హ్యూమన్ రైట్స్ వాచ్: కశ్మీర్‌లో ఇంటర్నెట్, ఫోన్ సేవలను భారత్ పునరుద్ధరించాలి

ఫొటో సోర్స్, Getty Images
జమ్మూకశ్మీర్‌లో భారత ప్రభుత్వం ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలను నిరవధికంగా నిలిపివేయడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ పేర్కొంది.
జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను ఉపసంహరించిన తరువాత అక్కడ హింసాత్మక ఘటనలకు కారణమయ్యే సమాచారాన్ని వ్యాపించకుండా ఆంక్షలు అవసరమని భారత అధికారులు పేర్కొన్నారు.
అయితే, వ్యక్తుల స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ హక్కుతో పాటు ప్రాథమిక స్వేచ్ఛపై పరిమితులు విధించడాన్ని అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం నిషేధిస్తుందని హ్యూమన్ రైట్స్ వాచ్ తెలిపింది.
''కశ్మీర్‌లో భారత ప్రభుత్వం నిరవధికంగా ఫోన్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం స్థానికులకు తీవ్ర హాని కలిగిస్తుంది. వెంటనే ఆంక్షలను ఎత్తివేయాలి'' అని హ్యూమన్ రైట్స్ వాచ్ దక్షిణాసియా డైరెక్టర్ మీనాక్షి గంగూలీ తెలిపారు.
''ఆంక్షలు స్థానికుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. ఆర్థిక నష్టం కలిగిస్తున్నాయి. మానవ హక్కుల పరిస్థితి మరింత దిగజార్చే పుకార్లకు ఆజ్యం పోస్తున్నాయి'' అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘జీవితంపై పెను ప్రభావం‘
కశ్మీర్ లోయతో పాటు, ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉండే ప్రాంతాలలో టెలిఫోన్ సర్వీసులను నిలివేశారు. అక్కడ కొన్ని ల్యాండ్‌లైన్ ఫోన్లు మాత్రమే పనిచేస్తున్నాయి.
ప్రభుత్వ కార్యాలయాల్లోనే ఫోన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. స్థానికులు బయటకు వచ్చి ఫోన్ చేసుకోవాలంటే అనేక చోట్ల భద్రతా తనిఖీ కేంద్రాలను దాటి, గంటల తరబడి వేచి ఉండాలి.
మరోవైపు కశ్మీర్ బయట ఉన్నవారు తమ వారికి సంబంధించిన సమాచారం తెలియకపోవడంతో నిరాశకు గురవుతున్నారు.
తమ రోజూవారీ పనుల్లో భద్రతా తనిఖీలు భాగం కావడంతో తమ జీవితంపై పెనుప్రభావం పడుతోందని కశ్మీరులు హ్యూమన్ రైట్స్ వాచ్‌తో అన్నారు.
''ప్రభుత్వం మమ్మల్ని జైలులో పెట్టినట్లు ఉంది. మేం స్వేచ్ఛగా తిరగలేం. మాట్లాడలేం. దీన్ని జైలు అనకుండా ఇంకేమంటారు?'' అని స్థానిక వ్యాపారి ఒకరు చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
ఆదాయ పన్ను కట్టలేకపోతున్నాం
ఆంక్షలతో కశ్మీర్‌లో వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. జర్నలిస్టులు వార్తలు కూడా రాయలేకపోతున్నారు.
''మా ఆదాయ పన్ను కట్టడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు అంతా ఆన్‌లైన్ అవడంతో ఏం చేయలేకపోతున్నాం'' అని స్థానికుడొకరు హ్యూమన్ రైట్స్ వాచ్‌కు చెప్పారు.
ఇంటర్నెట్‌తో సహా అన్ని మాధ్యమాల ద్వారా స్వేచ్ఛగా సమాచార బట్వాడాకు, తమ ఆలోచనలను పంచుకునేందకు కావాల్సిన హక్కులను అంతర్జాతీయ మానవ హక్కుల చట్టంలోని పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడిక (ఐసీసీపీఆర్) పరిరక్షిస్తుంది.
ఈ ఒడంబడిక ప్రకారం భద్రతకు సంబంధించిన పరిమితులు చట్ట ఆధారితంగా ఉండాలి.
జమ్మూకశ్మీర్ సమస్యపై ఆగస్టు 22న ఐక్యరాజ్యసమితి ఒక ప్రకటన చేసింది. ''సరైన కారణాలు లేకుండా భారత ప్రభుత్వం ఇంటర్నెట్, ఫోన్ సేవలను నిలిపివేయడం ప్రాథమిక నిబంధనలకు విరుద్ధంగా ఉంది'' అని పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
‘భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోరాదు’
అంతర్జాతీయ మానవ హక్కుల చట్టంలోని పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడిక (ఐసీసీపీఆర్)లోని ఆర్టికల్ 19 ప్రకారం ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా వివిధ దేశాలు ఇంటర్నెట్, ఫోన్ సేవలపై ఆంక్షలు విధించడాన్ని ఖండించాలని 2016 జులై లో హ్యూమన్ రైట్స్ కౌన్సెల్ ఒక తీర్మానాన్ని తీసుకొచ్చింది.
ఇంటర్నెట్, ఫోన్ సేవలపై ప్రభుత్వం ఆంక్షలు విధించడానికి బదులుగా పారదర్శకమైన సమాచారాన్ని ప్రజలకు అందించేలా సోషల్ మీడియాను ఉపయోగించాలని, అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనల ప్రకారం బలగాలు నడుచుకోవాలని హ్యూమన్ రైట్స్ వాచ్ కోరింది.
''అంతర్జాతీయ చట్టాలు ఇంటర్నెట్‌తో సహా భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలకు అనుమతిస్తున్నాయి. కానీ, అవి చట్టబద్ధమైన లక్ష్యం కోసం సంకుచితంగా పనిచేస్తున్నాయి'' గంగూలీ తెలిపారు.
''భారత ప్రభుత్వం కశ్మీరీల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. వారి భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకోరాదు'' అని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- అమరావతి నుంచి రాజధాని మారుస్తున్నారా? అక్కడేం జరుగుతోంది?
- ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్: రోజువారీ జీవితాల్లో భాగమైపోయిన ప్రచ్ఛన్న యుద్ధ కాలపు స్పై టెక్నాలజీ
- భారత 'రూపాయి' విలువ బంగ్లాదేశ్ 'టకా' కంటే తగ్గిందా? - Fact Check
- ‘మా నాన్న ఒక గ్యాంగ్‌స్టర్... నా మూలాలు దాచేందుకు నా ముక్కునే మార్చేశాడు’
- రాజధాని నిర్మాణానికి 2.3 లక్షల కోట్లు... కొత్త ప్రాంతాన్ని ప్రకటించిన దేశాధ్యక్షుడు
- భారతదేశంలో జన్మించిన పాకిస్తాన్ 'ప్రథమ మహిళ' రానా లియాకత్ అలీ
- 15 రాత్రుల్లో 121 మంది మహిళలతో... ప్రాచీన చైనా చక్రవర్తుల జీవితాన్ని గణితశాస్త్రం ఎలా ప్రభావతం చేసింది?
- BODMAS: 8÷2(2+2) = ?.. ఈ ప్రశ్నకు మీ జవాబు ఏంటి?
- 1.. 2.. 3.. సంగతి సరే.. అసలు సున్నా ఎలా పుట్టింది? దీన్ని భారతీయులు ఎలా కనిపెట్టారు?
- గుండెజబ్బు నివారణకు నాలుగు ఔషధాలున్న ఒకే మాత్ర
- డార్జీలింగ్ టీ పొడి: కిలో లక్షా 30 వేలు.. ఈ తేయాకును పౌర్ణమి వెలుగులోనే కోస్తారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








