హౌడీ మోదీ: నరేంద్ర మోదీ, డోనల్డ్ ట్రంప్‌ల్లో ఎవరు గెలిచారు? - అభిప్రాయం

నరేంద్ర మోదీ, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నరేంద్ర మోదీ, డోనల్డ్ ట్రంప్
    • రచయిత, సురేంద్ర కుమార్
    • హోదా, మాజీ దౌత్యాధికారి

అమెరికాలోని హ్యూస్టన్‌లో జరిగిన 'హౌడీ మోదీ' కార్యక్రమానికి ఒక రాక్ మ్యూజిక్ కాన్సర్ట్‌కు ఉండే అన్ని లక్షణాలూ ఉన్నాయి.

భారీ జనసందోహం, 'మోదీ.. మోదీ' అంటూ గొంతులు బొంగురుపోయేలా జనాల అరుపులు, రంగురంగుల వెలుగులు, సంగీతం, డ్యాన్స్.. ప్రస్తుత బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి వారు కూడా అసూయపడేంత అద్భుతంగా సాగింది ఈ కార్యక్రమం.

ప్రస్తుత ప్రపంచ నాయకుల్లో నరేంద్ర మోదీకి తప్ప మరెవరికీ ఒక విదేశంలో నిర్వహించిన సభలో ఇంతటి ఆదరణ కనిపించలేదు.

భారతీయ అమెరికన్ సమాజంపై మోదీకి ఉన్న పట్టు ఈ సభతో స్పష్టమైంది.

ఆర్థికంగా, రాజకీయంగా, సంస్థాగతంగా భారతీయ అమెరికన్లు ఇప్పుడు చాలా ప్రయోజనకరంగా మారారు. అమెరికా రాజకీయ వర్గాల్లోనూ గొప్ప పలుకుబడి సాధించారు.

మతపరంగా, సాంస్కృతికంగా, భావోద్వేగపరంగా భారత్‌తో వారిది విడదీయరాని బంధం. యోగా, భారతీయ నృత్యాలు, సంగీతం, భారతీయ సినిమాలను వారు ఆదరిస్తున్నారు. తమ భారతీయ మూలాల పట్ల గర్వపడుతున్నారు.

హ్యూస్టన్‌లో మోదీకి లభించిన ఆదరణ నమ్మశక్యం కానిది.

ఇప్పుడు ఆ సభ ముగిసింది. ఎన్‌ఆర్‌జీ స్టేడియం ఖాళీ అయ్యింది.

మరి, 'హౌడీ మోదీ'తో గెలిచిందెవరు? మోదీనా? అమెరికా అధ్యక్షుడు ట్రంపా?

నరేంద్ర మోదీ, డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

మోదీ, ట్రంప్ పరస్పరం భిన్నమైన వ్యక్తులు. కానీ, వారి మధ్య సారూప్యతలు చాలానే ఉన్నాయి.

ఈ చరిత్రాత్మక సభలో సంయుక్తంగా పాల్గొని, వాళ్లిద్దరూ తమ ఉమ్మడి లక్ష్యాలను చేరుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.

అంతర్జాతీయంగా, రాజకీయంగా తమ ఇమేజ్‌ను పెంచుకోవడం, ప్రత్యర్థి దేశాలకు వ్యూహాత్మకంగా సంకేతాలు పంపడం, ద్వైపాక్షిక వాణిజ్యం, రక్షణ, పెట్టుబడులకు సంబంధించి ఉన్న అవరోధాలను తొలగించుకోవడం, 'ఉగ్రవాద వ్యతిరేక పోరాటం'లో ఏకమవ్వడం వంటివి వారి ఉమ్మడి లక్ష్యాలు.

హ్యూస్టన్‌లో ఇంధన రంగ సంస్థల ప్రతినిధులతో మోదీ జరిపిన మొదటి సమావేశంలోనే అమెరికన్ సంస్థ టెల్లారియన్ నుంచి ఏటా 50 లక్షల టన్నుల ఎల్ఎన్‌జీ దిగుమతి చేసుకునేందుకు భారత సంస్థ పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

భారత్, అమెరికాల మధ్య వాణిజ్య సమతౌల్యం లేదంటోన్న ట్రంప్‌కు ఇది ఉపశమనం కలిగించి ఉంటుంది.

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, ANI

ఈ ఒప్పందం పట్ల ట్రంప్ సంతోషంగా కనిపించారు. రక్షణ, ఇంధన రంగాల ద్వైపాక్షిక బంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

అమెరికాలో, ముఖ్యంగా అక్కడి స్టీల్ రంగంలో భారతీయ సంస్థలు ఇటీవల పెట్టుబడులు పెట్టడాన్ని ట్రంప్ స్వాగతించారు.

ఈ భారీ సభలో మోదీని ట్రంప్ ఆదరించిన తీరు కూడా అక్కడి భారతీయ అమెరికన్లలో ఆయన ఇమేజ్‌ను పెంచింది. వలసదారులకు వ్యతిరేకంగా గతంలో చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వ ఆదేశాలతో కలిగిన నష్టాన్ని కొంతవరకు పూడ్చింది.

ఇంతవరకూ ట్రంప్ భారత్‌ను 'టారిఫ్ కింగ్' అంటూ ట్విటర్‌లో నిందిస్తూ వచ్చారు.

అయితే, మరింతగా ఇంధనం, గ్యాస్, రక్షణ పరికరాలను కొనుగోలు చేసేందుకు భారత్ చూపుతున్న ఆసక్తి ఆయన్ను శాంతపరిచే ఉంటుంది.

మోదీ అమెరికా పర్యటనకు బయల్దేరిన రోజునే, కార్పొరేట్ పన్నును భారీగా తగ్గిస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది. అమెరికా ప్రభుత్వం దీన్ని చాలా సానుకూలంగా చూస్తోంది.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ట్రంప్ బలమైన నాయకుడని, 'అమెరికాను మళ్లీ గొప్ప దేశం'గా మార్చేందుకు అమితాసక్తితో పనిచేస్తున్నారని మోదీ ప్రశంసించారు. అమెరికా కోసం, ప్రపంచం కోసం ఆయన ఎంతో సాధిస్తున్నారని అన్నారు.

'ఉగ్రవాదంపై పోరులో భారత్‌తోపాటు కలిసి నిలబడుతున్నందుకు' ధన్యవాదాలు తెలిపారు.

'అబ్ కీ బార్.. ట్రంప్ సర్కార్' అని మోదీ అనడం.. ట్రంప్‌ను ఆనందంలో ముంచెత్తి ఉంటుంది.

అమెరికాకు అత్యంత విధేయత కలిగిన, నమ్మకమైన స్నేహితుడు మోదీ అని ట్రంప్ అన్నారు.

ఎన్నికల్లో మోదీ చరిత్రాత్మక విజయం సాధించారని, ఎన్నో ఆర్థిక సంస్కరణలు తెచ్చి భారత్ కోసం ఎంతో చేస్తున్నారని ప్రశంసించారు.

భారత్‌లో కోట్ల మందిని మోదీ పేదరికం నుంచి బయటకు తెచ్చారని ట్రంప్ అభినందించారు.

దాదాపు 40 లక్షల మంది భారతీయ అమెరికన్లు సాంస్కృతికంగా అమెరికాను సుసంపన్నం చేస్తున్నారని ట్రంప్ అన్నారు.

భారతీయ అమెరికన్లు

ఫొటో సోర్స్, Getty Images

ఈ కార్యక్రమంలో తమ ప్రభుత్వం సాధించిన ఘనతల జాబితాను మోదీ చదువుతూ పోయారు. ఆయన ప్రసంగం ఎన్నికల ప్రచారాన్ని తలపించింది.

ఆర్టికల్ 370కి వీడ్కోలు చెప్పామంటూ ట్రంప్ సమక్షంలో మోదీ చేసిన ప్రకటనకు చాలా ప్రాధాన్యత ఉంది. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి తీసుకున్న ఈ నిర్ణయం తమ అంతర్గత విషయమన్న భారత్ వాదనను అమెరికా సమర్థిస్తున్నట్లు కనిపిస్తోంది.

మొట్టమొదటిసారి ముంబయిలో జరగనున్న ఎన్‌బీఏ మ్యాచ్‌కు తనను పిలుస్తారా అని అడగడం ద్వారా, త్వరలోనే భారత్‌లో తాను పర్యటించొచ్చని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు.

వచ్చే గణతంత్ర దినోత్సవానికి ట్రంప్‌నే ముఖ్య అతిథిగా మోదీ పిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మోదీ, ట్రంప్.. ఇద్దరూ తాము ఈ కార్యక్రమం ద్వారా గెలిచామని చెప్పుకోవచ్చు.

వివిధ అంశాల్లో విభేదాలున్నా.. భారత్, అమెరికాల బంధం కొత్త శిఖరాలకు చేరిందని ఈ సభ సంకేతాలు పంపింది. రెండు దేశాలకూ లాభించే పరిణామమే ఇది.

తనను ట్రంప్ 'టఫ్ నెగోషియేటర్' (అంత తేలిగ్గా ఏకాభిప్రాయానికి రారు) అంటారని మోదీ అన్నారు. ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ట్రంప్‌ది అందె వేసిన చెయ్యని, ఆయన నుంచి తాను కూడా నేర్చుకుంటున్నానని వ్యాఖ్యానించారు.

రాబోయే కొన్ని రోజుల్లో ఇరు దేశాలకూ ప్రయోజనకరమైన పలు వాణిజ్య ఒప్పందాలపై ఈ ఇద్దరు నేతలూ సంతకాలు చేసే అవకాశం ఉంది.

మొత్తానికి ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో ట్రంప్, మోదీల ఈ కలయిక భారత్, అమెరికాలకు సానుకూలమైన చాలా అంశాలకు బాటలు వేసింది. నేటి ప్రపంచ నాయకుల్లో అత్యంత ప్రభావవంతుల్లో మోదీ ఒకరన్న విషయాన్ని చాటింది.

(గమనిక : ఈ వ్యాసంలోని విషయాలు రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)