"సౌదీ అరేబియా నుంచి నేను ఎందుకు పారిపోయానంటే..."

ఫొటో సోర్స్, SALWA
ఇది ఒక కథలా ఉంటుంది. ఇది సౌదీ అరేబియాలో మహిళలపై విధిస్తున్న నిషేధాల గురించి బయటపెట్టినట్టు ఉంటుంది.
బ్యాంకాక్ విమానాశ్రయంలో తనను తాను ఒక గదిలో బంధించుకున్న 18 ఏళ్ల రాహఫ్ మహమ్మద్ అల్-కునన్ తిరిగి తన దేశం వెళ్లడానికి ఒప్పుకోనప్పుడు ఆమె ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
ఆమె సౌదీ అరేబియాలోని తన కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చింది. ట్విటర్‌లో ఆమెకు మద్దతుగా ఒక ఉద్యమం మొదలవడంతో రహాఫ్‌కు కెనడాలో ఆశ్రయం కల్పించారు.
ఈ ఘటన జరిగిన తర్వాత సౌదీ అరేబియాలో మహిళల హక్కుల అంశం మళ్లీ వెలుగులోకి వచ్చింది. అక్కడ మహిళలపై విధించే ఆంక్షల గురించి ప్రశ్నలు వెల్లువెత్తడం మొదలైంది.
తాజాగా అదే స్థితి నుంచి వచ్చిన మరో అమ్మాయి బీబీసీకి తన కథ మొత్తం చెప్పింది. సౌదీ అరేబియా నుంచి పారిపోయి వచ్చిన ఆమె ఇప్పుడు కెనడాలో నివసిస్తున్నారు.
24 ఏళ్ల సలవా తన 19 ఏళ్ల చెల్లెలితో పాటు ఏడెనిమిది నెలల కిందట ఇల్లు వదిలి వచ్చేసింది. ఇప్పుడు ఆమె మాంట్రియోల్‌లో నివసిస్తోంది. సలవా చెప్పిన కథను ఆమె మాటల్లోనే చదివి తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, UNHCR
ఎలా ఇల్లు వదిలారు?
మేం సుమారు ఆరేళ్ల నుంచి సౌదీ అరేబియాను వదిలిపెట్టడానికి సన్నాహాలు చేస్తూ వచ్చాం. దానికోసం మాకు పాస్‌పోర్ట్, నేషనల్ ఐడీ అవసరం అవుతుంది.
నాకు ఆ పత్రాలన్నిటికీ నా తోబుట్టువుల సమ్మతి అవసరం (సౌదీ అరేబియాలో చాలా వాటికి ఎవరైనా పురుష సంరరక్షకులు లేదా సంబంధీకుల అనుమతి తప్పనిసరి).
కానీ అదృష్టవశాత్తు నా దగ్గర ఐడీ కార్డ్ ఉంది. ఎందుకంటే యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో నా కుటుంబం అది తీసుకోడానికి సమ్మతించింది.
నా దగ్గర పాస్‌పోర్ట్ కూడా ఉంది. ఎందుకంటే రెండేళ్ల ముందే ఇంగ్లిష్ పరీక్ష కోసం నాకు దాని అవసరం వచ్చింది.
కానీ నా కుటుంబం నా దగ్గరి నుంచి అవన్నీ వెనక్కు తీసుకుంది. అందుకే నేను వాటిని ఎలాగైనా తిరిగి తీసుకోవాలని అనుకున్నా.
నేను మా సోదరుడి ఇంటి తాళాలు దొంగిలించా. షాపుకు వెళ్లి వాటిలాగే నకిలీ తాళాలు చేయించాను. ఇంట్లో అందరూ నిద్రపోతున్నప్పుడు చప్పుడు లేకుండా ఇంటినుంచి బయటికి వచ్చేసి అవన్నీ పూర్తి చేశాను.
అదంతా చాలా ప్రమాదం అనిపించింది. ఎందుకంటే నేను ఆ ప్రయత్నంలో పట్టుబడితే నా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది.
ఇప్పుడు నా దగ్గర తాళాలు ఉన్నాయి. దాంతో నేను మా చెల్లెలి పాస్‌పోర్ట్ కూడా తీసుకున్నాను. అప్పుడు మా నాన్న నిద్రపోతుండడంతో ఆయన ఫోన్ కూడా తీసుకున్నాను.
దాన్నుంచి హోం మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో ఆయన అకౌంట్ నుంచి లాగిన్ అయ్యాను. ఆయన రిజిస్టర్డ్ నంబర్ తీసి నా నంబర్ మార్చాను.
ఆయన అకౌంట్ నుంచి మేం ఇద్దరం దేశం నుంచి వెళ్లడానికి అంగీకారం కూడా పొందాం.

ఫొటో సోర్స్, Getty Images
ఇంటి నుంచి ఎలా బయటపడ్డారు?
ఒక రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు మేం ఇద్దరం ఎలాగో కష్టపడి పారిపోయాం. ఆ సమయంలో మేం చాలా ఒత్తిడికి గురయ్యాం.
మేం డ్రైవ్ చేయలేం. అందుకే ఒక ట్యాక్సీని పిలిపించాం. ఇక్కడ ట్యాక్సీ డ్రైవర్లందరూ విదేశీయులే కావడంతో, అది మాకు కలిసొచ్చింది. మేం ఒంటరిగా వెళ్లడం చూసినా వాళ్లు మమ్మల్ని సందేహించలేదు.
మేం రియాద్ దగ్గర ఉన్న కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాం. ఆ సమయంలో మేం ఏం చేస్తున్నామో ఎవరైనా పసిగట్టుంటే, మమ్మల్ని హత్య కూడా చేసేవారు.
నేను కాలేజీలో చివరి సంవత్సరం చదువుతున్నప్పటి నుంచీ ఒక ఆస్పత్రిలో పనిచేస్తున్నాను. అప్పటి నుంచే డబ్బు ఆదా చేస్తూ వచ్చాను. అలా జర్మనీకి ఫ్లైట్ టికెట్, ఒక ట్రాన్సిట్ వీసా కొనగలిగేంత డబ్బు దాచిపెట్టాను. నా దగ్గర నా నిరుద్యోగ భృతి డబ్బు కూడా అలాగే ఉంది.
నేను నా చెల్లెలితో కలిసి జర్మనీ ఫ్లైట్ ఎక్కేశా. విమానంలో కూర్చోవడం అదే మొదటి సారి. ఆ అనుభవం చాలా అద్భుతంగా అనిపించింది. సంతోషం, భయం రెండూ ఒకేసారి కలిగాయి. అంటే ఆ ఫీలింగ్స్ అన్నీ కలగలిసిపోయాయి.
మేమిద్దరం ఇల్లు వదిలి వెళ్లిపోయామనే విషయం మా నాన్నకు తెలీగానే, ఆయన పోలీసులను పిలిపించారు. కానీ వారికి అప్పటికే ఆలస్యం అయ్యింది.
నేను హోంమంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ఆయన ఫోన్ నంబర్ మార్చేయడంతో, అధికారులు నాన్నకు ఫోన్ చేసినప్పుడల్లా అవి నాకొచ్చేవి.
మేం జర్మనీలో దిగాక నాకు పోలీసుల నుంచి ఒక మెసేజ్ కూడా వచ్చింది. నిజానికి అది మా నాన్న కోసం పంపారు.

ఫొటో సోర్స్, Getty Images
జర్మనీ చేరినప్పుడు ఏం చేశారు?
సౌదీ అరేబియాలో అసలు ఎలాంటి జీవితం లేదు. అక్కడ నా జీవితం అంతా ఇంటి నుంచి యూనివర్సిటీకి వెళ్లడం, అక్కడి నుంచి ఇంటికి రావడం అంతే. అది తప్ప వేరే ఏమీ చేయలేకపోయేదాన్ని.
పురుషులు అన్ని విషయాల్లో స్త్రీల కంటే ఎక్కువ అని అక్కడ వాళ్లు మాకు నేర్పించేవాళ్లు.
ఇంట్లో రంజాన్ రోజు నాతో బలవంతంగా ఉపవాసం చేయించేవారు.
నేను జర్మనీ చేరగానే అక్కడ ఆశ్రయం పొందడానికి చట్టం సాయం తీసుకోవడానికి వకీలు దగ్గరికి వెళ్లాను. ఫాం నింపాక, ఆయనకు నా కథ చెప్పాను.
తర్వాత నేను కెనడాలో నివసించాలనే నిర్ణయం తీసుకున్నా. ఎందుకంటే మానవ హక్కుల విషయంలో ఆ దేశం చాలా బాగుంటుంది. సిరియా శరణార్థులకు అక్కడ ఆశ్రయం ఇచ్చారని నేను వార్తల్లో చదివాను.
నా దరఖాస్తును స్వీకరించారు. నేను టొరంటోలో దిగినప్పుడు ఎయిర్‌పోర్టులో కెనడా జెండాను చూశాను. అక్కడకు రావడం అనేది నాకు ఒక పెద్ద అచీవ్‌మెంట్‌లాగే అనిపించింది.
నేను ఇప్పుడు నా చెల్లెలితోపాటు ఎలాంటి ఒత్తిడి లేకుండా మాంట్రియోల్‌లో నివసిస్తున్నాను. ఇక్కడ ఇలా చేయాలి అని నన్ను ఎవరూ ఎప్పుడూ బలవంతం చేయరు.
సౌదీ అరేబియా చాలా డబ్బున్న దేశం కావచ్చు. కానీ ఇక్కడ జీవితం చాలా మెరుగ్గా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు అపార్ట్‌మెంట్ నుంచి బయటకు వెళ్లచ్చు. దానికోసం నాకు ఎవరి అనుమతీ అవసరం లేదు.
ఆ విషయం నాకు చాలా సంతోషాన్నిస్తుంది. నాకు స్వేచ్ఛ లభించినట్టు అనిపిస్తుంది. నాకు ఏది నచ్చితే అది వేసుకోగలుగుతున్నాను.
ఇక్కడ నాకు ఆకురాలే కాలం, మంచు చూస్తుంటే చాలా బాగుంది. నేను ఫ్రెంచ్ నేర్చుకుంటున్నాను. అది చాలా కష్టం. నేను బైక్ నడపడం, ఈత కొట్టడం, ఐస్ స్కేటింగ్ కూడా నేర్చుకుంటున్నా.
ఇప్పుడు నాకు జీవితంలో ఏదో చేస్తున్నట్లు అనిపిస్తోంది.
నాకు, నా కుటుంబానికి మధ్య మాటల్లేవు. కానీ అలా ఉండడం నాకు, వారికి మంచిదే అనిపిస్తుంది. ఇప్పుడిది నాకు నా ఇల్లులాగే అనిపిస్తోంది. అంతేకాదు, దానికంటే బాగా నచ్చింది.
ఇవి కూడా చదవండి.
- 'ఉత్తర కొరియా జైలులో నేను శవాల్ని పూడ్చిపెట్టాను'
- సౌదీలో మహిళల కంటే రోబోకే ఎక్కువ స్వేచ్ఛ!
- సౌదీ: ‘నా చేత బలవంతంగా ప్రార్థనలు చేయించేవాళ్లు. రంజాన్‌లో ఉపవాసం ఉంచేవాళ్లు’
- కుంభ మేళా: 'కుంభ్' సంప్రదాయం ఎప్పుడు మొదలైంది... ఈ మేళా చరిత్ర ఏమిటి?
- ఇందిరాగాంధీ: మెదక్ అంటే ఎందుకంత అభిమానం?
- అఘోరాలు ఎవరు... ఎందుకలా శవాల మధ్య గడుపుతారు...
- అమ్మాయిల కన్యత్వానికి, సీసా సీల్‌కు ఏమిటి సంబంధం...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








