పాక్ పాలిత కశ్మీర్‌లో ఆందోళనలు... 'పాకిస్తాన్ మా ప్రాంతానికి పూర్తి హక్కులు ఇవ్వాలి'

ఫొటో సోర్స్, MA JARRAL
- రచయిత, సాహెర్ బలూచ్
- హోదా, బీబీసీ ప్రతినిధి, ముజఫరాబాద్ నుంచి
కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ను భారత్ రద్దు చేసి 45 రోజులు అయ్యింది. అప్పటి నుంచి భారత పాలిత కశ్మీర్, పరిసర ప్రాంతాలలో నిరసనలు జరిగాయి. ఇదే సమయంలో కశ్మీరీలకు మద్దతుగా ర్యాలీలకు ఏర్పాట్లు చేయడంలో పాకిస్తాన్ కూడా బిజీగా ఉంది.
పాక్ పాలిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో జరిగిన ఒక ర్యాలీలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా పాల్గొన్నారు. 'కశ్మీర్ పాకిస్తాన్‌లో భాగం' అవుతుంది అంటూ ఆ ర్యాలీలో నినాదాలు వినిపించాయి.
మరోవైపు అదే పాక్ పాలిత కశ్మీర్‌లో పాకిస్తాన్‌కు, భారత్‌కు వ్యతిరేకంగా కశ్మీర్ వేర్పాటువాదులు కూడా నినాదాలు చేస్తున్నారు.
ఇటీవల, పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని తిత్రినోట్ సెక్టార్‌లో భారీ నిరసన ర్యాలీ తీశారు. కశ్మీర్‌కు స్వాతంత్య్రాన్ని కోరుతున్న 12 పార్టీలు ఆ ర్యాలీలో పాల్గొన్నాయి. భారత్ 370వ అధికరణాన్ని రద్దు చేయడాన్ని వ్యతిరేకించడంతో పాటు, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా కూడా నిరసనకారులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆ పార్టీలు స్వతంత్ర కశ్మీర్‌ను కోరుతున్నాయి. భారత్, పాకిస్తాన్ బలగాలు కశ్మీర్‌ను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.
నిరసన ర్యాలీ తీస్తూ నియంత్రణ రేఖను దాటి భారత పాలిత కశ్మీర్‌లోకి ప్రవేశించేందుకు యత్నించిన 22 మందిని పాకిస్తాన్ పోలీసులు అరెస్టు చేశారు.
ఆ తర్వాత అందరూ సంయమనం పాటించాలంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. నియంత్రణ రేఖను దాటేందుకు తన పిలుపు కోసం వేచి ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు.
మరొక ర్యాలీలో... కశ్మీర్‌లో జిహాద్ చేయాలని ఎవరైనా అనుకుంటే అది కశ్మీరీలకే నష్టం కలిగిస్తుందని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.

ఈ నిరసనలు ఎందుకు?
కశ్మీర్ లోయపై భారత్, పాకిస్తాన్‌ల నియంత్రణకు వ్యతిరేకంగా దశాబ్దాలుగా నిరసనలు కొనసాగుతున్నాయని వేర్పాటువాదులు, స్వాతంత్ర్య అనుకూల వర్గాలు అంటున్నాయి.
ఇటీవలి నిరసనలలో పాకిస్తాన్ నేషనల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఎన్ఎస్‌ఎఫ్)కు చెందిన కమ్రాన్ బేగ్ కూడా పాల్గొన్నారు. ఆయన బీబీసీతో మాట్లాడుతూ, "స్వతంత్ర కశ్మీర్ కోసం గతంలోనూ మా గొంతును బలంగా వినిపించాం. కానీ, మా గొంతు బయటి ప్రపంచానికి వినిపించకుండా, లోయకే పరిమితం చేశారు. కానీ, కాలం మారుతోంది. మా గొంతును వినగలిగినవారు ఇప్పుడు బయట చాలా మంది ఉన్నారు" అని అన్నారు.
పాకిస్తాన్‌లో నేషనల్ స్టూడెంట్స్ ఫెడరేషన్‌ను 1966లో స్థాపించారు. దీనిని పాకిస్తాన్ దేశవ్యాప్తంగా ఉద్యమకారులకు 'నర్సరీ'గా చాలామంది అభివర్ణిస్తుంటారు.
పాకిస్తాన్‌లోని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల హక్కుల కోసం ఉద్యమాలు చేయడంతో పాటు, కశ్మీరీల స్వయం నిర్ణయాధికారం కోసం కూడా ఎన్‌ఎస్‌ఎఫ్ మాట్లాడుతోంది. పాకిస్తాన్ అంతటా స్థానిక వార్తా ఛానళ్లపై 'ఆంక్షలు' విధించడం వల్ల తమ కార్యకలాపాలను వార్తల్లో చూపించరని ఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు అంటుంటారు.

ఈ గ్రూపుల డిమాండ్ ఏంటి?
ప్రస్తుతం, పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లో 14కి పైగా వేర్పాటువాద, స్వాతంత్ర్య అనుకూల గ్రూపులు ఉన్నాయి. ఇటీవల అందులో 12కి పైగా గ్రూపులు కలిసి పీపుల్స్ నేషనల్ అలయన్స్ అనే కూటమిగా ఏర్పడ్డాయి.
భారత్, పాకిస్తాన్‌ల నుంచి కశ్మీర్‌కు పూర్తి స్వాతంత్ర్యం కావాలంటూ ఈ కూటమి ప్రచారం చేస్తోంది. పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడేవారిని కూడా ఈ కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
"మా డిమాండ్ ఒక్కటే. పాకిస్తాన్‌కు కశ్మీర్ కావాలనుంటే మొదట మా ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఇవ్వాలి. మా ఉన్నత న్యాయస్థానానికి అధికారాలు ఇవ్వాలి. మా అసెంబ్లీని పూర్తిస్థాయి శాసనసభగా మార్చాలి. అలా చేస్తే, నేను పాకిస్తాన్‌ను ఎందుకు శత్రువుగా భావిస్తాను?" అని ఎన్‌ఎస్‌ఎఫ్‌కు చెందిన కమ్రాన్ బేగ్ అన్నారు.
తమ కార్యకర్తలపై పాకిస్తాన్ అక్రమంగా దేశద్రోహం కింద కేసులు బనాయిస్తోందని వేర్పాటువాద గ్రూపులు ఆరోపిస్తున్నాయి.
ఇస్లామాబాద్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోట్లీ ప్రాంతంలో వేర్పాటువాద గ్రూపు జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్‌ఎఫ్) ఇటీవల ర్యాలీ నిర్వహించింది. ఆ ర్యాలీలో పాల్గొన్న 19 మంది జేకేఎల్‌ఎఫ్ కార్యకర్తలను పాకిస్తాన్ అరెస్టు చేసి జైలులో పెట్టింది.
జేకేఎల్‌ఎఫ్‌ను 1977లో అమానుల్లా ఖాన్, మక్‌బూల్ భట్ లండన్‌లో స్థాపించారు. ప్రస్తుతం దీనికి యాసిన్ మాలిక్ నేతృత్వం వహిస్తున్నారు.
"అప్పట్లో మా కార్యకర్తలు కశ్మీర్ స్వాతంత్ర్యం కోసం లండన్‌లో, పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని కొంత భాగంలో శాంతియుతంగా పోరాడేవారు. కానీ, మరో మార్గం లేక 1988 జులై 31న మేం ఆయుధాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. అప్పటికీ, ఇప్పటికీ మా డిమాండ్ ఏమీ మారలేదు" అని జేకేఎల్‌ఎఫ్ సీనియర్ సభ్యుడు ఖ్వాజా సైఫుద్దీన్ అన్నారు.

"కశ్మీర్ సమస్య భారత్, పాకిస్తాన్ మధ్య ఒక భూభాగానికి సంబంధించిన వివాదం కాదని అప్పుడు చెప్పాం. ఇది మా స్వేచ్ఛ కోసం చేస్తున్న పోరాటం. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాం. కానీ, ఒకప్పుడు మాకు మద్దతు ఇచ్చినవారే (పాకిస్తాన్) ఇప్పుడు మా మీద దేశద్రోహం ఆరోపణలు చేస్తున్నారు" అని సైఫుద్దీన్ అన్నారు.
పాకిస్తాన్‌లో దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రూపుల్లో వేర్పాటువాద కశ్మీర్ నేషనల్ పార్టీ కూడా ఉంది.
2007లో స్థాపించిన ఈ పార్టీ... తన మేనిఫెస్టోలో "విదేశీ బలగాలు" కశ్మీర్ నుంచి వెళ్లిపోవాలి, స్వతంత్ర కశ్మీరీ దేశం ఏర్పాటు కావాలి అని పేర్కొంది.
"ప్రజల ఆంక్షనే మేం చెబుతున్నాం. మా ప్రజలను విడగొట్టొద్దు అని కోరుతున్నాం. ఆర్టికల్ 370 పేరిట భారత్ ఏం చేసిందో... గిల్గిత్ బాల్టిస్తాన్‌లో 35-Aను ఉపసంహరించడం ద్వారా పాకిస్తాన్ కూడా అదే చేస్తోంది" అని జేకేఎల్‌ఎఫ్ నేత పర్వేజ్ మీర్జా అన్నారు.
"గిల్గిత్ బాల్టిస్తాన్‌లో 33 శాతం భూభాగాన్ని, పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లో ఐదు శాతం ప్రాంతాన్ని కలిపి స్వతంత్ర ప్రాంతంగా పాకిస్తాన్ అంగీకరించాలని, ఆ భూభాగం నుంచి పాకిస్తాన్ తన సైనికులను వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం" అని పర్వేజ్ మీర్జా చెప్పారు.

ప్రభుత్వం ఏమంటోంది?
పాకిస్తాన్ పాలిత కశ్మీర్ అధ్యక్షుడు సర్దార్ మసూద్ ఖాన్ మాట్లాడుతూ, "ఇటీవల జరిగినట్లుగానే ఆజాద్ కశ్మీర్‌లో గతంలోనూ నిరసనలు జరిగాయి. నిర్దిష్ట భావజాలంతో ఉన్న ఒక గ్రూపు ఈ నిరసనలు చేస్తోంది. వాస్తవం ఏమిటంటే పాక్ పాలిత కశ్మీర్‌లో ఎక్కువ మంది పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉన్నారు. ఎవరి మీదా ఎలాంటి ఆంక్షలూ లేవు. ప్రజలకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఎవరైనా తమ ఆకాంక్షలను బహిరంగంగా వ్యక్తీకరించవచ్చు" అని అన్నారు.
వేర్పాటువాద గ్రూపులు చేసిన వాదనలను పాక్ పాలిత కశ్మీర్ సమాచార శాఖ మంత్రి ముష్తాక్ మిన్హాస్ ఖండించారు.
"ఆజాద్ కశ్మీర్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంది. అలాగని, ప్రభుత్వ విధానాలకు, పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా వేర్పాటువాదులు ప్రజల్లో అసత్య ప్రచారం చేస్తుంటే ఊరుకోం. కఠిన చర్యలు తీసుకుంటాం" అని మంత్రి అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్ కోసం భారత్‌తో యుద్ధం రావచ్చు: ఇమ్రాన్ ఖాన్
- "సౌదీ అరేబియా నుంచి నేను ఎందుకు పారిపోయానంటే..."
- భారతదేశంలో జన్మించిన పాకిస్తాన్ 'ప్రథమ మహిళ' రానా లియాకత్ అలీ
- 'పాకిస్తాన్ నుంచి ఎవరైనా కశ్మీర్‌కు వెళ్ళి జిహాద్ చేస్తే కశ్మీరీలే నష్టపోతారు' - ఇమ్రాన్ ఖాన్
- ‘POK భారత్‌లో భాగమే. ఎప్పటికైనా స్వాధీనం చేసుకుంటాం’ - భారత విదేశాంగ మంత్రి
- కశ్మీరీలను ఆగ్రా జైలులో పెట్టిన ప్రభుత్వం.. తమవారిని కలుసుకునేందుకు ఇబ్బందులు పడుతున్న బంధువులు
- 'గాజులు పంపించమంటారా' అని పాకిస్తాన్ రెచ్చగొడుతోంది: అజిత్ డోభాల్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








