బ్రిటన్ నల్లమందు వ్యాపారం భారతీయులను పేదరికంలోకి ఎలా నెట్టింది

ఫొటో సోర్స్, Hulton Archive
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ఇండియా ప్రతినిధి
అమితావ్ ఘోష్ నవల 'సీ ఆఫ్ పాపీస్'లో.. ఇండియాలో నల్లమందు ఉత్పత్తి చేసే ప్రాంతానికి చెందిన ఒక గ్రామీణ మహిళకు.. నల్లమందు సాగు గింజలు అంటే గసగసాల సాగుతో తన అనుభవాలు బాగా గుర్తున్నాయి.
''ఆ గింజలను అంతకుముందెన్నడూ చూడనట్లు చూసిందామె. అకస్మాత్తుగా ఆమెకు అర్థమైంది. తన జీవితాన్ని శాసించింది పైనున్న గ్రహాలు కాదని. ఏక కాలంలో అందంగానూ, భీకరంగానూ, విధ్వంసకరంగానూ, సహాయకారిగానూ, ప్రతీకారం తీర్చుకునేది గానూ కనిపించే ఈ బీజమే తన జీవితాన్ని శాసించిందని''
ఈ నవల రచనా ఇతివృత్త కాలంలో ఉత్తర భారతదేశంలోని 13 లక్షల వ్యవసాయ కుటుంబాలు నల్లమందును ఉత్పత్తిచేసేవి.
వ్యవసాయదారులు సాగుచేసే పంటల్లో ఈ వాణిజ్య పంట వాటా మూడో వంతు వరకూ ఉండేది. పంతొమ్మిదో శతాబ్దం ముగిసేసరికి నల్లమందు సాగు.. ఇప్పటి ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో దాదాపు కోటి మంది జనంపై ప్రభావం చూపింది.
గంగా నది సమీపంలోని రెండు నల్లమందు కర్మాగారాల్లో కొన్ని వేల మంది కార్మికులు.. ఈ గింజల నుంచి వచ్చే పాలవంటి ద్రవాన్ని ఎండబెట్టి ఉండలు చుట్టి చెక్కపెట్టెల్లో ప్యాక్ చేసేవారు.

ఫొటో సోర్స్, Hulton Archive
ఆసియాలో వాణిజ్యంపై సర్వాధికారాలు గల శక్తివంతమైన బహుళ జాతి సంస్థ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ వ్యాపారం చేసేది. ప్రభుత్వం నడిపే ఈ వ్యాపారాన్ని ప్రధానంగా రెండు యుద్ధాల ద్వారా సాధించారు. ఆ యుద్ధాలతో బ్రిటిష్ ఇండియా నల్లమందుకు చైనా తన ద్వారాలు తెరవాల్సి వచ్చింది.
ఈస్ట్ ఇండియా కంపెనీ మీద 'ద అనార్కీ' అనే కొత్త పుస్తకం రాసిన చరిత్రకారుడు విలియం డార్లింపుల్.. ''ఈస్ట్ ఇండియా కంపెనీ చైనాకు నల్లమందు రవాణా చేసింది. హాంగ్‌కాంగ్‌లో విదేశీ రేవు స్థావరాన్ని చేజిక్కించుకోవటానికి, మాదకద్రవ్యాల మీద తన గుత్తాధిపత్యాన్ని సంరక్షించుకోవటానికి నల్లమందు యుద్ధాలు చేసింది'' అని అంటారు.
అయితే.. ఈ నల్లమందు వ్యాపారం భారతదేశపు గ్రామీణ ఆర్థికవ్యవస్థను అభివృద్ధి చేసిందని, రైతులకు సంతోషం కలిగించిందని కొందరు చరిత్రకారులు వాదించారు.
కానీ అది నిజం కాదని.. యూనివర్సిటీ ఆఫ్ వియెన్నాలో ఆర్థిక, సామాజిక చరిత్ర ప్రొఫెసర్ రాల్ఫ్ బాయెర్ చేసిన తాజా పరిశోధనలో వెల్లడైంది.
ఆయన కొన్నేళ్లపాటు చారిత్రక పత్రాలను శోధిస్తూ.. నల్లమందు ఉత్పత్తికి అయ్యే ఖర్చు, రైతులకు చెల్లించే డబ్బు, వ్యయాలను పరిశీలించారు.
ఈ వాణిజ్యం మీద గల భారీ చరిత్ర - 1895 నాటి రాయల్ కమిషన్ ఆఫ్ ఓపియం నివేదికను కూడా ఆయన అధ్యయనం చేశారు. అది ఏడు సంపుటాలలో 2,500 పేజీల్లో ఉంది.
నాటి ఇండియాలో నల్లమందు వినియోగం గురించి 28,000 ప్రశ్నలు, వందలాది సాక్ష్యాల నివేదికలు అందులో ఉన్నాయి. ఈ ఉత్పత్తిని, వినిమయాన్ని వలస ప్రభుత్వం ఎలా నియంత్రించిందనేదీ ఆయన అధ్యయనం చేశారు.
ఈ పరిశోధనలో గుర్తించిన విషయాలను 'ద పీజెంట్ ప్రొడక్షన్ ఆఫ్ ఓపియం ఇన్ నైన్టీన్త్ సెంచురీ ఇండియా'గా ప్రచురించారు. ఆ నల్లమందు వ్యాపారం భారతీయ రైతులను తీవ్రంగా దోపిడీ చేసిందని, రైతులు పేదరికంలో మగ్గేలా చేసిందని ఆయన నిర్ధారించారు.
''గణనీయమైన నష్టంతోనే నల్లమందును సాగుచేసేవారు. అది సాగు చేయకపోయినట్లయితే ఈ రైతుల పరిస్థితి మెరుగుగా ఉండి ఉండేది'' అని ప్రొఫెసర్ రాల్ఫ్ నాతో చెప్పారు.

ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ వాణిజ్యాన్ని ఇలా నడిపింది.
ఓపియం ఏజెన్సీ అనే పేరుతో ఉన్న ఓ శక్తివంతమైన అధికార యంత్రాంగం కింద దాదాపు 100 కార్యాలయాల్లో సుమారు 2,500 మంది క్లర్కులు పనిచేసేవారు. నల్లమందు రైతులను పర్యవేక్షించటం, కాంట్రాక్టులు అమలు చేయటం, నాణ్యత ప్రమాణాలు తగ్గకుండా ఉండేలా చూడటం వీరి విధులు. వీరికి పోలీసు తరహా అధికారాలుండేవి. భారతీయ కార్మికులకు వారు తయారుచేసి ఇచ్చే నల్లమందుకు ఒక శేరు (లీటరు వంటి పాత భారతీయ కొలమానం)కు ఇంత అని కమీషన్ ఇచ్చేవారు.
ఈ అంతర్జాతీయ వాణిజ్యం ఉధృతంగా సాగేది. 19వ శతాబ్దం ఆరంభంలో ఏటా 4,000 పెట్టెలుగా ఉన్న ఎగుమతులు 1880ల నాటికి 60,000 పెట్టెలకు పెరిగాయి.
19వ శతాబ్దంలో వలస ప్రభుత్వానికి లభించే ఆదాయంలో రెండో పెద్ద వాటా నల్లమందు వ్యాపారం నుంచే వచ్చేదని ప్రొఫెసర్ రాల్ఫ్ పేర్కొన్నారు. దానికన్నా ఎక్కువ ఆదాయం భూమి శిస్తు ద్వారా మాత్రమే వచ్చేది. (ప్రపంచ ఔషధ మార్కెట్ కోసం చట్టబద్ధంగా అత్యధిక స్థాయిలో నల్లమందు ఉత్పత్తి చేస్తున్న దేశంగా భారతదేశం ఇప్పటికీ కొనసాగుతోంది.)
''ఉపఖండంలోని అతిపెద్ద పరిశ్రమల్లో ప్రభుత్వ నల్లమందు పరిశ్రమ ఒకటిగా ఉండేది. ఈ మాదకద్రవ్యాన్ని ప్రతి ఏటా కొన్ని వేల టన్నులు ఉత్పత్తి చేసేవారు. నేడు ప్రపంచ హెరాయిన్ మార్కెట్ కోసం అఫ్గానిస్తాన్ భారీగా ఉత్పత్తి చేస్తున్న నల్లమందు తరహాలో అన్నమాట'' అని ప్రొఫెసర్ రాల్ఫ్ వివరించారు.
ఇంకా ముఖ్యంగా.. ఈ పంట ''లక్షలాది మంది జీవితాలపై శాశ్వత ప్రతికూల ప్రభావం చూపింది'' అని చెప్పారు.
సులభంగా అప్పు లభించని రైతులకు వడ్డీ లేకుండా అడ్వాన్సు చెల్లింపులు చేసేవారు. ప్రపంచ మార్కెట్ కోసం ఉత్పత్తి చేసే వారికి ఇలా అడ్వాన్సులు ఇవ్వటం చెడ్డదేమీ కాదు.
అయితే.. ముడి ఓపియం అమ్మటం ద్వారా వచ్చే ఆదాయం కన్నా.. కౌలు, ఎరువు, సాగునీరు, కూలీలకు చేసే ఖర్చు చాలా ఎక్కువగా ఉండటంతో ఆ అడ్వాన్సులు బంధనాలుగా మారాయని చెప్తారు ప్రొఫెసర్ రాల్ఫ్.

ఫొటో సోర్స్, Rischgitz
మరో రకంగా చెప్పాలంటే.. రైతులు తాము ఉత్పత్తి చేసిన నల్లమందుకు దక్కిన ధరతో.. దానిని సాగు చేయటానికి అయిన ఖర్చు కూడా తిరిగి రాలేదు. దీంతో వీళ్లు ''కాంట్రాక్టు బాధ్యతల'' సాలెగూడులో చిక్కుకుపోయారు. దాని నుంచి బయటపడటం కష్టం.
అలాగే.. ఓపియం ఏజెన్సీ నిర్దేశించే విపరీతమైన ఉత్పత్తి లక్ష్యాల వల్ల.. ఓపియం సాగుచేసే వారిలో అధికంగా ఉన్న చిన్న రైతులు అసలు తాము ఈ పంట సాగు చేయాలా లేదా అనేది నిర్ణయించుకునే అవకాశం కూడా ఉండేది కాదు. వారు ''తమ భూములను, శ్రమను వలస ప్రభుత్వ ఎగుమతి వ్యూహానికి బలవంతంగా సమర్పించాల్సి వచ్చేది''.
స్థానిక భూయజమానులు తమ కౌలుదార్లను నల్లమందు సాగుచేసేలా బలవంతం చేసేవారు. ఈ పంటను సాగుచేయటానికి నిరాకరించే రైతులను కిడ్నాప్ చేయటం, అరెస్ట్ చేయటం, పంటలు ధ్వంసం చేస్తామని, నేరాభియోగాలు మోపుతామని, జైళ్లలో పెడతామని బెదిరించటం కూడా జరిగేది.
''అదో తీవ్ర నిర్బంధ వ్యవస్థ'' అంటారు ప్రొఫెసర్ రాల్ఫ్.
1915 నాటికి.. ఈస్ట్ ఇండియాకు అతి పెద్ద మార్కెట్ అయిన చైనాతో నల్లమందు వ్యాపారం ముగిసిపోయింది. కానీ 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకూ కూడా నల్లమందు మీద బ్రిటిష్ ఇండియా గుత్తాధిపత్యం కొనసాగుతూనే ఉంది.
''అయితే.. లక్షలాది మంది రైతులను వారికి హానిచేసే ఈ పంటను సాగుచేసేలా కేవలం కొన్ని వేల మంది ఓపియం క్లర్కులు ఎలా నియంత్రించారనేది ఆశ్చర్యకరం'' అంటారు ప్రొఫెసర్ రాల్ఫ్.
అది మంచి ప్రశ్న.
ఇవి కూడా చదవండి:
- రాయలసీమకు ఆ పేరు ఎలా.. ఎప్పుడు వచ్చింది? ఎవరు పెట్టారు?
- ఫొటోల్లో లక్షల ఏళ్ల భారత చరిత్ర!
- వీర్ సావర్కర్: కొందరికి హీరో, మరికొందరికి విలన్...
- జలియన్‌వాలా బాగ్: భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో రక్తసిక్త అధ్యాయానికి 100 ఏళ్ళు
- ఫ్రీదా బేడీ: భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన బ్రిటిష్ మహిళ
- మొఘల్ చక్రవర్తుల కాలంలో క్రిస్మస్ ఎలా జరిగేది?
- మంగాయమ్మ: ఐవీఎఫ్ పద్ధతిలో కవల పిల్లలకు జన్మనిచ్చిన 73 ఏళ్ల బామ్మ
- #నో బ్రా ఉద్యమం: బ్రా వేసుకోకుండా సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్న దక్షిణ కొరియా మహిళలు
- కశ్మీర్: ఈ నెల రోజుల్లో భారత్ ఏం సాధించింది, ఏం కోల్పోయింది
- భారత్‌లో ‘దేవతల గుహ’: వెళ్తే తిరిగిరాలేరు.. ఎందుకు? ఏముందక్కడ?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








