పీఎం మోదీ విమానానికి పాకిస్తాన్ తన గగనతలం నుంచి అనుమతివ్వకపోవడం సరైన చర్యేనా? నిషేధించే హక్కు పాక్‌కు ఉందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సింధువాసిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
పాకిస్తాన్ గగనతలం నుంచి వెళ్లడానికి తమ ప్రధాని నరేంద్రమోదీ విమానానికి అనుమతి ఇవ్వాలని భారత ప్రభుత్వం ఇటీవల ఆ దేశాన్ని కోరింది. కానీ, కశ్మీర్‌లో పరిస్థితుల నేపథ్యంలో మేం అనుమతించడం లేదు అని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ సమాధానం ఇచ్చారు.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించినప్పటి నుంచి పాకిస్తాన్ వివిధ పద్ధతుల్లో తన వ్యతిరేకతను వ్యక్తం చేస్తూనే ఉంది. భారత ప్రధాని నరేంద్రమోదీని పాకిస్తాన్ గగనతలం నుంచి వెళ్లడానికి అనుమతించకపోవడం కూడా ఇందులో భాగమే.
అంతకుముందు, భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విమానాన్ని కూడా తన గగనతలంలోంచి వెళ్లడానికి కూడా పాక్ అనుమతించలేదు.
పాకిస్తాన్ చర్యను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావిశ్ కుమార్ ఖండించారు. ఈ విషయంలో పునరాలోచన చేయమని పాక్‌ను కోరినట్లు ఆయన చెప్పారు.
అయితే, ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అదేమిటంటే, ఏ దేశమైనా తన గగనతలం నుంచి ఇతరులు ప్రయాణించకుండా నిషేధించే హక్కు ఉందా?

ఫొటో సోర్స్, Getty Images
అంతర్జాతీయ చట్టాలు ఇందుకు అనుమతిస్తున్నాయని విమానయానానికి సంబంధించిన వార్తలను సేకరించే 'హిందూ బిజినెస్ లైన్' సీనియర్ జర్నలిస్టు అశ్విని ఫడ్నిస్ తెలిపారు.
''ప్రతీ సార్వభౌమ దేశం జాతీయ భద్రత దృష్ట్యా తన గగనతలంలో ఇతరుల ప్రవేశానికి దూరంగా ఉంచే హక్కు ఉంది. పౌరుల భద్రతకు ఏ దేశమైన ప్రాధాన్యత ఇస్తుంది. ఇతర ప్రదేశాల నుంచి వచ్చే విమానం తమ పౌరుల భద్రతకు ముప్పు తెచ్చిపెడుతుందని భావిస్తే తన గగనతలంలోకి ఇతరుల ప్రవేశానికి అనుమతి నిరాకరించవచ్చు'' అని ఆయన బీబీసీకి తెలిపారు.
ది ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏవో) సంస్థ అంతర్జాతీయంగా సురక్షిత విమాన ప్రయాణానికి నియమాలను నిర్దేశిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఈ నిబంధనల ప్రకారం ఇతర దేశాల విమానాలను తమ గగనతలంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తాయి.
ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉద్రిక్తతలు, పరిణామాలను ఈ సంస్థ నిరంతరం పర్యవేక్షిస్తుంది. విమానాల కదలికకు ఏ గగనతలం హాని కలిగిస్తుందో పరిశీలిస్తుంది.
గగనతలం మూసివేత అనేది సాధారణంగా జాతీయ భద్రతకు సంబంధించినది అయినప్పటికీ, మరికొన్ని పరిస్థితులలోనూ ఈ నిర్ణయం తీసుకోవచ్చు.
అశ్విని ఫడ్నిస్ దీనికి సంబంధించి ఒక ఉదాహరణ ఇచ్చారు. ''కొన్నేళ్ల కిందట ఇండోనేషియాలో ఒక అగ్నిపర్వతం పేలింది. ఈ కారణంగా గగనతలం చాలా కలుషితమైంది. ఆ తరువాత విమానయాన సంస్థలు ఆ గగనతలంలోంచి వెళ్లడానికి నిరాకరించాయి'' అని చెప్పారు.
ఎయిర్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జితేంద్ర భార్గవ కూడా అశ్విని ఫడ్నిస్ చెప్పినదాంతో ఏకీభవించారు.
''ఒక దేశానికి తన గగనతలంపై పూర్తి అధికారం ఉంటుంది. అందువల్ల పాకిస్తాన్ చట్టబద్ధంగా ఎటువంటి నిబంధనలను ఉల్లంఘించలేదు'' అని ఆయన చెప్పారు.
ఒక దేశ విమానం మరో దేశ గగనతలంలోకి ప్రవేశించినప్పుడు, విమానం తన గగనతలం నుంచి సురక్షితంగా బయటకు వచ్చేవరకు దాని ఏయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) విభాగం విమానానికి మార్గనిర్దేశం చేస్తుందని జితేంద్ర భార్గవ వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
పాక్, భారత్ రెండూ చేశాయి
ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామా దాడి, బాలకోట్ వైమానిక దాడి తరువాత భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇరు దేశాలు ఒకదానికొకటి తమ వైమానిక క్షేత్రాలను మూసివేశాయి.
సాధారణ పరిస్థితి నెలకొన్న తర్వాత భారత్ తన గగనతలం నుంచి రాకపోకలకు అనుమతిచ్చింది. కానీ, పాక్ తన గగనతలం నుంచి భారత్ విమానాలు ఎగరకుండా ఆరు నెలల పాటు నిషేధం విధించింది.
దీని ఫలితంగా భారత్ నుంచి అమెరికా, యూరప్ వెళ్లే విమాన ప్రయాణ వ్యవధి పెరిగింది. ఈ కారణంగా చాలా విమానయాన సంస్థలు తమ సర్వీసులలో మార్పులు చేసుకోవాల్సి వచ్చింది.
ఉదాహరణకు, అమెరికన్ క్యారియర్ యునైటెడ్ సంస్థ తన నాన్‌స్టాప్ సర్వీస్‌ను ఆపివేసింది, ఎయిర్ కెనడా తన విమానాలను నిలిపివేసింది. ఇండిగో సంస్థ తన దిల్లీ నుంచి ఇస్తాంబుల్ (టర్కీ) నాన్‌స్టాప్ ఫ్లైట్‌ను ఆపాల్సి వచ్చింది.
2001లో భారత పార్లమెంటుపై దాడి తరువాత, వాజ్‌పేయ్ ప్రభుత్వ కాలంలో కూడా భారత్, పాక్ తమ వైమానిక క్షేత్రాలను మూసివేసాయి. ఐదు నెలల తర్వాత సాధారాణ పరిస్థితులు నెలకొన్నాక తెరిచాయి.
9/11 దాడుల తరువాత అమెరికా కూడా ఇతర దేశాలు తన గగనతలంలో ఎగరకుండా మూసివేసింది. దీనివల్ల ఏ దేశ విమానం అమెరికా గగనతలంలోకి ప్రవేశించలేదు.
రెండు దేశాల మధ్య యుద్ధం తలెత్తినప్పుడు ఇరు దేశాలు తమ ఎయిర్‌ఫీల్డ్‌లను మూసివేస్తాయి.

ఫొటో సోర్స్, Reuters
పాక్ తన గగనతలంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించడంపై భారత్ ఎక్కడైనా ఫిర్యాదు చేయడం లేదా పాక్ నిర్ణయాన్ని ఏ సంస్థ వద్దనైనా సవాలు చేయడం సాధ్యం కాదని జితేంద్ర భార్గవ చెప్పారు.
''ఈ విషయంలో భారత్ చేయగలిగేది ప్రతీకారం తీర్చుకోవడం మాత్రమే, అంటే పాకిస్తాన్ కోసం తన గగనతలం మూసివేయడం'' అని ఆయన పేర్కొన్నారు.
అశ్విని ఫడ్నిస్ మాట్లాడుతూ, ''సాధారణంగా వీవీఐపీ విమానాల ప్రవేశానికి అనుమతి ఉంది. కానీ, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్నందున రాష్ట్రపతి కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమానాలను తమ గగనతల గుండా వెళ్లడానికి పాక్ అనుమతించలేదు'' అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రముఖుల విమానాలతో దేశ భద్రతకు ముప్పు ఉంటుందా?
"అలా కాకపోవచ్చు. నిజానికి, ఈ నిర్ణయాలన్నీ రాయబార కార్యాలయాలిచ్చే సమాచారం ఆధారంగా ఉంటాయి. ఇలాంటి చర్యల ద్వారా తాము ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉన్నాం అనే సంకేతాలను ఆ దేశం ఇస్తుంది. పాకిస్తాన్ నిర్ణయం కూడా ఒకరకంగా ఇలాంటిదే" అని ఫడ్నీస్ అభిప్రాయపడ్డారు.
ఇలాంటి చర్యల వల్ల భారత్, పాకిస్తాన్‌లలోని విమానయాన సంస్థలు, వాటి వ్యాపార కార్యకలాపాలపై కూడా ప్రభావం పడుతుంది.
బాలాకోట్ దాడుల తర్వాత భారత్, పాకిస్తాన్.. రెండు దేశాలూ తమ గగనతలాలను మూసేశాయి. దీని వల్ల కలిగిన నష్టాన్ని రెండు దేశాలు భరించాయి.
ఈ నిర్ణయం వల్ల దాదాపు 300 నుంచి 400 కోట్ల రూపాయల నష్టం జరిగిందని భారత పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి పార్లమెంటులో వెల్లడించారు.
అదే సమయంలో, పాకిస్తాన్ మీడియా కథనాల ప్రకారం పాక్ విమానయాన రంగం కూడా భారత గగనతలాన్ని మూసివేయడం వల్ల వందల కోట్ల రూపాయలను నష్టపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
గగనతలాల విషయంలో భారత్-పాకిస్తాన్‌ల చర్యల వల్ల ఏం జరుగుతుంది?
అశ్విని ఫడ్నీస్ విశ్లేషణ
ఐరోపా దేశాలకు ప్రయాణించేవారికి భారత్, పాకిస్తాన్ గగనతలాలు ప్రధాన మార్గాలు. రోజుకు దాదాపు 200-250 విమానాలు భారత్, పాక్ గగనతలాల మీదుగా ఎగురుతూ యూరోపియన్ దేశాలకు వెళ్తాయి.
అలాంటి పరిస్థితుల్లో, ఈ విమానాలన్నీ యూరప్ చేరుకోవడానికి అదనంగా 40-45 నిమిషాల సమయం తీసుకుంటే అది విమానయాన సంస్థలకు, ప్రయాణికులకూ కూడా నష్టం, అసౌకర్యాలను కలిగిస్తుంది.
గగనతలాన్ని ఇంతకాలానికి మించి మూసి ఉంచడానికి వీల్లేదని చెప్పేందుకు ఎలాంటి గరిష్ఠ కాలపరిమితీ లేదని ఫడ్నీస్ అంటున్నారు.
"ఇది ఇరుదేశాలకు సంబంధించిన వ్యవహారం. ఒక దేశం తమ గగనతలాన్ని అనుమతించేందుకు సిద్ధమైతే రెండోదేశం కూడా సాధారణంగా అలానే స్పందిస్తుంది. కానీ అన్ని సందర్భాల్లో ఇలానే జరుగుతుందని అనుకోలేం. బాలాకోట్ దాడుల తర్వాత భారత్ తమ గగనతలాన్ని త్వరగానే తెరిచినప్పటకీ, పాకిస్తాన్ మాత్రం చాలా సమయం తీసుకుని దానిపై నిర్ణయం తీసుకుంది" అని ఆయనన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్‌కు ఎలాంటి ప్రయోజనం లేదు
భారత ప్రధాని, రాష్ట్రపతులను తమ గగనతలం నుంచి ప్రయాణించకుండా అడ్డుకోవడం పాకిస్తాన్ అపరిపక్వతను సూచిస్తోంది అని జితేంద్ర భార్గవ అన్నారు. దీనివల్ల పాకిస్తాన్‌కు ఎలాంటి లాభం ఉండదు, కానీ దీని పర్యవసానాలను అది భవిష్యత్తులో ఎదుర్కొంటుంది అని ఆయన అభిప్రాయపడ్డారు.
"ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి ఈ అంశాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లాలని పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కశ్మీర్‌పై ప్రపంచ దేశాలు దృష్టిసారించేలా చేయాలనేది వారి ప్రయత్నం. తాజాగా భారత ప్రధాని మోదీని తమ గగనతలం నుంచి ప్రయాణించేందుకు అనుమతించకపోవడం కూడా ఈ ప్రయత్నాల్లో భాగమే" అని భార్గవ విశ్లేషించారు.
మరోవైపు, భారత రాష్ట్రపతి పాక్ గగనతలం మీదుగా విమాన ప్రయాణానికి చేసిన విజ్ఞప్తిని పాకిస్తాన్ తిరస్కరించిన తర్వాత ప్రధాని మోదీ విమాన ప్రయాణానికి సంబంధించిన విజ్ఞప్తిని పాకిస్తాన్‌కు భారత్ చేసి ఉండకూడదు అని అశ్విని ఫడ్నీస్ అభిప్రాయపడ్డారు.
"జులైలో ప్రధాని మోదీ బిష్కెక్‌కు వెళ్లడానికి ఒమన్, ఇరాన్ గగనతలాల మీదుగా ప్రయాణించారు. కొన్ని నెలల తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ గగనతలం కోసం విజ్ఞప్తి ఎందుకు చేసినట్లు? దీనికి ప్రత్యేకమైన కారణాలేవీ నాకు కనిపించడం లేదు" అని ఫడ్నీస్ అన్నారు.
పుల్వామా దాడి, బాలాకోట్ వైమానిక దాడుల అనంతర ఉద్రిక్తతల కారణంగా ఈ సంవత్సరం జులైలో ప్రధాని మోదీ పాకిస్తాన్ గగనతలంపై ప్రయాణించకుండానే బిష్కెక్‌కు వెళ్లారు. కానీ ఆ సందర్భంలో మోదీ ప్రయాణించే విమానానికి తమ గగనతలాన్ని వాడుకునేందుకు పాకిస్తాన్ అనుమతించింది.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్: పీఎస్ఏ చట్టం కింద ఫారూక్ అబ్దుల్లా నిర్బంధం... ఏమిటీ చట్టం? ఎంత కఠినం?
- ఉప్పులూరు చెన్నకేశవ ఆలయం: కులవివక్షను అధిగమించిన ఈ ఆలయంలో 11 తరాలుగా పూజారులంతా దళితులే
- ఇస్రో చైర్మన్ కె శివన్ కథ: ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన నిరుపేద రైతు కొడుకు
- బ్రిటన్ నల్లమందు వ్యాపారం భారతీయులను పేదరికంలోకి ఎలా నెట్టింది
- తెలంగాణ రెవెన్యూ శాఖలో సంస్కరణలు అవసరమా, కాదా? ఉద్యోగుల భవిష్యత్తు ఏంకానుంది?
- నల్లమలలో యురేనియం సర్వే వివాదం: "ఇక్కడ తవ్వితే మా ఊళ్లు నాశనమైపోతాయి... ఆ విషంతో మేం భంగమైపోతాం"
- బంగారు చెవిదుద్దును కోడిపుంజు మింగేసింది.. కోసి బయటకు తీశారు
- ఐన్‌స్టీన్ దృష్టిలో అద్భుతమైన గణిత మేధావి ఎవరో తెలుసా?
- చెన్నైలో 20 ఏళ్ల కిందట కిడ్నాపైన బాలుడు.. అమెరికా నుంచి తిరిగొచ్చాడు. ఎలాగంటే..
- మలేరియా వ్యాధి నిరోధక టీకా.. ప్రపంచంలోనే మొదటిసారి అందుబాటులోకొచ్చిన వ్యాక్సిన్
- బ్యాంకు ఖాతాలో 90 లక్షలు వచ్చాయి... డ్రా చేశారు, ఖర్చుపెట్టేశారు... ఆ తర్వాత ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








