ఆయన భార్యను జైలులో పెట్టారు. అప్పటి నుంచి ఆమె విడుదల కోసం ఆయన పోరాడుతున్నారు.

ఫొటో సోర్స్, CITIZEN LAB
వాట్సాప్ యాజమాన్య సంస్థ ఫేస్‌బుక్ ఈ స్పైవేర్ రూపకర్త ఎన్‌ఎస్‌వో గ్రూప్‌పై దావా వేస్తోంది.
అయితే, ఎన్‌ఎస్‌వో సంస్థ మాత్రం తమ తప్పేమీ లేదంటోంది.
ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో 150 కోట్ల మంది వినియోగిస్తున్న వాట్సాప్‌లో తాము గుర్తించని ఒక దుర్బలతను ఎన్‌ఎస్‌వో వాడుకుందని ఫేస్‌బుక్ ఆరోపిస్తోంది.
గతంలో హ్యాకర్లు వాట్సాప్ ద్వారా లింకులు పంపిస్తే వాటిని యూజర్లు డౌన్‌లోడ్ చేసుకుంటే స్పైవేర్‌లు ఇన్‌స్టాల్ అయ్యేవని.. కానీ, పెగాసస్ అలా కాకుండా యూజర్‌తో సంబంధం లేకుండానే వారి ఫోన్లో ఇన్‌స్టాల్ అవుతోందని ఫేస్‌బుక్ ఆరోపిస్తోంది.
2018 జనవరి నుంచి 2019 మే మధ్య ఎన్‌ఎస్‌వో సంస్థ సైప్రస్, ఇజ్రాయెల్, బ్రెజిల్, ఇండోనేసియా, స్వీడన్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో కొన్ని మొబైల్ నంబర్లు తీసుకుని వాటితో వాట్సాప్ ఖాతాలు తెరిచి మోసాలకు పాల్పడుతోందని కూడా ఫేస్‌బుక్ ఆరోపిస్తోంది.
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో వాట్సాప్ కాల్స్‌తో బాధితుల ఫోన్లలో ఈ స్పైవేర్ ఇన్‌స్టాల్ చేశారని ఫేస్‌బుక్ చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
కాల్ సెట్టింగుల మాటున..
ఫేస్‌బుక్ కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం.. ''వాట్సాప్ సిగ్నలింగ్ సర్వర్లలో ఉండే సాంకేతిక పరిమితులను దాటడానికి ప్రతివాదులు హానికర కోడ్ ఉన్న కాల్ ఇనిషియేషన్ మెసేజ్‌లు రూపొందించి చట్టబద్ధమైన కాల్‌లా అనిపించేలా చేశారు.. ఆ కాల్ సెట్టింగులో కోడ్ దాగి ఉంది'' అని పేర్కొన్నారు.
''ఆ హానికర కోడ్.. కాల్ సెట్టింగుల్లా మారు రూపంలో ఉంచి దాన్ని లక్షిత ఫోన్ నంబరుకు పంపిస్తున్నారు. ఇది వాట్సాప్ సిగ్నలింగ్ సర్వర్‌ల నుంచి వచ్చినట్లుగానే ఉంటుంది'' అన్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో బాధితులు తాము హ్యాకర్ల దాడికి గురవుతున్నట్లు గుర్తించలేరు. హ్యాకింగ్ అనుమానాలున్నవారు కూడా మిస్డ్ కాల్‌గానే భావిస్తున్నారు కానీ హ్యాకింగుకు గురైనట్లు తెలుసుకోలేకపోతున్నారు.
కాగా హ్యాకింగ్‌కు తమకు ఎలాంటి సంబంధం లేదని ఎన్‌ఎస్‌వో గ్రూప్ చెబుతోంది. జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ మరణానికీ ఈ స్పైవేరే కారణమైందన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఈ ఆరోపణలకు వ్యతిరేకంగా పోరాడతామని ఎన్‌ఎస్‌వో ఒక ప్రకటన విడుదల చేసింది.
ప్రపంచంలోని వివిధ ప్రభుత్వాలకు చెందిన అనుమతులున్న నిఘా సంస్థలకు మాత్రమే ఉగ్రవాదం, తీవ్ర నేరాలకు వ్యతిరేకంగా వారు చేసే పోరాటం, దర్యాప్తులకు ఉపకరించేలా తమ సాఫ్ట్‌వేర్‌లు సరఫరా చేస్తామని ఎన్‌ఎస్‌వో తమ ప్రకటనలో చెప్పింది.
ఇవి కూడా చదవండి
- పెగాసస్ స్పైవేర్: మీకు తెలీకుండానే మీ ఫోన్‌ను హ్యాక్ చేస్తుంది
- అఫ్గానిస్తాన్‌లో వాట్సాప్‌ను నిషేధిస్తారట!
- వాట్సాప్ మెసేజ్‌ల మీద నిఘా పెట్టాలని భారతదేశం ఎందుకు భావిస్తోంది?
- స్మార్ట్ ఫోన్లు మన మాటలు, సంభాషణలను రహస్యంగా వింటున్నాయా?
- మీ చేతిలోని స్మార్ట్ ఫోనే మీకు శత్రువుగా మారితే...
- వాట్సాప్‌లో కొత్త సమస్య.. మీ మెసేజ్‌లను వక్రీకరించి పంపొచ్చు
- పిడికెడు మిరపకాయలు, గుప్పెడు అన్నం... అయిదేళ్లు ఆదే ఆమె ఆహారం
- వరల్డ్ వీగన్ డే: ఏ ప్రాణినీ ఇబ్బంది పెట్టని ఆహారం
- సినీడ్ బుర్కీ: ఫ్యాషన్ మ్యాగజీన్ ముఖచిత్రంగా ఎదిగిన ‘లిటిల్ పర్సన్’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








