‘డోనల్డ్ ట్రంప్ అమెరికా రాజ్యాంగాన్ని దారుణంగా ఉల్లంఘించారు’.. గద్దె దించేందుకు అభిశంసన తీర్మానం పెట్టిన డెమోక్రాట్స్

అభిశంసన ప్రక్రియ

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా అభిశంసన ప్రక్రియ ప్రారంభిస్తున్నామని ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పలోసీ ప్రకటించారు.

సభలో డెమోక్రట్స్ అధికారికంగా అభిశంసన ప్రక్రియను ప్రారంభించారు.

అమెరికాలో తలెత్తిన ఈ సరికొత్త రాజకీయ వివాదంలో ట్రంప్, విదేశీయులతో పాటు న్యాయపరమైన, నైతికపరమైన అంశాలు, ఆరోపణలు, రాజకీయ విరోధాలు ఉన్నాయి.

ఒక్క ముక్కలో చెప్పాలంటే.. అమెరికాలోని తన రాజకీయ ప్రత్యర్థులకు నష్టం చేకూర్చేందుకు విదేశీ శక్తుల్ని వాడుకోవాలని ట్రంప్ ప్రయత్నించారన్నది ఈ ఆరోపణల సారాంశం.

డెమాక్రటిక్ ప్రత్యర్థి జో బైడెన్, అతడి కొడుకు అవినీతి చేశారనే వాదనలపై విచారణ ప్రారంభించాలని ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమీర్ జెలెంస్కీపై ఒత్తిడి తెచ్చినట్లు వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.

అయితే, తన రాజకీయ ప్రత్యర్థి గురించి ఉక్రెయిన్ అధ్యక్షుడితో చర్చించింది నిజమేనని ట్రంప్ కూడా అంగీకరించారు.

"ట్రంప్ అమెరికా రాజ్యాంగాన్ని దారుణంగా ఉల్లంఘించారు. అధ్యక్షుడికి జవాబుదారీ ఉండాలి, చట్టానికి ఎవరూ అతీతులు కారు" అని నాన్సీ పలోసీ అన్నారు.

ట్రంప్‌ను పదవి నుంచి తప్పించడం కోసం చేసే ఎలాంటి ప్రయత్నానికైనా అధ్యక్షుడిపై తిరుగుబాటు చేసే 20 మంది రిపబ్లికన్ ఎంపీల మద్దతు అవసరం అవుతుంది.

అయితే, ఇప్పటివరకూ ఏ అమెరికా అధ్యక్షుడినీ అభిశంసన ప్రక్రియ ద్వారా తొలగించలేదు.

అభిశంసన ప్రక్రియ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నాన్సీ పలోసీ

అభిశంసన ప్రక్రియ ప్రారంభించడాన్ని జో బైడెన్ కూడా సమర్థించారు. "ట్రంప్‌పై అభిశంసన పెట్టడం దురదృష్టకరం. కానీ అది ఆయన స్వయంకృతాపరాధమే" అన్నారు.

2020లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ నుంచి ట్రంప్‌కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

ఈ అభిశంసన ప్రక్రియ "రాజకీయంగా నాకు సానుకూలమే అవుతుంది" అని ట్రంప్ అన్నారు.

దిగువ సభలో 145 నుంచి 235 డెమోక్రట్స్ ట్రంప్‌పై అభిశంసనను సమర్థిస్తున్నారు.

కానీ దిగువ సభలో అభిశంసన ప్రక్రియ పూర్తైనా, అది రిపబ్లికన్స్ మెజారిటీ ఉన్న సెనేట్ దగ్గర పాస్ కావడం కష్టం.

ఇటు, ఒపీనియన్ పోల్స్ కూడా అమెరికా ఓటర్లు దీనిపై అంత ఆసక్తి చూపడం లేదని చెబుతున్నాయి.

అభిశంసన ప్రక్రియ

ఫొటో సోర్స్, Reuters

ట్రంప్‌పై అభిశంసన ఎందుకు

ట్రంప్ ఒక విదేశీ నేతతో చర్చలు జరిపారని, ఆ విదేశీ నేత ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెంస్కీ అని తర్వాత తెలిసిందని.. అమెరికా నిఘా అధికారులు ప్రభుత్వానికి చెందిన ఒక వాచ్‌డాగ్‌కు ఫిర్యాదు చేసినట్లు గత వారం వార్తలు వచ్చాయి.

యాక్టింగ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్, జోసెఫ్ మగూరే నుంచి తాము ఫిర్యాదు అందుకున్నామని విజిల్ బ్లోయర్ చెప్పింది.

సెప్టంబర్ 9న తన ఫిర్యాదు గురించి మగూరే కాంగ్రెస్‌కు సమాచారం ఇచ్చారు. కానీ దాని వివరాలు ఇవ్వలేదు.

ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్ జనరల్ విజిల్ బ్లోయర్‌కు చేసిన ఆ ఫిర్యాదును 'తక్షణం దృష్టిపెట్టడానికి తగినది'గా భావించారు.

ఆ ఫిర్యాదు కాపీ ఇవ్వాలని డెమోక్రట్స్ సభలో డిమాండ్ చేశారు. కానీ వైట్ హౌస్, న్యాయ శాఖ ఆ కాపీని అందించడానికి నిరాకరించాయి.

అభిశంసన ప్రక్రియ

ఫొటో సోర్స్, Getty Images

మగూరేను గురువారం హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ ముందు బహిరంగంగా విచారించనున్నారు. ప్రజా ప్రతినిధులు ఈ ఫిర్యాదును చూడాలనుకుంటున్నారు.

కాపీ ఇవ్వడం కుదరకపోతే, దానిని పొందేందుకు హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ చైర్మన్ ఒక కేసు వేయవచ్చని సీఎన్ఎన్ చెబుతోంది. ఇద్దరు నేతలు ఫోన్లో ఏం మాట్లాడుకున్నారు అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

కానీ, డెమోక్రట్స్ మాత్రం ఉక్రెయిన్ అధ్యక్షుడితో బైడెన్, ఆయన కొడుకుకు వ్యతిరేకంగా ఉన్న అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరపాలని ట్రంప్ ఒత్తిడి తెచ్చారు. అది కుదరదని చెప్పడంతో ఉక్రెయిన్‌కు అందించే సైనిక సాయం ఆపేస్తామని బెదిరించారు అని ఆరోపిస్తున్నారు.

ఇటు, బైడెన్ గురించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెంస్కీతో చర్చించానని ట్రంప్ కూడా అంగీకరించారు.

కానీ "యూరప్ కూడా సాయం అందించడానికి ముందుకు రావాలనే, తను సైనిక సాయం ఆపేస్తానని ఆ దేశాన్ని బెదిరించానని" చెప్పారు.

అభిశంసన ప్రక్రియ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హంటర్ బైడెన్, జో బైడెన్, డోనల్డ్ ట్రంప్

ఇదంతా ఎప్పుడు, ఎలా జరిగింది

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెంస్కీ ఈ ఏడాది జులై 25న ఫోన్లో మాట్లాడారు.

జో బైడెన్‌, ఆయన కొడుకుపై దర్యాప్తు చేయాలని ఒత్తిడి తేవడంతోపాటు ఉక్రెయిన్‌కు ఇచ్చేందుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన 250 మిలియన్ డాలర్ల సైనిక సాయం గురించి కూడా ట్రంప్ బెదిరించారని ఆరోపించారు. ట్రంప్ ప్రభుత్వం ఆ నిధులను సెప్టంబర్ వరకూ విడుదల కాకుండా ఆలస్యం చేసింది.

ఈ ఫోన్ కాల్‌కు దాదాపు వారం ముందు ఉక్రెయిన్‌కు సైనిక సాయం నిలిపివేయాలని ట్రంప్ తన అధికారులను ఆదేశించినట్లు వాషింగ్టన్ పోస్ట్, అమెరికా మీడియా చెప్పాయి.

ట్రంప్ వీటిలో ఏదైనా అంగీకరిస్తున్నారా

కొన్ని అంగీకరించినట్లే అనిపిస్తోంది.

అవినీతి గురించి బైడెన్, అతడి కొడుకు హంటర్, ఇతర అంశాల గురించి జెలెంస్కీతో మాట్లాడినట్లు ట్రంప్ చెప్పారు. "ఫోన్లో ఆ సంభాషణ చాలా చక్కగా జరిగింది. అమెరికా ఉక్రెయిన్‌కు సాయం అందిస్తోంది. అందుకే ఆ దేశం నిజాయితీగా ఉండాలని మేం కోరుకున్నాం" అని చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ట్విటర్‌లో మాత్రం ట్రంప్ తీవ్రంగా స్పందించారు. "డెమోక్రట్స్, వంకర మీడియాలే ఈ వివాదాన్ని సృష్టించాయని" అన్నారు. విజిల్ బ్లోయర్ అని చెబుతున్న వారి దేశభక్తిని కూడా ఆయన ప్రశ్నించారు.

అభిశంసన ప్రక్రియ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉక్రెయిన్

అమెరికా నేతలు ఏం చెబుతున్నారు

విజిల్ బ్లోయర్ తన ఫిర్యాదులో చెబుతున్న ఫోన్‌ కాల్ చాలా ముఖ్యమైనదని, అది విదేశీ నేతతో అధ్యక్షుడి ఒప్పందాలను వెలుగులోకి తెచ్చేందుకు సాయం అవుతుందని డెమోక్రట్స్ అంటున్నారు. హంటర్, ఆయన తండ్రి బైడెన్ పరువు తీయాలన్ ట్రంప్ వారిపై దర్యాప్తు చేయించాలనుకున్నారని చెప్పారు.

ఒక ఉక్రెయిన్ అధినేత కంపెనీలో బోర్డు సభ్యుడైన హంటర్ బైడెన్ వ్యాపార కార్యకలాపాలపై అధికారులతో దర్యాప్తు జరిపించాలని ట్రంప్ జెలెంస్కీపై ఒత్తిడి తెచ్చారని విమర్శకులు చెబుతున్నారు.

రిపబ్లికన్స్ ఈ వివాదం గురించి పెద్దగా పెదవి విప్పడం లేదు. దీనిపై మరింత తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు కొందరు నేతలు చెబుతున్నారు.

డెమోక్రట్స్ మాత్రం ట్రంప్-జెలెంస్కీ సంభాషణల వివరాలతోపాటు ఫిర్యాదు గురించి పూర్తి సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అధికారులు దానికి మొదట నిరాకరించినా, బుధవారం దాని గురించి పూర్తి వివరాలను విడుదల చేస్తానని అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ట్విటర్‌లో ప్రకటించారు. "అది చాలా స్నేహపూర్వకమైన, పూర్తిగా తగిన కాల్ అని మీరే చూస్తారు" అని రాశారు.

అభిశంసన ప్రక్రియ

ఫొటో సోర్స్, TERESA KROEGER/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, 2016లో ఒక కార్యక్రమంలో జో బైడెన్, హంటర్ బైడెన్

జో బైడెన్, ఆయన కొడుకు పై ఉన్న ఆరోపణలేంటి

2016లో అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ షోకిన్‌ను బలవంతంగా పదవి నుంచి తొలగించడంలో విజయవంతం కాగలిగారని ట్రంప్ మద్దతుదారులు, లాయర్లు ఆరోపిస్తున్నారు.

బురిసిమా హోల్డింగ్స్ అనే ఒక ఉక్రెయిన్ గ్యాస్ కంపెనీపై దర్యాప్తు జరగడానికి షోకిన్ కారణం అయ్యారు. ఈ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఒకరుగా ఉండడానికి జో బైడెన్ కొడుకు హంటర్ బైడెన్ ఆప్పట్లో నెలకు 50 వేల డాలర్లకు పైగా చెల్లిస్తున్నారు.

ఆ కంపెనీని, తన కొడుకును కేసుల నుంచి కాపాడుకోడానికి జో బైడెన్ ఉక్రెయిన్‌పై రకరకాలుగా ఒత్తిడి తెచ్చారని, అందులో అమెరికా ఆ దేశానికి హామీ ఇచ్చిన 1 బిలియన్ డాలర్ల నిలిపివేస్తామనే బెదిరింపులు కూడా ఉన్నాయని ట్రంప్, ఆయన లాయర్ ఆరోపించారు.

కానీ ఇప్పటివరకూ దీనికి సంబంధించిన ఎలాంటి ఆధారాలూ అందించలేదు. కానీ ప్రాసిక్యూటర్‌గా షోకిన్‌ను తొలగించిన తర్వాత అతడి స్థానంలో వచ్చిన యూరీ లుటెసెంకో కూడా లీగల్ ప్రొసీడింగ్స్ ముగించేవరకూ ఆ కంపెనీపై పది నెలలపాటు దర్యాప్తు కొనసాగించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)