‘పెళ్లికి ముందు సెక్స్‌లో పాల్గొంటే జైలు’.. ఇండోనేసియాలో ప్రతిపాదిత బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు

ఫొటో సోర్స్, Reuters
పెళ్లికి ముందు సెక్స్‌ను నేరంగా పరిగణించేలా ఇండోనేసియా ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త బిల్లుకు వ్యతిరేకంగా ఆ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.
ఇండోనేసియా పార్లమెంటు ఎదుట మంగళవారం నిరసనకారులు ఆందోళనకు దిగారు. వారిపై పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కానన్లను ప్రయోగించారు.
దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోనూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి.
ఈ కొత్త బిల్లు చట్ట రూపం దాల్చితే పెళ్లికి ముందు సెక్స్‌లో పాల్గొనడం నేరంగా మారుతుంది. అలా చేసినవారికి ఏడాది వరకూ జైలు శిక్ష విధించవచ్చు.
వివాహేతర సంబంధం పెట్టుకున్నవారికి ఆరు నెలల వరకూ జైలుశిక్ష వేయొచ్చు.
దేశ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, మతం, ప్రభుత్వ సంస్థలు, జాతీయ జెండా, జాతీయ గీతం, జాతీయ చిహ్నాలను 'అవమానించినా' చట్టవ్యతిరేకమే అవుతుంది.
అబార్షన్ చేసుకున్నవారికి గరిష్ఠంగా నాలుగేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. అత్యాచార బాధితులకు, వైద్యపరమైన అత్యవసర పరిస్థితి ఎదురైనవారికి మాత్రమే మినహాయింపు ఉంటుంది.

ఫొటో సోర్స్, Reuters
ఈ బిల్లుపై మంగళవారం ఓటింగ్ జరగాల్సి ఉంది.
అయితే, దీన్ని శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడొడో ప్రకటించారు.
కొత్త చట్టాలపై ఇంకొంత పరిశీలన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
బిల్లుపై పార్లమెంటులో ఓటింగ్ తాత్కాలికంగా వాయిదా పడ్డా, అది త్వరలోనే ఆమోదం పొందొచ్చని చాలా మంది ఇండోనేసియా పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త బిల్లు ద్వారా అవినీతి నిరోధక కమిషన్‌ను బలహీనపరిచేందుకు జరుగుతున్న ప్రయత్నాలను కూడా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
''అవినీతి నిరోధక సంస్థను బలహీనం చేసే కొత్త చట్టాన్ని మేం అడ్డుకుంటాం. వాళ్లు ప్రజలకు కాదు, అవినీతిపరులకు అనుకూలం'' అని ఫావద్ వహ్యుద్దీన్ అనే 21 ఏళ్ల విద్యార్థి పశ్చిమ జావాలో రాయిటర్స్ వార్తా సంస్థతో అన్నారు.
మంగళవారం ఇండోనేసియా వ్యాప్తంగా వివిధ పట్టణాల్లో వేల సంఖ్యలో జనాలు వీధుల్లోకి వచ్చి ఈ కొత్త బిల్లుపై తమ నిరసనను తెలిపారు.
వీరిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు.

ఫొటో సోర్స్, AFP
దేశ రాజధాని జకార్తాలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
పార్లమెంటు స్పీకర్ బాంబాంగ్ సోసట్యోను కలిసేందుకు అనుమతించాలని ఇక్కడ ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
తమ సెక్స్ జీవితం ఎలా ఉండాలో నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదని ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేశారు.
పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లు ప్రయోగించారు.
యోగ్యకర్తా, మాకస్సర్ ప్రాంతాల్లో నిరసనలు రెండో రోజుకు చేరుకున్నాయి.
జకార్తాలో భద్రతపరమైన సమస్యలు రాకుండా 5 వేలకుపైగా పోలీసు సిబ్బందిని మోహరించినట్లు వార్తలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి:
- #నో బ్రా ఉద్యమం: బ్రా వేసుకోకుండా సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్న దక్షిణ కొరియా మహిళలు
- గూగుల్‌లో మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇలా డిలీట్ చెయ్యండి!
- ‘ట్రంప్ అమెరికా రాజ్యాంగాన్ని దారుణంగా ఉల్లంఘించారు’.. గద్దె దించేందుకు అభిశంసన తీర్మానం పెట్టిన డెమోక్రాట్స్
- నరేంద్ర మోదీకి గేట్స్ ఫౌండేషన్ ‘గ్లోబల్ గోల్‌కీపర్’ అవార్డు.. దీనిపై వివాదం ఏమిటి? ఎందుకు?
- హాంగోవర్ కూడా ఒక జబ్బే: జర్మనీ కోర్టు తీర్పు
- గులాలాయీ ఇస్మాయిల్: పాకిస్తాన్ నుంచి అమెరికా పారిపోయిన మానవహక్కుల కార్యకర్త
- నకాషీ: 500 ఏళ్ల నుంచి ప్రత్యేకత నిలుపుకుంటున్న తెలంగాణ చిత్రకళ
- అబద్ధాలు చెప్పే వారిని ఎలా గుర్తించాలి?
- ‘బ్రౌన్ గర్ల్స్’... ఇన్‌స్టాగ్రామ్‌లో దక్షిణాసియా అమ్మాయిల సరికొత్త గ్యాంగ్
- వాజినిస్మస్: 'నా శరీరం సెక్స్‌కు సహకరించదు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








