కశ్మీర్: ఈ నెల రోజుల్లో భారత్ ఏం సాధించింది, ఏం కోల్పోయింది

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుబైర్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారతీయులంతా కశ్మీర్ సమస్య పరిష్కారం అయ్యిందనే అనుకుంటున్నారు.
ఆగస్టు 5న దీనిపై ప్రకటన చేసిన తర్వాత కశ్మీర్ లోయలో పెద్దగా హింస జరగలేదనే భారత ప్రభుత్వం వాదన కూడా వారి భావనలకు బలం చేకూరుస్తోంది.
అంటే దీనికి, అక్కడ ప్రజలు భారత ప్రభుత్వ నిర్ణయాన్ని పెద్దగా వ్యతిరేకించలేదనే అర్థం.
భారత్ కశ్మీర్‌ను అంతర్గత అంశంగా భావిస్తుంది. పాకిస్తాన్ ఈ వాదనను ఎప్పుడూ వ్యతిరేకిస్తుంది.
కశ్మీర్ లోయలో వేర్పాటువాదులు స్వనిర్ణయాధికారాన్ని కోరుకుంటున్నారు. గత 30 ఏళ్ల నుంచీ లోయలో తీవ్రవాదం పెరుగుతూ వస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
లోయలో భారత మద్దతుదారులు కూడా ఉన్నారు.
కానీ ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి జమ్ము-కశ్మీర్‌ను ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఒక వివాదాస్పద అంశంగా మార్చేసింది.
జమ్మూ ప్రజలు భారత ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతించారన్నది కూడా అంతే నిజం.
లద్దాఖ్‌లోని లేహ్ నగరంలో కూడా భారత ప్రభుత్వ నిర్ణయానికి జనం సంబరాలు చేసుకున్నారు.
కార్గిల్ ప్రజలు ఎప్పుడూ భారత్‌లో భాగంగా ఉండాలని భావించేవారు. కానీ తమకు ఆర్టికల్ 370 కింద లభించిన ప్రత్యేక ప్రతిపత్తి కూడా ఉండాలనుకునేవారు.
అయితే, కశ్మీర్ లోయలోని 70 లక్షల మందికి ఇప్పుడు కశ్మీర్ సమస్య అంతమైనట్లే అనుకోవాలా.

ఫొటో సోర్స్, TWITTER/AMIT SHAH
అభివృద్ధికి మొదటి అడుగు
కశ్మీర్ లోయకు ఇటీవల తిరిగి వచ్చిన కశ్మీరీ జర్నలిస్ట్ రాహుల్ పండితా దీనిని "భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కశ్మీర్ సమస్యను అంతం చేసే దిశగా చేపట్టిన మొదటి బలమైన చర్య" అన్నారు.
"చూడండి.. దీనిని కశ్మీర్ సమస్య అంతం అనుకోలేం. కానీ భారత ప్రభుత్వం దానిని అంతం చేసే దిశగా వేసిన మొదటి బలమైన చర్య" అని చెప్పారు.
"70 ఏళ్లుగా కశ్మీర్ అంశాన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టాయి. కానీ వాటివల్ల ఏం సాధించలేకపోయారు" అని రాహుల్ చెప్పారు.
"కశ్మీర్‌లో భారత్ పునాదులనే బలహీనంగా చేశారు. 70 ఏళ్ల నుంచీ కశ్మీర్ నేతలు భారత్‌లో ఒకవిధంగా, లోయలో ఒక విధంగా మాట్లాడుతున్నారు. ప్రజల మనసుల్లో గందరగోళం పాకిస్తాన్ వల్ల పుట్టలేదు. అవి స్వయంగా భారత ప్రభుత్వం వల్లే ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ గందరగోళానికి శాశ్వతంగా తెరపడింది" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దీని గురించి కశ్మీరీల అభిప్రాయం ఏంటనేదానిపై సమాధానం కావాలంటే అక్కడ ల్యాండ్ లైన్‌పై ఉన్న ఆంక్షలు ఎత్తివేసిన తర్వాతే తెలుస్తుంది.
ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా లోయలో ఉన్న వారిలో చాలా ఆగ్రహం ఉందనే విషయం తెలిసిందే. నిరుపమ్ సుబ్రమణ్యం అనే ఒక హిందూ వార్తాపత్రిక రిపోర్టర్ అక్కడ నుంచి తిరిగి వచ్చి తన ట్విటర్‌లో ఒక పోస్ట్ చేశారు.
"ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. భారత్‌లో కశ్మీర్ సమస్య పరిష్కారం అయ్యిందని ఎంతోమంది నమ్ముతున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలు పూర్తిగా వేరేగా ఉన్నాయి. సంబరాల వాతావరణం ముగిసిన తర్వాత సవాళ్లు స్పష్టంగా తెలుస్తాయి" ఆమె చెప్పారు.
"మేం ఆగస్టు 5 నుంచి దాదాపు పది రోజుల వరకూ లోయలో రిపోర్టింగ్ చేశాం. ఆ సమయంలో మాతో మాట్లాడిన అందరూ పరిస్థితులు సాధారణం అయ్యాక తమలో ఉన్న లావా బయటికి వస్తుందని అన్నారు. భారత మద్దతుదారులుగా భావించేవారు కూడా ఇలాంటి మాటలు చెప్పారు"

ఫొటో సోర్స్, Getty Images
ఈ కశ్మీరీల వాదన ప్రకారం భారత ప్రభుత్వం తన నిర్ణయంలో కశ్మీరీలను కూడా సంప్రదించి ఉండాలి
"కశ్మీర్ అంశం పరిష్కారం కాలేదని, అది మరింత చిక్కుముడిలా మారిందని వేర్పాటువాదులు మాతో అన్నారు. దాని ప్రకారం, వారి పోరాటం స్వాతంత్ర్యం కోసమే. కశ్మీర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామనే భారత ప్రభుత్వం వాదనతో వారికి ఎలాంటి తేడా అనిపించదు" అంటారు నిరుపమ్.
అటు పాకిస్తాన్ విమర్శలు, కొందరి రెచ్చగొట్టే స్పందనలను బట్టి కశ్మీర్ అంశం ముగిసిపోయిందని అనుకుంటే, అది తెలివైన విషయమే అవుతుందా.
పాకిస్తాన్ మాజీ విదేశాంగ కార్యదర్శి రామ్‌షాద్ అహ్మద్ బీబీసీతో మాట్లాడుతూ కశ్మీర్ అంశం ఇప్పుడు మరోసారి అంతర్జాతీయ వేదికపైకి వచ్చిందని అన్నారు.
‘‘భారత ప్రభుత్వం తనకు నచ్చినట్టు చెప్పనివ్వండి. కానీ ఈ సమస్యను టేబుల్ దగ్గర కూర్చుని రెండు దేశాలూ పరిష్కరించుకోవాలని ప్రపంచమంతా అంగీకరిస్తుంది. శాంతియుత తీర్మానం విషయానికి వస్తే, భారత్ చెప్పే ప్రతిమాటా నమ్మాలనేం లేదు" అంటారు రామ్‌షాద్.

ఫొటో సోర్స్, Reuters
ఇమ్రాన్ ఖాన్ ఏం చేస్తారు
పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పాక్ పాలిత కశ్మీర్ ప్రజలకు తను కశ్మీర్ రాయబారిగా ప్రపంచమంతా తిరుగుతానని, చివరి శ్వాస వరకూ వారి కోసం పోరాడతానని భరోసా ఇచ్చారు.
భారత్‌లో అందరూ ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయలేదనే భావిస్తున్నారు. ఎందుకంటే ఆ దేశం దగ్గర బలమైన ప్రత్యామ్నాయం ఏదీ లేదు. పాక్ అంతర్జాతీయ మద్దతు కూడా కూడగట్టలేదు.
కానీ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తమ దగ్గర ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చెబుతున్నారు.
"మేం మొదటి నుంచే ప్రత్యామ్నాయాలు సిద్ధం చేశాం. కశ్మీరీల స్వయం నిర్ణయాధికారాన్ని గౌరవిస్తూ భద్రతామండలి ప్రతిపాదనలు, భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వాగ్దానాలపై భారత్‌తో చర్చలు జరిపేందుకు ఎలాంటి నిర్ణయం అయినా తీసుకుంటాం" అన్నారు ఇమ్రాన్.
"కానీ, భారత్ కశ్మీర్ ఆక్రమణ నుంచి వెనక్కు తగ్గినపుడు, కర్ఫ్యూ(కశ్మీర్‌లో) ఎత్తివేసినపుడు, తమ సైన్యం ఉపసంహరించినపుడు మాత్రమే ఆ చర్చలు ప్రారంభమవుతాయి" అని ఇమ్రాన్ చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
అంతా గమనిస్తున్నాం-బ్రిటన్
పాకిస్తాన్ ప్రభుత్వం కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో కూడా లేవనెత్తింది
నాకు తెలిసినంతవరకూ సెప్టంబర్ 27న ఇమ్రాన్ ఖాన్ ఐక్యరాజ్యసమితిలో చేయనున్న ప్రసంగంలో కశ్మీర్ అంశం గురించి గట్టిగా చెబుతారనే అనుకుంటున్నా" అంటారు రామ్‌షాద్
అమెరికా సహా ప్రపంచంలోని చాలా అగ్ర దేశాలు కశ్మీర్ అంశాన్ని పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అపీల్ చేశాయి.
ఆర్టికల్ 370, జమ్ము-కశ్మీర్‌లో కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడంపై బ్రిటన్ పెద్దగా ఆందోళన వ్యక్తం చేయలేదు.
కానీ, కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలపై వెంటనే విస్తృత, పారదర్శకంగా దర్యాప్తు జరగాలని ఆ దేశం గట్టిగా చెప్పింది.
బ్రిటన్ విదేశాంగ మంత్రి డామినిక్ రాబ్ ఆ దేశ పార్లమెంటులో "ఆగస్టు 7న భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్‌తో మాట్లాడానని, కశ్మీర్‌లో వ్యక్తమవుతున్న ఆందోళనల గురించి ఆయనతో చర్చించానని తెలిపారు.
కశ్మీర్ పరిస్థితిని బ్రిటన్ నిశితంగా గమనిస్తుంటుందని కూడా ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశం
శ్రీలంకలో జరిగిన యునిసెఫ్ సదస్సులో పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తేందుకు ప్రయత్నించింది.
చైనా, మలేసియా, టర్కీ పాకిస్తాన్‌ను సమర్థించాయి.
అమెరికాలో డెమాక్రటిక్ నుంచి పార్టీ అధ్యక్ష పదవి అభ్యర్థుల్లో ఒకరైన బర్న్ శాండర్స్ కూడా కశ్మీర్‌పై ఆందోళన వ్యక్తం చేశారు.
ఇలా భారత్ కోరుకోకపోయినప్పటికీ, కశ్మీర్ అంశం అంతర్జాతీయ స్థాయి అంశంగా మారుతూ కనిపిస్తోంది.
భారత దృష్టికోణం నుంచి చూసినా కశ్మీర్ అంశం ఇంకా పరిష్కారం కాలేదు. ఆర్టికల్ 370పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు.
సుప్రీం కోర్టు దీనిపై ప్రభుత్వం నుంచి వివరాలు కోరింది. కానీ పార్లమెంటు ఈ నిర్ణయాన్ని కొట్టిపారేయడం ఇప్పుడు సాధ్యం కాదని రాహుల్ పండితా చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇటు హోంమంత్రి అమిత్ షా "కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చట్టపరమైన అభ్యంతరాలను కూడా ఎదుర్కోగలదని" భావిస్తున్నారు.
ఇక ప్రభుత్వానికి ఎదురయ్యే రెండో సవాలు కశ్మీర్ లోయలో ప్రజల మనసులు గెలవడం. అది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కఠినంగా అనిపిస్తోంది.
కానీ వీటన్నిటికీ మించి పాకిస్తాన్ పాలనలో ఉన్న ఆ కశ్మీర్‌ను ఏం చేయాలనేది కూడా ఉంటుంది. భారత్ దృష్టిలో అది దేశం నుంచి విడదీయలేని భాగం
అంటే పాకిస్తాన్ పాలిత కశ్మీర్ భారత్ నుంచి విడదీయరాని భాగంగా ఉన్నంతవరకూ, కశ్మీర్ అంశం పరిష్కారం అవుతుందని చెప్పలేం.
కానీ "ఇప్పుడు రెండు దేశాలు ఈ పరిస్థితిని వాస్తవికతతో చూడాల్సి ఉంటుందని రాహుల్ పండితా అంటున్నారు..
అంటే "ఎల్ఓసీని అంతర్జాతీయ సరిహద్దుగా భావించాలి. అలా భారత్ కశ్మీర్ భారత్ దగ్గర, పాకిస్తాన కశ్మీర్ పాకిస్తాన్ దగ్గరే ఉండడానికి సిద్ధం కావాలని" ఆయన భావిస్తున్నారు.
ఈ సలహా ఇంతకు ముందు కూడా ఇచ్చారు. కానీ రెండు దేశాల ప్రభుత్వాలు దాన్ని తోసిపుచ్చాయి.
పాకిస్తాన్ మాజీ విదేశాంగ కార్యదర్శి రామ్‌షాద్ కశ్మీర్ అంశాన్ని రెండు దేశాలూ కలిసి పరిష్కరించుకునే ఒకేఒక దారి గురించి నొక్కి చెబుతారు. "రెండుదేశాలు కలిసి చర్చించాలి. కశ్మీరీలకు కూడా ఆమోదయోగ్యంగా ఉండేలా ఒక నిర్ణయం తీసుకోవాలి" అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- 'మమ్మల్ని కొట్టకండి, కాల్చి చంపేయండి...'
- భారత వాయుసేనలో చేరిన అపాచీ హెలికాప్టర్ల దళం.. వీటి ప్రత్యేకతలేంటి
- ‘మా నాన్న ఒక గ్యాంగ్‌స్టర్... నా మూలాలు దాచేందుకు నా ముక్కునే మార్చేశాడు’
- దళితుడి శవాన్ని వంతెన మీంచి కిందకు తాళ్ళు కట్టి ఎందుకు దింపారు...
- ఏపీ రాజధాని అమరావతిపై బీబీసీతో బొత్స ఏమన్నారంటే...
- మూర్ఛ వ్యాధికి చంద్రుడి ప్రభావమే కారణమా
- విక్రమ్ సారాభాయ్: ఈ శాస్త్రవేత్త అణుబాంబును వ్యతిరేకించారా
- వరదలో 12 ఏళ్ల బాలుడి సాహసం.. సోషల్ మీడియాలో వైరల్
- ఆర్టోస్: ఇది మా కూల్ డ్రింకండీ
- హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








